Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
నేత్ర న్యూస్, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి) : ఒత్తిడి లేని విద్యను అందిస్తూ విద్యార్థి సృజనాత్మకతను పెంపొందించడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తూ విద్యార్థుల భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావం చూపించడానికి కొన్ని అంటే కొన్నే పాఠశాలలు పనిచేస్తుంటే.. విద్యార్థి భవిష్యత్తుపై ఎటువంటి ప్రభావం చూపించని డబ్బా పాఠశాలలు చేస్తున్న నిర్వాకం విద్యాశాఖను సైతం అభాసుపాలు చేస్తున్నట్టే ఉంది. పండగ సమయంలో విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం, విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యమని పలువురు విద్యావేత్తలు వెల్లడిస్తున్నా నూటికి 30శాతం ఉత్తీర్ణతను ఇచ్చే డబ్బా పాఠశాలు పండగ సమయంలో విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తూ తరగతులు నిర్వహించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వం నుంచి ఈనెల 7న ఆర్‌సీ నెంబర్ ఏసీఏడీ/2308989/2025 పేరిట పండగ సెలవుల నిమిత్తం సర్కులర్‌ని విడుదల చేసినా అటుగా ఆచరించవలసిన పాఠశాలలు, అనుసరించవలసిన విద్యాశాఖ పట్టించుకోకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. నూటికి నూరు శాతం ఫలితాలు ఇచ్చే పాఠశాలలో విద్యార్థులు ఒత్తిడి గురికాకుండా ఉండటానికి ప్రత్యేక సెలవులు ప్రకటిస్తుంటే.. నూటికి 30శాతం ఫలితాలు ఇచ్చే డబ్బా పాఠశాలలు తరగతులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐఐటీ ` నీట్ కోచింగ్ సెంటర్‌లు మినహా అన్ని విద్యా సంస్థలు ఈనెల 10నుంచి 19వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిన అటుగా ఉత్తమ డబ్బా పాఠశాలలు పట్టించుకోకపోవడం గమనార్హం. మరోవైపు ఆదేశాలను అనుసరించాల్సిన జిల్లా విద్యాశాఖ సైతం నామమాత్రపు ఆదేశాలు జారీ చేసి చేతులు కడుక్కున్నారని స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై సంబంధిత జిల్లా ఉన్నతాధికారులను కార్యాలయంలో కలవడానికి ముందుగానే ప్రయత్నించినా ఇరువురు అధికారులు కార్యాలయాల్లో లేకపోవడం ఎటువంటి సమాధానం దొరకలేదు. పైగా దిగువస్థాయి సిబ్బందితో జిల్లా విద్యాశాఖాధికారి తరుపున అని పత్రికా ప్రకటనలో సంతం పెట్టి విడుదల చేయడం కొసమెరుపు.
సంక్రాంతి పండగ సెలవుల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి విడుదలైన సర్కులర్‌ని జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటుగా అన్ని పాఠశాలలు విధిగా పాటించాలని ఆదేశించినా ఆర్భాటం ఎక్కువగా చేసే కొన్ని డబ్బా పాఠశాలలు పాటించకుండా తుంగలో తొక్కడం సరికాదని పలువురు విద్యావేత్తలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహాలో కల్తీ విద్యను పాఠశాలలు బోధించడం వలన విద్యార్థులు ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని కోల్పోవడానికి ఎక్కువ అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. పాఠశాలల పనితీరుని నిరంతరం కనిపెట్టాల్సిన విద్యాశాఖ దిగువ స్థాయిలో ఎంఈవోలు, సీఆర్‌పీలను కేటాయించినా అటుగా ఆ సిబ్బంది పని చేయకపోవడం అసలు సమస్య ఉత్పన్నం అవుతుంది. కొందరు సిబ్బంది పాఠశాలలను తమ కనుసైగల్లో పెట్టుకొని నెలవారీ మామూళ్లు, ఇండెంట్లు మత్తులో పాఠశాల యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నారని ఇట్టే అర్థం అయిపోతుంది. ఎంతగా అంటే సెలవు దినంలో కూడా స్వేచ్ఛగా తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి పాఠశాలల్లో తరగతులు నిర్వహించడం. దీనిపై సంబంధిత పాఠశాల యాజమాన్యాలను ప్రశ్నించగా పాఠశాలలు నడపడంలో మాకు అన్ని పద్ధతులు తెలుసు అని వ్యంగ్యంగా సమాధానం ఇవ్వడం ఆశ్చర్యం.
తుఫానులు, పండగల సమయంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పభుత్వం తరుపున జిల్లా కలెక్టర్ పాఠశాలలకు సెలవులు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసిన ప్రతీసారి కొన్ని డబ్బా పాఠశాలలు బేఖాతరుగా వ్యవరించడం చాలా సందర్భాలు ఉన్నాయి. గతనెల 21న భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సెలవును ప్రకటించినా ఏ మాత్రం పట్టించుకోలేదు. గత అక్టోబర్‌లో 12రోజులు దసరా సెలవులు ప్రకటిస్తే ఏదో అత్యుత్తమమైన ర్యాంక్‌లు సాధించినట్టు ఈ డబ్బా పాఠశాలలు పది రోజులు తరగతులను నిర్వహించారు. గత సెప్టెంబర్ 2న భారీ వర్షాల కారణంగా సెలవు ప్రకటిస్తే ఈ పాఠశాలలు పాటించకపోగా సంబంధిత విద్యాశాఖ దిగువ స్థాయి సిబ్బందికి ఆమ్యామ్యాలు ఇచ్చి ఇష్టారాజ్యంగా వ్యవరించారని పాఠశాలల యాజమాన్యలే బహిరంగంగా గుసగుసలాడుకుంటున్నారు. ఇదే క్రమంలో గత కృష్ణాష్టమికి సైతం సెలవు లేకుండా ఉత్తమ ర్యాంక్‌లు సాధించడానికి కృషి చేసిన ఈ డబ్బా పాఠశాలలు తీరుకి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. దీనిపై ప్రతీసారి సంబంధిత ఎంఈవోలకు, సీఆర్‌పీలకు ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఈ అంశాలపై నకిలీ పత్రికలు నడుపుతున్న కొందరు నకిలీ విలేకరులు ప్రశ్నించడంతో వాళ్లను మచ్చిక చేసుకోవడానికి సంబంధిత విద్యాశాఖ అధికారులే అన్ని పాఠశాలలకు సంబంధించిన సమాచార అంశాలను ఇచ్చి ప్రకటనల రూపంలో రూ.లక్షలు దోచుకోవడానికి సాయం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎంతగా అంటే ఓ నకిలీ పత్రిక ఏకంగా సుమారు 50పాఠశాలలకు ఫోన్ ద్వారా బెధిరించి ప్రకటనల రూపంలో రూ.లక్షలు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసినంత వరకు. ఈ అంశాలన్ని జిల్లా పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుని(ఆర్‌జేడీ) దృష్టిలో సైతం ఉందని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం.