Please assign a menu to the primary menu location under menu

Weekly Gadgets

Find Us on Socials

Wednesday, November 29, 2023

Tag Archives: GVMC

CrimeGovernment

పక్కదారి పట్టిన ప్లాస్టిక్‌ రహిత బృందాలు

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : విశాఖ నగరాన్ని ప్లాస్టిక్‌ రహిత నగరంగా చూడాలని జీవీఎంసీ ఉన్నతాధికారులు చేస్తున్న ప్రయత్నం పక్కదారి పడుతుంది. 120మైక్రాన్‌ కంటే తక్కువగా మైక్రాన్‌లు ఉన్న ప్లాస్టిక్‌ సంచులతో పాటుగా ఒక్కసారి ఉపయోంగించే ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగాన్ని సైతం పూర్తి స్థాయిలో అరికట్టాలని ప్రారంభించిన ప్రయత్నాలు పలు విమర్శలకు దారి తీస్తుంది. గత నెల ప్రారంభంలో సుమారు రూ.2కోట్లు వరకు ఖర్చు చేసి పది ఇసుజు డీ-మ్యాక్స్‌ జీవీఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వాహనాలను ప్రారంభించిన ఉన్నతాధికారులు ముందుగా పలు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇప్పుడు నగరంలో పరువు తీసుకుంటున్నారు. దీనికి తోడు నెలవారీ ఒక్కొక్క వాహనానికి 140లీటర్లు డీజిల్‌ చొప్పున పది వాహనాలకు 1400 లీటర్లు డీజీల్‌కు గాను రూ.1,37,620లను, గౌరవ వేతనం చొప్పున ఒక్కొక్క వాలంటీర్‌కి రూ.10వేలు చొప్పున 36మందికి రూ.3.60లక్షలను ఖర్చు చేయడం అయోమయానికి గురి చేస్తుంది. వార్డు వాలంటీర్‌కి ఇచ్చిన రూ.5వేలు గౌరవ వేతనంతో పాటుగా అదనంగా రూ.10వేలు చొప్పున చెల్లించినా సంబంధిత వాలంటీర్‌లు వార్డుల్లో చేతివాటం చూపించడంతో పలువురు వ్యాపారుల నుంచి వ్యతిరేకత వినిపిస్తుంది.

దుకాణాల వద్దకు తనిఖీకి వెళ్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృంద సభ్యులు ఇష్టానుసారంగా మాట్లాడటంతో పాటుగా అక్రమ మార్గంలో వసూళ్లకు పాల్పడతున్నట్టు పలువురు దుకాణదారులు వెల్లడిస్తున్నారు. అసలు ఈ బృందాలు నగరంలో గల మార్కెట్‌లు, దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌, చిరు వ్యాపారాలు, తోపుడు బండ్ల వద్ద ఉపయోగించే ప్లాస్టిక్‌ సంచులను ఉపయోగించకుండా చూడటం, వాళ్లకు అవగాహన పరచడం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరిమానాలు విధించడం వంటివి చేయాలి. కానీ ఈ బృందాలు చిరు వ్యాపారులకు ఇష్టానుసారంగా జరిమానాలు విధించడంతో పాటుగా ఆమ్యామ్యాలపై మక్కువ చూపిస్తూ పక్కదారి పట్టడంతో నగర ప్రజల నుంచి జీవీఎంసీ అధికారులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 • వార్డు వాలంటీర్లకు దాడులు చేసే అధికారమా..?
  నెలకు రూ.5వేలు గౌరవ వేతనంతో వార్డు ప్రజలకు సేవలంధించే వార్డు వాలంటీర్లకు దాడులు చేసే అధికారం ఇవ్వడం వ్యాపారుల నుంచి విమర్శల గుప్పుమంటున్నాయి. వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహించడంతో పాటుగా ప్లాస్టిక్‌ రహిత అమలు బృందాల్లో సభ్యులుగా స్థానం కల్పించడంతో వాలంటీర్‌లు పెచ్చురేగిపోతున్నారు. గన్‌మాన్‌ల మాదిరి సఫారీ దుస్తులు ధరించి దాడులు చేయడానికి వెళ్లే క్రమంలో వాళ్లు ఆడిరదే ఆట.. పాడిరదే పాట..గా తయారైయిందని పలువురు వ్యాపారులు ఇప్పటికే జీవీఎంసీ కమిషనర్‌కి స్పందనలో ఫిర్యాదులు సైతం ఇచ్చారు. రూ.15వేలు గౌరవ వేతనంతో పాటుగా చిన్న చిన్న దుకాణాలు, తోపుడు బండ్ల వద్ద చిరు వ్యాపారులను బెధిరింపులకు గురిచేస్తూ దండీగా దోచుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ వాలంటీర్‌ గురువారం ఉదయం విధులకు హాజరవ్వడానికి తన ఇంటి నుంచి వెళ్లే క్రమంలో పాతనగరంలో ఓ దుకాణంలోకి చొరబడి తాను జీవీఎంసీ టాస్క్‌ఫోర్స్‌ టీంగా పరిచయం చేసుకున్నాడు. తన బృందంతో వస్తే భారీగా జరిమానా విధిస్తానని, ఒక్కడిగా రావడంతో మీకు అదృష్టం అనుకోవాలని చెప్పారు. వెంటనే ఇవ్వనవసరం లేదని, సాయంత్రం వచ్చి తీసుకుంటానని చెప్పి అక్కడ నుంచి చల్లగా జారుకోవడమే కాకుండా దుకాణ యజమాని ఫోన్‌ నెంబర్‌ సైతం తీసుకొని బేర సారాలు ఆడటం మొదలపెట్టారు. దుకాణ యజమాని పనిపై బయట ఊరు వెళ్తానని చెప్పగా ఊరు వెళ్లడం వాయిదా వేసుకోవాలని, సాయత్రం వచ్చి మాట్లాడుతానని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది.

