Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
విశాఖపట్నం జాయింట్ సబ్ రిస్ట్రార్‌లో రోజు రోజుకి ముదురుతున్న ముసలం..
పర్సంటేజ్‌లు పంచుకోవడంలో వ్యత్యాసం రావడంతోనే అసలు రచ్చ.. రచ్చ..
నేత్రన్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి): విశాఖపట్నం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సిబ్బంది మధ్య జరుగుతున్న జగడం ఆనోట.. ఈనోట.. పలుకుతూ పైస్థాయి అధికారుల దృష్టికి సైతం వెళ్లడం ప్రస్తుతం చర్చనీయంగా మారింది. అక్కడి అధికారుల నుంచి దిగువ స్థాయి సిబ్బంది వరకు సమాన వాటాలతో రావల్సిన పర్సంటేజ్‌లో వ్యత్యాసాలు కనిపించడం సిబ్బంది మధ్య గత నెలరోజులుగా కుమ్ములాట జరుగుతుందని విశ్వసనీయ సమాచారం. దీంతో రోజువారీ కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మండిపడుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో జరగాల్సిన చిన్న చిన్న పనులు సైతం నత్తనడకన సాగుతూ వారాలు గడిచిపోతున్నాయని పలువురు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త సిబ్బందికి సక్రమంగా పనులు చేయడం రాకపోవడంతో రాబందుల మాదిరి చుట్టుపక్కల కాసుకొని కూర్చున్న కొందరు ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్‌లతో పనులు చేయిస్తున్నారని కూడా బహిరంగంగా వెల్లడిస్తున్నారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో నగదు రహిత పనులు జరగాలని ప్రభుత్వం అన్నింటిని ఆన్‌లైన్ ద్వారా పెట్టడంతో మరింత సమస్యగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారి లేదా సిబ్బంది వద్దకు వెళ్లినప్పుడు లంచం అడిగితే అవినీతి నిరోధకశాఖకు ఫిర్యాదులు అందించే అవకాశం లేకుండానే రిజిస్ట్రార్ కార్యాలయానికి దూతలుగా వ్యవహరిస్తున్న ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్‌ల వద్దనే అన్ని లావాదేవీలు జరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రిజిస్ట్రేషన్ సమయంలో అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే 0.5శాతం, పత్రాల్లో వ్యత్యాసాలు ఉంటే 1శాతం నుంచి ఎదుట వ్యక్తి ఆలోచనలో పడినంత పర్సంటేజ్‌ని వసూలు చేసి అధికారులకు, అక్కడి సిబ్బందికి ఇవ్వడంలో ఈ డాక్యుమెంట్ రైటర్‌లు కీలకంగా ఉన్నారని ఇట్టే అర్థం అవుతుంది. జిల్లా కార్యాలయానికి, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి అనుసంధానంగా పనిచేసే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందికి సైతం ఇక్కడ తీసుకున్న పర్సంటేజ్‌ల్లో సమాన వాటాలను సైతం ఇస్తున్నారని పలువురు డాక్యుమెంట్ రైటర్‌లే బహిరంగ రహస్యంగా చెప్పుతున్నారు. ఇక్కడ జరుగుతున్న అన్ని అంశాలను పలువురు ప్రజలు ఫిర్యాదుల రూపంలో జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లడంతో ఇప్పటికే ఆయన వచ్చి సిబ్బందిని ఆయన తీరులో మందలించడం కూడా జరిగింది. రూ.కోట్లల్లో జరుగుతున్న ఆర్థిక లావాదేవీల్లో కీలకంగా వ్యవహరించే రెవెన్యూ వ్యవస్థ విధించిన పర్సంటేజ్‌లు ఎంత లాభాన్ని లెక్కకడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతీ వ్యవహారానికి ప్రభుత్వం విధించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీల పేరిట విపులంగా పెద్ద పెద్ద బోర్డులను అమర్చినా ప్రజల్లో చైతన్యం రాకుండా అవితీకి ఆజ్యం పోస్తున్నట్టు పర్సంటేజ్‌లు చెల్లించడం ప్రజలు చేస్తున్న పెద్ద తప్పుగానే పరిగిణించాలి.