Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : నగరంలో అక్రమాలను అడ్డుకట్ట వేయడంలో కీలక పాత్ర పోషించాల్సిన ‘టాస్క్‌ఫోర్స్’ పనితీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల రక్షణకై ఏర్పాటైన ఈ విభాగం ఇటీవల కాలంలో రాజకీయ పెద్దల అండదండలతో ‘నీరు కారిపోతోందా’ అన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిడితో సంబంధిత సిబ్బంది అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు సైతం టాస్క్‌ఫోర్స్ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తుంది. నేరాల నియంత్రణలో, వ్యవస్థీకృత నేరాలను ఛేదించడంలో చురుగ్గా వ్యవహరించాల్సిన ఈ ప్రత్యేక బృంద సభ్యులు కొన్ని కీలక కేసుల్లో ఎందుకు పలచబడిపోతున్నారో అర్థం కావడం లేదు. దీని వెనుక కేవలం నిర్లక్ష్యమా..? లేక తెరవెనుక రాజకీయ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయా..? అన్నది అంతుబట్టకుండా ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ మధ్య కాలంలో పాతనగరం సమీప ఓ పెద్ద క్లబ్‌లో పేకాట నగదుతో ఆడుతున్నట్టు నగదుతో పాటుగా లెక్కింపు యంత్రం సైతం బోర్డుపై లభించింది. ఆ సమయంలో దాడులు నిర్వహించగా కొన్ని క్షణాల్లో శాసనసభలో కీలక నేత పైరవీతో అక్కడకక్కడే వదిలి వెళ్లిపోవల్సి వచ్చింది. ఇదే విధంగా గాజువాక ప్రాంతంలో ఓ క్లబ్‌లో దాడులు నిర్వహించగా అక్కడ స్థానిక ప్రజాప్రతినిధి చెప్పడంతో మరోమారు వదిలిపెట్టి వెళ్లిపోయారు. టాస్క్‌ఫోర్స్ స్టేషన్ సమీప ప్రాంతాల్లో కొన్ని హోటల్స్‌లో పేకాటలు ఆడుతున్నట్టు సమాచారం అందుకోని దాడిచేసిన కొన్ని నిమిషాల్లో స్థానిక ప్రజాప్రతినిధి నుంచి ఫోన్‌కాల్ రావడంతో వచ్చిన వేగంతోనే వెనక్కి వెళ్లిపోవడం సాధారణ విషయంగా మారిపోయింది. నగర శివారు ప్రాంతాల్లో పలుమార్లు పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించే సమయంలో సాక్ష్యాత్తు మన ప్రజా ప్రతినిధులను, మాజీ ప్రజాప్రతినిధులను పెద్ద సంఖ్యలో పట్టుకొని వదిలిపెట్టిన సందర్భాలు కోకొల్లలు.
ప్రత్యేక విభాగంగా గుర్తింపు పొందిన టాస్క్‌ఫోర్స్‌కి ఓ ఏసీపీ స్థాయి అధికారి అవసరం ఎంతైనా ఉంది. నగర వ్యాప్తంగా గల 23 పోలీసు స్టేషన్‌ల పరిధిలో విధులు నిర్వహించాల్సిన విభాగంలో కేవలం ఇద్దరు సీఐలు, ఒక ఎస్సై ఉండటంతో టాస్క్‌లు నిర్విహించిన ప్రతీసారి ఇబ్బందులు తప్పడం లేదు. డీసీపీ, ఏడీసీపీ స్థాయి అధికారుల పర్యావేక్షణలో పని చేస్తున్నా.. స్టేషన్‌ల పరిధిలో దాడులు చేసే సమయంలో సీనియర్ సీఐలు మాట టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న సీఐలు, ఎస్సై అప్పుడప్పుడు కొట్టలేకపోవడం ఓ కారణం అయితే.. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ ఒత్తిడితో నిమ్మకుండిపోవడం సాధారణంగా జరుగుతుంది. పైగా రెండు జోన్‌లకు ఒకే ఎస్సై ఉండటం కూడా పని ఒత్తిడిలో కీలక టాస్క్‌లు వదిలిపెట్టడం జరుగుతుందని విశ్వసనీయ సమాచారం. గతంలో ఏసీపీ స్థాయి అధికారి ఉన్నప్పటికి ప్రస్తుతానికి చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని, గతంలో దాడులు చేయాలంటే గోప్యత ఉండేదని, ప్రస్తుతం ముగ్గురి చర్చల్లో కాలం చెల్లిపోతుందని పలువురు ఆరోపిస్తున్నారు.
