Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
నేత్ర న్యూస్, విశాఖపట్నం, మార్చి 20: ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ తో దుర్భాసలాడి బెదిరించిన మేయర్ భర్త గొలగాని శ్రీనివాసరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ సోమవారం పోలీస్ కమిషనరేట్ లోని స్పందనలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 13న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆరిలోవలోని తోటగరువు స్కూల్ వద్ద గల పోలింగ్ బూత్ దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ స్వామి విధులు నిర్వహిస్తుండగా, షాడో మేయర్ గొలగాని శ్రీనివాస్ అక్కడికి చేరుకొని, ఆ పోలీసుతో అమానుషంగా దుర్భాసలాడి బెదిరించి భయభ్రాంతులకు గురి చేయడం దారుణం అన్నారు. రక్షక భటులైన పోలీసులను గౌరవించాల్సింది పోయి గూబ పగల గొడతానని, సస్పెండ్ చేసి పారేస్తాను అంటూ దుర్భాసలాడిన విషయం అన్ని చానల్లో, పత్రికల్లో వచ్చాయని తెలిపారు. శ్రీనివాస్ ఒక మంత్రి, ఎమ్మెల్యే, అధికార కార్పొరేటర్ కాదని, వైసీపీ సాధారణ కార్యకర్త అని ఏం అధికారం ఉందని విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పై దారుణంగా దుర్భాషలాడుతారా అంటూ మండిపడ్డారు. పోలీసులు సుమోటో గా కేసు నమోదు చేసి ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. చట్టాలపై పోలీసులపై వైసీపీ నేతలకు గౌరవ లేదని, అందుకు ఉదాహరణ ఈ సంఘటన అన్నారు. సాక్షాత్తు పోలీసులను నడి రోడ్డుపై బెదిరించి విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. ఇప్పటికే షాడో మేయర్ గా శ్రీనివాస్ వ్యవహరిస్తూ జీవీఎంసీ అధికారులను బెదిరిస్తూ ప్రజా ధనాన్ని దోచుకు తింటున్నారని ఆరోపించారు. అదే వేరే పార్టీ వారు ఇలా చేసి ఉంటే ఈ పాటికి కేసులు పెట్టేవారన్నారు. వైసీపీ నాయకులకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. ఆధారాలతో స్పందనలో ఏడీసీపీ రామకృష్ణంరాజుకు ఫిర్యాదు చేశానని, స్పందించిన ఆయన చర్యలు తీసుకోమని ఆరిలోవ పోలీసులకు ఆదేశించారన్నారు. పోలీసు అధికారుల సంఘం ఇప్పటికైనా స్పందించాలన్నారు. ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.
నేత్రన్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి): హెయిర్ పిన్ నుంచి ఏరోప్లేన్‌కి ఉపయోగపడే సామాగ్రికి సైతం ఆతిథ్యం అందిస్తున్న పూర్ణామార్కెట్ ఇప్పుడు అభాసు పాలవుతుంది. కొంత మంది నకిలీ వ్యాపారులు చేస్తున్న చేష్టల వలన వినియోగదారులు అటుగా రావడానికి సైతం సతమతం అవుతున్నారు. స్థానిక పోలీసు యంత్రాంగం, అద్దెలు వసూలు చేస్తున్న జీవీఎంసీ ఉన్నతాధికారులు అటుగా చర్యలు తీసుకోక పోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని పలువురు వినియోగదారులు బోరుమంటున్నారు. రహదారిపై అనధికారికంగా తిష్టవేసి అక్రమ వ్యాపారాలు చేస్తున్న నకిలీ వ్యాపారుల వలన నిత్యం నరకయాతన పడుతున్నామని రోజువారీ వచ్చే వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ధరలు వ్యత్యాసంపై బేరాలు ఆడితే బెధిరింపులకు పాల్పడుతున్నారని, భయంతో బదులు ఇస్తే కత్తులు బయటకు తీసి దాడులకు పాల్పడుతున్నారని ఓ బాధితురాలు భయంతో సమాధానం ఇచ్చింది. పెద్ద పెద్ద దుకాణాల నుంచి చిన్నపాటి జంగిడీల వరకు సుమారు 600దుకాణాలకు ఆశ్రయం ఇచ్చిన పూర్ణామార్కెట్‌కి ఇప్పుడు పరువు పోతుంది. 92ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఘటనలు భయాందోళన కల్గిస్తున్నాయి. రెండు నెలల క్రితం జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్న ఓ జడ్జి కుటుంబం మార్కెట్‌కి వచ్చి పోయే సమయంలో ఓ వ్యాపారి జడ్జిపై అసభ్యకరంగా మాట్లాడటంతో పాటుగా దాడికి ప్రయత్నించడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందించారు. ఇదే క్రమంలో రెండు రోజుల క్రితం ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీసు భార్య కూరగాయలు కొనుగోలు నిమిత్తం మార్కెట్‌కి వచ్చి వెళ్లే క్రమంలో ఆమెపై స్థానికంగా ఉన్న ఓ మహిళా వ్యాపారి అసభ్యకరమైన పదజాలంతో రెచ్చిపోవడంతో పాటుగా చేతిలో ఉన్న చిన్నపాటి కత్తితో బెధిరింపులకు పాల్పడటంపై పలువురు నుంచి తీవ్ర విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి ఘటనల నేపథ్యంలో రెండు నెలల క్రితం మార్కెట్ లోపలి భాగంలో వ్యాపారాలు చేస్తున్న యజమానులు మార్కెట్‌కి స్వచ్ఛందగా బంద్‌ని ప్రకటించిన నేటికి ఎటువంటి ఫలితం లేకపోయింది. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న జోన్-4 జోనల్ కమిషనర్ విధులు సక్రమంగా నిర్వర్తించకుండా చోద్యం చూడటంతో పూర్ణామార్కెట్‌కి ఈ పరిస్థితి పట్టిందని ఓ వృద్ధ వ్యాపారి ఆరోపించారు.
