Please assign a menu to the primary menu location under menu

Weekly Gadgets

Find Us on Socials

Friday, April 19, 2024

Tag Archives: SKML TEMPLE

Government

ఆలయంలో అక్రమ కొలువులు

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, ( ప్రత్యేక ప్రతినిధి ) : బురుజుపేట శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పైరవీల పర్వానికి తెరతీశారు. ఆలయంలోకి అక్రమ మార్గంలో చొరబడే భక్తులను కట్టడి చేయాల్సిన ఉద్యోగులే అక్రమ మార్గంలో వస్తుంటే అమ్మవారి ఆదాయాన్ని రక్షించే నాథుడు ఎవరని భక్తులు గుసగుసలాడుకుంటున్నారు. ఆలయంలో నిత్యం చెదురు మదురు ఘటనలతో అమ్మవారి ఆదాయాన్ని గండి కొడుతున్న అధికారులు ఇప్పుడు ఏకంగా కొలువుల వర్షం కురిపిస్తూ అమ్మవారి ఆదాయాన్ని గండి కొట్టిస్తున్నారు. గతంలో స్థానికంగా విధులు నిర్వహించిన ఓ ఈవో తన వాహనానికి డ్రైవర్‌ కావాలని ఒకరికి ఉద్యోగం ఇస్తే.. ఆ తరువాత వచ్చిన మరో ఈవో నేనేం తక్కువ తినలేదని అక్కడ ఉన్న డ్రైవర్‌ని ఉపయోగించుకోకుండా మరో కొత్త డ్రైవర్‌ని నియమించుకొని ఘనత సృష్టించారు. ఇదే క్రమంలో కొత్తగా ఓ మంత్రి పైరవీ చేశారని ఒకరికి అక్రమ మార్గంలో ఉద్యోగం ఇచ్చిన అధికారులు హాజరు పుస్తకంలో పేరుని నమోదు చేస్తే.. స్థానిక ఎమ్మెల్యే తరుపున మరో ఉద్యోగం కేటాయించమని ఆలయంలో ఓ వ్యక్తి ప్రదక్షిణలు చేయడంతో పాటుగా ఆలయానికి వచ్చే భక్తులపై అధికారం సైతం చలాయిస్తున్నాడు. ఇక ఈ తంతును చూసిన ఆలయ ఛైర్మన్‌ తరుపున మరో రెండు ఉద్యోగాలు కేటాయించి తన వాటాను సైతం ఉపయోగించుకున్నారు. ఇదే మార్గంలో ఓ ఆలయాధికారి తాము ఏమీ తక్కువ తినలేదని తమకు ఎప్పటికప్పుడు అన్ని విధాలుగా ఉపయోగపడే ఓ మహిళకు సైతం ఏడాది క్రితం ఉద్యోగం కేటాయించిన ఘనత శ్రీకనకమహాలక్ష్మి ఆమ్మవారి ఆలయంలోనే చెల్లింది.

 

  • కొలువుల కల్పనకు కొత్త కొత్త కుట్రలు..
    ఆలయంలో కొత్తగా కొలువులు కేటాయించడానికి అక్కడి అధికారులు వేస్తున్న ఎత్తు పైఎత్తులు ఆశ్చర్యాన్ని కల్గించే విధంగా ఉన్నాయని పలువురు ఉద్యోగులు మాటల్లోనే తేటతెల్లం అవుతుంది. ఆలయ ప్రాంగణంలో శుభ్రం చేసే వ్యక్తికి కాపాలదారిగా విధులు కేటాయిస్తే.. శుభ్రం చేసే వ్యక్తి ఉద్యోగం వేసే అవకాశం పుట్టుకొచ్చిందని, డ్రైవర్‌గా విధులు నిర్వహించాల్సిన వ్యక్తికి అన్నదానంలో ఉద్యోగం కేటాయిస్తే కొత్త డ్రైవర్‌ని సృష్టించొచ్చని అక్కడి అధికారుల మాటాల్లో స్పష్టంగా అర్థం అవుతుంది. ఏది ఏమైన ఒక ఏడాదిలో సుమారు ఏడుగురుకి ఉద్యోగాలు కేటాయించి కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ అధికారులు పెద్ద మనసు చాటుకుంటున్నారని పలువురు హేళన చేస్తున్నారు.

