Please assign a menu to the primary menu location under menu

Monday, September 9, 2024

Tag Archives: KALABAIRAVA

DevotionalGovernment

కాలభైరవ కష్టాల మార్గంలో కొలువై ఉన్నావా..!

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : భక్తుల కోర్కెలను తీర్చే భగవంతునికే కష్టాలు తప్పడం లేదు. ఆయన కొలువైన మార్గంలో అడుగడుగునా ఆటంకాలు అడ్డుపడుతూ అగమ్యగోచరాన్ని తలపిస్తున్నాయి. విశాఖపట్నంలో ప్రధమ దేవాలయంగా పేరుగాంచిన సింహాచలం శ్రీ అప్పన్న స్వామి అనుసంధాన దేవాలయం భైరవకోన కాలభైరవుడు కష్టాల మార్గంలో కొలువై ఉన్నారు. అమావాస్య పూజునిగా పేరొందిన కాలభైరవ స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో అడుగడుగునా ఆటంకాలు అడ్డుపడుతూ ప్రజలకు ముప్పతిప్పలు పెట్టిస్తున్నాయంటే ఆశ్చర్యం చెందనవసరం లేదనే చెప్పాలి. మాసంలో అమావాస్య రోజున స్వామి దర్శనానికి సుధూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఓ వైపు ప్రధాన రహదారి ఇబ్బందులకు గురిచేస్తుంటే.. మరోవైపు ఆలయ సిబ్బంది చేస్తున్న చేష్టలతో నరకయాతన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖకు చెందిన ప్రాంతంలో రాకపోకల మార్గం నిర్మించడానికి ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయని.. అంతటిని సైతం దాటుకొస్తున్న భక్తులకు ఆలయ సిబ్బంది చేస్తున్న చేష్టలు చిరాకు తెప్పిస్తున్నాయని మండిపడుతున్నారు. స్థానిక సిబ్బందితో పాటుగా సింహాచలం దేవాస్థానం నుంచి డిప్యూటేషన్‌పై విధులకు వస్తున్న ఆలయ సిబ్బంది చూపిస్తున్న బంధు ప్రీతి ప్రజలను గంటల తరబడి క్యూలైనుల్లో నిలబెట్టిస్తుంది. కిలో మీటర్‌ దూరం క్యూలైన్‌లో ఉన్న భక్తులు గంటలు గడుస్తున్నా ఆ కిలో మీటర్‌ దూరానికే పరిమితం అవ్వడం వలన భక్తుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఆలయ ఉన్నతాధికారులు సరైన పద్ధతులను అవలంభించక పోవడంతో అడుగడుగున భక్తులు అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. ఆలయం వద్ద పైరవీలు పర్వం పెరిగిపోవడంతో క్యూలైనుల్లో పడిగాపులు కాస్తున్న భక్తులు ఎండ వేడికి సొమ్మసిల్లి పోతున్న ఘటనలు కోకొల్లలు. చిల్లరకు కక్కుర్తి పడుతున్న సిబ్బంది ఉన్నంత వరకు ఈ ఆలయ అభివృద్ధి అడవి మధ్యలోనే ఉంటుందని పలువురు పలు రకాలుగా విమర్శిస్తున్నారు. ఈమధ్య పదుల సంఖ్యలో కార్యనిర్వహణాధికారులు మారుతున్న ఈ అరణ్య మార్గంలో ఉన్న కాలభైరవునికి సరైన రోడ్డు మార్గాన్ని నిర్మించలేకపోతున్నారని పలువురు ప్రజలు పరుషంగానే ప్రశ్నిస్తున్నారు.

  •  కాలభైరవుని ఆలయంలో పైరవీలు ప్రమాదకరం..
    అమావాస్య రోజున వేలదిగా తరలివస్తున్న భక్తుల మనోభావాలతో ఆలయ అధికారులు ఆడుకుంటున్నారని పలువురు భక్తులు మండి పడుతున్నారు. స్థానిక సిబ్బందితోనే సమస్యలు ఎదురవుతున్నాయంటే డిప్యూటేషన్‌పై విధులకు హాజరవుతున్న సిబ్బందితో మరింత ప్రమాదకరంగా ఉందని ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. బంధు ప్రీతితో క్యూలైన్లుగా వేరుచేస్తున్న బంధాలను సైతం తొలిగించి స్వామి దర్శనం కల్పిస్తున్నారు. దీంతో సాధారణ భక్తులు బారులు తీరుతూ క్యూలైనుల్లో నరకయాతన పడుతున్నారు. దీనికి తోడు బంధువులతో వాలంటీర్‌ పద్ధతులను ప్రారంభించడం వలన ఆ తోపులాటలో మహిళా భక్తులు ఇబ్బందులకు గురవుతున్నామని మండిపడుతున్నారు. అగ్ర దేవాలయంగా పేరొందిన సింహాచలం అనుసంధాన దేవాలయాల్లో ఇంతటి ఇబ్బందులు ఎదురవుతుంటే సాధారణ ఆలయాల్లో పరిస్థితి ఎవ్వరు చక్కబెడతారని పలువురు ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