 • ప్లాస్టిక్‌ రహిత అమలు బృందాలు పని ఏంటీ..?
  విశాఖ పాస్టిక్‌ రహిత నగరంగా చూడాలని జీవీఎంసీ ఉన్నతాధికారులు గతనెల ప్రారంభంలో సుమారు రూ.2కోట్లు ఖర్చు చేసి 10వాహనాలను ప్రారంభించారు. ఎనిమిది జోన్‌లకు 8వాహనాలను కేటాయించి రెండు వాహనాలను రిజర్వుగా ఆర్‌ఎఫ్‌వో కార్యాలయం వద్ద ఉంచారు. దీనికి గాను జీవీఎంసీ ప్రాంతీయ అగ్నిమాపకాధికారి కో`ఆర్డీనేటర్‌గా వ్యవరిస్తారు. 36మంది వాలంటీర్‌లను ఈ విభాగంలో ఉపయోగించుకోవడానికి ఒప్పందం కుదుర్చుకొని ఎంపిక చేశారు. అందులో ఒక వాలంటీర్‌ టీం లీడర్‌గా వ్యవరించి మరో 35మంది సభ్యులు నలుగురు చొప్పున ఎనిమిది వాహనాల్లో తమకు కేటాయించిన జోన్‌ పరిధిలో తిరుగుతూ ప్లాస్టిక్‌ కవర్లు, ఒక్కసారి ఉపయోగించే ప్లాస్టిక్‌ వస్తువులు వలన కలిగే ప్రమాదాలను వివరిస్తూ అవగాహన పరచాలి. అవగాహన కల్పించిన వ్యాపారస్తుడు మరోమారు స్పందించకపోతే అక్కడ లభ్యమయ్యే ప్లాస్టిక్‌ కవర్ల సామర్థ్యాన్ని బట్టి జరిమానాలు విధించాలి. అదీ కూడా ఆన్‌లైన్‌ పద్ధతిలో రశీదు పొందుతూ నగదు చెల్లించాలి. ఈ బృందాలకు వాలంటీర్‌గా నెలవారీ వచ్చే రూ.5వేలతో పాటుగా ఈ బృందంలో పనిచేస్తున్నందుకు మరో రూ.10వేలు అదనంగా గౌరవ వేతనం ఇస్తున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడిరచారు. పైగా ఈ బృందాలు రోజువారీ తిరగడానికి ఒక్కొక్క వాహనానికి నెలకు 140 లీటర్లు డీజిల్‌ చొప్పున పది వాహనాలకు రూ.1,37,620 ఖర్చు చేస్తున్నారు. ఈ బృందాలకు రోజువారీ సూచనలు, సలహాలు, శిక్షణ ఇచ్చి వ్యాపారులతో సక్రమంగా నడుచుకునేందుకు అవసరమైన అంశాలతో పాటుగా పనితీరు, ప్రయాణించే ప్రదేశాలు, విధులు వంటి వాటిని జీవీఎంసీ ప్రాంతీయ అగ్నిమాపక అధికారి చూసుకుంటారు.

 • విధులకు దూరంగా విలాశాలకు దగ్గరగా..!
  పాస్టిక్‌ రహిత అమలు బృందాలుగా గుర్తింపు పొందిన బృందాలు విధులు నిర్వహించడంలో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తుంది. నలుగురు చొప్పున ఏసీ కారులో దర్జాగా బీచ్‌లు, పార్కుల్లో చక్కర్లు కొడుతూ కనిపిస్తున్నారు. వీవీఐపీలకు కేటాయించే పోలీసు అధికారులకు ఎక్కడా కూడా తీసుపోయే విధంగా ఈ వేషధారణ ఉండటంతో దుకాణాల్లో ఒక్కసారిగా చొరబడి సినీఫక్కి తరహాలో చొరబడి చిరు వ్యాపారులపై దాడులు నిర్వహిస్తున్నారు. కనీస ఉద్యోగ భద్రత లేని వ్యవస్థకు అన్ని అధికారులు ఇస్తే..? అనే విధంగా ఈ బృందాలు నగర రహదారులపై చెలరేగిపోతున్నాయి.
 • అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటాం..!
  ఈ బృందాలు నియమించడంలో ప్రధాన ఉద్ధేశం విశాఖ అభివృద్ధి. ప్లాస్టిక్‌ రహిత నగరంగా ఉండాలని ఇంత ఖర్చు చేసి ఈ తరహాలో పనిచేస్తున్నాం. సిబ్బంది ఇప్పటి వరకు అవినీతికి పాల్పడినట్టు సమాచారం లేదు. విధులు నిర్వహించడంలో సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. తమకు ఫిర్యాదులు ఇస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం. -యాగంటి హనుమంత్‌రావు (ప్రాంతీయ అగ్నిమాపక అధికారి, జీవీఎంసీ).

 

GovernmentPolitical

రూ.62.56లక్షలకే ఆశీల పాట..! పూర్ణామార్కెట్ లో రింగులాట..!

 •  సిబ్బంది సాయంతో రూ.కోట్ల సొమ్మును రూ.లక్షలకే కట్టుదిట్టం చేసిన రింగ్‌ మాస్టార్‌లు..
 •  స్టాండిరగ్‌ కమిటీకి తప్పుడు లెక్కలు చూపించి కైవసం చేసుకోవడానికి జోరు ప్రయత్నాలు..
 •  గత కొన్నేళ్లుగా డమ్మీ డీడీలు చెల్లించి ఒక్క రోజులో లక్షల సంపాధిస్తున్న డమ్మీ గుత్తేదారుడు..
 •  స్థానిక కార్పొరేటర్‌ బృందానికి రూ.11లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న రింగ్‌ మాస్టార్‌..
 •  పూర్ణామార్కెట్‌ ప్రధాన వర్తక సంఘానికి సైతం ముడుపులు చెల్లించడానికి గ్రీన్‌ సిగ్నెల్‌..
 •  చోటా నాయకుడితో పాటుగా ఓ విలేఖరికి రూ.లక్షల్లో సొమ్మును ఎరవేసిన మాస్టార్‌ మైండ్‌..
 •  అనుమతి పత్రాలు లేకుండానే ఆశీల కలెక్షన్‌ ప్రారంభించిన గుత్తేదారుల బృంద సభ్యులు..
 •  జీవీఎంసీ ఆదాయానికి గండి కొడుతున్న చోద్యం చూస్తున్న జీవీఎంసీ ఉన్నతాధికారులు..

 

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం : జీవీఎంసీకి రూ.కోట్ల ఆదాయాన్ని అందించే ప్రధాన ఆస్తుల్లో పూర్ణా మార్కెట్‌ (సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మార్కెట్‌) ఒక్కటిగా నిలవడం అందరికీ తెలిసిన విషయమే.. అటువంటి మార్కెట్‌ను రూ.లక్షలకే అప్పనంగా అంటగట్టడానికి చేసిన ప్రయత్నాలు ఫలించాయని అందరూ అనుకుంటున్నారు. ఏడాదికి ఓ బినామీని వేలం పాటలో నిలబెట్టిన ఓ రింగ్‌ మాస్టార్‌ ఒకవైపు.. గత కొన్నేళ్లుగా డమ్మీ డీడీలను చెల్లించి పాటలో హడావుడి చేసి ఒక్క రోజులో రూ.లక్షల లాభంతో పక్కదారి పట్టించే డమ్మీ గుత్తేదారుడు మరోవైపు.. ఆడిన రింగులాటకు జీవీఎంసీ అధికారుల సైతం కంగు తిన్నారంటే ఆశ్చర్య పడనవసరం లేదు. ప్రతీ ఏడాది జీఎస్‌టీతో కలుపుతూ రూ.కోటికి పైగా ఆదాయాన్ని అందించే పూర్ణామార్కెట్‌ ఈ ఏడాది జీఎస్‌టీతో కలిపినా గత పదేళ్లలో సర్కారు వారి పాట మొత్తానికి సైతం సరి తూగడానికి వీలు లేని విధంగా రూ.74.44లక్షలకు రింగు అయిపోయి జీవీఎంసీ ఆదాయాన్ని పక్కదారి పట్టించారని స్పష్టంగా కనిపిస్తుంది. పూర్ణామార్కెట్‌ ఆశీలకు సంబంధించి బహిరంగ వేలం పాటను నిర్వహిస్తున్నామని ప్రకటించగానే ఓ డమ్మీ గుత్తేదారుడు బ్యాంక్‌కు నేరుగా వెళ్లి డీడీలు చెల్లించి పాటలో కూర్చొని ఎదుట గుత్తేదారుడితో ముందుగా రింగు అయిపోయి రూ.లక్షలతో ఉన్న బ్యాగ్‌ను తీసుకొని వెళ్లిపోయే తీరు ఒకటైతే.. ప్రతీ ఏడాది ఓ కొత్త వ్యక్తిని రంగంలోకి దింపి పాటను కైవసం చేసుకున్న గుత్తేదారుడి తీరు మరొకటి. ఈ క్రమంలో గత ఏడాది 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.45లక్షలు చెల్లించి బ్యాంక్‌ గ్యారెంటీ ఇవ్వలేదని రెండు నెలల పది రోజులకే శుభం కార్డుతో పక్కకు వచ్చేసిన బృందం ఈ ఏడాది ఎందుకు పాటకు రాలేదని ఆలోచిస్తే.. గత ఏడాది నష్టపోయిన సొమ్ము ఈ గుత్తేదారుడి వద్ద వసూలు చేసుకొని లాభం పొందడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని అక్కడ ఎంతగా రింగులు తిప్పారో చెప్పడానికి మాటలు సరిపోవడం లేదంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. రూ.60లక్షలకు సర్కార్‌ వారి పాటను ప్రారంభిస్తే రూ.పది వేల చొప్పున పెంచుతూ రూ.62.40లకు వచ్చిన గుత్తేదారులు జీవీఎంసీ అధికారులు అంగీకరించక పోవడంతో పాటను రూ.5వేల చొప్పున పెంచుతూ రూ.62.50లకు చేర్చారు. అక్కడ నుంచి కొత్త నాటకానికి ఆరంభం పలికి రూ.వెయ్యి చొప్పున పెంచుతూ రూ.62.55లపై రూ.1వెయ్యి అదనంగా వేసి రూ.62.56కి పాటను కైవసం చేసుకోవడం ఆస్కార్‌ నటనకు అద్దం పట్టినట్టు కనిపించింది. రూ.62.55లక్షలను చెల్లించడానికి సిద్ధమైన గుత్తేదారుడు వెయ్యి రూపాయల తేడాతో ఎదుట గుత్తేదారుడికి పాటను వదిలి పెట్టడం వెనుక రింగులాట ఎంత చక్కగా ఆడారో ఇట్టే అర్థం అయిపోతుంది.

 

 

 •  అంగీకారం తెలపకుండానే అనధికార వసూలకు పాల్పడుతున్న గుత్తేదారులు..
  ఈనెల 20న జీవీఎంసీకి సంబంధించిన పూర్ణామార్కెట్‌, రామకృష్ణ కూరగాయల మార్కెట్‌ని బహిరంగ వేలం వెయ్యగా.. సంబంధింత గుత్తేదారునికి జీవీఎంసీ జోన్‌-4 అధికారులు అంగీకర పత్రాలు ఇవ్వకుండానే అనధికార వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు వ్యాపారులు బోరుమంటున్నారు. దీనిపై సంబంధిత అధికారులను వివరణ కోరగా అటువంటి చేష్టలకు పాల్పడితే చట్టరిత్య చర్యలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడిరచారు. ఈ ప్రాంతంలో నిత్యం అధికంగా ఆశీలు వసూళ్లు, దాడులకు పాల్పడుతున్నారని ఇప్పటికే పలుమార్లు సంబంధిత పోలీసులకు ఫిర్యాదులు అందించగా అది జీవీఎంసీ అధికారులు చూడాలని స్థానిక పోలీసులు ఉచిత సలహాలు ఇస్తున్నారని పలువురు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో గుత్తేదారుల అండ చూసుకొని అనధికారికంగా రహదారిపై వ్యాపారాలు చేస్తున్న కొందరు వ్యాపారులు వినియోగదారులపై దాడులు చేసిన ఘటనలు ఉన్నా అటుగా పోలీసులు, జీవీఎంసీ అధికారులు స్పందించక పోవడం గుత్తేదారులకు ఇష్టానుసార అధికారాలు ఇవ్వడమేనని పలువురు ఆగ్రహిస్తున్నారు.

 

 • రింగు అవ్వడంతో గుత్తేదారుడికి రూ.17.50లక్షలు చెల్లింపులు అంచనా..?
  జీవీఎంసీకి చెందిన పూర్ణామార్కెట్‌, రామకృష్ణ కూరగాయల మార్కెట్‌ బహిరంగ వేలం వెయ్యడం వలన జీవీఎంసీకి వచ్చే ఆదాయం కంటే పాటలో రింగుగా అయిన వ్యక్తికి సొమ్ము ఇవ్వడం, స్థానిక కార్పొరేటర్‌కి, అక్కడే ఉన్న చోటా మోటా నాయకులు, మార్కెట్‌ సంఘ నాయకులు, విలేకరులు, జీవీఎంసీ అధికారులు, సిబ్బందికి చెల్లించాల్సిన సొమ్ము రూ.లక్షల్లో ఉంటుందని గుత్తేదారుడు మాటలు వింటే ఇట్టే అర్థం అయిపోతుంది. తనకు వచ్చే ఆదాయంలో సగ భాగం ఆమ్యామ్యాలు ఇవ్వడానికే సరిపోతుందని ఓ గుత్తేదారుడు వెల్లడిరచాడంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత ఏడాదిలో వేలం పాట కైవసం చేసుకొని సుమారు 17లక్షల వరకు నష్టపోయిన ముగ్గురు వ్యక్తులకు (ముందుగా రింగు అయినందుకు) రూ.11లక్షలు, జీవీఎంసీ అధికార, సిబ్బందికి రూ.2.50లక్షలు, మార్కెట్‌ సంఘ సభ్యులకు రూ.1.50లక్షలు, ఓ విలేకరికి సుమారు రూ.2లక్షలు, స్థానిక చోటా మోటా నాయకుడికి రూ.50వేలు చొప్పున చెల్లించడానికి గుత్తేదారుడు ఒప్పందం సైతం చేసుకున్నాడని విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారంలో మరికొంత మంది హాజరవ్వడంతో కైవసం చేసుకున్న పాటను సైతం వదులు కోవడానికి కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తున్నారని కూడా విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా జీవీఎంసీకి రూ.కోట్లలో రావల్సిన ఆదాయాన్ని గండికొట్టి రూ.లక్షల్లో తీసుకొస్తున్న ఘనత జీవీఎంసీ అధికారులకే చెల్లింది.

