Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
నేత్రన్యూస్, పోలాకి రవికుమార్, పత్యేక ప్రతినిధి: సింహాద్రి అప్పన్న భూములకు సంబంధించి ల్యాండ్ రెగ్యులరైజేషన్ సర్టిఫికేట్ (ఎల్‌ఆర్‌సీ) వివాదం ప్రధానంగా పంచగ్రామాలైన వేపగుంట, అడవివరం, చీమలపల్లి, పురుషోత్తపురం, వెంకటాపురం పరిధిలో ఉంది. సింహాచలం దేవస్థానానికి చెందిన సుమారు 12వేల ఎకరాల భూముల్లో తరతరాలుగా 13వేలకు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 1996లో అప్పటి పెందుర్తి, విశాఖపట్నం రూరల్ తహసీల్దార్లు ఈ భూములు సింహాచలం దేవస్థానానికి చెందినవని పేర్కొంటూ రైతువారీ పట్టాలు జారీ చేశారు. తరువాత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఐదు గ్రామాల్లోని స్థానికులు ఆక్రమించుకున్న భూములను క్రమబద్ధీకరించడానికి రెండు జీవోలు జారీ చేశారు. జీవో సంఖ్య 578 ద్వారా కొద్ది శాతం మంది నివాసితులు తమ భూములను క్రమబద్ధీకరించుకుని దేవస్థానం నుండి ఎల్‌ఆర్‌సీ పొందారు. అయితే చాలా మందికి ఎల్‌ఆర్‌సీలు లేకపోవడంతో తమ భూములను విక్రయించడం, రిజిస్ట్రేషన్ చేయలేక పోయారు. ఆ తరువాత 2014లో టీడీపీ ప్రభుత్వం మరో జీవో 296 ను జారీ చేసి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించింది. అయితే వైసీపీ లీగల్ సెల్ దీనిని కోర్టులో సవాలు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.
అప్పన్న భూముల్లో భూ బకాసురులు రోజురోజుకి భరితెగిస్తున్నారు. పంచగ్రామాలకు సంబంధించి హైకోర్టులో కేసు ఉన్నప్పటికీ అడివివరం బీఆర్‌టీఎస్ రోడ్డు విస్తీరణ నెపంతో ఆక్రమణకు పాల్పడుతున్నారు. భవనాలను నిర్మించే విషయంలో కొత్తగా టీడీఆర్‌లని చూపిస్తూ గతంలో ఇచ్చిన ఎల్‌ఆర్‌సీల మాట వినిపించకుండా చేస్తున్నారు. హైకోర్టులో అప్పన్న భూముల కేసు పరిష్కారం అయ్యే వరకు ఆలయ ఆస్తులను పరిరక్షించాల్సిన ఆలయ అధికారులు సైతం ఆక్రమణదారులతో చేతులు కలపడంతో అప్పన్న భూములు ఆవిరైపోతున్నాయి. కొత్తగా టీడీఆర్‌లు ఇచ్చిన భూముల్లో ఇష్టానుసారంగా భారీ భవనాలు నిర్మించుకోవచ్చని కొలతలు వేసి మరీ.. అప్పన్న భూములను అప్పనంగా అప్పగించడంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 28ఏళ్ల నుంచి ఎల్‌ఆర్‌సీలు లేనివారు భవనాలు నిర్మించకూడదని కఠిన నిబంధనలు ఉన్నా ఆలయ అధికారులు అటుగా పట్టించుకోకపోవడంతో టీడీఆర్ ముసుగులో భారీ భవనాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఓ వైసీపీ నాయకుడు రహదారిపై ఉన్న భవనానికి ఎల్‌ఆర్‌సీ ఉందని ఆ భవనం వెనుక ఉన్న భారీ స్థలంలో ఎల్‌ఆర్‌సీ లేకుండా కల్యాణ మండపం నిర్మించడం అందరికీ తెల్సిందే.. భవనాన్ని నిర్మిస్తున్న క్రమంలో కూటమి నాయకులు అటుగా కన్నెర్ర చెయ్యడంతో చేసేది ఏమి లేక రెండు రోజులకు ముందు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయినా అప్పన్న భూముల్లో అక్రమంగా ఆ భారీ భవనం నిర్మించడానికి ఆయనకు అవకాశం దక్కుతుందో.. లేదో.. వేచి చూద్దాం.
- పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న భవనాలు..
సింహాచలం అడివివరం రహదారి విస్తీర్ణ సమయంలో ఇచ్చిన టీడీఆర్‌లను ఆధారంగా చేసుకొని భారీ భవనాలు నిర్మిస్తున్నారు. రహదారి పొడుగున పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న భవనాలకు ఎటువంటి ఎల్‌ఆర్‌సీలు లేకపోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అనుమతులు లేకపోయిన సంబంధిత ఆలయ అధికారులు అటుగా అడ్డగించకుండా కొలతలు వేసి మరీ భవనాలకు నిర్మించుకోవడానికి అనుమతులు ఇవ్వడం చుట్టుపక్కల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో భవనాలు తెల్లగొడలుగా దర్శనం ఇవ్వడం, మరికొన్ని పునాదులు, పిల్లర్లతో కనిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల చిన్నపాటి రేకుల షేడ్‌లు నిర్మించి తరువాత ఆ స్థలాన్ని తన ఖాతాలో వేసుకుంటున్నారు.
- దుకాణాలు, పొదలు ఉన్నచోట ఎల్‌ఆర్‌సీలు ఎలా..?
పంచగ్రామాల సమస్యతో సుమారు 28ఏళ్లు పొదలతో నిండిపోయిన భూముల్లో ఇప్పుడు భారీ భవనాలు దర్శనమిస్తున్నాయి. న్యాయస్థానంలో కేసు పెండిరగ్‌లో ఉన్నా సంబంధిత అధికారుల పర్యావేక్షణ లోపంతో ఇప్పటి వరకు పొదల్లో ఉన్న భూములు భవనాలుగా మారిపోతున్నాయి. ఏఈవో స్థాయి అధికారులను విభాగాల వారీగా కేటాయించినా అప్పన్న భూములు కబ్జాలు ఆగడం లేదు. తాయిలాలుకు కక్కుర్తి పడుతున్న ఆలయ అధికారులు అప్పన్న భూముల్లో జరుగుతున్న వ్యవహారాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడంతో ఇప్పటికే భారీ భవనాల రూపంలో వాళ్ల తప్పులు దర్శనమిస్తున్నాయి. ఇప్పటి వరకు చిన్న చిన్న బడ్డీల రూపంలో ఉన్న స్థలంలో ఎల్‌ఆర్‌సీలు లేకుండా భవనాలు నిర్మిస్తున్నా అటుగా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని పలువురు అప్పన్న భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ఈ వ్యవహారంలో ఎవరికి ఎంత లాభం..?
సింహాద్రి అప్పన్న భూముల్లో నిబంధనలకు వ్యతిరేకంగా భవనాలు నిర్మించడం వలన భవన యజమానులకంటే.. ఆలయ అధికారులకే అధిక లాభం దక్కుతుందని ఎల్‌ఆర్‌సీలు లేకుండా భవనాలు నిర్మిస్తున్న యజమానులు వెల్లడిస్తున్నారు. టీడీఆర్ రూపంలో వచ్చిన సొమ్ములో కొంత శాతం తమకి చదివించడంతో టీడీఆర్ ముసుగులో భవనాలు శెరవేగంగా నిర్మించుకోవాలని సూచించారని పలువురు ఆక్రమణదారులు వివరిస్తున్నారు. ఎల్‌ఆర్‌సీలు లేకుండా నిర్మాణాలు చేపట్టకూడదని ఇప్పటికే నోటీసు బోర్డులను ఏర్పాటు చేసిన సిబ్బంది అటుగా ఆ స్థలాల్లో భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకోకపోవడం కొసమెరుపు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు స్వామివారి స్థలంలో దురాక్రమణదారులు శిక్షార్హులు అని ఏర్పాటు చేసిన బోర్డులు నామమాత్రంగానే ఉన్నాయి.