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : పూర్ణామార్కెట్ పార్కింగ్ ప్రాంతంలో అక్రమంగా చేస్తున్న వ్యాపారాలను వెంటనే తొలిగించి తమకు న్యాయం చేయాలని సర్ధార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో పూర్ణామార్కెట్‌కి బుధవారం సంపూర్ణ బంద్‌ని ప్రకటించి నిరసన చేపట్టారు. ఉదయం ఆరు గంటల సమయంలో రహదారిపై బైఠాయించిన వ్యాపారులు సంబంధిత అధికారులు హామి ఇచ్చే వరకు నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. అనంతరం మార్కెట్ ఆవరణంలో వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సందర్భంగా సంఘ అధ్యక్షుడు కొండా రామకృష్ణ మాట్లాడుతూ పార్కింగ్ ప్రాంతంలో ఎటువంటి వ్యాపారాలకు అనుమతి లేదని, కొంత మంది కుట్రపూరిత చర్యల వలన రహదారులపై ఈ తరహా వ్యాపారాలు పెరిగిపోయాయని తెలిపారు. దీంతో తమ వ్యాపారాలు పూర్తి స్థాయిలో జరగడం లేదన్నారు. మార్కెట్ లోపలి భాగంలో వ్యాపారాలు లేక సంబంధిత వ్యాపారులు అప్పులలో మునిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటుగా సంబంధిత జీవీఎంసీ అధికారులకు, ట్రాఫిక్ పోలీసులకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ బంద్‌ని ప్రకటించి నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు.
మార్కెట్‌లో ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తున్న వ్యాపారులు అప్పులపాలైపోతుంటే కొత్తగా వస్తున్న నకిలీ వ్యక్తులు వ్యాపారులుగా మారీ రహదారులపై ఇష్టానుసారంగా వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని దండీగా సంపాధిస్తున్నారని మండి పడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన న్యాయం జరగకపోవడంతో దుకాణాలకు తాళాలు వేసి నిరసన తెలుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం స్వచ్ఛంగా దుకాణాలకు తాళాలు వెయ్యడం 92ఏళ్లలో మొదటసారి అని పలువురు వ్యాపారులు వెల్లడిరచారు. అధికారులు హామి ఇచ్చే వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతునే ఉంటామని నిరసన కార్యక్రమంలో నినాదాలు చేశారు. ఒక వైపు ఎండ తీవ్రత పెరుగుతున్న పట్టించుకోకుండా నిరసన జ్వలలను రేపారు.
పూర్ణామార్కెట్లో నిత్యం వేలాది వినియోగదారులు వస్తుంటారు. పండగల సమయంలో అసలు చూడక్కర్లేదు. అలాంటిది అక్కడ సరైన పార్కింగ్ వసతి లేదు. కార్లు వస్తే నిమిషాల పాటు ట్రాఫిక్ జాం. ఒక్కోసారి దుకాణాల ముందే వాహనాలు నిలిపేస్తున్నారు. దీంతో తమకు ఇబ్బందులు తప్పడం లేదని, చిరు వ్యాపారులు సిండికేట్గా మారి తమపైనే దౌర్జన్యాలకు దిగు తున్నారని వాపోతున్నారు. పోలీసులు బీట్ కాస్తున్నా తమకు రక్షణ లేకుండా పోయిందని, జీవీఎంసీ అధికారులు అప్పుడప్పుడు మాత్రమే వచ్చి తనిఖీలు చేసుకుని వెళ్లిపోతున్నారని ఆరోపిస్తున్నారు. అత్యధిక ఆదాయం వచ్చే అలాంటి చోట అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో చెప్పాలని, మామ్మూళ్లు వసూలు చేసుకుని తమ పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.