 

 •  అధిక ధరలు, అనధికార వస్సూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవ్‌..!
  జీవీఎంసీ బహిరంగ వేలం పాట నిర్వహించి రెండు రోజులు కూడా గడవక ముందే మార్కెట్‌ల్లో అనధికార వసూళ్లుకు పాల్పడటం, రహదారులపై ఎగుమతి దిగుమతులకు వాహనాలు చెల్లించే ఆశీలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ఇప్పటికే అక్కడ నియమించిన సంబంధిత సిబ్బందికి హెచ్చరించడం జరిగింది. గుత్తేదారులు కూడా అనుమతులు ఇవ్వకుండా వసూళ్లకు పాల్పడితే ముందుగా ఇచ్చిన డీడీలను రద్దు చేసి వేలం పాటను రద్దు చేయడం జరుగుతుంది. పైగా స్థానిక పోలీసులకు ఫిర్యాదులు అందించి చట్టరిత్య చర్యలు తీసుకుంటాం. జీవీంఎసీ ఆస్తుల్లో ఏ ఒక్కరైన చొరబడి వసూళ్లకు పాల్పడిన చట్టరిత్య చర్యలు తీసుకో బడతాయి. ఈ మధ్య వేసిన వేలం పాట స్టాండిరగ్‌ కమిటీకి పంపించాం. అక్కడ నుంచి అంగీకారం వస్తేనే గుత్తేదారులకు అనుమతి పత్రాలు ఇస్తాం. అంత వరకు వసూళ్లు చేయడానికి ఏ ఒక్కరికి ఎటువంటి అధికారం లేదు. అక్రమ వసూళ్లకు పాల్పడితే వెంటనే జోనల్‌ కార్యాలయంలో ఫిర్యాదులు చెయ్యండి చర్యలు తీసుకుంటాం. కె.శివ ప్రసాద్‌ (జోనల్‌ కమిషనర్‌, జోన్‌-4 కార్యాలయం).
Government

అభివృద్ధి పనులు పరిశీలించిన ఆదిమూలపు

నేత్ర న్యూస్, విశాఖపట్నం : ఈ నెల 28, 29 తేదీలలో జరుగనున్న జి-20 సదస్సు కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి విశాఖ నగరానికి విచ్చేస్తున్న ప్రతినిధులను, అతిధులను ఆకట్టుకునేలా విశాఖ నగరాన్ని సుందరీకరణ పనులను మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి, జీవీఎంసీ కమిషనర్ పి.రాజబాబు, డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్, అధికారులు తో కలిసి మేయర్ గొలగాని హరి వెంకట్ కుమారి పర్యటించి పరిశీలించారు. దీనిలో భాగంగా మాధవధారలో ఉన్న పంప్ హౌస్ కు చేరుకొని దీని ద్వారా 24/7 నీటి సరఫరా ఆ ప్రాంత ప్రజలకు నిరాటంకంగా అందించడం జరుగుతుందని, నీటి సరఫరాలో ఎక్కడ అంతరాయాలు లేకుండా వున్నాయని, ఎలక్ట్రికల్ సిస్టం ద్వారా లైన్ లోకి వెళ్లకుండానే తాగునీరు ఆపే విధానం తోపాటు ఎక్కడైనా లేఖలు ఉన్నట్లయితే త్రాగునీటి వృధా అవకుండా సిస్టం ద్వారా తెలుసుకొని అరికట్టవచ్చని ఈ పంప్ హౌస్ ఎ.డి.బి. నిధులతో ఏర్పాటు చేయడమైనదని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వారికి వివరించి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ కు తెలిపారు. అనంతరం మూఢసరలోవ రిజర్వేయర్ లో ఉన్న సోలార్ ప్రాజెక్ట్ లను ఏర్పాటు చేసి, విద్యుత్ ను ఆదా చేయడమే కాకుండా, కాలుష్యాన్ని నివారిస్తూ, ఆర్ధిక లాభం జివిఎంసి పొందుతుందన్నారు. 24 గంటలు ప్రజలకు మంచి నీటి సరఫారాను అందించడం జరుగుతుందన్నారు. వేస్ట్ వాటర్ ను రీసైక్లింగ్ చేయడం ద్వారా వచ్చిన మంచి నీటిని నగరంలో గల పరిశ్రమలకు సరఫరా చేయడం ద్వారా జివిఎంసి కు ఆదాయం చేకూరుతుంది అని మంత్రి ఆదిమలకు సురేష్ కు అధికారులు వివరించారు. జి.20 సంబంధించి అభివృద్ధి పనులను, సుందరీకరణ పనులను ఆయన పరిశీలించి త్వరితగతిన పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. విశాఖ నగరాన్ని టాప్ -10 సిటీలలో ఒక సిటీగా ఉండేటట్లు తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పమని, ఆయన ఆదేశాల మేరకు విశాఖ నగరాన్ని మరింత సుందర నగరంగా అభివృద్ధి చేయడంతో పాటు పరిపాలన రాజధానిగా తీర్చిదిద్దాలనే స్థాయికి విశాఖ నగరం ముస్తాబ్ అవుతుందని తెలిపారు.

అనంతరం సీత కొండ బీచ్ వద్ద వ్యూ పాయింట్ ను పరిశీలించారు ఈ వ్యూ పాయింట్ను డాక్టర్ వైఎస్ఆర్ వ్యూ పాయింట్గా (సీతకొండ) దగ్గర అనే నామకరణం చేసేందుకు ప్రతిపాదనలను మంత్రి ఆదిమలకు సురేష్, గుడివాడ అమర్నాథ్ కు తెలియజేశారు. ఈ సదస్సు నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కార్పొరేటర్లు రొయ్యి వెంకటరమణ, కె స్వాతి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Government

జోన్‌-4 టౌన్‌ ప్లానింగ్‌ కార్యదర్శిల చేతివాటం

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం: జీవీఎంసీ జోన్‌-4లో పట్టణ ప్రణాళిక కార్యదర్శిలు చేతివాటం చూపిస్తూ చెలరేగిపోతున్నారు. తాము చేసిందే చట్టంగా వార్డు స్థాయిలో ఇష్టానుసారంగా వ్యవరిస్తున్నారు. గతంలో చైన్‌మాన్‌లు చేసిన అవినీతికి ఏ మాత్రం తగ్గకుండా జోన్‌-4 టౌన్‌ ప్లానింగ్‌ పరువుని నిలబెడుతున్నారు. ఇన్‌ఛార్జీ ఏసీపీ, టీపీవోగా వ్యవరిస్తున్న అధికారి, తన కింద టీపీఎస్‌ స్థాయి సిబ్బంది సైతం ఉన్నా ఇటుగా ఒక్కసారి కూడా తొంగి చూడలేదంటే భవన యజమానులు అక్కడికి ఎన్ని ముడుపులు పంపించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనుమతులు లేకుంటే విద్యుత్తు, మంచి నీరు వంటి సధుపాయాలు ఇవ్వడం కుదరదని జీవీఎంసీ కమిషనర్‌ ఇప్పటికే ప్రకంటించినా అటుగా ఏ ఒక్కరూ పట్టించుకోక పోవడంపై సర్వత్ర విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. దిగువ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శిలు రూ.లక్షలకు కక్కుర్తి పడి భవన యజమానులకు వత్తాసు పలుకుతున్నారు. 36వ వార్డులో గత కొన్ని నెలలుగా అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం పరిస్థితిపై సంబంధిత పట్టణ ప్రణాళిక కార్యదర్శి విట్టల్‌ను ఆరా తియ్యగా.. కాకమ్మ కబుర్లు చెప్పుతూ తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇప్పటికే రూ.లక్షలాది సొమ్మును తన ఖాతాలో వేసుకొని ఆ వార్డులో ఇన్‌ఛార్జీ మాత్రమే చేస్తున్నాను. పూర్తిస్థాయిలో సమాచారం కావాలంటే భవనం వద్దకు వెళ్లి తెలుసుకొండి అని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇదే క్రమంలో 35వ వార్డు వెలంపేటలో నిర్మిస్తున్న మరో భారీ భవనానికి సంబంధించి సంబంధిత పట్టణ ప్రణాళిక కార్యదర్శి శ్వేతని వివరణ కోరగా ఆ భవనానికి పూర్తిస్థాయి అనుమతులు ఉన్నాయని, ఎటువంటి అదనపు అంతస్తులు నిర్మించలేదని మసిబూసి మారేడుకాయ మాటలతో తప్పించుకుంటున్నారు. ఈమెకు కూడా పెద్ద మొత్తంలో సొమ్ములు ముట్టాయని, పైగా ఓ కార్పొరేటర్‌ నిర్మిస్తున్న భవనం కావడంతో తానే దగ్గరుండి అక్రమ నిర్మాణానికి సంబంధించి అన్ని పనులు చూసుకుంటున్నారని సమాచారం.

