Please assign a menu to the primary menu location under menu

Weekly Gadgets

Find Us on Socials

Tag Archives: VISAKHAPATNAM MRO OFFICE

CrimeGovernmentPolitical

జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రచ్చ.. రచ్చ..

విశాఖపట్నం జాయింట్‌ సబ్‌ రిస్ట్రార్‌లో రోజు రోజుకి ముదురుతున్న ముసలం..

– కొత్త సిబ్బంది పనితీరు, సమన్వయ లోపంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు..

పర్సంటేజ్‌లు పంచుకోవడంలో వ్యత్యాసం రావడంతోనే అసలు రచ్చ.. రచ్చ..

– అన్నీ ఉంటే 0.5% లేకపోతే 1% నుంచి మా ఇష్టమంటున్న మధ్యవర్తులు..

– జిల్లా అధికారికి అధిక సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఇప్పటికే మందలింపు..

నేత్రన్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి): విశాఖపట్నం జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సిబ్బంది మధ్య జరుగుతున్న జగడం ఆనోట.. ఈనోట.. పలుకుతూ పైస్థాయి అధికారుల దృష్టికి సైతం వెళ్లడం ప్రస్తుతం చర్చనీయంగా మారింది. అక్కడి అధికారుల నుంచి దిగువ స్థాయి సిబ్బంది వరకు సమాన వాటాలతో రావల్సిన పర్సంటేజ్‌లో వ్యత్యాసాలు కనిపించడం సిబ్బంది మధ్య గత నెలరోజులుగా కుమ్ములాట జరుగుతుందని విశ్వసనీయ సమాచారం. దీంతో రోజువారీ కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మండిపడుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో జరగాల్సిన చిన్న చిన్న పనులు సైతం నత్తనడకన సాగుతూ వారాలు గడిచిపోతున్నాయని పలువురు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త సిబ్బందికి సక్రమంగా పనులు చేయడం రాకపోవడంతో రాబందుల మాదిరి చుట్టుపక్కల కాసుకొని కూర్చున్న కొందరు ప్రైవేటు డాక్యుమెంట్‌ రైటర్‌లతో పనులు చేయిస్తున్నారని కూడా బహిరంగంగా వెల్లడిస్తున్నారు. రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నగదు రహిత పనులు జరగాలని ప్రభుత్వం అన్నింటిని ఆన్‌లైన్‌ ద్వారా పెట్టడంతో మరింత సమస్యగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారి లేదా సిబ్బంది వద్దకు వెళ్లినప్పుడు లంచం అడిగితే అవినీతి నిరోధకశాఖకు ఫిర్యాదులు అందించే అవకాశం లేకుండానే రిజిస్ట్రార్‌ కార్యాలయానికి దూతలుగా వ్యవహరిస్తున్న ప్రైవేటు డాక్యుమెంట్‌ రైటర్‌ల వద్దనే అన్ని లావాదేవీలు జరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రిజిస్ట్రేషన్‌ సమయంలో అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే 0.5శాతం, పత్రాల్లో వ్యత్యాసాలు ఉంటే 1శాతం నుంచి ఎదుట వ్యక్తి ఆలోచనలో పడినంత పర్సంటేజ్‌ని వసూలు చేసి అధికారులకు, అక్కడి సిబ్బందికి ఇవ్వడంలో ఈ డాక్యుమెంట్‌ రైటర్‌లు కీలకంగా ఉన్నారని ఇట్టే అర్థం అవుతుంది. జిల్లా కార్యాలయానికి, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి అనుసంధానంగా పనిచేసే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బందికి సైతం ఇక్కడ తీసుకున్న పర్సంటేజ్‌ల్లో సమాన వాటాలను సైతం ఇస్తున్నారని పలువురు డాక్యుమెంట్‌ రైటర్‌లే బహిరంగ రహస్యంగా చెప్పుతున్నారు. ఇక్కడ జరుగుతున్న అన్ని అంశాలను పలువురు ప్రజలు ఫిర్యాదుల రూపంలో జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లడంతో ఇప్పటికే ఆయన వచ్చి సిబ్బందిని ఆయన తీరులో మందలించడం కూడా జరిగింది. రూ.కోట్లల్లో జరుగుతున్న ఆర్థిక లావాదేవీల్లో కీలకంగా వ్యవహరించే రెవెన్యూ వ్యవస్థ విధించిన పర్సంటేజ్‌లు ఎంత లాభాన్ని లెక్కకడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతీ వ్యవహారానికి ప్రభుత్వం విధించిన స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, యూజర్‌ ఛార్జీల పేరిట విపులంగా పెద్ద పెద్ద బోర్డులను అమర్చినా ప్రజల్లో చైతన్యం రాకుండా అవితీకి ఆజ్యం పోస్తున్నట్టు పర్సంటేజ్‌లు చెల్లించడం ప్రజలు చేస్తున్న పెద్ద తప్పుగానే పరిగిణించాలి.

  • రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరుగుతున్న తంతు తెలిసినా చోద్యం ఎందుకు..?
    ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని అందించే కీలక వ్యవస్థల్లో రిజిస్ట్రార్‌ కార్యాలయాలు మొదటి ఐదు స్థానాల్లో నిలుస్తాయని అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. అటువంటి వ్యవహారాలు జరిగే కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ అప్పుడప్పుడు చుట్టం చూపుగా చూడటంపై కొందరి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. అన్ని సేవలు ఆన్‌లైన్‌ పేరిట ఉన్నా సంబంధిత వ్యవహారాలపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఎట్టకేలకు కార్యాలయాలకు దూతలుగా వ్యవహరిస్తున్న డాక్యుమెంట్‌ రైటర్‌లనే ఆశ్రయించి నిలువుదోపిడికి గురవుతున్నారు. ఈ తరహా వ్యవహారాల దృష్ట్య ప్రస్తుత కాలంలో అవినీతి అధికారులని, సిబ్బందిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి అవకాశం లేదని తెలిసినా సంబంధిత ఏసీబీ అధికారులు అటుగా డాక్యుమెంట్‌ రైటర్‌లపై దృష్టి కేంద్రీకృతం చేయడంలో చోద్యం ఎందుకు అని పలు ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. పర్సంటేజ్‌లు పుచ్చుకునే కార్యాలయాల్లో అన్ని అంశాల గురించి పూర్తి అవగాహాన ఉన్న అవినీతి నిరోధక శాఖ చక చక పనులు ప్రారంభిస్తే ఇట్టే అవినీతి తిమింగళాలను పట్టుకోవచ్చు. ఇదే జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 2.ఓ పరిస్థితికి ముందు చాలా మంది అవినీతి అధికారులను పట్టుకొని కటకటాల వెనక్కి నెట్టిన ఘనత ఏసీబీకి చాలా సార్లు దక్కింది. గతంలో ఇదే చోట పనిచేసి పలుమార్లు ఇదే స్థానంలో రావడానికి ఇష్టపడుతున్న అధికారులు, ఎక్కడి స్థానంలో అక్కడ ఉండిపోవడానికి అత్యాశ చూపించే గత సిబ్బంది, ఇదో ఏదో బాగుందే అని పనులు రాకపోయిన నెట్టుకొస్తున్న కొత్త సిబ్బంది తీరుని గమనిస్తే ఎంతటి స్థాయిలో అవినీతి జరుగుతుందో ఇట్టే అర్థం అయిపోతుంది. కార్యాలయ ప్రాంగణంలో అవినీతి జరగకపోయినా అవినీతికి పాల్పడిన అధికారులు దూతల ద్వారా అధిక శాతం కోరుతున్న ఘటనలు ఈ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గోడలు, కిటికీలు నిరంతరం కనిపెడుతునే ఉన్నాయి.
CrimeGovernment

ప్రజలను పీడిస్తున్న అవినీతి జలగలు

– ధ్రువపత్రాల పేరిట పేదల నుంచి రూ.వేలల్లో దోచుకుంటున్న తహశీల్దార్‌ కార్యాలయ సిబ్బంది..
– సర్టిఫికెట్‌ స్థాయిని బట్టి సొమ్ములు కాజేస్తున్న మహరాణిపేట తహశీల్దార్‌ కార్యాలయ జలగలు..
– రూ.కోట్లకు పడగలెత్తిన ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది, అటుగా చూడని జిల్లా ఉన్నతాధికారులు..

