Please assign a menu to the primary menu location under menu

Weekly Gadgets

Find Us on Socials

Tag Archives: RTE

Government

ప్రైవేట్ పాఠశాలల్లో పైశాచికత్వం

ఓవైపు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి.. మరోవైపు తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో వసూలు..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి) : చదువుల బరువు మోసి చిన్నారి మనసులు చితికి పోయే.. మార్కుల కోసం పరుగులెత్తి బాల్యం దూరమయ్యే.. అనే పదాలను పద్య రూపంలో ఓ సమకాలీన కవి నాడు చెప్పినట్టే నేడు ప్రైవేట్‌ పాఠశాలల్లో వ్యవహరిస్తున్న తీరు చిన్నారుల బాల్యాన్ని శూన్యం దిశగా సాగిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. పొరుగు పాఠశాలలతో పోటీ పడుతూ విద్యార్థుల ఆసక్తులు, సామర్థ్యాలను గుర్తించకుండా పాఠశాల యాజమాన్యలు తీవ్ర ఒత్తిడిని కలిగించడం చాలా ప్రమాదకరమని పలువురు పరిశోధనాత్మక విద్యావేత్తలు వివరిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ సరైన సూచనలు జారీ చేయకపోవడం, జారీ చేసిన సూచనలపై పర్యవేక్షణ లేకపోవడంతో ఈ సమస్య అధికంగా వేధిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆరోపిస్తున్నారు. జిల్లాను 11మండలాలుగా విభజించి వాటికి ఇద్దరు చొప్పున ఎంఈవోలను కేటాయించి, ఒక్కొక్క మండలంలో కొన్ని సమూహాలు(క్లస్టర్‌లు)గా విడదీసి సీఆర్‌పీలను నియమించినా పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. విద్యార్థులకు చదువుపై ఆసక్తిని పెంచడానికి అన్ని అంశాల్లో మరింత చురుకుగా పాల్గొని ఆహ్లాదకరమైన విద్యను అభ్యసించాల్సిన విద్యార్థులు పాఠశాలలపై అసభ్యకరమైన పదజాలంతో ఫిర్యాదులు చేస్తున్నారంటే విద్యా విధానం ఎటుగా ప్రయాణిస్తుందో అర్థమవుతుంది. ప్రభుత్వం పదోవ తరగతి విద్యార్థులకు సరైన ప్రణాళికతో చదవడానికి 100రోజుల యాక్షన్‌ ప్లాన్‌ని ప్రారంభించగా ప్రైవేటు పాఠశాలలు పాటించే తీరు విద్యార్థులను ఒత్తిడి దిశగా తీసుకెళ్తుందని పలువురు విద్యార్థులే వెల్లడిస్తున్నారు. ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు పాఠశాలకే పరిమితం చేయడం, సెలవు దినాలు, ఆదివారాల్లో సైతం తరగతులు నిర్వహించడం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని రోధిస్తున్నారు. ఒత్తిడి లేని విద్యను అందించే దిశగా కొన్ని పాఠశాలలు ప్రణాళికలను రచిస్తుంటే మరికొన్ని డబ్బా పాఠశాలలు ఆర్భాటం చేయడంలోనే పనితనం చూపించి ఫలితాల్లో శూన్యం చూపిస్తున్నారు. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే సెలవు దినాలు, సమయాన్ని పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవల్సిన విద్యాశాఖ సిబ్బంది సంబంధిత పాఠశాలలకు వత్తాసు పలకడంతో విద్యా వ్యవస్థ దిక్కుతోచని స్థితిలో ఉందని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక ఫీజులు నియంత్రణ అంశాలు పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్‌ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నా ఏ ఒక్కరూ అటుగా ప్రశ్నించకపోవడం అందర్నీ అయోమయానికి గురిచేస్తుందనే చెప్పాలి.

  • ప్రైవేట్‌ పాఠశాలలపై ఆశాఖకు అంత ప్రేమ ఎందుకో..?

ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో సమానంగా విద్యా విధానాన్ని రూపొందించడం, పాఠశాలల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, విద్యా ప్రమాణాల పర్యవేక్షణ అంశాల్లో మాత్రమే శ్రద్ధ చూపించాల్సిన విద్యాశాఖ ప్రైవేటు పాఠశాలలపై అమితమైన ప్రేమ చూపిస్తూ ద్వంద వైఖరిగా వ్యవహరించడం పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యాల నుంచి లాభాపేక్ష అధికంగా ఉండటంతో దిగువ స్థాయిలో ఉండే సీఆర్‌పీలు, ఎంఈవోలతో కలిసి సహాయ అధికారులు, ఉన్నతాధికారులు సైతం విద్యా ప్రమాణాలు పాటించని పాఠశాలలకు చేదోడు వాదోడుగా ఉండటం గమనార్హం. ప్రత్యేక తరగతుల పేరిట ఉదయం 8నుంచి రాత్రి 8గంటల వరకు పాఠశాలలు నిర్వహించడం, పాఠశాలలోనే ప్రత్యేక బోధన పేరిట ట్యూషన్‌ తరగతులు పెట్టడం, సెలవు దినాల్లో పాఠశాలల్లో తరగతులు జరపడం వంటివి చేస్తున్నా సంబంధిత విద్యాశాఖ అధికారులు చోద్యం చూడటంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

  • ఫీజులు వసూల అంశపై నియంత్రణ ఉందా..?