 

 • టౌన్‌ ప్లానింగ్‌లో అందరికీ సమాన వాటాలు..

జోన్‌-4 పట్టణ ప్రణాళిక విభాగంలో అందరికీ సమాన వాటాలు ఉంటాయని సంబంధిత కార్యాలయంలో గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. గతంలో ఛైన్‌మాన్‌లు చేసిన పనులను ఇప్పుడు నేరుగా టౌన్‌ ప్లానింగ్‌ సెక్రటరీలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. జోనల్‌ కార్యాలయంలో ఉండే అధికారులకు ఓ రేటు.. తమకు మరో రేటును ముందస్తుగానే ఒప్పందం చేసుకొని దండీగా దండుకుంటున్నారు. ఈ వ్యవహారంలో నకిలీ విలేకరులు కలుగజేసుకొని ఆరా తీస్తే వాళ్లకు కొంత సొమ్మును కట్టబెట్టి నిర్మాణాలను శెరవేగంగా కట్టుకుంటున్నారు.

 

 • నకిలీ ఇంటి ప్లాన్‌లతో అక్రమ నిర్మాణాలు..

వార్డు స్థాయిలో ఓ అక్రమ నిర్మాణం నిర్మించాలంటే మొదటిగా జీవీఎంసీ నుంచి అనుమతి పొందిన సర్వేయర్‌లు నకిలీ ప్లాన్‌లను తయారు చేసి ఓ కోడిరగ్‌ పద్ధతిలో సంబంధిత టౌన్‌ప్లాన్‌ంగ్‌ అధికారికి అందిస్తున్నారు. అక్కడ నుంచి ఇరు వర్గాల మధ్య రహస్య సమావేశాలను ఏర్పాటు చేసి ఒప్పందం చేసే వరకు పూర్తి బాధ్యత సర్వేయర్‌లే తీసుకుంటారు. ఆ తరువాత ప్లానింగ్‌ సెక్రటరీ ద్వారా మరోమారు దాడి చేసి మరోమారు రూ.లక్షల సొమ్మును రుచి చూస్తారు. అక్కడితో వదిలిపెట్టకుండా ప్లానింగ్‌ కార్యదర్శి మరికొంత సొమ్ము తీసుకొని చూసి చూడనట్టు వార్డులో వ్యవరిస్తారు.

GovernmentPolitical

పూర్ణామార్కెట్‌ పరువు తీస్తున్నారు

 •  మార్కెట్‌ వినియోగదారులపై రెచ్చిపోతు దాడులకు పాల్పడుతున్న నకిలీ వ్యాపారులు.. 
 • నిత్యం పలు ఘటనలు జరుగుతున్నా అటుగా పట్టించుకోని పూర్ణామార్కెట్‌ వర్తక సంఘం..
 •  పోలీసు కుటుంబాలపై విరుచుకుపడుతున్న వ్యాపారులను దండిరచని స్థానిక పోలీసులు..
 • పూర్ణామార్కెట్‌పై పలు ఫిర్యాదులు ఇస్తున్నా నేటికి పట్టించుకోని జోన్‌`4 జోనల్‌ కమిషనర్‌..

నేత్రన్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి): హెయిర్‌ పిన్‌ నుంచి ఏరోప్లేన్‌కి ఉపయోగపడే సామాగ్రికి సైతం ఆతిథ్యం అందిస్తున్న పూర్ణామార్కెట్‌ ఇప్పుడు అభాసు పాలవుతుంది. కొంత మంది నకిలీ వ్యాపారులు చేస్తున్న చేష్టల వలన వినియోగదారులు అటుగా రావడానికి సైతం సతమతం అవుతున్నారు. స్థానిక పోలీసు యంత్రాంగం, అద్దెలు వసూలు చేస్తున్న జీవీఎంసీ ఉన్నతాధికారులు అటుగా చర్యలు తీసుకోక పోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని పలువురు వినియోగదారులు బోరుమంటున్నారు. రహదారిపై అనధికారికంగా తిష్టవేసి అక్రమ వ్యాపారాలు చేస్తున్న నకిలీ వ్యాపారుల వలన నిత్యం నరకయాతన పడుతున్నామని రోజువారీ వచ్చే వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ధరలు వ్యత్యాసంపై బేరాలు ఆడితే బెధిరింపులకు పాల్పడుతున్నారని, భయంతో బదులు ఇస్తే కత్తులు బయటకు తీసి దాడులకు పాల్పడుతున్నారని ఓ బాధితురాలు భయంతో సమాధానం ఇచ్చింది. పెద్ద పెద్ద దుకాణాల నుంచి చిన్నపాటి జంగిడీల వరకు సుమారు 600దుకాణాలకు ఆశ్రయం ఇచ్చిన పూర్ణామార్కెట్‌కి ఇప్పుడు పరువు పోతుంది. 92ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఘటనలు భయాందోళన కల్గిస్తున్నాయి. రెండు నెలల క్రితం జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్న ఓ జడ్జి కుటుంబం మార్కెట్‌కి వచ్చి పోయే సమయంలో ఓ వ్యాపారి జడ్జిపై అసభ్యకరంగా మాట్లాడటంతో పాటుగా దాడికి ప్రయత్నించడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందించారు. ఇదే క్రమంలో రెండు రోజుల క్రితం ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీసు భార్య కూరగాయలు కొనుగోలు నిమిత్తం మార్కెట్‌కి వచ్చి వెళ్లే క్రమంలో ఆమెపై స్థానికంగా ఉన్న ఓ మహిళా వ్యాపారి అసభ్యకరమైన పదజాలంతో రెచ్చిపోవడంతో పాటుగా చేతిలో ఉన్న చిన్నపాటి కత్తితో బెధిరింపులకు పాల్పడటంపై పలువురు నుంచి తీవ్ర విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి ఘటనల నేపథ్యంలో రెండు నెలల క్రితం మార్కెట్‌ లోపలి భాగంలో వ్యాపారాలు చేస్తున్న యజమానులు మార్కెట్‌కి స్వచ్ఛందగా బంద్‌ని ప్రకటించిన నేటికి ఎటువంటి ఫలితం లేకపోయింది. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న జోన్‌-4 జోనల్‌ కమిషనర్‌ విధులు సక్రమంగా నిర్వర్తించకుండా చోద్యం చూడటంతో పూర్ణామార్కెట్‌కి ఈ పరిస్థితి పట్టిందని ఓ వృద్ధ వ్యాపారి ఆరోపించారు.