టాస్క్‌ఫోర్స్ విభాగ పనితీరు నగరంలో ఈ మధ్య జరిగిన రెండు, మూడు కీలక సంఘటనలు పరిశీలిస్తే ఇట్టే అర్థమయిపోతుంది. నగర బహిష్కరణ చేసిన ఓ రౌడీ షీటర్ ఎంవీపీ పోలీసు స్టేషన్ పరిధిలో బెదిరింపులకు పాల్పడుతూ ఓ భూ దందా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎట్టకేలకు సీపీ కార్యాలమంలో బాధితులు బోరుమనడంతో సంబంధిత స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇదే క్రమంలో రుషికొండ సమీపంలో ఎండీఎం డ్రగ్స్‌ని విక్రయం చేస్తున్న నలుగురు నిందితులను టాస్క్‌ఫోర్స్ బృందం అదుపులోకి తీసుకుంది. తీవ్ర రాజకీయ ఒత్తిడితో ఇద్దరు నిందితులను జైలుకి సాగనంపిన సిబ్బంది మరో ఇద్దరు నుంచి భారీ మొత్తంలో దండుకొని ఉచ్చులో ఎర(డెకాయ్)గా ఉపయోగించామని నమ్మించి వదిలిపెట్టారని విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు ఇరువురు నిందితులు మరో వ్యాపార విషయంలో గొడవ పడటంతో ఒకడ్ని మరొకడు బెదిరించడంతో టాస్క్‌ఫోర్స్‌లో చేతివాటం చూపించి ఇరువుర్ని వదిలిపెట్టిన ఆ అధికారి వద్దకు వచ్చి బోరుమన్నాడు. దీంతో ఇరువురు నిందితులను పిలిచి నచ్చచెప్పినట్టు సంబంధిత ఖాకీ సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. గతంలో వారానికి ఓమారు నగరంలో ఉన్న రౌడీషీటర్‌లకు కౌన్సిలింగ్ నిర్వహించడం, స్టేషన్‌ల వారీగా నిఘా కట్టుదిట్టం చేయడంతో పాటుగా టాస్క్‌ఫోర్స్ నుంచి ప్రత్యేక నిఘా ఉండేది. ప్రస్తుతం అటుగా కౌన్సిలింగ్‌లు నిర్వహించకపోవడంతో పలు హత్యకేసుల్లో నిందితుడిగా గుర్తింపు పొంది నగర బహిష్కరణకు గురైన రౌడీషీటర్ టాస్క్‌ఫోర్స్ స్టేషన్‌కి కూతవేటు దూరంలో తన ప్రతాపాన్ని చూపించి పోలీసులకు సవాల్ విసిరిన నాలుగు రోజులకు మేల్కొన్నారు.
స్టాండిరగ్ కమిటీ తీర్మానం లేకుండా జీవీఎంసీ ఆస్తుల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠాలు
నేత్ర న్యూస్, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి): జీవీఎంసీకి రూ.కోట్ల ఆదాయాన్ని అందించే కీలక మార్కెట్‌లు ప్రస్తుతం దొంగల చేతుల్లో చిక్కుకున్నాయి. ఇంటి దొంగల సంరక్షణలో ఉండాల్సిన ఆస్తులను సైతం కమీషన్‌లకు కకుర్తిపడి బయట దొంగలకు అప్పగించినట్టు ఇట్టే అర్థమైపోతుంది. ఈ తరహా తంతుని చూసి ప్రశ్నించాల్సిన స్థానిక స్టాండిరగ్ కమిటీ సభ్యుడు సైతం ఆ ముఠాలతో చేతులు కలిపినట్టే కనిపిస్తుంది. ఏడాదికి రూ.