మార్కెట్ రహదారులపై వ్యాపారాలు నిర్వహిస్తే సహించేది లేదని, ఎవ్వరికి కేటాయించిన దుకాణాల్లో వాళ్లు వ్యాపారాలు చేసుకుంటే అందరు బాగుంటారని వెల్లడిరచారు. నిత్యవసర సరుకులు కొనుగోలుకు వస్తున్న వినియోగదారులపై నకిలీ వ్యాపారులు దాడులకు దిగడంతో మార్కెట్ పరువు పోతుందని, ఇప్పటికైనా శాంతిభద్రతల పోలీసులు స్థానికంగా బీట్ బుక్ పెట్టి వ్యాపారులకు రక్షణ కల్పించాలని ప్రాధేయ పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా బీట్ సిబ్బందిని పెంచి రహదారులపై వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులపై చర్యలకు సిద్ధం కావాలని కోరుతున్నారు. స్థానిక ప్రజా ప్రతినిథుల పైరవీలతో వ్యాపారాలు చేసినా సహించేది లేదని తేల్చి చెప్పారు. మరోసారి వ్యాపారాలు రహదారిపైకి వస్తే తాము తీసుకోవల్సిన చర్యలు తీసుకుంటామని వెల్లడిరచారు.
మార్కెట్ వ్యాపారులు చేసిన నిరసన కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని సర్ధార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ వర్తక సంఘ సభ్యులు వెల్లడిరచారు. స్థానిక శాంతిభద్రతల పోలీసులతో పాటుగా ట్రాఫిక్ పోలీసులు ఎంతో సహకరించారని వెల్లడిరచారు. జీవీఎంసీ జోనల్ కమిషనర్‌తో పాటుగా మేయర్ నుంచి కూడా మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. నిరసనకు సహకరించిన అందరికీ ధన్యవాదలు సైతం చెప్పారు.
– మహారాణిపేట ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లో ఫైనాన్స్ వ్యాపారులు..
– విధుల మధ్యలో దర్జాగా ఫైనాన్స్ కలెక్షన్ చేస్తున్న ట్రాఫిక్ సిబ్బంది..
– యూనిఫాంతో దర్జాగా తమ పరిధిలో చిట్టీలు, వడ్డీ వ్యాపారం..
– కూడళ్లలో ట్రాఫిక్ సమస్యలు ఎదురైనా పట్టించుకోని ఇరువురు..
– భారీ వడ్డీలతో పేద ప్రజలను పట్టి పీడిస్తున్న ఇద్దరు హోమ్ గార్డులు..
– అనాధికారంగా ఫైనాన్స్ చేస్తున్న చోద్యం చూస్తున్న ప్రత్యేక విభాగం..
నేత్ర న్యూస్, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి): నిత్యం రద్ధీగా ఉండే కూడళ్లలో విధులు నిర్వహించాల్సిన సిబ్బంది సమయాన్ని పాటించడం లేదు. తమకు కేటాయించిన డ్యూటీలను సైతం పక్కన పెట్టి భారీగా పెట్టిన పెట్టుబడులను వసూలు చేసుకోవడానికి పరుగులు పెడుతున్నారు. సాధారణ రోజుల్లోనే రద్ధీగా ఉండే మహారాణిపేట పోలీసు స్టేషన్ పరిధి కూడళ్లలో ఇక పండగ వస్తే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వస్త్ర, బంగారం దుకాణాలతో పాటుగా ఇతర వస్తువులను విక్రయించే దుకాణాలకు భారీ సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగించడం వలన ఆ కూడళ్లలో తీవ్ర రద్ధీ ఏర్పడుతుంది. అటువంటి ప్రధాన జంక్షన్‌లో సైతం రోజువారీ విధులు నిర్వహించాల్సిన ఇద్దరు హోమ్‌గార్డ్‌లు మాత్రం తమకు కేటాయించిన విధులను సైతం పక్కన పెట్టి దసరా చిట్టీలు, ఫైనాన్స్, వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నారు. సాధారణంగా రోజుకి 8గంటల పాటు విధులు నిర్వహించాల్సిన సిబ్బంది సమయం మధ్యలోనే కూడళ్లను గాలికి వదిలిపెట్టి వడ్డీ వ్యాపారం చేసుకోవడంలో నిమగ్నమైపోయారు. విధుల మధ్యలో కలెక్షన్‌కి పరుగులు పెట్టిన సిబ్బంది తన పైస్థాయి అధికారి బీట్ చెకింగ్‌కి వచ్చే సమయానికి మాత్రం యథాస్థానంలో ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మహారాణిపేట ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో హోమ్‌గార్డులుగా విధులు నిర్వహిస్తున్న కె.గణేష్ (హెచ్‌జీ నంబర్-459), పి.లక్ష్మీనారాయణ (హెచ్‌జీ నంబర్-189)లు పోలీసు వ్యవస్థకు వ్యతిరేక మార్గంలో ప్రయాణిస్తున్నారు. సంబంధిత స్టేషన్ పరిధిలో ఉన్న పలు చిరువ్యాపారులకు అనాధికారంగా దసరా చిట్టీలతో పాటుగా ఫైనాన్స్ ఇచ్చి రోజువారీ వడ్డీ, అసలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ సాధారణ సమయంలో చేస్తున్నారని అనుకుంటున్నారా..? అలా అనుకుంటే మీరు పప్పులో కాదు తప్పులో కాలేసినట్టే..! వాళ్లకి కేటాయించిన కూడల్లో ట్రాఫిక్ రద్ధీ అధికంగా ఉండే సాయంత్రం 7.30గంటల నుంచి 9.30గంటల సమయంలో మాత్రమే ఈ ఫైనాన్స్ కలెక్షన్ చేస్తున్నారని ‘నేత్ర న్యూస్’ నిఘా బృందం పలు వీడియో రికార్డింగ్‌ల ద్వారా ఆధారాలు సైతం స్వీకరించారు. ప్రధాన కూడళ్లలో గత వారం రోజుల్లో సమయానుగుణంగా విధులు నిర్వహించాల్సిన అదే సిబ్బంది ఫైనాన్స్ కలెక్షన్ చేస్తూ వీడియో కెమెరాలకు చిక్కారు.
