Please assign a menu to the primary menu location under menu

Weekly Gadgets

Find Us on Socials

Monday, September 9, 2024

Tag Archives: RICE

CrimeGovernment

బియ్యం దొంగలు

  •  పెద్ద మొత్తంలో పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న ఎండీయూ సిబ్బంది..
  •  బియ్యం పంపిణీలో జాయింట్‌ కలెక్టర్‌ హెచ్చరికలు సైతం బేఖాతరు..
  •  కోటా బియ్యం విక్రయాల్లో చేతులు మారుతున్న రూ.కోట్ల సొమ్ము..
  •  ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టిస్తున్న పౌర సరఫరా శాఖ సిబ్బంది..
  •  కాసుల కక్కుర్తిలో పర్యవేక్షణను గాలికొదిలిన రెవెన్యూ యంత్రాంగం..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : ప్రభుత్వం నుంచి పేదలకు అందిస్తున్న కోటా బియ్యం రూ.కోట్ల వ్యాపారాన్ని దాటేస్తుందని అనడంలో అతిశయోక్తి లేదు. పేదలకు అందకుండానే ఆమడ దూరంలో దళారుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. బియ్యం పంపిణీ విషయమై డీలర్‌ వద్ద అక్రమాలు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంటి వద్దనే ఇచ్చే విధంగా మొబైల్‌ పంపిణీ యూనిట్‌ (ఎండీయూ) వాహనాలను ప్రారంభిస్తే.. మొబైల్‌ పంపిణీ యూనిట్‌ సిబ్బంది డీలర్‌ల స్థాయిని సైతం మించిపోతున్నారని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వినిపిస్తుంది. ఈ క్రమంలో ప్రతీ నెల పేద ప్రజలకు బియ్యం ఇవ్వల్సింది పోయి వారికి బియ్యానికి బదులు కేజీకి రూ.10 చొప్పున సొమ్ము ఇస్తున్నారు. కొందరు మాత్రం బియ్యం కావాలని పట్టు పట్టి కూర్చుంటే రేపు రావాలి.. మరుసటి రోజు రావాలి.. అనే నెపంతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఇప్పటికే పలువురు ప్రజలు మండి పడుతున్నారు. ఉచితంగా ఇచ్చే బియ్యం వద్ద రూ.10 వస్తుందని ప్రజలు తీసుకుంటున్నారు కానీ తద్వార ప్రభుత్వానికి ఎంత మొత్తంలో గండి కొడుతున్నామని ఏ ఒక్కరూ ఆలోచించకపోవడం శోచనీయం. నాడు డీలర్‌ల నుంచి వందల టన్నుల్లో బియ్యం పక్కదారి పడితే నేడు వేల టన్నుల్లో మాయమైపోతున్నాయి. దీనికి తోడు ప్రతీ అంశంలో ప్రభుత్వ అధికారుల మాదిరి లంచం తినడంలో మొదటి వరసలో ఈ ఎండీయూల సిబ్బంది ఉన్నారు.

  •  దసరా మామ్మూళ్లు పేరిట రూ.లక్షల్లో సొమ్మును కాజేశారు..
    తాత్కలిక పద్ధతిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఏడాదికి ఓమారు దసరా మామ్మూళ్లు వసూలు చేస్తే ఓమాదిరి వినడానికి వినసొంపుగా ఉంటే.. వాహనాల ద్వారా రేషన్‌ బియ్యం పంపిణీ చేయాల్సిన ఎండీయూలు వారికి పైన ఉన్న వీఆర్‌వోలు, ఆర్‌ఐలు, డీటీలు, పౌరసరఫరా శాఖ సిబ్బంది పేరిట రూ.లక్షల్లోనే వసూలు జరిగింది. వాహనం వద్దకు వచ్చి బియ్యం తీసుకొని, రూ.10 చొప్పున తీసుకొని విక్రయించే ప్రతీ ఒక్కరి వద్ద రూ.20చొప్పున సుమారు 5లక్షల కార్డులకు ఎంత మొత్తంలో వసూలు అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభుత్వం నుంచి జీతం, డీలర్‌ నుంచి కమీషన్‌, ప్రజల నుంచి మామ్మూళ్లు ఇలా నలు రకాలుగా వసూళ్లకు పాల్పడి నాలుగు రాళ్లు వెనకేసుకున్నారని ప్రతి పక్షపార్టీ నాయకులు సైతం బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. దీనిపై ఇప్పటికే జేసీ డీలర్‌లు, ఆర్‌ఐలతో ఓ సమావేశమై చర్చించగా ఒకరిపై ఒకరు చెప్పుకొని సంఘ నాయకులపై నెట్టడంతో తర్జన భర్జనల నడుమ సమస్య సద్దుమనిగిందనే చెప్పాలి. కానీ ఈ వ్యవహారంపై నేటికీ విచారణ కొనసాగుతుందని సమాచారం.