కోటికి పైగా అధిక ఆదాయాన్ని అందించే పూర్ణామార్కెట్, సుమారు రూ.30లక్షలకు పైగా అందించే రామకృష్ణ కూరగాయల మార్కెట్ ఈ ఏడాది అంతర్గత లెక్కలు లెక్కించిన అధికారుల లెక్కల ప్రకారం పూర్ణామార్కెట్‌ని 18శాతం జీఎస్టీ, 0.5 స్వచ్ఛభారత్‌తో కలిపి రూ.97.28లక్షలకు, అదే రామకృష్ణ కూరగాయల మార్కెట్‌ని 18శాతం జీఎస్టీ, 0.5 స్వచ్ఛభారత్‌తో కలిపి రూ.23.10లక్షలకు బహిరంగ వేలం పాట ద్వారా ఖరారు చేశారు. ఈనెల మొదటి నుంచి పాట పాడిన వ్యక్తులకు అప్పగించడానికి కుతూహలంతో ఉన్న జోనల్ స్థాయి అధికారులు స్టాండిరగ్ కమిటీ తీర్మాణం లేకుండానే ఇవ్వడం వెనుక మర్మం ఏంటో అని మార్కెట్‌లో వ్యాపారులే ఆసక్తి చూపుతున్నారు. బయట సమాజాన్ని నమ్మించడానికి 15మంది సచివాలయ కార్యదర్శిలు, ముగ్గురు మజ్దూర్‌లను, ఒక ట్యాక్స్ కలెక్టర్, ఒక పబ్లిక్ అండ్ హెల్త్ ఉద్యోగిని నియమించినట్టు గతనెల 29న సంతకాలు చేసి ఆదేశాలను జారీ చేశారు. కానీ వాస్తవానికి ఈ ఉద్యోగులు ఈనెల 1నుంచి నేటి వరకు అదే జోనల్ కార్యాలయ సీసీ కెమెరాల పరిధిలోనే పనిచేసినట్టు రికార్డింగ్‌లు సంబంధిత విభాగంలోనే భద్రపరిచి ఉండటం కొసమెరుపు. నకిలీ అదేశాలను జారీ చేసిన అధికారులు అటుగా సిబ్బందిని కేటాయించిన స్థానంలో పని చేస్తున్నట్టు అక్కడ సీసీ కెమెరాల్లో సైతం ఉంటే బాగుండేదని పలువురు వ్యాపారులు హేళన చేస్తున్నారు.
జీవీఎంసీలో జరిగిన ఆర్థిక లావాదేవీలను స్టాండిరగ్ కమిటీ తీర్మాణంతో కేటాయించాల్సి ఉన్నా.. జోన్-4 రెవెన్యూ అధికారులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏడాదికి రూ.కోట్లు ఆదాయాన్ని ఇచ్చే పూర్ణామార్కెట్, రూ.30లక్షలకు పైగా ఆదాయాన్ని ఇచ్చే రామకృష్ణ కూరగాయల మార్కెట్‌ని ఎటువంటి అనుమతులు లేకుండా జీవీఎంసీ కమిషనర్ పేరిట టోకెన్లను ముద్రించి బయట వ్యక్తులకు అప్పగించారు. నామ మాత్రంగా బృందాలను కేటాయించి పూర్తిస్థాయిలో బయట వ్యక్తులతో ఆశీలు వసూళ్లు చేయిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులను ప్రశ్నించగా తమ సిబ్బంది మాత్రమే వసూలు చేస్తున్నారని వివరిస్తున్న అధికారులు ఇప్పటి వరకు జీవీఎంసీ సౌకర్యంలో ఎంత మొత్తంలో జమ చేశారో లెక్కలు చూపించాలని పలువురు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. స్టాండిరగ్ కమిటీ అనుమతి కూడా లేకుండా బయట వ్యక్తులతో రెండు మార్కెట్‌ల్లో వసూలు చెయిస్తున్నారంటే సంబంధిత అధికారులు ఎంత మొత్తంలో నకిలీ బృందాల నుంచి వసూలు చేశారో లెక్కలు చూడాల్సి ఉంది.
