Please assign a menu to the primary menu location under menu

Tag Archives: SIMHACHALAM

DevotionalGovernmentPolitical

అప్పన్న భూముల్లో భూ బకాసురులు..

నేత్రన్యూస్‌, పోలాకి రవికుమార్‌, పత్యేక ప్రతినిధి: సింహాద్రి అప్పన్న భూములకు సంబంధించి ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ సర్టిఫికేట్‌ (ఎల్‌ఆర్‌సీ) వివాదం ప్రధానంగా పంచగ్రామాలైన వేపగుంట, అడవివరం, చీమలపల్లి, పురుషోత్తపురం, వెంకటాపురం పరిధిలో ఉంది.  సింహాచలం దేవస్థానానికి చెందిన సుమారు 12వేల ఎకరాల భూముల్లో తరతరాలుగా 13వేలకు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 1996లో అప్పటి పెందుర్తి, విశాఖపట్నం రూరల్‌ తహసీల్దార్లు ఈ భూములు సింహాచలం దేవస్థానానికి చెందినవని  పేర్కొంటూ రైతువారీ పట్టాలు జారీ చేశారు. తరువాత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఐదు గ్రామాల్లోని స్థానికులు ఆక్రమించుకున్న భూములను క్రమబద్ధీకరించడానికి రెండు జీవోలు జారీ చేశారు. జీవో సంఖ్య 578 ద్వారా కొద్ది శాతం మంది నివాసితులు తమ భూములను క్రమబద్ధీకరించుకుని దేవస్థానం నుండి ఎల్‌ఆర్‌సీ పొందారు. అయితే చాలా మందికి ఎల్‌ఆర్‌సీలు లేకపోవడంతో తమ భూములను విక్రయించడం, రిజిస్ట్రేషన్‌ చేయలేక పోయారు. ఆ తరువాత 2014లో టీడీపీ ప్రభుత్వం మరో జీవో 296 ను జారీ చేసి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించింది. అయితే వైసీపీ లీగల్‌ సెల్‌ దీనిని కోర్టులో సవాలు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.

 అప్పన్న భూముల్లో భూ బకాసురులు రోజురోజుకి భరితెగిస్తున్నారు. పంచగ్రామాలకు సంబంధించి హైకోర్టులో కేసు ఉన్నప్పటికీ అడివివరం బీఆర్‌టీఎస్‌ రోడ్డు విస్తీరణ నెపంతో ఆక్రమణకు పాల్పడుతున్నారు. భవనాలను నిర్మించే విషయంలో కొత్తగా టీడీఆర్‌లని చూపిస్తూ గతంలో ఇచ్చిన ఎల్‌ఆర్‌సీల మాట వినిపించకుండా చేస్తున్నారు. హైకోర్టులో అప్పన్న భూముల కేసు పరిష్కారం అయ్యే వరకు ఆలయ ఆస్తులను పరిరక్షించాల్సిన ఆలయ అధికారులు సైతం ఆక్రమణదారులతో చేతులు కలపడంతో అప్పన్న భూములు ఆవిరైపోతున్నాయి. కొత్తగా టీడీఆర్‌లు ఇచ్చిన భూముల్లో ఇష్టానుసారంగా భారీ భవనాలు నిర్మించుకోవచ్చని కొలతలు వేసి మరీ.. అప్పన్న భూములను అప్పనంగా అప్పగించడంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 28ఏళ్ల నుంచి ఎల్‌ఆర్‌సీలు లేనివారు భవనాలు నిర్మించకూడదని కఠిన నిబంధనలు ఉన్నా ఆలయ అధికారులు అటుగా  పట్టించుకోకపోవడంతో టీడీఆర్‌ ముసుగులో భారీ భవనాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఓ వైసీపీ నాయకుడు రహదారిపై ఉన్న భవనానికి ఎల్‌ఆర్‌సీ ఉందని ఆ భవనం వెనుక ఉన్న భారీ స్థలంలో ఎల్‌ఆర్‌సీ లేకుండా కల్యాణ మండపం నిర్మించడం అందరికీ తెల్సిందే.. భవనాన్ని నిర్మిస్తున్న క్రమంలో కూటమి నాయకులు అటుగా కన్నెర్ర చెయ్యడంతో చేసేది ఏమి లేక రెండు రోజులకు ముందు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయినా అప్పన్న భూముల్లో అక్రమంగా ఆ భారీ భవనం నిర్మించడానికి ఆయనకు అవకాశం దక్కుతుందో.. లేదో.. వేచి చూద్దాం. 

- పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న భవనాలు..
సింహాచలం అడివివరం రహదారి విస్తీర్ణ సమయంలో ఇచ్చిన టీడీఆర్‌లను ఆధారంగా చేసుకొని భారీ భవనాలు నిర్మిస్తున్నారు. రహదారి పొడుగున పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న భవనాలకు ఎటువంటి ఎల్‌ఆర్‌సీలు లేకపోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అనుమతులు లేకపోయిన సంబంధిత ఆలయ అధికారులు అటుగా అడ్డగించకుండా కొలతలు వేసి మరీ భవనాలకు నిర్మించుకోవడానికి అనుమతులు ఇవ్వడం చుట్టుపక్కల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో భవనాలు తెల్లగొడలుగా దర్శనం ఇవ్వడం, మరికొన్ని పునాదులు, పిల్లర్లతో కనిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల చిన్నపాటి రేకుల షేడ్‌లు నిర్మించి తరువాత ఆ స్థలాన్ని తన ఖాతాలో వేసుకుంటున్నారు.

- దుకాణాలు, పొదలు ఉన్నచోట ఎల్‌ఆర్‌సీలు ఎలా..?
పంచగ్రామాల సమస్యతో సుమారు 28ఏళ్లు పొదలతో నిండిపోయిన భూముల్లో ఇప్పుడు భారీ భవనాలు దర్శనమిస్తున్నాయి. న్యాయస్థానంలో కేసు పెండిరగ్‌లో ఉన్నా సంబంధిత అధికారుల పర్యావేక్షణ లోపంతో ఇప్పటి వరకు పొదల్లో ఉన్న భూములు భవనాలుగా మారిపోతున్నాయి. ఏఈవో స్థాయి అధికారులను విభాగాల వారీగా కేటాయించినా అప్పన్న భూములు కబ్జాలు ఆగడం లేదు. తాయిలాలుకు కక్కుర్తి పడుతున్న ఆలయ అధికారులు అప్పన్న భూముల్లో జరుగుతున్న వ్యవహారాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడంతో ఇప్పటికే భారీ భవనాల రూపంలో వాళ్ల తప్పులు దర్శనమిస్తున్నాయి. ఇప్పటి వరకు చిన్న చిన్న బడ్డీల రూపంలో ఉన్న స్థలంలో ఎల్‌ఆర్‌సీలు లేకుండా భవనాలు నిర్మిస్తున్నా అటుగా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని పలువురు అప్పన్న భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- ఈ వ్యవహారంలో ఎవరికి ఎంత లాభం..?
సింహాద్రి అప్పన్న భూముల్లో నిబంధనలకు వ్యతిరేకంగా భవనాలు నిర్మించడం వలన భవన యజమానులకంటే.. ఆలయ అధికారులకే అధిక లాభం దక్కుతుందని ఎల్‌ఆర్‌సీలు లేకుండా భవనాలు నిర్మిస్తున్న యజమానులు వెల్లడిస్తున్నారు. టీడీఆర్‌ రూపంలో వచ్చిన సొమ్ములో కొంత శాతం తమకి చదివించడంతో టీడీఆర్‌ ముసుగులో భవనాలు శెరవేగంగా నిర్మించుకోవాలని సూచించారని పలువురు ఆక్రమణదారులు వివరిస్తున్నారు. ఎల్‌ఆర్‌సీలు లేకుండా నిర్మాణాలు చేపట్టకూడదని ఇప్పటికే నోటీసు బోర్డులను ఏర్పాటు చేసిన సిబ్బంది అటుగా ఆ స్థలాల్లో భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకోకపోవడం కొసమెరుపు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు స్వామివారి స్థలంలో దురాక్రమణదారులు శిక్షార్హులు అని ఏర్పాటు చేసిన బోర్డులు నామమాత్రంగానే ఉన్నాయి.