నేత్రన్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి): కాసులు చెల్లించలేని కటిక పేదవాడైతే అక్కడ అధికారుల నుంచి అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న దళారులకు సైతం కనిపించరు. అదే దుడ్లు అయినా పరవాలేదు త్వరితగతిన పనులు జరిగితే చాలు అనుకుంటే అర నిమిషంలో కార్యాలయ యంత్రాంగం సైతం కాసుకొని కూర్చుంటారు. ఈ మధ్య కాలంలో అవినీతి నిరోధక శాఖ జరిపిన దాడుల్లో ఇదే కార్యాలయ డిఫ్యూటీ తహశీల్దార్‌ రూ.60వేలు లంచం తీసుకుంటూ పట్టుబడినా ఇక్కడ సిబ్బందికి బుద్ధి రాలేదనే చెప్పాలి. కుల ధ్రువ పత్రం కావాలని ఓ యువకుడు సంబంధిత అధికారిని సంప్రదించగా సొంత జిల్లా నుంచి వలస వచ్చినట్టు మైగ్రేషన్‌ ధ్రువ పత్రం తీసుకురావాలని చెప్పిన ఆ అధికారులు అక్కడికి రెండు రోజుల తరువాత ఎటువంటి మైగ్రేషన్‌ లేకుండానే కాసులకు కుక్కుర్తి పడి కులధ్రువపత్రం ముద్రించి ఇవ్వడం జరిగింది. ఇదే క్రమంలో ఓ బాధితురాలు కుటుంబ ధ్రువపత్రం కోసం అర్జీ చేసుకొని పదిరోజులు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోని అధికారులు, దళారుల ద్వారా వెళ్లిన పది నిమిషాల్లో కుటుంబ ధ్రువ పత్రం ఇవ్వడంతో ఆ బాధితురాలు ఆశ్చర్యానికి గురైయిందనే చెప్పాలి.

అవినీతికి అవకాశం ఇవ్వకుండా సామాన్య ప్రజలకు త్వరితగతిన సేవలందించే ఉద్ధేశంతో రాష్ట్ర ప్రభుత్వం ధ్రువపత్రాల స్థాయిని బట్టి జారీ చేయడానికి ఇచ్చిన గడువును అక్కడి అధికారులు, సిబ్బంది ధ్రువ పత్రాల స్థాయిని ఆధారంగా చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారని ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా వెలువడుతున్నాయి. ప్రభుత్వం ధ్రువపత్రం స్థాయిని బట్టి రోజులను కేటాయిస్తే ఆ రోజులను అధికారులు అనువుగా తీసుకొని అందినకాడికి దోచుకోవడానికి ఉపయోగిస్తున్నారు. కార్యాలయంలో ఎప్పటి నుంచో పాతుకుపోయిన కొందరు సిబ్బంది చేస్తున్న చేష్టలతోనే కార్యాలయం నడుస్తుందంటే అతిశయోక్తి కాదు. పైగా అనధికారికంగా ఉన్న మరికొంత మంది దళారులుగా మెలుగుతూ పేద ప్రజలను పట్టి పీడిస్తున్నారని ఫిర్యాదులు జిల్లా ఉన్నతాధికారులకు పలుమార్లు వెళ్లినా అటుగా ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఓ బాధితురాలు తనని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వేలల్లో లంచం అడుగుతున్నారని ఫిర్యాదు చేస్తే రూ.60వేలు లంచం సొమ్ముతో డీటీ పట్టుబడ్డాడంటే ఆ దిగువన ఉన్న సిబ్బంది.. ఆ పైన ఉన్న అధికార యంత్రాంగానికి ఏ మాత్రం వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీఆర్‌వో, ఇన్‌స్పెక్టర్‌ స్థాయి సిబ్బంది చేస్తున్న చేష్టలు వెలుగులోకి రాలేనంత వరకు కప్పను మింగిన పాములా ఉంటున్నారని, సిబ్బంది చేస్తున్న నిర్వాకం మొత్తం బాధితులు బయట పెడితే ఉద్యోగాలు సైతం ఊడిపోవడం కాయమని సంబంధిత విభాగ సిబ్బందే గుసగుసలాడుకుంటున్నారు. తహశీల్దార్‌ కార్యాలయంలో ధ్రువ పత్రాల కోసం వెళ్తున్నామని చెప్పిన వెంటనే ఎన్ని దుడ్లు తీసుకెళ్తున్నారు అని ప్రజల్లో పలు సందేహాలు వస్తున్నాయంటే అక్కడ అధికారులు, సిబ్బంది తీరు ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం అవుతుంది.