ఆశీల పాటను నిర్వహించిన అధికారులు గెజిట్ లెక్కల ఆధారంగా వసూలు చేయాలని గుత్తేదారులకు ముందుగానే అవగాహన పరుస్తారు. వాటికి అనుగుణంగానే అధికారులు వాళ్లకు పాటను కేటాయించి అటుగా వసూళ్లు చేయాలని సూచిస్తారు. కానీ ఇక్కడ ఎటువంటి సంబంధం లేని వ్యక్తులకు అక్రమ మార్గంలో ఆశీల వసూళ్లకు అవకాశం కల్పించి ఇష్టానుసారంగా దండుకుంటున్నా అటుగా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. పూర్ణామార్కెట్‌లో ద్విచక్ర వాహనానికి రూ.10, కార్లుకి రూ.20 వసూలు చేస్తున్నారు. ఇదే క్రమంలో భారీ వాహనాలకు రూ.300, సరుకులు రవాణాకు ఉపయోగించే వాహనాలకు రూ.200 దౌర్జన్యంగా తీసుకుంటున్నారు. రామకృష్ణ కూరగాయల మార్కెట్‌లో రూ.20కి బదులుగా దుకాణానికి రూ.50, రహదారిపై తాత్కాలికంగా వ్యాపారం చేసి వెళ్లిపోయే రైతుల వద్ద రూ.100 నుంచి రూ.150వరకు వసూలు చేస్తున్నారని పలువురు వ్యాపారులు బోరుమంటున్నారు. గెజిట్‌లో లెక్కలను పెద్ద పెద్ద అక్షరాలతో ముద్రించి ప్రధాన మార్గంలో గోడలకు మాత్రమే పరిమితం చేసి పెద్ద మొత్తంలో దండుకుంటున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం రద్దీగా ఉండే పూర్ణామార్కెట్ ప్రధాన రహదారిపై తొలిగించిన వ్యాపారాలు యధావిధిగా పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ స్థానిక నాయకున్ని మంగళవారం తీసుకొచ్చి ఆశీలు వసూళ్లు చేయడానికి అర్హత లేని గుత్తేదారులు రహదారిపై దండలతో సన్మానాలు చేసి ఆయన్ని మచ్చిక చేసుకుంటున్నారు. మనిషికి రెండు జంగిడీల చొప్పున కేటాయించి వ్యాపారాలు జరపడానికి చూస్తున్నారు. ఈ జంగిడీలు రహదారిపై పెట్టి వ్యాపారం చేస్తే గుత్తేదారులకు అక్షరాల రూ.40లక్షల వరకు లాభం వస్తుందని మాజీ గుత్తేదారులు సైతం వెల్లడిస్తున్నారు. వ్యాపారులపై ఉన్న ప్రేమ కంటే రూ.40లక్షలపై ఎక్కువ ప్రేమ ఉందని స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై నగర పోలీసు కమిషనర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : నగర గగనతలంలో పోలీసు డ్రోన్లు పూర్తి స్థాయిలో చక్కర్లు కొట్టనున్నాయి. ఇప్పటికే సంబంధిత పోలీసు సిబ్బందికి డ్రోన్లు పనితీరుకి సంబంధించిన అన్ని అంశాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న జనాభా, నేర నియంత్రణ, ట్రాఫిక్ రద్దీ, పోలీసు సిబ్బంది సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఈ డ్రోన్ పోలీసింగ్ విధానాన్ని నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ ప్రవేశపెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న టెక్నాలజీని పోలీసు విధుల్లో సైతం ఉపయోగించడం వలన మరింత ఫలితాలు సాధ్యమవుతాయని ఆయన ఈ డ్రోన్ పోలీసింగ్‌పై దృష్టి కేంద్రికృతం చేశారు. ఇప్పటికే ఓ ప్రైవేటు సంస్థ నుంచి సీఎస్‌ఆర్ పేరిట కొన్ని డ్రోన్‌లను పోలీసు విభాగానికి కేటాయించడంతో నగర ఆకాశ వీధిల్లో డ్రోన్‌లు జోరు వేగంతో విధులు నిర్వహిస్తున్నాయి.
మందు బాబులు, అల్లరి మూకలు, ధూమపానం, గంజాయి బ్యాచ్‌లకు ఇక నుంచి చుక్కలు కనిపించనున్నాయి. ఆకాశంలో చుక్కల మాదిరి చక్కర్లు కొడుతూ గుంపులను చెల్లాచెదురు చేయడంతో పాటుగా హై క్వాలిటీ ఫొటోలు, వీడియోలు సేకరించి కేసులు నమోదు చేయడానికి పోలీసు డ్రోన్‌లు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నపాటి సందులు, కొండ ప్రాంతాలు అనే వ్యత్యాసాలు లేకుండా ఒకే రకమైన పోలీసు సేవలు అందించడానికి ఈ డ్రోన్‌లు సిద్ధమయ్యాయి. గోల్డెన్ మినిట్స్‌లో కీలక అంశాలను సేకరించడంతో పాటుగా భద్రపరిచి కేసులు పరిష్కారం దిశగా ఈ డ్రోన్‌లు వేగంగా పని చేస్తున్నాయి. నగరంలో 23పోలీసు స్టేషన్‌లకు ఒకటి, రెండు చొప్పున అక్కడి వ్యాసార్థం బట్టి బ్లూకోల్ట్స్, డీకోల్ట్స్, మొబైల్, రక్షక్ పేరిట విధులు నిర్వహిస్తున్న విభాగాలకు దీటుగా ఈ డ్రోన్‌లు పరుగులు 24గంటలు పెట్టనున్నాయి. నిర్జన, సంక్షోభిత ప్రాంతాల్లో పోలీసు సైరన్ అలార్ట్‌లతో హెచ్చరికలు జారీ చేయడం, నిందితులను వెంబడిరచడానికి డ్రోన్‌లు వేగంగా ఎగురుతున్నాయి. త్వరలో పూర్తిస్థాయిలో డ్రోన్ సేవలు అందించడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయని విశాఖ సిటీ సీపీ బాగ్చీ వెల్లడిస్తున్నారు.