– ఒకరు హోటల్ సౌందర్య ఇన్‌లో, మరొకరు జిల్లా కోర్టులో..
నగర రహదారుల రద్దీ దృష్ట్యా అధికారులు విధించిన విధులను సక్రమంగా చేయాల్సిన సిబ్బంది మొండిచేయి చూపిస్తున్నారు. కూడళ్లలో ట్రాఫిక్ కంట్రోల్ చేయాల్సిన సిబ్బంది చేతులో సెల్‌ఫోన్‌లు పట్టుకొని వాట్సప్, ఫేస్‌బుక్, ఇంస్టాగ్రామ్, రీల్స్‌తో పాటుగా రమ్మీ, పబ్`జీ, క్యారమ్స్, క్యాండీ క్రష్, 8బాల్ పూల్, లూడో కింగ్ వంటి ఆటలను ఆడుకోవడం, యూ ట్యూబ్‌లో పాత పాటలు, హాస్య సన్నివేశాలు, ఇతర వీడియోలు చూడటంలో నిమగ్నమై పోతున్నారు. ఇదే క్రమంలో మహారాణిపేట ట్రాఫిక్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోమ్‌గార్డ్ కె.గణేష్ అయితే రెండు గంటల ముందే తనకు కేటాయించిన కూడలిని గాలికి వదిలేసి జగదాంబ సమీపంలో గల మక్కా మసీద్ ఎదురుగా ఉన్న హోటల్ సౌందర్య ఇన్‌లో కూర్చోని తనకి రావల్సిన కలెక్షన్ సొమ్మును లెక్కబెట్టుకొని పలుమార్లు చుట్టు పక్కల దుకాణాలకు వెళ్లి వసూలు చేసి ఆఖరికి హోటల్‌కి చేరుకుంటారు. హోమ్‌గార్డ్ పి.లక్ష్మీనారాయణ అయితే గంట ముందే కూడలిని వదిలిపెట్టి తన ప్రియురాలితో నేరుగా విశాఖపట్నం జిల్లా కోర్టుల సముదాయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. చీకటిగా ఉన్న ప్రాంతంలో ఇరువురు ముచ్చట్లు ఆడుకుంటూ ఒక గంట సమయాన్ని గడిపేస్తారు. అనంతరం ఆమెను మార్గంలో మధ్యలో వదిలిపెట్టి స్టేషన్ పరిధిలో ఉన్న పలు చిరు దుకాణాలు, హోటల్స్, తోపుడు బండ్లు, ఇళ్ల వద్దకు వెళ్లి రోజువారీ ఫైనాన్స్ కలెక్షన్ వసూలు చేస్తుంటారు.
– హోమ్‌గార్డులు పోలీసు ముసుగులో ఫైనాన్స్ చేస్తున్నారు..
నగరంలో చాలా మంది పోలీసు సిబ్బంది ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారని సంబంధిత పోలీసు ప్రత్యేక విభాగ (స్పెషల్ బ్రాంచ్) అధికారుల దృష్టిలో సమాచారం ఉన్నా అటుగా ఎందుకు అడుగులు వెయ్యడం లేదో తెలియాల్సి ఉంది. నెలవారీ వచ్చే వేతనాలతో పాటుగా రోజువారీ వచ్చే అక్రమార్జన (వస్సూళ్లు, వడ్డీలు)లను లెక్కిస్తే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేయాల్సిన అవినీతి నిరోధక శాఖ సైతం అటుగా చూడటం లేదు. ఇక ఈ ఇద్దరు సిబ్బంది విషయానికొస్తే విధుల మధ్యలో ఫైనాన్స్ కలెక్షన్‌కి వెళ్లే సమయంలో తనతో పాటుగా ఉన్న వాకీ టాకీ సెట్(సమాచార యంత్రం) అందరికీ వినిపించే విధంగా పెద్దగా శబ్ధం చేసి ఫైనాన్స్ సొమ్మును వసూలు చేస్తున్నారు. దీనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవల్సిన యంత్రాంగం సైతం అటుగా చూడటం లేదు. ఏది ఏమైన పోలీసు విభాగంలో పనిచేస్తూ ఫైనాన్స్ చేసే హోమ్‌గార్డ్ సిబ్బందిపై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని పలువురు సిబ్బంది కోరుతున్నారు.