నేత్ర న్యూస్, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి): కీలక టాస్క్‌ల్లో నిందితులకు ముందస్తు సమాచారం అందించి చేతివాటం చూపించడంతో పాటుగా క్రికెట్ బెట్టింగ్‌లు, పేకాటలు నిర్వహించడంలో టాస్క్‌ఫోర్స్ బృందం ప్రత్యేక గుర్తింపు కైవసం చేసుకుందని నగర ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్ ముసుగులో గత ఎనిమిదేళ్లుగా సుమారు రూ.150కోట్లకు పైగా క్రికెట్ బుకీ లావాదేవీల్లో పల్లా గంగరాజు అనే హెడ్ కానిస్టేబుల్‌ని గుర్తించి ఈనెల 15న ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వాస్తవానికి స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్‌గా విధుల నుంచి తొలిగించిన ఈ గంగూభాయ్ టాస్క్‌ఫోర్స్ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేసినప్పటి నుంచి బొబ్బిలి రవి, లగుడు రవి, తన సోదరుడు పల్లా త్రినాథ్‌తో కలిసి బెట్టింగ్ బుకీ నిర్వహించినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాంధ్ర, తూ.గో, ప.గోతో పాటుగా సుధూర ప్రాంతాల్లో ఈ బుకీ కార్యకలాపాలు జరిగినట్టు ఇప్పటికే ప్రత్యేక బృందాలు విచారణ చేపడుతున్నాయి. రోజుకి ఇద్దరు, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్న అధికారులకు విస్తుపోయే నిజాలు బయటపడటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఓ బాధితుడు పీజీఆర్‌ఎస్‌లో నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీకి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంలో రాజకీయ ఒత్తిడి తీవ్రంగా ఉన్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఇంతటి ఘనతను సాధించినట్టు పలువురు అధికారులు వెల్లడిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ స్టేషన్‌కి సమీపంలో ఎన్నో ఏళ్లుగా ఈ వ్యవహారం జరుగుతున్నా ఇంత ఆలస్యంగా గుర్తించడంలో ఆ హెడ్ కానిస్టేబుల్‌తో పాటుగా గతంలో పని చేసిన కీలక అధికారులకు సైతం ముడుపులు అందినట్టు పలు అనుమానాలు వెంటాడుతునే ఉన్నాయి. ఇదే క్రమంలో ప్రస్తుత బృందంలో ఉన్న కొందరు దిగుస్థాయి సిబ్బంది టాస్క్‌లకు వెళ్లే సమయంలో నిందితులకు ముందస్తు సమాచారం చేరవేసి లబ్ధి పొందుతున్నట్టు సంబంధిత విభాగంలోనే గుసగుసలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పోర్టులో సొత్తును కాజేస్తున్న ఇద్దరు మాయ లేడీల నుంచి నెలవారీ వచ్చే ముట్టగొట్ట(లంచం)కి కక్కుర్తి పడటం, గంజాయి తరలింపు కేసుల్లో కీలక ఆధారాలు తీసుకొచ్చి కేసులు నమోదు చేయడంలో ఎంత చాకచక్యం ప్రదర్శిస్తున్నారో అంత కంటే పెద్ద పెద్ద ముఠాలను పక్కదారిలో తరలించడానికి సాయం చేస్తూ ఎంత మొత్తంలో భక్షిస్తున్నారో బహిరంగ రహస్యంగానే సిబ్బంది మనసులో దాచుకున్నారు. నగరంలో ఉన్న రౌడీ షీటర్స్, బడా బాబులందరూ జూదం ఆడటానికి ఓ వేదికను ఏర్పాటు చేసే కీలక రౌడీషీటర్ కొలుసు కుమార్‌కి సైతం చేదోడు వాదోడుగా ఉంటూ నెలవారీ ముడుపులు తీసుకోవడంలో బిజీ బిజీగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం. అది కూడా ఎంతగా అంటే సంక్రాంతి పండగ అటు ఇటుగా నెలరోజులు స్టేషన్‌కి వచ్చి వారాంతపు సంతకాలు చేయాల్సిన రౌడీషీటర్ సైతం జూదం ఆడుకుంటూ రాకపోయినా పట్టించుకోలేనంతగా ఇక్కడ సిబ్బంది స(అ)క్రమంగా విధులు నిర్వహిస్తున్నారు.