 

  • వర్గ పోరులో ఆలయ ఆదాయానికి గండి..
    కనకమ్మ ఆలయంలో ఎప్పటి నుంచో పాతుకుపోయిన ఉద్యోగులు, స్థానికంగా పలుకుబడి కోసం పాకులాడుతున్న చోటా మోటా నాయకులు, ఒకవైపు ఆలయ అధికారులు.. మరోవైపు ప్రజా ప్రతినిథులు.. ఇలా ఒక్కరా..? ఇద్దరా..? కంటికి కనిపించే అందరూ వర్గాలుగా ఏర్పడి ఆలయంలో పెత్తనం చలాయిస్తున్నారు. ఒకరు ఉద్యోగం వేశారని మరొకరు.. మరొకరు ఉద్యోగం వేశారని ఇంకొకరు.. ఇలా అందరూ అక్కడ చేస్తున్న చేష్టల వలన అమ్మవారి ఆదాయానికి భారీగా గండి పడుతుందని ఇట్టే అర్థం అవుతుంది. దీనిపై గతంలో దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వెళ్లిన నేటికీ ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైయిందని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

  • ఉద్యోగాలు కేటాయించాలంటే పద్ధతి ప్రకారమే..
    ఆలయంలో ఉద్యోగాలు కేటాయించాలంటే ఎవ్వరికైనా ఒకటే పద్ధతి. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు చెప్పారని కేటాయించడం జరగదు. ఏది ఏమైన పద్ధతి ప్రకారమే జరుగుతుంది. మాకు వచ్చిన అర్జీలను పరిశీలించి దేవాదాయశాఖ కమిషనర్‌ దృష్టిలోకి తీసుకెళ్లి అక్కడ నుంచి అనుమతి వస్తేనే తాత్కలిక పద్ధతిలో ఉద్యోగం కేటాయిస్తాం. నా దృష్టికి ఇంత వరకు ఇటువంటి అంశాలు రాలేదు. దిగుస్థాయి సిబ్బందితో చర్చించి తప్పు జరిగితే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. -కె శిరీష (ఆలయ కార్యనిర్వాహణాధికారిణి).
DevotionalGovernment

కనకమ్మ ఆలయంలో కల్తీల రాజ్యం

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, ( ప్రత్యేక ప్రతినిధి ):రోజు రోజుకి భక్తజనం నుంచి విశేష ఆదరణ నోచుకుంటున్న బురుజుపేట శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కల్తీల లీలలు ఎక్కువైపోయాయి. ఉద్యోగం ముసుగులో చేస్తున్న మాయ పదుల సంఖ్యలో సీసీ కెమెరాలు సైతం పసిగట్టడం లేదంటే నిర్వహణలో డొల్లతనం డబ్బాల్లో దాచిపెడుతున్నట్టు ఇట్టే అర్థమైపోతుంది. డొల్లతనం.. డబ్బాల్లో దాచిపెట్టడం ఏంటో అని ఆశ్చర్యం చెందనవసరం లేదు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే ఆలయంలో కీలకమైన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న సన్నివేశాలు ఆనోట.. ఈనోట.. బయటకు పొక్కకుండ, పత్రికల్లో ముద్రించి రాకుండ ఉంటే చాలు అన్ని అక్కడే పరిష్కరం అయిపోతాయి. కనకమ్మ అమ్మవారు కోర్కెలు తీర్చినట్టు అక్కడి చోటా మోటా అధికారులు అన్నిటిని పరిష్కరిస్తారు. ఆలయంలో జరుగుతున్న చోరీలు.. అసభ్యకరమైన పనులు, అమ్మవారి ఆదాయన్ని పక్కదారి పట్టించడం, ప్రసాదాల కార్ఖానా నుంచి సరుకులు ఖాళీ అవ్వడం వంటి అన్ని అంశాలు అక్కడే పరిష్కరించి అమ్మవారి ఆదాయాన్ని గండికొడుతున్నారు. ఈ అంశాలు ఉన్నతాధికారులకు తెలియక తెలిసిన అటుగా పట్టించుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదని పలువురు భక్తులతో పాటుగా ఆలయంలో పని చేస్తున్న సిబ్బందే గుసగుసలాడుకుంటున్నారు.