– ఉద్యోగాల పేరిట బాధితుల నుంచి రూ.లక్షలు కాజేస్తున్న మూడోపట్టణ కానిస్టేబుల్ చెక్కా అప్పలకొండ..
– గత పది రోజులుగా బాధితురాలు స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోని స్టేషన్ అధికారులు..
– ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.లక్షలు దోచుకోవడంపై ఫిర్యాదులు వస్తున్నా కొండకు అండగా ఉన్న ఖాకీలు..
– ఫోన్`పే యాప్ ద్వారా బాధితురాలి నుంచి రూ.3లక్షలు తీసుకున్నట్టు స్టేషన్‌లో అంగీకరించిన ఆ ఖాకీ..
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి): నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఓ సాధారణ కానిస్టేబుల్ పలు ప్రభుత్వ వ్యవస్థల్లో కొలువులు ఇప్పిస్తానని రూ.లక్షలు కాజేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై సంబంధిత స్టేషన్ స్థాయి అధికారులను వివరణ కోరగా అటువంటి ఫిర్యాదులు తమ దృష్టికి రాలేదని, పత్రికల్లో కథనాలు వస్తే బాధితురాలికి న్యాయం జరగదని చెప్పడం ఓ విచిత్రమైన అనుభూతి కల్గించిందనే చెప్పాలి. ఎటువంటి ఫిర్యాదులు రాలేదని చెప్పిన అధికారులకు బాధితుడా..? బాధితురాలా..? అనే లింగ భేదం ఏ విధంగా గుర్తించారో అంతు చిక్కడం లేదు. దీనిపై మరో రెండు రోజులు ఓపికతో ఉంటే ఎఫ్‌ఐఆర్ సైతం నమోదు చేసి పూర్తి వివరాలు తానే వెల్లడిస్తానని చెప్పడం కూడా కొస మెరుపు. మూడోపట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న చెక్కా అప్పలకొండ (పీసీ నెంబర్: 3937) ఓ బాధితురాలి నుంచి ఉద్యోగం ఇప్పిస్తానని కొన్ని రోజుల క్రితం ఫోన్`పే యాప్ ద్వారా దఫ దఫాలుగా రూ.3లక్షలు తీసుకున్నాడని, పైగా బాధితురాలి ద్వారానే హైదరాబాద్‌కి విమాన టికెట్ సైతం బుకింగ్ చేయించుకున్నాడని స్టేషన్‌లో గుస గుసలు గుప్పుమంటున్నాయి. దీనిపై బాధితురాలు గత పది రోజులుగా స్టేషన్ చుట్టూ తిరుగుతున్న న్యాయం జరగలేదని, పైగా స్టేషన్ స్థాయి అధికారులు రాజీ చేయడానికి చూస్తున్నారని తోటి ఉద్యోగులే వెల్లడిస్తున్నారు. సొంత కొంపలో సానుభూతి సూత్రం ఉపయోగిస్తే సామాన్య ప్రజలకు ఏం న్యాయం జరుగుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గతవారం రోజుల క్రితం 2018వ బ్యాచ్‌కి చెందిన కానిస్టేబుల్ కొండని సంబంధిత ఉన్నతాధికారులు ప్రశ్నించగా బాధితురాలి నుంచి రూ.3లక్షలు ఫోన్`పే యాప్ ద్వారా తీసుకున్నట్టు అంగీకరించాడని, కొంత కాలం గడువు ఇస్తే.. తిరిగి ఇస్తానని హామీ ఇవ్వడంతో ఎఫ్‌ఐఆర్ లేకుండా రాజీకి బేరం కుదించారని విశ్వసనీయ సమాచారం. నగదు సమకూర్చుకోవడానికి సంబంధిత కానిస్టేబుల్ స్టేషన్‌లో సెలవు చీటీ కూడా సమర్పించి నాలుగు రోజులు క్రితమే మాయమైపోయడాని బాధితురాలి తరుపున వచ్చిన ఓ బంధువు మాటల్లో స్పష్టత లభిస్తుంచింది. కానిస్టేబుల్ కొండ ఈ ఒక్క వ్యవహారంలోనే కాకుండా తన స్నేహితుడు ప్రణీత్‌తో కలిసి చాలా మందిని మోసం చేశాడని స్టేషన్‌లో తోటి సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. పలు వ్యవహారాల్లో సుమారు రూ.30లక్షలకు పైగా మోసం చేసినట్టు, దీనిపై కానిస్టేబుల్‌ని తోటి ఉద్యోగులు తమదైన పద్ధతిలో అడిగితే ప్రణీత్ తనని సైతం మోసం చేసి పారిపోయాడని వెల్లడిస్తున్నాడు. దీనికి గాను తన వ్యక్తిగత ఫేస్‌బుక్ ఖాతాలో ‘మిస్సింగ్ పర్సన్ (ప్రణీత్) ఎనీ వన్ ఐడెంట్‌పై కాల్‌మీ’ అని తన ఫోన్ నెంబర్‌ని సైతం కానిస్టేబుల్ పెట్టడం తాను చెప్పిన కథను రత్తి కట్టించడానికే అని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి కొలువుల కొండ.. కాసులకు అనకొండగా గుర్తింపు పొందిన కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటారా..? లేదా..? చూడాలి.
