Please assign a menu to the primary menu location under menu

Tag Archives: TASK FORCE

CrimeGovernmentPolitical

టాస్క్‌ ఫోర్స్‌లో మహా మాయగాళ్లు

కీలక టాస్క్‌ల్లో నిందితులకు సమాచారం చేరవేసి చేతివాటం చూపిస్తున్నట్టు పలు ఆరోపణలు..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి): కీలక టాస్క్‌ల్లో నిందితులకు ముందస్తు సమాచారం అందించి చేతివాటం చూపించడంతో పాటుగా క్రికెట్‌ బెట్టింగ్‌లు, పేకాటలు నిర్వహించడంలో టాస్క్‌ఫోర్స్‌ బృందం ప్రత్యేక గుర్తింపు కైవసం చేసుకుందని నగర ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్‌ ముసుగులో గత ఎనిమిదేళ్లుగా సుమారు రూ.150కోట్లకు పైగా క్రికెట్‌ బుకీ లావాదేవీల్లో పల్లా గంగరాజు అనే హెడ్‌ కానిస్టేబుల్‌ని గుర్తించి ఈనెల 15న ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. వాస్తవానికి స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా విధుల నుంచి తొలిగించిన ఈ గంగూభాయ్‌ టాస్క్‌ఫోర్స్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేసినప్పటి నుంచి బొబ్బిలి రవి, లగుడు రవి, తన సోదరుడు పల్లా త్రినాథ్‌తో కలిసి బెట్టింగ్‌ బుకీ నిర్వహించినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాంధ్ర, తూ.గో, ప.గోతో పాటుగా సుధూర ప్రాంతాల్లో ఈ బుకీ కార్యకలాపాలు జరిగినట్టు ఇప్పటికే ప్రత్యేక బృందాలు విచారణ చేపడుతున్నాయి. రోజుకి ఇద్దరు, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్న అధికారులకు విస్తుపోయే నిజాలు బయటపడటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఓ బాధితుడు పీజీఆర్‌ఎస్‌లో నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చీకి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంలో రాజకీయ ఒత్తిడి తీవ్రంగా ఉన్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఇంతటి ఘనతను సాధించినట్టు పలువురు అధికారులు వెల్లడిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్‌ స్టేషన్‌కి సమీపంలో ఎన్నో ఏళ్లుగా ఈ వ్యవహారం జరుగుతున్నా ఇంత ఆలస్యంగా గుర్తించడంలో ఆ హెడ్‌ కానిస్టేబుల్‌తో పాటుగా గతంలో పని చేసిన కీలక అధికారులకు సైతం ముడుపులు అందినట్టు పలు అనుమానాలు వెంటాడుతునే ఉన్నాయి. ఇదే క్రమంలో ప్రస్తుత బృందంలో ఉన్న కొందరు దిగుస్థాయి సిబ్బంది టాస్క్‌లకు వెళ్లే సమయంలో నిందితులకు ముందస్తు సమాచారం చేరవేసి లబ్ధి పొందుతున్నట్టు సంబంధిత విభాగంలోనే గుసగుసలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పోర్టులో సొత్తును కాజేస్తున్న ఇద్దరు మాయ లేడీల నుంచి నెలవారీ వచ్చే ముట్టగొట్ట(లంచం)కి కక్కుర్తి పడటం, గంజాయి తరలింపు కేసుల్లో కీలక ఆధారాలు తీసుకొచ్చి కేసులు నమోదు చేయడంలో ఎంత చాకచక్యం ప్రదర్శిస్తున్నారో అంత కంటే పెద్ద పెద్ద ముఠాలను పక్కదారిలో తరలించడానికి సాయం చేస్తూ ఎంత మొత్తంలో భక్షిస్తున్నారో బహిరంగ రహస్యంగానే సిబ్బంది మనసులో దాచుకున్నారు. నగరంలో ఉన్న రౌడీ షీటర్స్‌, బడా బాబులందరూ జూదం ఆడటానికి ఓ వేదికను ఏర్పాటు చేసే కీలక రౌడీషీటర్‌ కొలుసు కుమార్‌కి సైతం చేదోడు వాదోడుగా ఉంటూ నెలవారీ ముడుపులు తీసుకోవడంలో బిజీ బిజీగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం. అది కూడా ఎంతగా అంటే సంక్రాంతి పండగ అటు ఇటుగా నెలరోజులు స్టేషన్‌కి వచ్చి వారాంతపు సంతకాలు చేయాల్సిన రౌడీషీటర్‌ సైతం జూదం ఆడుకుంటూ రాకపోయినా పట్టించుకోలేనంతగా ఇక్కడ సిబ్బంది స(అ)క్రమంగా విధులు నిర్వహిస్తున్నారు.