 • మార్కెట్‌ విషయంలో జోనల్‌ కమిషనర్‌ ఫెయిల్‌..
  ఏడాదికి రూ.కోట్ల ఆదాయాన్ని జీవీఎంసీకి అందిస్తున్న పూర్ణామార్కెట్‌ పరువు తీయడంలో స్థానిక జోన్‌`4 జోనల్‌ కమిషనర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారని పలువురు వ్యాపారులు, వినియోగదారులు ఆరోపిస్తున్నారు. మార్కెట్‌లో సమస్యలు అధిగమిస్తున్నాయని పలుమార్లు జీవీఎంసీ జోనల్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసే వ్యాపారులను కాసంత కూడా కనికరించకుండా వదిలిపెట్టడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. పూర్ణామార్కెట్‌లో సమస్యల పరిష్కారం దిశగా స్వచ్ఛందంగా బంద్‌ని ప్రకటించి రహదారులపై బెఠాయిస్తే బిచ్చగాళ్లు మాదిరి చూసి వెళ్లిపోయారని మండి పడ్డారు. స్థానిక నాయకుల బూటకపు మాటల మాటున న్యాయం చేయకుండా చోద్యం చూశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారులపై వ్యాపారాలను పెట్టకూడదని తూతూ మంత్ర మాటలతో అటుగా కనిపించకుండా మాయమైపోయారని పలువురు వ్యాపారులు మండి పడుతున్నారు. ఫిర్యాదు ఇచ్చే వ్యాపారులపై ఎదురు దాడి చేసి మీరు ముందు వ్యాపారాలను సక్రమంగా చేయండి లేకపోతే దుకాణాలను రద్దుచేసి వెనక్కి తీసుకుంటామని బెధిరించారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 • జీవీఎంసీ కౌన్సిల్‌ సైతం చోద్యం చూస్తుంది..
  జీవీఎంసీకి అధిక ఆదాయాన్ని అందించే పూర్ణామార్కెట్‌ ఇప్పుడు చిల్లర వసూలకు మాత్రమే పరిమితం అవ్వడానికి జీవీఎంసీ కౌన్సిల్‌ పెద్దలే కారణమని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. పూర్ణామార్కెట్‌లో సమస్యలను జీవీఎంసీ మేయర్‌ దృష్టికి తీసుకెళ్తే అటుగా పట్టించుకోవడంలో చిన్న ప్రయత్నం కూడా చేయలేదని మండి పడుతున్నారు. మూడు రోజుల్లో మార్కెట్‌ రహదారులపై అక్రమ వ్యాపారాలను తొలిగిస్తామని హామీ ఇచ్చి మూడు నెలలు గడుస్తున్నా ఏ ఒక్కరూ అటుగా కనిపించకపోవడం సిగ్గుచేటు అని వ్యాపారులు హేళన సైతం చేస్తున్నారు. స్థానిక కార్పొరేటర్‌ చెప్పిన బూటకపు మాటలతో మార్కెట్‌ని గాలికి వదిలిపెట్టడం వలన రూ.కోట్ల ఆదాయాన్ని జీవీఎంసీ కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 • ఒకరిపై ఒకరు చెప్పుతూ తప్పించుకుంటున్నారు..
  మార్కెట్‌ చుట్టు పక్కల రహదారులపై రాకపోకలు సాగించే సమయంలో వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, స్థానిక ట్రాఫిక్‌ పోలీసులకు ఫిర్యాదులు అందిస్తే.. ఆ పని జీవీఎంసీ, శాంతిభద్రత పోలీసులకు సంబంధించిందని ఓ ట్రాఫిక్‌ అధికారి వెల్లడిరచారు. ఇక శాంతిభద్రతల అధికారుల దృష్టికి ఆ సమస్యను తీసుకెళ్తే జీవీఎంసీకి చెందిన మార్కెట్‌లో జీవీఎంసీకి, రహదారిపై సమస్య ఉందని ట్రాఫిక్‌ పోలీసులకు చెందుతుందని అక్కడి అధికారులు సమాధానం ఇచ్చారు. ఇక అద్దెలు వసూలు చేస్తున్న జీవీఎంసీ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తే స్థానిక పోలీసులు చేయాల్సిన పనులు మేము ఎలా చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని పలువురు వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జీవీఎంసీ, పోలీసు ఉన్నతాధికారులు స్పందించి దిగువ స్థాయిలో సిబ్బంది చేస్తున్న లాలూచీ పనులకు శుభం కార్డు వేయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

GovernmentPolitical

పూర్ణామార్కెట్‌ సంపూర్ణ బంద్‌

  • పార్కింగ్‌ స్థలంలో అక్రమ వ్యాపారులకు వ్యతిరేకంగా నిరసన..
  • సమస్యల పరిష్కారం దిశగా వ్యాపారుల రహదారిపై ఆందోళన..
  • సానుకూలంగా స్పందించిన జీవీఎంసీ, పోలీసు విభాగాలు..
  • రోడ్డుపై వ్యాపారాలు చేస్తే జరిమానాలు తప్పవని హెచ్చరిక..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : పూర్ణామార్కెట్‌ పార్కింగ్‌ ప్రాంతంలో అక్రమంగా చేస్తున్న వ్యాపారాలను వెంటనే తొలిగించి తమకు న్యాయం చేయాలని సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మార్కెట్‌ వర్తక సంఘం ఆధ్వర్యంలో పూర్ణామార్కెట్‌కి బుధవారం సంపూర్ణ బంద్‌ని ప్రకటించి నిరసన చేపట్టారు. ఉదయం ఆరు గంటల సమయంలో రహదారిపై బైఠాయించిన వ్యాపారులు సంబంధిత అధికారులు హామి ఇచ్చే వరకు నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. అనంతరం మార్కెట్‌ ఆవరణంలో వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సందర్భంగా సంఘ అధ్యక్షుడు కొండా రామకృష్ణ మాట్లాడుతూ పార్కింగ్‌ ప్రాంతంలో ఎటువంటి వ్యాపారాలకు అనుమతి లేదని, కొంత మంది కుట్రపూరిత చర్యల వలన రహదారులపై ఈ తరహా వ్యాపారాలు పెరిగిపోయాయని తెలిపారు. దీంతో తమ వ్యాపారాలు పూర్తి స్థాయిలో జరగడం లేదన్నారు. మార్కెట్‌ లోపలి భాగంలో వ్యాపారాలు లేక సంబంధిత వ్యాపారులు అప్పులలో మునిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటుగా సంబంధిత జీవీఎంసీ అధికారులకు, ట్రాఫిక్‌ పోలీసులకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ బంద్‌ని ప్రకటించి నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు.