గొడవలు, అల్లర్లు జరిగే ప్రాంతాల్లో సిబ్బంది వెళ్లే సమయాని కంటే ముందుగా పరుగులు పెట్టడానికి ఈ డ్రోన్‌లు మెరుగ్గా పని చేయనున్నాయి. వాహనాలు వెల్లడానికి వీలు లేని ప్రాంతాల్లో సైతం త్వరితగతిన వెల్లడంతో పాటుగ ఘటనా స్థలంలో జరిగిన సంఘటనలు చిత్రికరించి కేసులు వేగవంతంగా చేయడానికి ఆధారాలు సేకరిస్తాయి. వీఐపీల రాకపోకలపై నిఘా కట్టుదిట్టం చేయడం, సమస్యాత్మక ప్రాంతాల్లో అల్లరిమూకలను చెల్లాచెదురు చేయడం, రహదారులపై ఆకతాయిలు మహిళలను వేధింపులకు గురిచేయకుండా అనుక్షణం కనిపెడుతునే ఉంటాయి. ఈ డ్రోన్‌లు పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి వస్తే శాంతిభత్రల సమస్యలు చాలా వరకు సర్ధుమనుగుతాయని విశాఖ పోలీసులు ప్రయోగాత్మకంగా చూపించనున్నారు.
నగరంలో వేగంగా పెరుగుతున్న జనాభా, సిబ్బంది కొరత దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్, నేర నియంత్రణలో డ్రోన్ సేవలు చాలా కీలకంగా ఉండనున్నాయి. ప్రమాదాల నివారణతో పాటుగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఈ డ్రోన్‌లు విధులు నిర్వహించడం. ఎటువంటి నేరాలు జరగకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం, ధూమపానం, గంజాయి, మందు బాబుల బృందాలను చెదరగొట్టడంతో పాటుగా కేసులు నమోదు చేయడానికి కీలక ఆధారాలు సేకరిస్తాయి. నిర్మాణుష ప్రాంతాలతో పాటుగా రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో 24గంటలు నిఘా కట్టుదిట్టం చేయడానికి ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో అందుబాటులో ఉన్న డ్రోన్‌లను త్వరలో అన్ని స్టేషన్‌లకు కేటాయించడానికి పలు ప్రైవేటు సంస్థలతో సీఎస్‌ఆర్ పద్ధతిలో తీసుకోవడానికి పోలీసు వర్గాలు సిద్ధమయ్యాయి.
విశాఖ సిటీలో గత పరిస్థితుల కంటే మెరుగ్గా ఉండటానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం. నగర ప్రజల్లో ఏ ఒక్కరూ కూడా శాంతిభత్రలు దృష్ట్య ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, వాళ్ల భద్రతే ధ్యేయంగా నాతో పాటుగా అందరు సిబ్బంది పని చేయాలి. అటుగా ఇప్పటికే చాలా సేవలు ప్రారంభించాం. ఈ క్రమంలో డ్రోన్ పోలీసింగ్ ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నాం. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ప్రయోగాత్మక స్థితిలో ఉన్న డ్రోన్ పోలీసింగ్ ప్రజల్లోకి తీసుకెళ్లి మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. నేరాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలతో పాటుగా పరిష్కారానికి డ్రోన్ పోలీసింగ్ కీలకంగా మారుతుంది. నగర ప్రజలకు శాంతిభద్రతలు, ట్రాఫిక్, నేర విభాగాలకు సంబంధించి ఎటువంటి సమస్య ఎదురైనా నా 79950 95799 ఫోన్ నెంబర్‌కి కాల్ చేయండి. – డాక్టర్. శంఖబ్రత బాగ్చీ (విశాఖ సిటీ పోలీసు కమిషనర్).