తనకి హద్దులను కేటాయించినా నగర వ్యాప్తంగా సంచరిస్తున్న ఆ షాడో రౌడీ షీటర్స్‌తో స్నేహం చేసి దండీగానే దండుకుంటుంది. ఓ మహిళా న్యాయవాది సాయంతో జైల్లో ఉన్న రౌడీ షీటర్‌లకు ములాకత్, బెయిల్ పెట్టడంలో షాడో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇదే క్రమంలో అక్కడ మగ్గిపోతున్న కొందరు పీడీయాక్ట్, డ్రగ్స్, గంజాయి కేసుల్లో ఉన్న కేటుగాళ్ల నుంచి కీలక విషయాలను తెలుసుకొని నగరంలో మాయాజాలం ప్రదర్శిస్తుంది. ఓ ఘటనలో ఒక రౌడీషీటర్ వద్ద 2గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ గుర్తించి అదే టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పట్టుకుంటే తనకు ఆ రౌడీషీటర్ డబుల్ ఏజెంట్‌గా ఉన్నాడని ఉన్నతాధికారులను ఒప్పించి వదిలి పెట్టడంలో కీలకంగా వ్యవహరించింది ఆ షాడో. బెల్ట్ దుకాణాలు, రేషన్ బియ్యం అక్రమంగా తరలించే వ్యక్తుల నుంచి సైతం పెద్ద మొత్తంలో ముడుపులు అందుతున్నట్టు టాస్క్‌ఫోర్స్ గోడలు సైతం ఈ షాడో చేష్టలు చూడలేక గగ్గోలు పెడుతున్నాయి.
నగర వ్యాప్తంగా ఎటువంటి తారతమ్యం, రాజకీయ ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించడానికి టాస్క్‌ఫోర్స్‌లో డైరెక్ట్ డీఎస్పీ స్థాయి అధికారి అవసరం అక్కడ ఎంతైన ఉందని పలువురు దీర్ఘకాలిక అనుభం కలిగిన పోలీసు ఉద్యోగులు వెల్లడిస్తున్నారు. నెలరోజులు క్రితం స్టేషన్‌కి సమీపంలో ఓ లాడ్జీలో పేకాట జట్టుని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ బృందానికి తీవ్ర తలనొప్పి తెచ్చిపెట్టింది. ఓ రాజకీయ ఒత్తిడి వలన కొంత సొమ్ముతోనే అదుపులోకి తీసుకోవల్సి వచ్చింది. ఇదే క్రమంలో వారం రోజుల క్రితం ఆనందపురం, రామవరం రోడ్డులో సుమారు వంద మందికి పైగా కోడి పందాలు ఆడుతున్నారని పట్టుకోవడానికి వెళ్లిన సిబ్బందికి ఓ మాజీ ఎమ్మెల్యే ఒత్తిడి తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అప్పటికే ముప్పై మందికి పైగా అదుపులోకి తీసుకొని రూ.2.10లక్షల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. సిబ్బంది కష్టపడినా కార్లులో ఉన్న భారీ మొత్తాన్ని పట్టుకోలేకపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో డైరెక్ట్ అధికారి అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు సీఐలు, ఒక ఎస్సై, నలుగురు హెచ్‌సీలు, పద్నాలుగు మంది కానిస్టేబుల్స్, ఇద్దరు హోంగార్డు డ్రైవర్‌లతో నడుస్తున్న టాస్క్‌ఫోర్స్ బృందాన్ని స్పెషల్ బ్రాంచ్ ఏడీసీపీతో పాటుగా నగర పోలీసు కమిషనర్ పర్యావేక్షించడం ఒక విధంగా మంచిదైనా స్థానికంగా అక్కడ ఓ ఉన్నతాధికారి లేకపోవడం దిగువ స్థాయి అధికారులకు ఇబ్బంది తప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి కంటే అక్కడ సీనియర్ స్టేషన్ స్థాయి అధికారికి నిందితులను అప్పగించే సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు. పైగా ఎదురు సమాధానం చెప్పలేకపోవడంతో టాస్క్ నిర్వహించి సంబంధిత సమీప స్టేషన్‌కి అప్పంగించాల్సిన టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి సెంట్రీ డ్యూటీ వేసిన సందర్భాలు కూడా నగరంలో అధికంగానే ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంది.
