Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : పేద ప్రజలకు అందించాల్సిన పీడీఎస్ రైస్ పక్కదారి పట్టడానికి ప్రభుత్వ అధికారులే కీలకంగా వ్యవరిస్తున్నారని ఒకటి రెండు ఘటనలు పరిశీలిస్తే ఇట్టే అర్థం అయిపోతుంది. నెల చివరిలో వచ్చే జీతాలు కంటే నెలవారీ వస్తున్న మామ్మూళ్లు మత్తులో అధికారులు విధులు నిర్వహించడంతో పేదల బియ్యం పక్కదారి పడుతుంది. పీడీఎస్ రైస్‌ని అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు అందినకాడికి దోచుకోని వదిలేయడంతో ఓ ఫిర్యాదు దారుడు జిల్లా అధికారికి సైతం ఫిర్యాదు అందించడానికి సిద్ధమయ్యాడంటే దిగువ స్థాయిలో సిబ్బంది చేస్తున్న చేష్టలు హద్దులు మీరుతున్నాయనే చెప్పాలి. గురువారం రాత్రి సుమారు10.50గంటల సమయంలో అరిశెట్టి మహేశ్వరరావు అనే వ్యాపారి అల్లిపురం బజారు ప్రాంతంలో 750కేజీల పీడీఎస్ రైస్‌ని ఆటోలో అక్రమంగా తరలిస్తున్న సమాచారం అందుకున్న ఓ సర్కిల్-1 ఆర్‌ఐ రూ.20వేలు లంచం తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే క్రమంలో సర్కిల్-3 పరిధిలో విధులు నిర్వహిస్తున్న మరో ఆర్‌ఐ ఓ పీడీఎస్ రైస్ వ్యాపారిపై దాడులు నిర్వహించి రూ.15వేలు, ఓ మిల్లు యజమాని నుంచి ఇంకొక ఆర్‌ఐ రూ.15వేలు తీసుకోవడం అధికారుల పనితీరు కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనే చెప్పాలి.
నేత్ర న్యూస్, విశాఖపట్నం: పేదలకు అందించాల్సిన పీడీఎస్ రైస్‌ని పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏడాది పాటుగా ఉచితంగా ఇవ్వవలసిన బియ్యం, సబ్సిడీలో ఇవ్వవలసిన పప్పు, పంచదార, గోదుమ పిండి సైతం పక్కదారి పట్టి కిరాణా దుకాణాలకు చేరుతున్నాయంటే అశ్చర్యపడనవసరం లేదు. ఓ దొంగ వ్యాపారి సరికొత్త బ్యాండ్ బ్యాగ్‌లను తయారు చేసి రైస్ మిల్లు నుంచి దుకాణాలకు తరలిస్తున్నట్టు రేషన్ బియ్యాన్ని ప్యాకింగ్ చేసి పక్కకు తరలిస్తుంటే మరో వ్యాపారి పాత సంచుల్లోనే సామాగ్రిని తరలించినట్టు మూడో కంటికి కనిపించకుండా బియ్యాన్ని చక్కగా మిల్లులకు తరలిస్తున్నారు. మరి కొందరు వ్యాపారస్తులు ఎవ్వరికీ ఎటువంటి అనుమానాలు రాకుండా ప్రభుత్వం ఇచ్చిన ఎండీయూ వాహనాల్లోనే నార సంచుల్లో బియ్యాన్ని మిల్లులకు పంపించి పని కానిస్తున్నారు. ఈ వ్యవహారాలపై ఇప్పటికే సంబంధిత అధికారులకు పలు ఫిర్యాదులు అందించినా అటుగా పట్టించుకోకుండా చోద్యం చేస్తున్నారని బహిరంగంగానే పలు విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. పౌరసరఫరాల శాఖ అధికారులతో పాటుగా విజిలెన్స్ విభాగ దిగువ స్థాయి నుంచి ఉన్నతాధికారుల సైతం ఈ నెలవారీ మామ్మూళ్లు మత్తులో ఉండటంతో పక్కదారి పడుతున్న పేదల బియ్యాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పలువురు ఆరోపిస్తున్నారు. నాలుగు నెలల క్రితం ఏపీ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ సీహెచ్ విజయ ప్రతాప్ రెడ్డి రాష్ట్రంలో పలు జిల్లాలతో పాటుగా విశాఖలో కూడా అకస్మిక తనిఖీలు నిర్వహించి సంబంధిత అధికారులతో పాటుగా డీలర్స్, ఎండీయూ సిబ్బందిని సైతం చమటలు పట్టించిన ఘటనలు మరువక ముందే తిరిగి జోరు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారంటే పీడీఎస్ బియ్యం వ్యాపారాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఇట్టే అర్థం అవుతుంది. ఉన్నతాధికారుల ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి తూతూ మంత్రంగా ఒకటి రెండు కేసులను నమోదు చేసి రోజుకి వేల సంఖ్యలో బస్తాలు పక్కదారి పడుతున్నా అటుగా పట్టించుకోలేని వ్యవస్థ ఉన్నంత వరకు బియ్యన్ని అక్రమ మార్గంలో తరలించి, ఫ్యాన్సీ నెంబర్ కారుల్లో తిరుగుతన్న పెద్దల పబ్బం గడుస్తునే ఉంటుంది. ఈ వ్యవహారాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ మరోమారు అక్రమార్కుల అంతు చూస్తే నాణ్యమైన స్వర్ణ రకం మధ్యస్థ సన్న బియ్యం పేదలకు చేరుతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.