– పాల ప్యాకెట్లు పక్కదారి పడుతున్నాయి..
ఆలయంలో దీర్ఘకాలిక సిబ్బందితో పాటుగా తాత్కలికంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది చేస్తున్న చేష్టలు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆలయానికి వచ్చే భక్తులు అమ్మవారికి గతంలో పాలాభిషేకం నిర్వహించేవారు. ఈ మధ్య కరోనా నుంచి అటువంటి పద్ధతిని పట్టాలు ఎక్కించడంతో భక్తులు తీసుకొచ్చిన పాల ప్యాకెట్లు ఆ పక్కనే ఉన్న డబ్బాలో వెయ్యడంతో అసలు కథ అక్కడే మొదలైయింది. ఆ పాల ప్యాకెట్లును అక్కడే పని చేస్తున్న దీర్ఘకాలిక సిబ్బందితో పాటుగా తాత్కలిక సిబ్బంది పలుమార్లు పదుల సంఖ్యలో పక్కదారి పట్టించడం సంబంధిత అధికారుల దృష్టికి వచ్చినా దోచుకున్న సిబ్బందిని దాగుడుమూతల ఆటలో దొంగల పేరిట వదిలిపెట్టడంపై విమర్శలు వస్తునే ఉన్నాయి. దీనిపై పైస్థాయి అధికారులు ఏమైన స్పందించి చర్యలు తీసుకున్నారా..? అని ఆరా తీస్తే నాలుగు గోడల మధ్య రహస్య ఒప్పందాలు జరిగినట్టు జరిగి అసలైన దొంగల చేతికే తాళాలను కట్టబెట్టారని పలువురు ఆలయ సిబ్బంది వాపోతున్నారు. కాసేపు పాల ప్యాకెట్లు విషయం పక్కన పెడితే ఆలయంలో ఎప్పటికప్పుడు మాయమవుతున్న పసాదాల తయారీ వస్తువులు, ఆయిల్‌ ట్యాంక్‌లు, ఓ ప్లాస్టిక్‌ దుకాణం ఇస్తున్న ప్లాస్టిక్‌ వస్తువులు, హుండీ ఆదాయం, పైరవీల పర్వం ఇలా ఒకటా..? రెండా..? లెక్కకు మించి జరుగుతున్నాయని సంబంధిత సిబ్బందే కస్సు బుస్సు లాడుకుంటున్నారు.

– సిబ్బంది పైరవీలు పెరిగిపోతున్నాయి..
నిత్యం రద్దీగా ఉండే ఆలయాల్లో పైరవీలు జరగడం కొంత సాధ్యమైన విషయం. కానీ ఈ అమ్మవారి ఆలయంలో సిబ్బంది చేస్తున్న నయా దందా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే తెల్లటి చొక్కా.. తెల్లటి పంచె.. కట్టుకున్న సిబ్బంది ఆలయం బయట తిరుగుతూ వచ్చి పోయే భక్తులకు సుపరిచితం. దీనికి కారణం గతంలో ఆ భక్తులు ఈ సిబ్బంది ద్వారా దొంగ మార్గంలో అమ్మవారి దర్శనం చేసుకున్నవారు కాబటి.్ట.! ఆలయంలో దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తుల నుంచి ముందస్తుగా కొంత సొమ్మును తీసుకొని వీఐపీ, వీవీఐపీ దర్శనం కల్పించడం ఈ సిబ్బందికే దక్కింది. ముందుగా సొమ్ము చెల్లించిన భక్తులను ప్రధాన మార్గంలో వీఐపీ మాదిరి తీసుకొని వెళ్లి ఆలయ గర్భ గుడిలో ప్రత్యేక పూజలు చేయించి అదే మార్గంలో బయటకు తీసుకొచ్చి వదిలిపెడతారు. ఈ క్రమంలో ఆ సిబ్బందికి ఇంచు మించు భక్తుల సంఖ్యను బట్టి వేలల్లో ముడుపులు అందుతాయని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఇదే క్రమంలో ఎవ్వరైన వేరొక ఉద్యోగి ఎవ్వరు..? అని అడిగితే ఉన్నతాధికారుల బంధువులు, పోలీసు అధికారుల చుట్టాలు, ప్రోటోకాల్‌, పొట్లకాయ అని లోపలికి తీసుకెళ్లి అమ్మవారి చెందాల్సిన చందా సొమ్మును కాజేస్తున్నారు. ఈ వ్యవహారంపై ‘నేత్ర న్యూస్‌’ నిఘా పెట్టగా ఆ ఉద్యోగి పరుశంగా మాట్లాడటం కొస మెరుపు.

