Please assign a menu to the primary menu location under menu

Weekly Gadgets

Find Us on Socials

Monday, September 9, 2024

Tag Archives: #TEMPLE

Devotional

ఆయన భక్తి అదో రకం

నేత్ర న్యూస్‌, అన్నవరం, (ప్రత్యేక ప్రతినిధి) : మానవుడిగా పుట్టిన వాడికి కాసంత భక్తి భావం ఉండాలని పెద్దలు అన్న విషయం మరోమారు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో కనిపించిందనే చెప్పాలి. అక్కడ కాసంత కాదు.. కొండంత భక్తి ఉందని ఓ భుక్తుడు నిరూపించాడు. ఆ భక్తి పరవశంలో తనతో పాటుగా చుట్టు పక్కల ఉన్నవారు సైతం మునిగి పోవాలని నిబంధన పెట్టడమే అక్కడ అసలు కథ మొదలైంది. తాను భక్తుడే కాకుండా ఆ ఆలయ కార్యనిర్వాహణాధికారి కావడం కొస మెరుపు. తాను చెప్పింది శిరసా వహించకపోతే శిక్షలు తప్పవని హెచ్చరికలు సైతం జారీ చేయడంతో చేసేదేమి లేక సిబ్బంది అందరూ శిరస్సు వంచి మాలధారణ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయ కార్యనిర్వాహణాధికారిగా ఉన్న చంద్రశేఖర్‌ ఆజాద్‌ గతంలో శ్రీశైలం శ్రీమల్లిఖార్జున స్వామి ఆలయం, విజయవాడ శ్రీకనక దుర్గమ్మ ఆలయంలో వ్యవరించిన తీరు మరోమారు అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో కనిపించడంపై పలువురు సిబ్బంది మండి పడుతున్నారు. ఏ ఆలయంలో విధులు నిర్వహిస్తే ఆ స్వామివారి మాలధారణ చేయడం ఆయనకు అలవాటుగా అనుకుంటే..

ఆ ఆలయంలో విధులు నిర్వహిస్తున్న మొత్తం సిబ్బందిని బలవంతంగా మాలధారణ చేయాలని ఆదేశించడం మూర్ఖత్వంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆలయంలో పని చేస్తున్న మొత్తం సిబ్బంది గతంలో శ్రీశైలంలో సిబ్బంది శివమాల, విజయవాడలో సిబ్బంది దుర్గమ్మ మాల వేసినట్టు ఇక్కడ సిబ్బంది సత్యదేవుని మాల వేయాలని ఆదేశించారు. తాను సైతం మంగళవారం ఉదయం వేద పండితుల సమక్ష్యంలో మాలధారణ చేయడంతో పాటుగా ఆలయంలో సుమారు 80శాతం సిబ్బందికి మాలధారణ చేయించారు. మరో 20శాతం సిబ్బంది ఇంట్లో ఉన్న చిన్నపాటి రుతుక్రమ సమస్యలు తీరిన తరువాత తీరిగ్గా.. అది కూడా మరో రెండు రోజుల్లో మాలధారణ చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో సిబ్బంది ముక్కుతూ మూలుగుతూ స్వామివారి మాలధారణ భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుని చీటీ తీసుకురావాలని, తన కుటుంబంలో ఎవరికైనా సమస్యలు ఉంటే సమస్యను వివరిస్తూ సంబంధిత పత్రాలను చూపించాలని షరతులు సైతం పెట్టారని పలువురు ఆగ్రహంతో మండి పడుతున్నారు. ఇటువంటి సమస్యలపై ఇప్పటికే అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లామని, దీనిపై అంతర్గత విచారణ చేపట్టి ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూస్తున్నామని పలువురు సిబ్బంది వెల్లడిస్తున్నారు.

  • మా స్వామివారి భక్తిలో డిస్కౌంట్‌ ఆఫర్లు..
    దైవ భక్తితో చేసిన చేష్టలు చూడటానికి చక్కగా ఉంటే.. దొంగ భక్తితో చేసిన చేష్టలు చికాకు తెస్తున్నాయని ఆలయంలో సిబ్బంది కార్యనిర్వహణాధికారి ఆజాద్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సుమారు వెయ్యి మందికి మాలధారణ చేయమని చెప్పడం ఓ మాదిరిగా ఉన్నా.. ఇంట్లో కుదరలేని సిబ్బంది స్వామివారి మాల వస్త్రాలు మాత్రం తప్పనిసరిగా ధరించి విధులు నిర్వహించాలని నిబంధన పెట్టడంపై పలువురు సిబ్బంది నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. మెడలో మాల లేకపోయినా వస్త్రాలు ధరించి విధులు నిర్వహించడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయగా ఆఖరికి చేసేదేమి లేక పై స్థాయి అధికారి చెప్పినట్టు నడుచుకోవడం మంచిదని సర్ధుకున్నారని సమాచారం. దీనిపై హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి సభ్యులు, స్వామివారి భక్తులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

  • ఉన్నత స్థాయి అధికారికి ఉడతా భక్తి ఉందా..?
    అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉన్నత స్థాయిలో ఉన్న ఈవో చంద్ర శేఖర్‌ ఆజాద్‌కి ఉడత చేసినంత భక్తి ఉందా..? లేదా నటిస్తున్నారా..? అనే సందేహాలు వెంటాడుతునే ఉన్నాయి. గతంలో శ్రీశైలం ఆలయంలో ఈవోగా ఉన్న సమయంలో గుప్త నిధుల వేటతో అక్కడి భక్తుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆయన శివమాల పేరిట అక్కడ సిబ్బందిని హింసకు గురిచేయడం, ఆ తరువాత విజయవాడ దుర్గమ్మ ఆలయంలో అమ్మవారి మాలలు వేయాలని అక్కడ సిబ్బందిని ఇబ్బంది పెట్టిన కొన్ని రోజులకే ఏసీబీ దాడుల్లో దొరికిపోవడం ఆయనకు నిజమైన భక్తి ఉందా..? లేదా భక్తి ఉన్నట్టు నటిస్తున్నారా..? అనే విషయం అర్థం కావడం లేదు. ఇదే క్రమంలో అన్నవరం సత్యనారాయణ స్వామివారి ఆలయంలో తన భక్తిని చాటుకునే క్రమంలో ఆయనతో పాటుగా సిబ్బంది మొత్తం మాలధారణ చేయాలని నిబంధనలు పెట్టడం, మాల వేయలేనివారు వస్త్రాలు ధరించి విధులు నిర్వహించాలని షరతులు పెట్టడం వెనుక పలు సందేహాలు వేధిస్తునే ఉన్నాయని తన తోటి ఉద్యోగులే గుస గుసలాడుకుంటున్నారు. ఇటువంటి వారిని చూసిన తరువాత ఏదిఏమైనా.. ఎవరూ ఏం చేసినా.. హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని నేత్ర న్యూస్‌ గుర్తుచేస్తుంది.