 

 • న్యాయం కోసం స్వచ్ఛందంగా దుకాణాలకు తాళాలు..

మార్కెట్‌లో ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తున్న వ్యాపారులు అప్పులపాలైపోతుంటే కొత్తగా వస్తున్న నకిలీ వ్యక్తులు వ్యాపారులుగా మారీ రహదారులపై ఇష్టానుసారంగా వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని దండీగా సంపాధిస్తున్నారని మండి పడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన న్యాయం జరగకపోవడంతో దుకాణాలకు తాళాలు వేసి నిరసన తెలుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం స్వచ్ఛంగా దుకాణాలకు తాళాలు వెయ్యడం 92ఏళ్లలో మొదటసారి అని పలువురు వ్యాపారులు వెల్లడిరచారు. అధికారులు హామి ఇచ్చే వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతునే ఉంటామని నిరసన కార్యక్రమంలో నినాదాలు చేశారు. ఒక వైపు ఎండ తీవ్రత పెరుగుతున్న పట్టించుకోకుండా నిరసన జ్వలలను రేపారు.

 

 • పండగ సమయంలో సమస్యలు తప్పడం లేదు..

పూర్ణామార్కెట్లో నిత్యం వేలాది వినియోగదారులు వస్తుంటారు. పండగల సమయంలో అసలు చూడక్కర్లేదు. అలాంటిది అక్కడ సరైన పార్కింగ్ వసతి లేదు. కార్లు వస్తే నిమిషాల పాటు ట్రాఫిక్ జాం. ఒక్కోసారి దుకాణాల ముందే వాహనాలు నిలిపేస్తున్నారు. దీంతో తమకు ఇబ్బందులు తప్పడం లేదని, చిరు వ్యాపారులు సిండికేట్గా మారి తమపైనే దౌర్జన్యాలకు దిగు తున్నారని వాపోతున్నారు. పోలీసులు బీట్ కాస్తున్నా తమకు రక్షణ లేకుండా పోయిందని, జీవీఎంసీ అధికారులు అప్పుడప్పుడు మాత్రమే వచ్చి తనిఖీలు చేసుకుని వెళ్లిపోతున్నారని ఆరోపిస్తున్నారు. అత్యధిక ఆదాయం వచ్చే అలాంటి చోట అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో చెప్పాలని, మామ్మూళ్లు వసూలు చేసుకుని తమ పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.

 • రహదారిపై వ్యాపారాలు చేస్తే సహించం..

మార్కెట్‌ రహదారులపై వ్యాపారాలు నిర్వహిస్తే సహించేది లేదని, ఎవ్వరికి కేటాయించిన దుకాణాల్లో వాళ్లు వ్యాపారాలు చేసుకుంటే అందరు బాగుంటారని వెల్లడిరచారు. నిత్యవసర సరుకులు కొనుగోలుకు వస్తున్న వినియోగదారులపై నకిలీ వ్యాపారులు దాడులకు దిగడంతో మార్కెట్‌ పరువు పోతుందని, ఇప్పటికైనా శాంతిభద్రతల పోలీసులు స్థానికంగా బీట్‌ బుక్‌ పెట్టి వ్యాపారులకు రక్షణ కల్పించాలని ప్రాధేయ పడుతున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు కూడా బీట్‌ సిబ్బందిని పెంచి రహదారులపై వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులపై చర్యలకు సిద్ధం కావాలని కోరుతున్నారు. స్థానిక ప్రజా ప్రతినిథుల పైరవీలతో వ్యాపారాలు చేసినా సహించేది లేదని తేల్చి చెప్పారు. మరోసారి వ్యాపారాలు రహదారిపైకి వస్తే తాము తీసుకోవల్సిన చర్యలు తీసుకుంటామని వెల్లడిరచారు.

 

 •  నిరసనకు మంచి ఫలితం లభించింది..

మార్కెట్‌ వ్యాపారులు చేసిన నిరసన కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మార్కెట్‌ వర్తక సంఘ సభ్యులు వెల్లడిరచారు. స్థానిక శాంతిభద్రతల పోలీసులతో పాటుగా ట్రాఫిక్‌ పోలీసులు ఎంతో సహకరించారని వెల్లడిరచారు. జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌తో పాటుగా మేయర్‌ నుంచి కూడా మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. నిరసనకు సహకరించిన అందరికీ ధన్యవాదలు సైతం చెప్పారు.

GovernmentPolitical

టౌన్‌ ప్లానింగ్‌లో రింగ్‌ మాస్టర్‌లు

 • జోన్‌-4లో అక్రమ వసూలతో చెలరేగిపోతున్న ప్లానింగ్‌ సిబ్బంది..
 •  సిబ్బంది అండతో అక్రమ కట్టడాలను నిర్మిస్తున్న యజమానులు..
 • ఇన్‌స్పెక్టర్‌, చైన్‌మాన్‌లు, సెక్రటరీలు హెచ్చు తగ్గు వాటాలతో లబ్ధి.. 
 • కార్పొరేటర్‌ల అండతో భారీ నిర్మాణాలకు నకిలీ అనుమతులు..
 •  అదనపు అంతస్తులు నిర్మిస్తున్న పట్టించుకోని ఉన్నతాధికారులు..
 • ఉద్యోగులు లంచాలు తీసుకుంటున్న చోద్యం చూస్తున్న అనిశా..

 

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : జీవీఎంసీ జోన్‌-4లో టౌన్‌ప్లానింగ్‌ రింగ్‌ మాస్టర్‌లు రెచ్చిపోతున్నారు. వార్డు స్థాయిలో జీవీఎంసీ ఉన్నతాధికారుల పర్యావేక్షణ లోపంతో ఇష్టానుసారంగా అనధికార అంతస్తులతో భవనాలను నిర్మిస్తున్న యజమానులకు అండగా ఉంటూ దండుకుంటున్నారు. సక్రమంగా నిర్మించే భవనాలకు అనుమతులు ఇవ్వడానికి రూ.లక్షల్లో దండుకుంటున్న టౌన్‌ప్లానింగ్‌ అధికారులు అక్రమంగా అదనపు అంతస్తులతో నిర్మించే భవనాల వద్ద ఎంత మొత్తంలో వసూలు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాతనగరంలో గల పలు వార్డుల్లో తమదైన శైలిలో విరుచుకుపడుతూ టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది వీరంగం సృష్టిస్తున్నారని పలు సమాచార మార్గాల ద్వారా సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నా అటుగా పట్టించుకునే నాథుడే లేడని పలువురు ఆరోపిస్తున్నారు.