– ఆలయంలో ప్లాస్టిక్‌ సామాగ్రి మాయం..
బురుజుపేట శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి ధన రూపేనా, వస్తు రూపేనా వచ్చే ఆదాయాన్ని వాటాలు వేసుకొని పంచుకోవడం పలుమార్లు సిబ్బంది మధ్య పెద్ద పెద్ద గొడవులు సైతం వచ్చాయి. ఆలయానికి అర్ధ కిలో మీటర్‌ దూరంలో గల పూర్ణామార్కెట్‌ కూడలి ఓ ప్లాస్టిక్‌ దుకాణ యజమాని ఆలయంలో అవసరాల నిమిత్తం ప్రతీసారి విరాళంగా ఇచ్చే ప్లాస్టిక్‌ వస్తువులు లెక్కల్లో చూపించకుండానే లెక్కలు వేసుకొని పక్కన పెట్టుకోవడం పలుమార్లు జరిగాయని అక్కడి సిబ్బంది మాట్లాడుకుంటున్న గుసగుసల్లో గుట్టు బయటపడిరది. ఈ విషయంలో కొందరు అధికారుల చేతులు సైతం చక్కబెట్టు కోవడానికి గతంలో ప్రయత్నించాయని, అంతటి స్థాయిలో ఉన్న వ్యక్తులే చేస్తున్నప్పుడు తాము చేయడం తప్పులేదని తెలివిగా చెప్పుతూ తప్పించుకుంటున్నారు.

– వ్రతాల సొమ్ము జేబులోకి వెళ్తుంది..?
అమ్మవారి ఆలయంలో ప్రత్యేక రోజుల్లో నిర్వహించే వ్రతాల సొమ్ము సిబ్బంది సొంత అవసరాలకు వాడుకుంటున్నారన్న అనుమానాలు బలంగానే వినిపిస్తున్నాయి. గతంలో ఈ వ్రతాల సొమ్ము విషయంలో ఇద్దరు అధికారుల మధ్యలో చిచ్చు రేగిందని వినికిడి. ఆలయంలో ప్రత్యేక రోజుల్లో నిర్వహించే వ్రతాలకు తీసుకునే రుసుము తమ జేబుల్లోకి వేసుకొని లెక్కలు తరువాత చెప్పే విధంగా సొంతానికి వాడుకుంటున్నారని అక్కడి సిబ్బందే చెప్పుతూ ఉంటారు. ఈ వ్యవహారం ఎప్పటి నుంచో జరుగుతుందని, ఏ ఒక్క అధికారి కూడా ఈ విషయమై పట్టించుకోలేదని సమాచారం. నూతనంగా వచ్చిన ఆలయ ఈవో కె.శిరిషా (సహాయ కమిషనర్‌) ఈ మధ్య ఓ ప్రకటనలో తెలిపినట్టు ఆలయాల్లో ఆడిట్‌ విధానం తప్పని సరీ.. అన్నట్టు ఈ ఆలయంలో ఆడిట్‌ విధానం పాటిస్తే నక్కి నక్కి ఉన్న దొంగలు ఒక్కసారిగా బయట పడటం కాయం.

– కార్ఖానాలో ప్రసాదాల సరుకులు స్వాహా..
ఆలయంలో నిరంతర పర్యావేక్షణ లేకపోవడం ప్రసాదాల కార్ఖానాలో చాలా సామాగ్రిని సొంతానికి ఉపయోగించు కుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. నూనె డబ్బాలు, నెయ్యి ప్యాకెట్లుతో పాటుగా పప్పులు, ఉప్పులు తప్పుడు మార్గంలో బయటకు వెళ్లడం ఇక్కడ సాధారణ విషయమని వెల్లడిస్తున్నారు. పాత డబ్బాల్లో సరుకులు కొత్త రూపాన్ని సంతరించు కుంటున్నాయని సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. ఇదే క్రమంలో ఆలయానికి రాలేని భక్తులు బయట ఉన్న ఇనుప ఊచల మధ్యలో నుంచి ఇచ్చిన చిల్లర సొమ్మును సైతం హుండీల్లో వెయ్యకుండా సిబ్బంది చేతులు మారుస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఆలయంలో జరుగుతున్న కార్యకలాపాలపై దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించాలని పలువురు భక్తులు కోరుతున్నారు.