  • టాస్క్‌ ఫోర్స్‌లో ఆ షాడోని పట్టుకోవడం కష్టమా..?

తనకి హద్దులను కేటాయించినా నగర వ్యాప్తంగా సంచరిస్తున్న ఆ షాడో రౌడీ షీటర్స్‌తో స్నేహం చేసి దండీగానే దండుకుంటుంది. ఓ మహిళా న్యాయవాది సాయంతో జైల్లో ఉన్న రౌడీ షీటర్‌లకు ములాకత్‌, బెయిల్‌ పెట్టడంలో షాడో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇదే క్రమంలో అక్కడ మగ్గిపోతున్న కొందరు పీడీయాక్ట్‌, డ్రగ్స్‌, గంజాయి కేసుల్లో ఉన్న కేటుగాళ్ల నుంచి కీలక విషయాలను తెలుసుకొని నగరంలో మాయాజాలం ప్రదర్శిస్తుంది. ఓ ఘటనలో ఒక రౌడీషీటర్‌ వద్ద 2గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ గుర్తించి అదే టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పట్టుకుంటే తనకు ఆ రౌడీషీటర్‌ డబుల్‌ ఏజెంట్‌గా ఉన్నాడని ఉన్నతాధికారులను ఒప్పించి వదిలి పెట్టడంలో కీలకంగా వ్యవహరించింది ఆ షాడో. బెల్ట్‌ దుకాణాలు, రేషన్‌ బియ్యం అక్రమంగా తరలించే వ్యక్తుల నుంచి సైతం పెద్ద మొత్తంలో ముడుపులు అందుతున్నట్టు టాస్క్‌ఫోర్స్‌ గోడలు సైతం ఈ షాడో చేష్టలు చూడలేక గగ్గోలు పెడుతున్నాయి.

  • టాస్క్‌ ఫోర్స్‌లో డైరెక్ట్‌ అధికారి అవసరమే..!

నగర వ్యాప్తంగా ఎటువంటి తారతమ్యం, రాజకీయ ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించడానికి టాస్క్‌ఫోర్స్‌లో డైరెక్ట్‌ డీఎస్పీ స్థాయి అధికారి అవసరం అక్కడ ఎంతైన ఉందని పలువురు దీర్ఘకాలిక అనుభం కలిగిన పోలీసు ఉద్యోగులు వెల్లడిస్తున్నారు. నెలరోజులు క్రితం స్టేషన్‌కి సమీపంలో ఓ లాడ్జీలో పేకాట జట్టుని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ బృందానికి తీవ్ర తలనొప్పి తెచ్చిపెట్టింది. ఓ రాజకీయ ఒత్తిడి వలన కొంత సొమ్ముతోనే అదుపులోకి తీసుకోవల్సి వచ్చింది. ఇదే క్రమంలో వారం రోజుల క్రితం ఆనందపురం, రామవరం రోడ్డులో సుమారు వంద మందికి పైగా కోడి పందాలు ఆడుతున్నారని పట్టుకోవడానికి వెళ్లిన సిబ్బందికి ఓ మాజీ ఎమ్మెల్యే ఒత్తిడి తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అప్పటికే ముప్పై మందికి పైగా అదుపులోకి తీసుకొని రూ.2.10లక్షల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. సిబ్బంది కష్టపడినా కార్లులో ఉన్న భారీ మొత్తాన్ని పట్టుకోలేకపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో డైరెక్ట్‌ అధికారి అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు సీఐలు, ఒక ఎస్సై, నలుగురు హెచ్‌సీలు, పద్నాలుగు మంది కానిస్టేబుల్స్‌, ఇద్దరు హోంగార్డు డ్రైవర్‌లతో నడుస్తున్న టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని స్పెషల్‌ బ్రాంచ్‌ ఏడీసీపీతో పాటుగా నగర పోలీసు కమిషనర్‌ పర్యావేక్షించడం ఒక విధంగా మంచిదైనా స్థానికంగా అక్కడ ఓ ఉన్నతాధికారి లేకపోవడం దిగువ స్థాయి అధికారులకు ఇబ్బంది తప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి కంటే అక్కడ సీనియర్‌ స్టేషన్‌ స్థాయి అధికారికి నిందితులను అప్పగించే సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు. పైగా ఎదురు సమాధానం చెప్పలేకపోవడంతో టాస్క్‌ నిర్వహించి సంబంధిత సమీప స్టేషన్‌కి అప్పంగించాల్సిన టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందికి సెంట్రీ డ్యూటీ వేసిన సందర్భాలు కూడా నగరంలో అధికంగానే ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంది.