Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
నేత్ర న్యూస్, విశాఖపట్నం : బయట ప్రపంచానికి కనిపించకుండా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ యంత్రాంగాల్లో ఒకటైన లీగల్ మెట్రాలజీ శాఖ (తూనికలు కొలతలు) విభాగం చేస్తున్న చేష్టలకు చిరు వ్యాపారులు బోరుమంటున్నారు. ఏడాదికి ఓమారు తనిఖీల పేరిట చిరు దుకాణాలు, తోపుడు బండ్లు వద్దకు వచ్చిన లీగల్ మెట్రాలజీ అధికార సిబ్బంది చేసే హడావుడితో వ్యాపారులు హడలెత్తిపోతున్నారనే చెప్పాలి. జీవోలో ముద్రించిన విధంగానే జరిమానాలు వసూళ్లు చేస్తున్నామని చెప్పిన అధికారులు ఇచ్చిన రశీదు కంటే అదనంగా వసూళ్లు చేస్తున్న సొమ్మును ఏ లెక్కల్లో చూపిస్తారో వాళ్లకే తెలియాలి. పెద్ద పెద్ద మార్కెట్‌లు, షాపింగ్ మాల్స్, పెద్ద డిపార్టుమెంటెల్ స్టోర్స్ నుంచి ఏడాది ఓమారు అప్పనంగా వచ్చే మామ్మూళ్లు మత్తులో అటుగా తనిఖీలు చేయని లీగల్ మెట్రాలజీ విభాగ సిబ్బంది రహదారులపై కాయగూరలు, పండ్లు అమ్ముకునే చిరు వ్యాపారులపై ఒక్కసారిగా పడి అందినకాడికి దోచుకుంటున్నారని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయం నుంచి ఏడాదికి ఓమారు దుకాణాల వద్దకు వచ్చి కాటాలకు వేసిన ముద్రణలతో కూడుకున్న సీల్స్‌ను మార్చాల్సిన సిబ్బంది అటుగా కనిపించకపోవడంతో ప్రైవేటు వ్యక్తులు రాజ్యమేలుతున్నారని ఆరోపిస్తున్నారు. కేజీలకు అనువుగా ఒక్కొక్క కాటాకు ఓ మొత్తంలో తీసుకోవల్సిన ప్రైవేటు వ్యక్తులు సైతం అదనంగా రూ.2వేల నుంచి రూ.3వేలు డిమాండ్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారని వెల్లడిస్తున్నారు. దీనిపై సంబంధిత ప్రైవేటు వ్యక్తులను వివరణ కోరగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానాతో పాటుగా ప్రభుత్వ అధికారులకు చెల్లిస్తున్న చిల్లర సొమ్ము కలుపుతూ అదనంగా వసూలు చేస్తున్నామని వెల్లడిస్తున్నారు. భారీ మొత్తంలో సొమ్మును చెల్లించలేమని బాధితులు బోరుమంటే సంబంధిత సిబ్బందిని దుకాణాల మీదకు ఎక్కించే ఘనమైన ఘనత కూడా వాళ్ల సొంతం. ఏడాదికి ఓసారి వచ్చి అడిగిన సొమ్మును చెల్లించకపోతే జరిమానా విధించి కాటాలను తీసుకెళ్లిపోతామని పలుమార్లు ప్రైవేటు వ్యక్తులే బెధిరింపులకు పాల్పడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.