నేత్రన్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిథి): అధికారులు, అక్కడి నాయకుల పనితీరుతో ఓ వార్డులో అతిసారం రాజ్యమేలుతుంది. ఒక్కరోజులో పదుల సంఖ్యలో పెద్ద, చిన్న అనే వ్యత్యాసం లేకుండా సమీప ఆసుపత్ర్రులకు పరుగులు పెట్టడం స్థానికులను భయాందోళనకు గురి చేస్తుంది. గంట గంటకు రెండు నుంచి మూడు కేసులు పెరగడంతో ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి సుధూర ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇప్పటికే సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసిన ఎటువంటి పలితం లేదని బోరుమంటున్నారు. 37వ వార్డు జబ్బరితోట ప్రాంతంలో రెండు రోజుల్లో సుమారు 15మందికి పైగా అతిసారం (డయేరియా) పంజాకు గురయ్యామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని నెలల తరబడి పెద్ద కుప్పగా మురుగుతున్న వ్యర్థాలను తొలిగించి వెళ్లినా అతిసారం తన తీరుని ఏ మాత్రం తగ్గించుకోలేదని కనిపిస్తుంది. స్థానిక శానిటరీ అధికారి, సిబ్బంది ఇటుగా పట్టించుకోకపోవడంతో స్థానికంగా ఉన్న స్మశానవాటిక గోడకు ఆనుకొని నెలల తరబడి మురుగుతున్న వ్యర్థాలతో పాటుగా యూజీడీ లైన్లు పొంగి పొరలడంతో మంచినీరు కలుషితమై డయేరియాకు గురవుతున్నట్టు పలువురు వైద్యుల వివరణతో స్థానికులు ఓ అంచనాకు వచ్చారు. ఇప్పటికే ఒక్కొక్కరిగా ఆసుపత్ర్రుల్లో ఐసీయూల బాట పట్టడంతో మిగిలిన ప్రజలు భయాందోళనలో మగ్గుతున్నారు. నీటి సరఫరా శాఖ అధికారులు, సిబ్బంది సైతం ఘటనా స్థలానికి చేరుకొని ఆ నీటిని తాము కూడా సేవించామని, ఎటువంటి సమస్య లేదని అక్కడ నుంచి నిష్క్రమించడంతో ఓ ఆలోచనలో పడ్డ ప్రజలు మరలా భయాందోళనలో పడినట్టు అయ్యింది.
– అతిసారం వలలో ఒకే ప్రాంత వాసులు ఎలా..?
ఎటువంటి నీటి కాలుష్యం జరగలేదని జీవీఎంసీ నీటి సరఫరా సిబ్బంది చెప్పిన సమాధానానికి అక్కడ ప్రజలందర్ని సందిగ్ధ్ధంలో పడేసింది. ఒక ఇంట్లో అందరికీ అతిసారం లక్షణాలు కనిపిస్తే ఆహార కలుషితం అయ్యిందని అనుకునే పరిస్థితులు అక్కడ లేకుండానే వార్డులో ఒకే ప్రాంతంలో ఉన్న సుమారు 15మందికి పైగా వ్యధి గ్రస్తులుగా మారండం అందర్నీ భయాందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికైనా సంబంధిత జీవీఎంసీ అధికారులు, నాయకులు ఘటనా స్థలానికిచేరుకొని అక్కడ ఏర్పడిన సమస్యపై ఓ వివరణ ఇస్తే మిగిలిన ప్రజలు ఊపిరి పీల్చుకునే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. స్థానికంగా వ్యర్థాలు సమస్యతో పాటుగా నీటి కలుషితం పైన కూడా దృష్టి కేంద్రికృతం చేయాలని పలువురు ప్రాథేయపడుతున్నారు.