– మైగ్రేషన్‌ లేకుండా ఎలా ఇచ్చారు..?
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులస్తులకు జారీ చేసే కుల ధ్రువ పత్రాలకు అవసరం లేని ‘మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌’ కేవలం తూర్పు కాపులకు జారీ చేసే కుల ధ్రువ పత్రానికి కీలకం చేయడం తహశీల్దార్‌ కార్యాలయ సిబ్బంది పండుగ చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల ద్వారా పుట్టుకతో ఒకేసారి వచ్చిన కులాన్ని ఏడాదికి ఒకసారి మార్పు చేసినట్టు ‘తూర్పు కాపు’ సర్టిఫికెట్‌ నకలు ఇచ్చినా మైగ్రేషన్‌ ఉందా అని ప్రశ్నించడం విస్మయానికి గురిచేస్తుంది. గత ఏడాదిలో అన్ని పత్రాలు పరిశీలించి ఇచ్చిన ధ్రువపత్రాన్ని జతపరిచినా ప్రస్తుతం ఇచ్చే ధ్రువపత్రానికి మైగ్రేషన్‌ తప్పనిసరిగా కావాలని మెలిక పెట్టి మనీ మనీ మోర్‌ మనీ అని పీడిస్తున్నారు. ఇదే క్రమంలో ఓ బాధితుడు గత ఏడాదిలో ఇచ్చిన తూర్పుకాపు (బీసీ`డీ) సర్టిఫికెట్‌ జతపరిచి కొత్త ధ్రువపత్రం ఇవ్వాలని అర్జీ పెట్టగా మైగ్రేషన్‌ కావాలని దరఖాస్తును రిజక్ట్‌ చేసిన అధికార యంత్రాంగం నాలుగు రోజుల తరువాత కాసులకు కక్కుర్తి పడి ఎటువంటి మైగ్రేషన్‌ లేకుండానే తూర్పుకాపు ధ్రువ పత్రం ఎలా ఇచ్చారో అధికారులే చెప్పాలి. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు ‘నేత్ర న్యూస్‌’ సేకరించింది.

– ఎన్నిరోజులు తిరిగితే అంత సొమ్ము..!
తహశీల్దార్‌ కార్యాలయం చుట్టూ దరఖాస్తుదారుడు ఎన్నిసార్లు తిరిగితే అంత సొమ్ము సంపాదించవచ్చని కార్యాలయ సిబ్బందికి గట్టి నమ్మకం. దరఖాస్తుదారుని అవసరాన్ని అవకాశంగా తీసుకొని సంబంధిత అధికార, సిబ్బంది వర్గం మధ్యలో ఉన్న దళారులను ప్రవేశపెడుతున్నారు. మహారాణిపేట తహశీల్దార్‌ కార్యాలయంలో దళారి వ్యవస్థ కనుసైగల్లో అన్ని పనులు జరిగిపోతాయని బహిరంగ రహస్యంగా చెప్పుతూ ఉంటారు. తహశీల్దార్‌, ఉప తహశీల్దార్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, వీఆర్‌వో ఇలా కనిపించే ప్రమాదకర వ్యవస్థ కంటే బహిరంగంగా కనిపించని ఆ దళారి వ్యవస్థ చాలా ప్రమాదకరమని పలువురు బాధితులు బోరుమంటున్నారు. గత రెండు నెలల క్రితం కుటుంబ సర్టిఫికెట్‌ కోసం ఓ మహిళ మహారాణిపేట ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్తే అక్కడి సిబ్బంది ఆమెను ముప్పతిప్పలు పెట్టి ఎట్టకేలకు రూ.30వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేయడం అయోమయానికి గురిచేస్తుంది.

– అడుగడుగున అవినీతి జలగలు..
ఈ కార్యాలయంలో అడుగడుగున అవినీతి జలగలు తారసపడుతున్నారు. ధ్రువ పత్రాల స్థాయిని బట్టి ధరను నిర్ణహిస్తున్నారు. ఎక్కువగా కుల ధ్రువపత్రం, కుటుంబ ధ్రువ పత్రం వంటి విషయాల్లో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కి సైతం ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. `వెంకటేశ్వర రావు (బాధితుడు)