చిన్నారులకు ఉన్నతమైన విద్యను అందించే దిశగా తల్లిదండ్రులు పస్తులుండి రూ.లక్షల్లో ఫీజులు చెల్లించడంపై గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఏ మాత్రం ఉపయోగం లేకపోయింది. ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్‌ (ఏపీఎస్‌ఈఆర్‌ఎంసీ) గ్రామ పంచాయితీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌ల వారీగా విభజిస్తూ సరసమైన పద్ధతిలో ఫీజులను తీసుకోవాలని ఆదేశాలు కేటాయించినా ఏ ఒక్క ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు కూడా పట్టించుకోలేదు. దీనిని పర్యావేక్షించాల్సిన విద్యాశాఖ సైతం చోద్యం చూడటంపై ప్రైవేట్‌ పాఠశాలల తీరు చాలా కుటుంబాలను చిన్నాభిన్నాం చేసిందనడంలో ఆశ్చర్య పడనవసరం లేదనే చెప్పాలి. ఏపీఎస్‌ఈఆర్‌ఎంసీ ప్రకారం గత మూడేళ్లుగా నర్సరీ నుంచి ఐదో తరగతికి గ్రామ పంచాయితీల్లో రూ.10వేలు, మున్సిపాల్టీల్లో రూ.11వేలు, కార్పొరేషన్‌లల్లో రూ.12వేలుగా అదే ఉన్నత విద్య 6నుంచి 10 తరగతి వరకు పంచాయితీల్లో రూ.12వేలు, మున్సిపాల్టీల్లో రూ.15వేలు, కార్పొరేషన్‌ల్లో రూ.18వేలుగా కేటాయించినా అటుగా ఏ ఒక్క ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యం పట్టించుకోకపోవడం దుర్మార్గం. దీనిని పర్యావేక్షించాల్సిన విద్యాశాఖ సైతం చూసి చూడనట్టు వ్యవహరించడం కొసమెరుపు.

  • ఆర్టీఈ యాక్ట్‌2009ని ఎవరు పాటిస్తున్నారో..?

రైట్‌ టు ఎడ్యుకేషన్‌ యాక్ట్‌2009 అనేది భారతదేశంలో పిల్లలకు ఉచిత, నిర్భంధ విద్యను అందించే చట్టంగా ప్రవేశపెట్టారు. 6నుంచి 14సంవత్సరాల వయస్సు గల ప్రతి బిడ్డకు తన నివాస స్థలానికి సమీపంలో ఉన్న ప్రైవేట్‌ పాఠశాలలో విద్యను అభ్యసించే హక్కు ఉంది. ఈ పద్ధతిలో ప్రైవేట్‌ పాఠశాలలు బలహీన వర్గాల పిల్లలకు 25శాతం సీట్లను రిజర్వ్‌ చేయాలి. కానీ జిల్లాలో కొన్ని పాఠశాలలు మాత్రమే ఈ విధానాన్ని నామమాత్రంగా స్వీకరించి ఉచిత సీటులను కేటాయిస్తే.. మరికొన్ని పాఠశాలలు అటువంటి అవకాశాలు లేవని ఖచ్చితంగా వెల్లడిరచాయి. ఇంకొన్ని పాఠశాలల్లో అర్హత పొందినా విద్యార్థి వయస్సు సరిపోలేదని, ఆ చట్టం అందుబాటులో లేదని కల్లబొల్లి కబుర్లు చెప్పుతూ తప్పించుకున్నారు. దీనిపై ఇప్పటికే గత జిల్లా విద్యాశాఖ అధికారికి పలుమార్లు విద్యార్థుల తల్లిదండ్రులు పలుమార్లు మొరపెట్టుకున్నా ఎటువంటి ఉపయోగం లేకపోయింది. దీనిపై పాఠశాలల వారీగా పర్యవేక్షించాల్సిన దిగువస్థాయి సిబ్బంది సైతం చోద్యం చూస్తూ ఉండిపొయారు. ఒత్తిడి విద్యను అందిస్తూ అధిక ఫీజులను వసూలు చేస్తున్న పాఠశాల యాజమాన్యాలతో పాటుగా అటుగా పట్టించుకోని విద్యాశాఖ సైతం పైశాచికత్వంగా ఉందని స్పష్టంగా అర్థమవుతుంది.