జోన్‌-4 టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో చాలా ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బంది తాము ఆడిరదే ఆటగా.. పాడిరదే పాటగా.. మారిపోయిందని, దీనికి తోడు కొత్తగా వచ్చిన వార్డు సచివాలయ సిబ్బంది తమదైన శైలిలో విధులు నిర్వహించకుండా బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌, చైన్‌మాన్‌ సిబ్బంది కనుసైగల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. దీనికి గాను అప్పనంగా వచ్చిన ఆమ్యామ్యాలు తీసుకొని తప్పించుకుంటున్నారు. ఇరుకు సందుల్లో నాలుగైదు అంతస్తులు నిర్మిస్తూ స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నా అటుగా సంబంధిత జీవీఎంసీ అధికారులు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం తీవ్ర విస్మయానికి గురిచేస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికైనా సంబంధిత జీవీఎంసీ ఉన్నతాధికారులు స్పందించి జోన్‌-4 టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది, వార్డు ప్లానింగ్‌ సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ప్రజల నుంచి రూ.లక్షలు కాజేస్తున్న కాటికాపరుల నుంచి ఇప్పటికైనా పూర్తి స్థాయిలో విముక్తి కల్పించాలని పలువురు ప్రజలు ప్రాధేయపడుతున్నారు.

 

 

 •  అవినీతిని అంతం చేయాల్సిన సిబ్బంది ఆజ్యం పోస్తున్నారు..
  పేద ప్రజలకు అందించే సేవల్లో ఎటువంటి అవినీతి జరగకూడదని, అవినీతిని అంతం చేయడానికి నూతన ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రవేశపెడితే ఆ వ్యవస్థలో సైతం అవినీతి బురద చేరిపోయింది. ముందున్న ముదురు సిబ్బంది వెళ్లే మార్గంలో సంబంధిత కార్యదర్శులను తీసుకెళ్లడంతో అవినీతిని అంతం చేయాల్సిపోయి ఆజ్యం పోస్తున్నట్టు తయారైయింది. చైన్‌మాన్‌లు నిర్ణయించిన ధరలో తమకు సైతం వాటా వస్తుందని అనధికార అదనపు అంతస్తులను చూసి చూడనట్టు వ్యవరిస్తున్నారు. తీరా ఆ నోటా.. ఈ నోటా.. అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారని ఒత్తిడి తీసుకొస్తే ఇప్పటికే నోటీసులు జారీ చేశామని చెప్పుతూ తప్పించుకొని తిరుగుతున్నారు. ప్రారంభంలో సెల్లార్‌ ఫ్లోర్‌లో ఖాళీగా దర్శనమిచ్చే ఫ్లోర్‌ ప్రస్తుతం గదులతో దర్శనమిస్తున్నాయని ప్రశ్నిస్తే వాటికి కూడా అనుమతులు ఉన్నాయని సర్వేయర్‌ల నుంచి తీసుకున్న నకిలీ పత్రాలు చూపిస్తూ తప్పించుకుంటున్నారు. జోన్‌ పరధిలో అవినీతి జలగలు ఉన్నంత వరకు అనుమతులు లేని అదనపు అంతస్తులు వస్తునే ఉంటాయని పలువురు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 • ప్లానింగ్‌ సిబ్బంది చెలరేగిపోతున్నారు..
  జోన్‌`4లో టౌన్‌ప్లానింగ్‌ చైన్‌మాన్‌లుగా కొనసాగుతున్న కొందరు వ్యక్తులు చేప్పిందే శాసనంగా తయారైయింది. వార్డుల్లో పర్యటించి అనధికార అంతస్తులు నిర్మిస్తున్న యజమానులతో ముందస్తుగా బేర సారాలు చేస్తున్నారు. తీరా అక్కడ వ్యాపారం తమ పరిధిలోకి రావడం లేదని గుర్తించిన వ్యక్తులు తమపై ఉన్న అధికారి సాయంతో అక్కడకు చేరుకొని వీరంగం సృష్టిస్తారు. ఆ సమయంలో బేరం కుదిరితే సరేసరి.. లేకపోతే యమభటులు మాదిరి పెద్ద పెద్ద సుత్తులు, గున్నపాములు తీసుకొచ్చి భవనాన్ని నేలమట్టం చేయడం ఇక్కడ ఆనవాయితీగా మారిపోయింది. జీవీఎంసీ గుర్తింపు పొందిన లైసెన్స్‌ సర్వేయర్‌లు ఇచ్చిన నకిలీ ప్లాన్‌లతో భవనాన్ని ప్రారంభించిన యజమానులు ఆశకు పోయి అదనపు అంతస్తులు నిర్మించడానికి రూ.లక్షలు వృథాగా ఖర్చుచేస్తున్నారు. ప్రభుత్వం బీపీఎస్‌ పద్ధతిని ప్రవేశ పెట్టకుండా అనధికార అదనపు అంతస్తులు నిర్మించడానికి టౌన్‌ప్లానింగ్‌ అధికార సిబ్బంది ఏ విధంగా అనుమతులు ఇస్తున్నారో అంతు చిక్కడం లేదని పలువురు హేలను చేస్తున్నారు. దీనిపై జీవీఎంసీ ఉన్నతాధికారులు స్పందించి చర్యలకు ముహుర్తం ఖరారు చేయకపోతే త్వరలో జీవీఎంసీనే తాకట్టు పెట్టే స్థాయికి ఈ టౌన్‌ప్లానింగ్‌ యంత్రాంగం సిద్ధమవుతుందని ఊహాగానం. ప్రజలను పట్టి పీడిస్తున్న వ్యవస్థపై అవినీతి నిరోధక శాఖ సైతం దృష్టి పెడితే అవినీతి జలగలు పుట్టల పుట్టలుగా పట్టుబడతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

 

 

 

 • సిబ్బంది చేష్టలకు చిర్రెత్తిపోతున్న ప్రజలు..

వార్డు స్థాయిలో విధులు నిర్వహించే టౌన్‌ప్లానింగ్‌ చైన్‌మెన్‌ సిబ్బంది చేస్తున్న చేష్టలకు పేద ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. జోన్‌-4 పరిధిలో పనిచేస్తున్న చైన్‌మాన్‌లు జీవీఎంసీ అనుమతి పొందిన సర్వేయర్‌లతో చేతులు కలిపి అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. తీరా బిల్డింగ్‌లకు అనుమతి ఉందా..? అని ప్రశ్నిస్తే అన్ని అనుమతులు ఉన్నాయని, సర్వేయర్‌ల నుంచి తీసుకున్న నకిలీ ప్లాన్‌లను చూపించి తప్పించుకుంటున్నారు. వార్డు పరిధిలో ఎక్కడ నిర్మాణం నిర్మిస్తున్న టౌన్‌ప్లానింగ్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందరూ పెళ్లికి వెళ్లినట్టు గుంపుగా వెళ్లి బేరసారాలు చేస్తున్నారు. అక్కడ వ్యతిరేక పరిణామాలు ఎదురైతే వెంటనే కన్నెర్ర చేసి నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. జోన్‌`4లో ఎన్నో ఏళ్ల తరబడి ఒకే విభాగంలో పాతుకుపోయిన టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది వార్డులో చేసిందే చట్టంగా మారింది. ఇప్పటికే రూ.లక్షలాది సొమ్మును దండుకున్న టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌, చైన్‌మాన్‌ సిబ్బంది ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టుకున్నారని జోన్‌-4లో విధులు నిర్వహిస్తున్న తోటి ఉద్యోగులే గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికైనా జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగంపై అవినీతి నిరోధక శాఖ దృష్టి కేంద్రీకృతం చేయాలని పలువురు ప్రజలు ప్రాధేయపడుతున్నారు.