– స్టేషన్‌లో జరుగుతున్న లొల్లిలో లాభం ఎంత..?
నిత్యం రద్ధీగా ఉండే మూడోపట్టణ పోలీసు స్టేషన్‌లో జరుగుతున్న ఇంతటి వ్యవహారం అర్ధనెల రోజులు అడ్డంగా గడిచిపోయినా బయటకు రాకపోవడం అందర్నీ అయోమయానికి గురిచేస్తుందనే చెప్పాలి. బాధితురాలు తన బంధువులతో కలిసి పదిరోజుల నుంచి పలుమార్లు వచ్చినా నేటికి సంబంధిత అధికారులు ఫిర్యాదు పత్రం లేదని విలేకరులకు చెప్పడం గమనార్హం. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ప్రతిసారి సంబంధిత అధికారులు కొలువులు ఇస్తానని మోసం చేసిన కానిస్టేబుల్ కొలువు పోతుందని బాధితురాలికి సర్దిచెప్పి రాజీకి ప్రయత్నించడం, దీనికి తోడు తీసుకున్న సొమ్ము తిరిగి చెల్లించడానికి కొంత సమయాన్ని ఇచ్చిన అధికారులు డబ్బులు సమకూర్చుకోవడానికి ఆ కానిస్టేబుల్‌కి సెలవులు సైతం ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వ్యవహారంపై పోలీసు సొంత నిఘా వ్యవస్థ (స్పెషల్ బ్రాంచ్) సిబ్బందికి కూడా తెలియకపోవడం పాపం.
– వేమన సాక్షిగా లావాదేవీలు జరిగాయా..?
ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గల వేమన మందిరం వద్ద బాధితురాలిని పలుమార్లు కలిసిన కానిస్టేబుల్ అక్కడే ఫోన్`పే యాప్ ద్వారా రూ.3లక్షలు తీసుకున్నట్టు బాధితురాలు సంబంధిత స్టేషన్ స్థాయి అధికారులకు వ్రాత పూరకంగా ఇచ్చినట్టు సమచారం. దీనిపై ఇరువురికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన అధికారులు విషయాన్ని తమ పైస్థాయి అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లకపోవడం పలు అనుమానాలుకు తావిస్తుంది. పైగా బాధితురాలికి అట్రాసిటీ కేసుల పేరిట కానిస్టేబుల్ భయాందోళనకు గురిచేసినట్టు కూడా సమాచారం.
– మా దృష్టికి ఎటువంటి ఫిర్యాదులు రాలేదు..!
ఉద్యోగాల పేరిట కానిస్టేబుల్ మోసం చేశాడని ఎటువంటి ఫిర్యాదులు రాలేదు. వ్రాత పూరకంగా కూడా ఎటువంటి ఫిర్యాదు అందించలేదు. ఇప్పుడు మీ పత్రికవాళ్లు ఏమైనా కథనాలు రాస్తే బాధితురాలికి న్యాయం జరగదు. మేము బాధితురాలికి న్యాయం చేయడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాం. బాధితురాలిని పిలిచి పూర్తి వివరాలు తెలుసుకుంటాం. మోసం చేసినట్టు గుర్తిస్తే వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తాం. రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తాం. కానిస్టేబుల్ విధులకు హాజరవుతున్నాడా..? అని అడిగిన ప్రశ్నకి సంబంధిత అధికారి లేదు సెలవులో ఉన్నాడని వివరణ ఇచ్చారు. `కోరాడ రామారావు(త్రీటౌన్, ఎస్‌హెచ్‌వో).
నేత్రన్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి): నగరంలో చోరీ కేసులు గణనీయంగా తగ్గు ముఖం పట్టాయి. దీనికి తోడు రికవరీ శాతం అమాంతం పెరిగి గత రెండేళ్లతో సరి పోల్చుకుంటే శభాష్ అనిపిస్తుంది. ఈ ఏడాది జనవరి 1నుంచి అక్టోబర్ 31వరకు కేసుల నమోదు, రికవరీ, డిటెక్షన్ వంటి కోణంలో చూస్తే మెరుగ్గానే ఉందని సంబంధిత విభాగ ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. ఈ తరహా విజయాలను సైతం కైవసం చేసుకోవడానికి నేర విభాగపు సిబ్బంది పనితీరుతో పాటుగా సాంకేతికత చక్కగా ఉపయోగించుకోవడమని పేర్కొంటున్నారు. గత రెండేళ్లలో చూస్తే.. 2019లో 850కేసులు, 2020లో 672కేసులు నమోదు అవ్వగా ఈ ఏడాది అక్టోబర్ 31వరకు కేవలం 667కేసులు మాత్రమే నమోదు అయ్యాయని వివరిస్తున్నారు. ఇందులో కూడా గత ఏడాది కరోనా లక్‌డౌన్ కారణంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అవ్వడంతో కాసంత తక్కువ కేసులు నమోదు అయినట్టు కనిపించాయని తెలిపారు. ఇక రికవరీ విషయానికొస్తే 2019లో 49శాతం, 2020లో 56శాతం నమోదవ్వగా ఈ ఏడాది అక్టోబర్ 31నాటికి 62శాతంగా ఉందన్నారు. ఈ పరిస్థితులు సాంకేతికతపై అధికంగా ఆధారపడం వలనే వచ్చాయన్నారు. సాంకేతికత ఉపయోగించుకొని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న నిందితులను సైతం అదే సాంకేతికత సరైన మార్గంలో ఉపయోగించి పట్టుకుంటున్నామన్నారు.
– లాభం కోసం హత్యలు కనుమరుగైపోయాయి..
మర్డర్ ఫర్ గైన్ (లాభం కోసం హత్య) వంటి కేసులు ఈ ఏడాది అక్టోబర్ 31వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గొప్ప విషయంగానే చెప్పాలి. 2019లో 2కేసులు, 2020లో 2కేసులు చొప్పున నమోదైన ఈ సంఖ్య ఈ ఏడాది పూర్తిగా శూన్యం కావడానికి అపార్ట్‌మెంట్‌లు, దుకాణాలు, గ్రూప్ హౌస్‌ల్లో సీసీ కెమెరాలు వంటివి అధిక సంఖ్యలో ఏర్పాటు చేయడం వలనే అని సంబంధిత ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. దీనికి తోడు గతంలో స్టాన్ పవర్ అనే సంస్థ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా 94కూడల్లో కెమెరాలను ఏర్పాటు చేయడం, ఆ తరువాత ఆ సంస్థ నిష్క్రమించిన తరువాత స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా జీవీఎంసీ సౌజన్యంతో మాట్ర్రిక్స్, ఎల్ అండ్ టీ వంటి సంస్థలు ఏర్పాటు చేసిన మరికొన్ని కెమెరాల ద్వారా నిత్యం నగరంలో డేగ కన్ను వేయడం వలన ఈ తరహా కేసులను కట్టుదిట్టం చేశామని వెల్లడిరచారు.
– గొలుసు, జేబు దొంగలు జోరు తగ్గింది..
గత ఏడాది కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడం వలన సాధారణంగా నమోదైన గొలుసు, జేబు దొంగతనాల కేసులు అంతకు ముందు ఏడాదితో పోల్చుకుంటే మెరుగైన ఫలితాలు ఇచ్చాయి. 2019లో గొలుసు దొంగతనాలు 54కేసులు నమోదు అవ్వగా ఈ ఏడాది అక్టోబర్ 31వరకు 38కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. 2020లో అయితే 34కేసులు నమోదైయ్యాయి. దీంతో పాటుగా జోబు దొంగతనాలు విషయానికొస్తే 2019లో 9కేసులు, 2020లో 10కేసులు నమోదు కాగా ఈ ఏడాది 9కేసులు నమోదై కాసంత పరవలేదనిపించాయి. ఈ తరహా కేసులు తగ్గు ముఖం పట్టడానికి ముఖ్య కారణం మార్కెట్‌లు, షాపింగ్ కాంప్లెక్స్‌లో నిఘా సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు ప్రజలను అవగాహన పరచడం వలన అదుపు చేశామని తెలిపారు.
– పగటి, రాత్రి పూట ఇంటి దొంగతనాలు మాయం..