DevotionalGovernmentPolitical

అప్పన్న ఆలయంలో అయోమయం..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : వరాహ నృశింహునిగా.. శ్రీమహావిష్ణువు స్వయంభువుగా.. ద్వయ రూపాలతో వెలసిన పవిత్ర దివ్యధామం సింహాచలంలో అయోమయం సంతరించుకుంది. ఆలయ అధికారుల పర్యావేక్షణ లోపం, పనిలో సిబ్బంది అలసత్వం ప్రదర్శించడంతో అప్పన్న దర్శనానికి తండోపతండాలుగా వచ్చే భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాల్సిన ఆలయ అధికారులు అటుగా ఆలోచనలు చేయకపోవడంతో మధ్యాహ్న సమయంలో భక్తజనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రూ.లక్షల్లో జీతభత్యాలు తీసుకునే ఉద్యోగులు శీతల గదులకు పరిమితమైపోవడంతో తాత్కలిక పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న చిరు ఉద్యోగులు, ప్రైవేటు సెక్యూరిటీ సంస్థల సిబ్బందికి ఇష్టారాజ్యమైపోయింది. రాజమార్గంగా ఉపయోగించే గాలిగోపురం వద్ద అన్ని బాధ్యతలను సెక్యూరిటీ సిబ్బంది చేతుల్లో వదిలిపెట్టడం, పీఆర్‌వో కార్యాలయంలో ఎక్కువగా సెక్యూరిటీ సిబ్బందిని ఉపయోగించడం, ఆ సిబ్బందితో పాటుగా సంబంధిత ప్రైవేటు సంస్థకు మంచి ఆదాయాన్ని అందుతుందనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. స్వామి దర్శనానికి సెక్యూరిటీ సంస్థ ప్రతినిథులు, వాళ్ళ బంధువులు, సెక్యూరిటీ సిబ్బంది బంధువులు వస్తే వీవీఐపీ దర్శన భాగ్యాన్ని కలిగించడంలో మంచి నైపుణ్యం సంపాధించారు. ఈ అంశాలు కొందరు ఆలయ అధికారులకు తెలిసినా వాళ్ళ బంధువులకు అదే పద్ధతిలో దర్శనాలు చేయించడానికి ఉపయోగపడతారని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో స్వామివారి ఆలయ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. ఏది ఏమైన అధిక సంఖ్యలో సిబ్బంది కలిగిన సింహాచలంలో ప్రైవేటు సిబ్బంది పెత్తనం ముందు ముందు చాలా ప్రమాదకరం.

  • పీఆర్‌వో కార్యాలయాన్ని ముడుపులు కోసం పట్టి పీడిస్తున్నారు..

ఆలయ పీఆర్‌వో కార్యాలయంలో సిబ్బంది చక్కగా స్థిర పడ్డారనడంలో ఆశ్చర్య పడనవసరం లేదు. మూడు నుంచి ఐదు నెలలకు ఒకసారి అన్ని విభాగాల్లో సిబ్బందిని మార్పులు చేర్పులు చేసే అధికారులును సైతం తమ చేతుల్లో పెట్టుకొని పీఆర్‌వో కార్యాలయంలో కొందరు సిబ్బంది ఏళ్ల తరబడి పాతుకుపోయారు. ప్రైవేటు సంస్థ నుంచి సెక్యూరిటీలుగా తీసుకున్న సిబ్బందిని పీఆర్‌వో కార్యాలయంలో సహాయకులుగా ఉపయోగించడంలో పెద్ద కుట్ర జరుగుతుందని, దర్శనాలు చేయించే సమయంలో భారీగా ముడుపులు అందుకుంటున్నట్టు పలు ఆధారాలు సైతం బహిరంగంగానే కనిపిస్తున్నాయి. ఆలయానికి మొదటిసారి వచ్చే భక్తులు రెండోసారి పీఆర్‌వో కార్యాలయానికి వెళ్లకుండానే వ్యక్తిగత నెంబర్లను ఇచ్చి క్యాష్‌ చేసుకుంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం అక్కడ స్థిర పడిపోయిన సిబ్బంది మార్పుతోనే సాధ్యపడుతుందని పలువురు భక్తులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

  • కేశఖండనశాలలో రద్దీ తీవ్రమవుతుంది..