 

  • పేదల బువ్వకు ఉపయోగించే బియ్యం కేజీ రూ.10 మాత్రమే..?
    ప్రభుత్వం అధిక మొత్తంలో కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా ఇస్తుంటే.. ఉచిత బియ్యంపై కేజీకి రూ.10 వస్తుందని ఎండీయూ సిబ్బందికే వదిలిపెడుతున్న ప్రజల చేష్టలను బియ్యం దొంగలు చిల్లర చేసుకుంటున్నారు. టన్నుల చొప్పున వాహనాల్లో అక్రమ రవాణా చేసి రూ.కోట్లల్లో విక్రయాలు చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా పౌర సరఫరా శాఖతో పాటుగా ప్రత్యేక నిఘా బృందాలతో విధులు నిర్వహిస్తున్న పోలీసు యంత్రాంగానికి సైతం బహిరంగ రహస్యంగానే తెలుసు. నెలవారీ మామ్మూళ్లు మత్తులో ఈ వ్యవహారం చూసి చూడనట్టు ఉండటం వలన ఎఫ్‌సీఐ గిడ్డంగుల నుంచి వచ్చిన బియ్యం పేదోడి కంచంలో బువ్వగా మారకుండానే మిల్లులకు ప్రయాణమవుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై విశాఖ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కేఎస్‌ విశ్వనాథన్‌ తీవ్ర ఆగ్రహంతో ఉన్నా ఆయన కంటికి కనిపించకుండా జోరు వ్యాపారాలు సాగేందుకు సంబంధిత విభాగ సిబ్బందే పరోక్షంగా పనిచేస్తున్నారని వినికిడి.

  •  పర్యావేక్షణ లోపంతో పక్కదారి పడుతున్న కోటా బియ్యం..
    కోటా బియ్యం పక్కదారి పట్టకుండా పౌర సరఫరా శాఖ అధికారులతో పాటుగా రెవెన్యూ, పోలీసు విభాగాలకు పూర్తి అధికారాలు ఉన్నా టన్నులు, టన్నులు బియ్యం పక్కదారి పట్టడం వెనుక అసలు రహస్యం అమ్యామ్యాలు మత్తులో కనిపించడం లేదనే చెప్పాలి. నెలవారీ వచ్చే మామ్మూళ్లుతో పాటుగా దాడులు నిర్వహించిన ప్రతీసారి పచ్చనోట్లు రావడంతో పర్యావేక్షణ పూర్తీగా లోపించిందనే పలువురు ప్రజలు వెల్లడిస్తున్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికైనా ఇంటి దొంగలపై కొరడా ఝుళిపిస్తే ప్రయోజనం ఉంటుందని సంబంధిత విభాగంలో దిగువ స్థాయి సిబ్బంది రహస్య అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Government