నేత్ర న్యూస్, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి) : ఒత్తిడి లేని విద్యను అందిస్తూ విద్యార్థి సృజనాత్మకతను పెంపొందించడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తూ విద్యార్థుల భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావం చూపించడానికి కొన్ని అంటే కొన్నే పాఠశాలలు పనిచేస్తుంటే.. విద్యార్థి భవిష్యత్తుపై ఎటువంటి ప్రభావం చూపించని డబ్బా పాఠశాలలు చేస్తున్న నిర్వాకం విద్యాశాఖను సైతం అభాసుపాలు చేస్తున్నట్టే ఉంది. పండగ సమయంలో విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం, విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యమని పలువురు విద్యావేత్తలు వెల్లడిస్తున్నా నూటికి 30శాతం ఉత్తీర్ణతను ఇచ్చే డబ్బా పాఠశాల లు పండగ సమయంలో విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తూ తరగతులు నిర్వహించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వం నుంచి ఈనెల 7న ఆర్‌సీ నెంబర్ ఏసీఏడీ/2308989/2025 పేరిట పండగ సెలవుల నిమిత్తం సర్కులర్‌ని విడుదల చేసినా అటుగా ఆచరించవలసిన పాఠశాలలు, అనుసరించవలసిన విద్యాశాఖ పట్టించుకోకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. నూటికి నూరు శాతం ఫలితాలు ఇచ్చే పాఠశాలలో విద్యార్థులు ఒత్తిడి గురికాకుండా ఉండటానికి ప్రత్యేక సెలవులు ప్రకటిస్తుంటే.. నూటికి 30శాతం ఫలితాలు ఇచ్చే డబ్బా పాఠశాలలు తరగతులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐఐటీ ` నీట్ కోచింగ్ సెంటర్‌లు మినహా అన్ని విద్యా సంస్థలు ఈనెల 10నుంచి 19వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిన అటుగా ఉత్తమ డబ్బా పాఠశాలలు పట్టించుకోకపోవడం గమనార్హం. మరోవైపు ఆదేశాలను అనుసరించాల్సిన జిల్లా విద్యాశాఖ సైతం నామమాత్రపు ఆదేశాలు జారీ చేసి చేతులు కడుక్కున్నారని స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై సంబంధిత జిల్లా ఉన్నతాధికారులను కార్యాలయంలో కలవడానికి ముందుగానే ప్రయత్నించినా ఇరువురు అధికారులు కార్యాలయాల్లో లేకపోవడం ఎటువంటి సమాధానం దొరకలేదు. పైగా దిగువస్థాయి సిబ్బందితో జిల్లా విద్యాశాఖాధికారి తరుపున అని పత్రికా ప్రకటనలో సంతం పెట్టి విడుదల చేయడం కొసమెరుపు.