అప్పన్న స్వామి ఆలయంలో భక్తులు తలనీలాలు చెల్లించడంలో ఎదుర్కొనే ఇబ్బందులు అక్కడ సిబ్బంది కొరత కారణమని స్పష్టంగా కనిపిస్తుంది. ఆలయంలో తాత్కాలిక నాయిబ్రాహ్మణ సిబ్బందిని పెంచడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 69మంది సిబ్బందితో కొనసాగుతున్న కేశఖండనశాలలో 5గురు మాత్రమే పూర్తిస్థాయి ఆలయ ఉద్యోగులు కావడం, మనిషికి 60టికెట్లు చొప్పున ఐదుగురికి రోజుకి 300 టికెట్లకు గాను రూ.12వేలుని ఆలయానికి ఇచ్చి మిగిలిన మొత్తం అక్కడి నాయిబ్రాహ్మణులు సమాన వాటాలతో సొమ్ము పంచుకోవడం ఇక్కడి ఆనవాయితీ. శని, ఆదివారం వంటి వారాంతాలతో పాటుగా సెలవు దినాల్లో భక్తులు అధికంగా వచ్చే సమయంలో రద్దీ తీవ్రంగా ఉండగా అధిక మొత్తం సంపాధించాలనే ఉద్ధేశంతో పొరుగు సిబ్బంది రాకుండా ఇక్కడ కీలక వ్యక్తులు పావులు కదుపుతున్నారని సమాచారం.

  • గాలిగోపురం వద్ద సిబ్బంది చేతివాటం చూపిస్తున్నారు..

స్వామి ఆలయానికి వచ్చే భక్తులు స్వామి హుండీల్లో చెల్లించిన ముడుపులుకంటే ఆలయ సిబ్బందికే ఎక్కువ కానుకలు చెల్లిస్తున్నారు. గాలిగోపుం గుండా స్వామిని దర్శించుకోవడానికి ఓ ప్రత్యేక ధర చెల్లించిన భక్తులతో పాటుగా ప్రోటోకాల్‌ భక్తులను పంపించాలని నిబంధనలు ఉన్నా.. కాసుల కక్కుర్తిలో గాలిగోపురం గుండా పైరవీలు చేసే వ్యక్తులకు, కానుకలు ఇచ్చే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఆలయ గాలిగోపురం వద్ద పూర్తిస్థాయి ఉద్యోగిని నియమించకుండా ప్రైవేటు సెక్యూరిటీలకు పెత్తనం ఇవ్వడంతో వాళ్ళు ఆడింది ఆట.. పాడింది పాట.. అన్నట్టుగా తయారైయింది. దీనికి తోడు తాత్కాలిక సిబ్బంది టికెట్లు తియ్యకుండా సగం తీసుకొని దొంగ మార్గంలో భక్తులను దర్శనాలకు పంపిస్తున్నట్టు ఇప్పటికే పలువురు భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికైనా ఆలయ ఉన్నతాధికారి స్పందిస్తారో..? లేదో..? వేచి చూడాలి.

చందనోత్సవంలో ఏర్పాట్లు..?

స్వామివారి ఆలయంలో తీవ్ర రద్దీని తలపించే చందనోత్సవ కార్యాక్రమంలో ఆలయ అధికారుల పనితీరు రెండేళ్లు క్రితం జరిగిన ఇబ్బందికర పరిస్థితులను గుర్తు చేస్తున్నట్టే ఉంది. ఇంచార్జి స్థాయిలో ఎటువంటి వ్యవహారంలో తల దూర్చకూడదని మడికట్టుకొని కూర్చున్న ఉన్నతాధికారి తీరుకి ఉత్సవ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతాయో అని పలువురు సిబ్బంది అయో మయానికి గురవుతున్నట్టు అనుమనాలు వ్యక్త పరుస్తున్నారు.

  • స్వామివారిని కనులారా చూద్దాం రండీ..

వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) రోజు ఏప్రిల్‌ 30న జరిగే చందనోత్సవంలో భక్తుల సౌకర్యార్థం జిల్లా కలెక్టర్‌ ఇప్పటికే పలు శాఖలతో సమన్వయం చేస్తున్నారు. భారీ భక్తుల రద్దీని నియంత్రించడానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుతో పాటుగా రవాణా, భద్రత, తాగునీరు, దర్శనం, వసతి, వైద్యం, ప్రసాదం వంటి వసతులు కల్పిస్తున్నారు. ఆ రోజున రూ.300, రూ.1000, రూ.1500 ధరల్లో టికెట్లను అందుబాటులో ఉంచారు. ఈ టికెట్లు ఆఫ్‌లైన్‌తో పాటుగా www.aptemples.ap.gov.in లో
విక్రయిస్తున్నారు.