  •  కాసుల కక్కుర్తిలో కాలభైరవునికి కష్టాలు..
    భక్తుల కష్టాలను తీర్చే కాలభైరవునికే కష్టాలు వెంటాడుతున్నాయంటే ముమ్మాటికి పాలకుల వైఫల్యమనే చెప్పాలి. అటవీ మార్గంలో కొలువైన స్వామికి సరైన రాకపోకల మార్గం ఏర్పాటు చేయడంలో పాలకుల నిర్లక్ష్యం వహించడానికి అటవీశాఖకు సంబంధించిన స్థలంలో రహదారి నిర్మించడానికి సవాలక్ష సమస్యలు ఉన్నాయని చెప్పుతూ తప్పించుకొని తిరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై అక్కడి పరిస్థితిలను తెలుసుకోవడానికి గతంలో పలువురు ఈవోలు ప్రయత్నాలు చేశారని ఆనోట.. ఈనోట.. వినడమే కానీ నేటికి నడక మార్గంపై ఓ స్పష్టత రాలేదు. ఈమధ్య కాలంలో తాత్కలిక, దీర్ఘకాలిక పద్ధతిలో పదుల సంఖ్యలో మారుతూ వస్తున్న ఆలయ కార్యనిర్వహణాధికారులు ఓసారి అటుగా పట్టించుకుంటారా అంటే..? ఏ నిమిషంలో బదిలీ అవుతారో.. ఏ నిమిషంలో పదోన్నతి పొందుతారో.. అనే అర్డర్స్‌ కోసం ఫ్యాక్స్‌ మిషన్‌ వైపు చూసుకోవడానికే సమయం సరిపోతుందని పలువురు ఆలయ సిబ్బందే గుసగుసలాడుకుంటున్నారు. ఇక దిగుస్థాయి సిబ్బందిని కనిపెట్టుకొని విధులు నిర్వహించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్న ఉన్నతాధికారుల వలన కాలభైరవ స్వామి ఆలయంలో చేతివాటంతో సిబ్బంది చెలరేగిపోతున్నారని, స్వామివారి హుండీలోకి రావల్సిన కాసులను మరో కంటికి కనిపించడకుండా కక్కుర్తితో మాయం చేస్తున్నారని పలువురు భక్తులు బహిరంగంగానే వెల్లడిస్తున్నారు.

  •  ట్రాఫిక్‌ సమస్యతో సతమతం..
    అమావాస్య రోజున రద్దీగా ఉండే కాలభైరవ స్వామి ఆలయ మార్గంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రమవ్వడానికి స్థానిక గోపాలపట్నం ట్రాఫిక్‌ పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. సిబ్బంది ముందస్తుగా పార్కింగ్‌ స్థలాలను పరిశీలించి కేటాయించకపోవడంతో రహదారి మధ్యలో వాహనాలను భక్తులు నిలిపి వెళ్లిపోవడంతో అటుగా వచ్చే వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు వాహన చోదకులు ఆరోపిస్తున్నారు. పైగా ఆ మార్గంలో భారీ వాహనాలు సైతం పంపించడంతో గంటల తరబడి వాహన రద్దీ ఉండిపోతుందని పలువురు చోదకులు స్థానిక పోలీసు వాట్సప్‌ నెంబర్‌కి ఫిర్యాదులు సైతం ఇవ్వడం కొస మెరుపు.

  • ఆలయంలో స్థానికుల హవా..
    కాలభైరవుని దర్శనంలో సమస్యలు ఎదురవ్వడానికి స్థానికుల హవా సైతం పెద్ద ఇబ్బందిగా తయారైయింది. స్థానిక పలుకుబడితో క్యూలైన్ల నుంచి రాకుండా పక్కనే ఉన్న తిరుగు మార్గంలో చొరబడి మరీ దర్శనం చేసుకుంటున్నారంటే అక్కడ హవా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో మరో కొత్త అంశం ఏమిటంటే ఈ స్థానిక హవాదారులు ఆలయానికి వచ్చే మార్గంలో రహదారిపై కూర్చున్న యాచకులను సైతం బెధిరింపులకు గురిచేసి వాళ్లు చెప్పిన ప్రాంతంలోనే కూర్చోవాలని ఆదేశాలు జారీ చేయడం కూడా కనిపిస్తున్నాయి. ఆలయ అధికారులు రాకపోకలకు సరైన మార్గాన్ని ఏర్పాటు చేయలేకపోవడంతో పాటుగా ఆలయంలో సరైన మార్గాన్ని అనుసరించక పోవడంతో అక్కడ ఓ ప్రైవేటు సైన్యమే రాజ్యమేలుతుంది. ఈ పరిస్థితుల నుంచి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్యనిర్వహణాధికారైన కాపాడుతారో.. లేదా కాలభైరవ స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో ఏర్పడిన పెద్ద పెద్ద బురద గుంటల్లో పడేస్తారో వేచి చూడాలి. సాధారణ రోజుల్లో ఒకరిద్దరు భక్తులతో పూజలందుకుంటున్న స్వామి ఏది ఏమైన ఓ నమ్మకంతో అమావాస్య రోజున లక్షలాది భక్త జనంతో ప్రత్యేక పూజలు అందుకుంటున్న స్వామికి కనీస సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత ఆలయ అధికారులపై ఎంతైన ఉందని పలువురు ప్రజలు వెల్లడిస్తున్నారు.