అధికారుల అండతో చీకటి వ్యాపారం

  • పౌర సరఫరా శాఖ సమక్షంలో పీడీఎస్ గోల్.. మాల్..
  • రేషన్ బియ్యం అక్రమ విక్రయాల్లో చేదోడు వాదోడు..
  • చూసి చూడ నందుకు నెలవారీ మామ్మూళ్లు..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : పేద ప్రజలకు అందించాల్సిన పీడీఎస్‌ రైస్‌ పక్కదారి పట్టడానికి ప్రభుత్వ అధికారులే కీలకంగా వ్యవరిస్తున్నారని ఒకటి రెండు ఘటనలు పరిశీలిస్తే ఇట్టే అర్థం అయిపోతుంది. నెల చివరిలో వచ్చే జీతాలు కంటే నెలవారీ వస్తున్న మామ్మూళ్లు మత్తులో అధికారులు విధులు నిర్వహించడంతో పేదల బియ్యం పక్కదారి పడుతుంది. పీడీఎస్‌ రైస్‌ని అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు అందినకాడికి దోచుకోని వదిలేయడంతో ఓ ఫిర్యాదు దారుడు జిల్లా అధికారికి సైతం ఫిర్యాదు అందించడానికి సిద్ధమయ్యాడంటే దిగువ స్థాయిలో సిబ్బంది చేస్తున్న చేష్టలు హద్దులు మీరుతున్నాయనే చెప్పాలి. గురువారం రాత్రి సుమారు10.50గంటల సమయంలో అరిశెట్టి మహేశ్వరరావు అనే వ్యాపారి అల్లిపురం బజారు ప్రాంతంలో 750కేజీల పీడీఎస్‌ రైస్‌ని ఆటోలో అక్రమంగా తరలిస్తున్న సమాచారం అందుకున్న ఓ సర్కిల్‌-1 ఆర్‌ఐ రూ.20వేలు లంచం తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే క్రమంలో సర్కిల్‌-3 పరిధిలో విధులు నిర్వహిస్తున్న మరో ఆర్‌ఐ ఓ పీడీఎస్‌ రైస్‌ వ్యాపారిపై దాడులు నిర్వహించి రూ.15వేలు, ఓ మిల్లు యజమాని నుంచి ఇంకొక ఆర్‌ఐ రూ.15వేలు తీసుకోవడం అధికారుల పనితీరు కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనే చెప్పాలి.

 

  • ఉన్నతాధికారుల నిఘా నీరు కారిపోతుంది..
    సర్కిల్‌ పరిధిలో డిఫోలు, ఎండీయూల నుంచి పీడీఎస్‌ రైస్‌ పక్కదారి పడుతుందని రోజువారీ వందల ఫిర్యాదులు వస్తున్నా అటుగా పట్టించుకోవడంలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహించడంతో దిగువ స్థాయిలో ఉన్న వీఆర్‌వోలు, ఆర్‌లు దండీగా దండుకుంటున్నారని సమాచారం. నెల చివరిలో వచ్చే జీతాల కంటే నెలవారీ వచ్చే మామ్మూళ్లుపై మక్కువ పెంచుకొని విధులు నిర్వహించడంతో అక్రమ విక్రయాలపై దృష్టి కేంద్ర్రీకృతం చేయలేకపోతున్నారని బహిరంగ రహస్యం. రోజువారీ సమీక్షలు నిర్వహించి దండిరచాల్సిన ఉన్నతాధికారులు సైతం చోద్యం చూడటంతో నిఘా నీరు కారిపోతుంది.

 

  • పీడీఎస్‌ అక్రమ విక్రయాలతో దండీగా దుడ్లు..
    పేదల బియ్యాన్ని పేదవాడికి అందించకుండా మిల్లులకు అక్రమంగా తరలించడంలో పౌర సరఫరా శాఖ సిబ్బంది, వార్డు సచివాలయ రెవెన్యూ కార్యదర్శిలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ దాడుల పేరిట పీడీఎస్‌ వ్యాపారులు, డిఫో డీలర్లు, ఎండీయూల నుంచి అందినకాడికి దోచుకోవడంలో సిద్ధ హస్తులుగా నిలుస్తున్నారు. ఎఫ్‌సీఐ గిడ్డంగుల నుంచి వచ్చే బియ్యం పేదవాడికి అందకుండా శివారు ప్రాంతాల్లో ఉన్న మిల్లులకు తరలించే ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తున్న సిబ్బంది దండీగా దుడ్లు సంపాధిస్తున్నారని ఆనోట.. ఈనోట.. గట్టిగానే వినిపిస్తుంది.

 

  • నెలలో పదిరోజులు పండగ చేసుకుంటున్నారు..
    ప్రతీ నెలలో మొదటి పది రోజులు పీడీఎస్‌ రైస్‌ని అక్రమంగ విక్రయాలు చేస్తున్న వ్యాపారులు పండగ చేసుకుంటున్నారు. గిడ్డంగుల నుంచి రేషన్‌ డిపోలకు తరలించిన బియ్యం డిపోల్లో కొత్త ప్యాకింగ్‌లతో సిద్ధమై దర్జాగా మిల్లులకు ప్రయాణమవుతున్నాయంటే వ్యవస్థలో లోపాలు ఏవిధంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనిపై పూర్తిగా అవగాహన ఉన్న అధికారులు సైతం ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదని పలువురు పేద ప్రజలే ప్రశ్నిస్తున్నారు.