ఇళ్లల్లో పగటి, రాత్రి సమయాల్లో జరిగే భారీ దొంగతనాలను అరికట్టించడంలో సిబ్బంది అద్భుత ప్రదర్శన కనబరిచారనే చెప్పాలి. 2019లో పగటి పూట 64, రాత్రి పూట 138 నమోదవ్వగా 2020లో పగటి పూట 15, రాత్రి పూట163కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు మాత్రం పగటి పూట 20, రాత్రి పూట 117 కేసులు మాత్రమే నమోదు కావడం చోరీకి గురైన నగదు, ఆభరణాల శాతం చాలా తగ్గిందనే చెప్పాలి. దీనికి కూడా అపార్ట్‌మెంట్‌లు, ఇళ్లల్లో సీసీ కెమెరాలు అమర్చుకోవడం వలనే అదుపుచేశామని తెలిపారు. దీంతో పాటుగా పోయిన సొత్తును సైతం స్వాధీనం చేసుకోవడానికి, నిందితులను పట్టుకోవడానికి సీసీ కెమెరాలు చక్కగా ఉపయోగించుకున్నామన్నారు. ఇప్పటీకి కూడా ఇళ్లల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అవగాహన పరుస్తున్నామన్నారు.
– డకాయిటీ, రాబరీ, సాధారణ చోరీలు తగ్గాయి..
దోపిడీలు, సాధారణ దొంగతనాల విషయానికి కొస్తే గత రెండేళ్లలో నమోదు చేసుకున్న కేసుల కంటే కాసంత తక్కువగానే ఉన్నాయి. 2019లో డకాయిటీలు-1, రాబరీలు-15, సాధారణ దొంగతనాలు-288 నమోదు అవ్వగా 2020లో డకాయిటీలు-1, రాబరీలు-22, సాధారణ దొంగతనాలు-213గా నమోదైయ్యాయి. ఈ ఏడాది మాత్రం కొంచెం మెరుగు పడి డకాయిటీలు-3, రాబరీలు-12, సాధారణ దొంగతనాలు-200గా నమోదై ఓ వైపు పోలీసు సిబ్బందిని, మరోవైపు ప్రజలను ప్రశాంతంగా నిద్రపోయేలా చేశాయి. ఈమేరకు డీసీపీ డీఎస్ శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ ఈ తరహా నేరాలను అదపుచేయడానికి అధిక సంఖ్యలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బలమైన నిఘా కట్టుదిట్టం చేశామని పేర్కొన్నారు.
– ఈ ఏడాదిలో రికవరీ శాతం పరుగులు పెట్టింది..
నగరంలో జరుగుతున్న నేరాలకు అనుగుణంగా చోరీకి గురైన సొత్తును, నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తును నగదుతో సరిపోల్చి వెల్లడిరచే ఆఖరి ఘట్టం అద్భుతంగానే కనిపిస్తుంది. 2019లో సుమారు రూ.5.96కోట్లు సొత్తు చోరీకి గురవ్వగా రూ.2.90కోట్లు స్వాధీనం చేసుకొని 49శాతంగా ఉంది. 2020లో సుమారు రూ.4.58కోట్లు సొత్తు చోరీకి కాగా రూ.2.55కోట్లు స్వాధీనం చేసుకొని 56శాతంగా నమోదైయింది. ఈ ఏడాది అక్టోబర్ 31వరకు తీసుకున్న లెక్కల ప్రకారం సుమారు రూ.5.39కోట్లు సొత్తు చోరీకి అవ్వగా రూ.3.32కోట్లు స్వాధీనం చేసుకొని ఏకంగా 62శాతంగా నమోదై అద్భుతాన్ని సృష్టించింది. మరో రెండు నెలలో ఆ శాతం మరింత పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయంటున్నారు.
– నగర ప్రజలు అవగాహనతో మెలగాలి..
నగరంలో చోరీలు పూర్తి స్థాయిలో అరికట్టడానికి సిబ్బందికి అనేక అంశాల్లో సూచనలు ఇస్తూ పనిచేయిస్తున్నాం. దీనికి తోడు నగర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలను, కమిషనరేట్‌లో అందుబాటులో ఉన్న టెక్‌సెల్, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ వంటి అనేక సాంకేతిక అంశాలను ఉపయోగించి చోరీ కేసులను ఛేదిస్తున్నాం. సమస్యాత్మక ప్రాంతాలైన పోర్టు ఏరియా, హెచ్‌పీసీఎల్, స్టీల్ ప్లాంట్ వంటి ప్రాంతాల్లో జరుగుతున్న దొంగతనాలపై ప్రత్యేక దృష్టి కేంద్రికరించాం. శివారు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కొంచెం తక్కువగా ఉండటం వలన ఆ ప్రాంతాల్లో చోరులను అదుపులోకి తీసుకోవడానికి కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం. పండుగ సమయాల్లో నగర ప్రజలు అవగాహన భరితంగా ఉండి పోలీసులు ఏర్పాటు చేసిన ఎల్‌హెచ్‌ఎంఎస్ ఆప్ సేవను ఉపయోగించుకోవాలి.
– డీఎస్ శ్రావణ్ కుమార్ (సీసీఎస్ – ఏసీపీ, నగర ఇన్‌ఛార్జీ నేర విభాగపు డీసీపీ).