నేత్ర న్యూస్, విశాఖపట్నం : బాలల దినోత్సవం ప్రపంచ క్రీడా దినోత్సవాన్ని తలపించే విధంగా జరిగిందని ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంఈవోలు ఎం.సునిత, బి.పుష్య రాగం అన్నారు. మంగళవారం సాయంత్రం అక్కయ్యపాలెం, పోర్టు స్టేడియం, విశ్వనాథ్ కన్వెన్షన్స్‌లో స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ ఆధ్వర్యంలో జరిగిన రన ఫర్ ఫన్ కార్యక్రమంలో ఇరువురు ముఖ్య అతిథిలుగా పాల్గొని ఆనందంగా తిలకించారు. ఈ సందర్భంగా గాజువాక ఎంఈవో ఎం.సునిత మాట్లాడుతూ ప్రస్తుత విద్యా విధానంలో ఈ తరహా కార్యక్రమాలు చాలా అవసరమని అన్నారు. క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన మానసిక ఉల్లాసంతో చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఇదే విధంగా అన్ని పాఠశాలల్లో వారానికి రెండు రోజులు చిన్నారులకు క్రీడల వైపు మళ్ళించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహారాణిపేట ఎంఈవో బి.పుష్య రాగం మాట్లాడుతూ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్‌లో వినూత్న రీతిలో చదివించడంతో పాటుగా క్రీడా పరమైన అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపించడం అభినందనీయమని అన్నారు. కరాటీ, డాన్స్, చెస్ వంటి క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి చిన్నారుల అభ్యున్నతికి పునాదులు వేస్తున్న పాఠశాలగా వండర్ కిడ్స్ నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరక్టర్ మళ్ల రామునాయుడు మాట్లాడుతూ బాలల దినోత్సవం అనేది బాలలు ఇష్టపడే విధంగా ఉండాలని, వాళ్ళ ఇష్టానుగుణంగా ఈ రన్ ఫర్ ఫన్ కార్యాక్రమాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ‘సరదా కోసం పరుగు’ పేరిట కార్యక్రమం నిర్వహించడం వలన చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని వివరించారు. అనంతరం చిన్నారులకు పలు రకాల క్రీడల్లో పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులతో పాటుగా పతకాలను అందించారు. కార్యక్రమంలో భాగంగా కేజీ విద్యార్థులు వేసిన నృత్యాలు అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. పలువురు విద్యార్థులు కరాటీ క్రీడలో చేసిన సాహసాలు అబ్బురపరిచాయి. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మరో ఇద్దరు ముఖ్య అతిథులు ఎంఈవోలు బి.పైడపునాయుడు, బి.విశ్వనాథం చిన్నారుల ప్రతిభకు మంత్రముగ్ధులై అభినందనల వెల్లువలు కురిపించారు. కార్యక్రమంలో రాష్ట్ర అపుస్మా మెంటర్ ఎ.కృష్ణారెడ్డి, కోశాధికారి ఎంవీ రావు, విశాఖ జిల్లా అపుస్మా అధ్యక్షులు ఎస్.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎంవీవీ సత్యనారాయణ, పాఠశాల ప్రిన్సిపల్ వాణిశ్రీ, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : ప్రభుత్వం నుంచి పేదలకు అందిస్తున్న కోటా బియ్యం రూ.కోట్ల వ్యాపారాన్ని దాటేస్తుందని అనడంలో అతిశయోక్తి లేదు. పేదలకు అందకుండానే ఆమడ దూరంలో దళారుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. బియ్యం పంపిణీ విషయమై డీలర్ వద్ద అక్రమాలు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంటి వద్దనే ఇచ్చే విధంగా మొబైల్ పంపిణీ యూనిట్ (ఎండీయూ) వాహనాలను ప్రారంభిస్తే.. మొబైల్ పంపిణీ యూనిట్ సిబ్బంది డీలర్‌ల స్థాయిని సైతం మించిపోతున్నారని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వినిపిస్తుంది. ఈ క్రమంలో ప్రతీ నెల పేద ప్రజలకు బియ్యం ఇవ్వల్సింది పోయి వారికి బియ్యానికి బదులు కేజీకి రూ.10 చొప్పున సొమ్ము ఇస్తున్నారు. కొందరు మాత్రం బియ్యం కావాలని పట్టు పట్టి కూర్చుంటే రేపు రావాలి.. మరుసటి రోజు రావాలి.. అనే నెపంతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఇప్పటికే పలువురు ప్రజలు మండి పడుతున్నారు. ఉచితంగా ఇచ్చే బియ్యం వద్ద రూ.10 వస్తుందని ప్రజలు తీసుకుంటున్నారు కానీ తద్వార ప్రభుత్వానికి ఎంత మొత్తంలో గండి కొడుతున్నామని ఏ ఒక్కరూ ఆలోచించకపోవడం శోచనీయం. నాడు డీలర్‌ల నుంచి వందల టన్నుల్లో బియ్యం పక్కదారి పడితే నేడు వేల టన్నుల్లో మాయమైపోతున్నాయి. దీనికి తోడు ప్రతీ అంశంలో ప్రభుత్వ అధికారుల మాదిరి లంచం తినడంలో మొదటి వరసలో ఈ ఎండీయూల సిబ్బంది ఉన్నారు.
నేత్ర న్యూస్, విశాఖపట్నం : హస్తకళలను ప్రోత్సాహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కెయస్ విశ్వనాథన్ పేర్కొన్నారు. మదురవాడలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన గాంధీ శిల్ప బజారు, కళాత్మక చేనేత వస్త్రముల ప్రదర్శన, అమ్మకాలను ఆయనతో పాటు ఆయన సతీమణి విశ్వాంజలి గైక్వాడ్ లు శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని చెప్పారు. భారతదేశ కళలను సంరక్షించుటకు, కాపాడుటకు, అభివృద్ధి పరచుటకు సరియైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించి, వాటి ఉన్నతికి హస్తకళాకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరుచుటకు వారిని ప్రోత్సహించాలన్నారు. హస్త కళలను ప్రోత్సహిస్తూ వారి శ్రేయస్సు కొరకు వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోగల వివిధ రాష్ట్రముల నుండి జాతీయ అవార్డులు, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అనేక మంది చేతివృత్తి కళాకారులు తాము తయారుచేసిన వివిధ కళాఖండములను ఒకే వేదిక వద్దకు తీసుకువచ్చి పొందిన చేతితో తయారుచేయబడిన కళాఖండములను ప్రేమించి విశాఖ నగర పౌరులకు కళాకారులే తమ వస్తువులను నేరుగా అమ్ముకొను సౌకర్యమును కల్పించుటయే ఈ గాంధీ శిల్ప బజారు యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు.
ఈ ప్రదర్శనలో పాల్గొను కళాకారులు కొనుగోలు దారుల అభిరుచికి తగ్గ ప్రసిద్ధ డిజైన్లను ప్రస్తుత వ్యాపారానికి తగినట్లుగా తయారుచేసినట్లు వివరించారు. ఈ ప్రదర్శనలో సుమారు 100 నుండి 125 మందికి పైగా వివిధ రకాల చేతివృత్తుల కళాకారులు తమ వస్తువులను ప్రదర్శన, అమ్మకమునకు ఉంచబడినట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుండి కలంకారి ప్రింటింగ్, పెయింటింగులు, కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, లేసు అల్లికలు, చెక్కతో తయారు కాబడిన వివిధ రకాల కళాకృతులు, టెర్రకోట పాటరీలు, తాటియాకులతో తయారు కాబడిన వస్తువులు, ఏలూరు తివాచీలు, కేన్ వస్తువులు, మంగళగిరి డ్రస్ మెటీరియల్స్, చీరాల చీరలు, హైదరాబాదు ముత్యాలు, నిజామాబాద్ మెమెంటోలు, బ్లాక్ మెటల్ వస్తువులు, ఉదయగిరి ఉడెన్ కట్లరీ వస్తువులు, నిర్మల్ పెయింటింగ్లు, తదితరమైనవి ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంబ్రాయిడరీ, గాజు ఆభరణములు, తివాచీలు, వివిధ ఆకృతుల లోహపు వస్తువులు, శిలలతో తయారుచేయబడిన కళాత్మక వస్తువులు, వివిధ రకాల ప్రింటింగ్ వస్త్రాలు, చిత్రపటాలు, సిల్వర్ ఫిలిగ్రీ, లడ్డు గాజులు, దోప్లేస్టింగ్లు, డ్రై ఫ్లవర్స్, కేన్ వస్తువులు, బాతిక్ పెయింటింగ్లు, ఉద్-ఇన్-లే వస్తువులు, తంజావూరు, మైసూరు పెయింటింగులు మొదలగునవి. ప్రదర్శన, అమ్మకమునకు ప్రరర్శించినట్లు చెప్పారు. ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 11 గంటలు నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటాయని, శెలవు దినములలో కూడా తెరచి ఉంటాయన్నారు. ఈ ప్రదర్శన హస్తకళల అభివృద్ధి కమిషనర్ కార్యాలయములు, జౌళిశాఖ, కేంద్రప్రభుత్వం, న్యూఢిల్లీ వారి ఆర్థిక సహాయంతో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ) లేపాక్షి హస్తకళల ఎంపోరియమ్, విశాఖపట్నం వారి సౌజన్యంతో నిర్వహించబడుచున్నదని తెలిపారు.
గాంధీ శిల్పబజూరు లేపాక్షి హస్తకళలు మరియు కళాత్మక చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకమునకు వివిధ రాష్ట్రముల నుండి వచ్చిన కళాకారులు తాము తయారుచేసిన వస్తువులను నేరుగా అమ్ముకొనుటకు విస్తృత ప్రచారం గావించి వారికి చేయూత నివ్వవలసినదిగా కోరారు. కార్యక్రమంలో ఎపి హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ బి. విజయలక్ష్మి, హస్తకళల అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వ మనోహర్, విశాఖ రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్య, డిసి హెచ్ ఎడి అపర్ణ లక్ష్మి. యన్, హెచ్ పిఓ ఎం సువర్చల, లేపాక్షి మేనేజర్ కె. విజయ గౌరి, ఇన్ చార్జ్ మేనేజర్ బి. శైలజ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.