సంక్రాంతి పండగ సెలవుల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి విడుదలైన సర్కులర్‌ని జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటుగా అన్ని పాఠశాలలు విధిగా పాటించాలని ఆదేశించినా ఆర్భాటం ఎక్కువగా చేసే కొన్ని డబ్బా పాఠశాలలు పాటించకుండా తుంగలో తొక్కడం సరికాదని పలువురు విద్యావేత్తలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహాలో కల్తీ విద్యను పాఠశాలలు బోధించడం వలన విద్యార్థులు ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని కోల్పోవడానికి ఎక్కువ అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. పాఠశాలల పనితీరుని నిరంతరం కనిపెట్టాల్సిన విద్యాశాఖ దిగువ స్థాయిలో ఎంఈవోలు, సీఆర్‌పీలను కేటాయించినా అటుగా ఆ సిబ్బంది పని చేయకపోవడం అసలు సమస్య ఉత్పన్నం అవుతుంది. కొందరు సిబ్బంది పాఠశాలలను తమ కనుసైగల్లో పెట్టుకొని నెలవారీ మామూళ్లు, ఇండెంట్లు మత్తులో పాఠశాల యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నారని ఇట్టే అర్థం అయిపోతుంది. ఎంతగా అంటే సెలవు దినంలో కూడా స్వేచ్ఛగా తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి పాఠశాలల్లో తరగతులు నిర్వహించడం. దీనిపై సంబంధిత పాఠశాల యాజమాన్యాలను ప్రశ్నించగా పాఠశాలలు నడపడంలో మాకు అన్ని పద్ధతులు తెలుసు అని వ్యంగ్యంగా సమాధానం ఇవ్వడం ఆశ్చర్యం.
తుఫానులు, పండగల సమయంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పభుత్వం తరుపున జిల్లా కలెక్టర్ పాఠశాలలకు సెలవులు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసిన ప్రతీసారి కొన్ని డబ్బా పాఠశాలలు బేఖాతరుగా వ్యవరించడం చాలా సందర్భాలు ఉన్నాయి. గతనెల 21న భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సెలవును ప్రకటించినా ఏ మాత్రం పట్టించుకోలేదు. గత అక్టోబర్‌లో 12రోజులు దసరా సెలవులు ప్రకటిస్తే ఏదో అత్యుత్తమమైన ర్యాంక్‌లు సాధించినట్టు ఈ డబ్బా పాఠశాలలు పది రోజులు తరగతులను నిర్వహించారు. గత సెప్టెంబర్ 2న భారీ వర్షాల కారణంగా సెలవు ప్రకటిస్తే ఈ పాఠశాలలు పాటించకపోగా సంబంధిత విద్యాశాఖ దిగువ స్థాయి సిబ్బందికి ఆమ్యామ్యాలు ఇచ్చి ఇష్టారాజ్యంగా వ్యవరించారని పాఠశాలల యాజమాన్యలే బహిరంగంగా గుసగుసలాడుకుంటున్నారు. ఇదే క్రమంలో గత కృష్ణాష్టమికి సైతం సెలవు లేకుండా ఉత్తమ ర్యాంక్‌లు సాధించడానికి కృషి చేసిన ఈ డబ్బా పాఠశాలలు తీరుకి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. దీనిపై ప్రతీసారి సంబంధిత ఎంఈవోలకు, సీఆర్‌పీలకు ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఈ అంశాలపై నకిలీ పత్రికలు నడుపుతున్న కొందరు నకిలీ విలేకరులు ప్రశ్నించడంతో వాళ్లను మచ్చిక చేసుకోవడానికి సంబంధిత విద్యాశాఖ అధికారులే అన్ని పాఠశాలలకు సంబంధించిన సమాచార అంశాలను ఇచ్చి ప్రకటనల రూపంలో రూ.లక్షలు దోచుకోవడానికి సాయం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎంతగా అంటే ఓ నకిలీ పత్రిక ఏకంగా సుమారు 50పాఠశాలలకు ఫోన్ ద్వారా బెధిరించి ప్రకటనల రూపంలో రూ.లక్షలు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసినంత వరకు. ఈ అంశాలన్ని జిల్లా పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుని(ఆర్‌జేడీ) దృష్టిలో సైతం ఉందని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం.