Please assign a menu to the primary menu location under menu

Tag Archives: CP OFICE

CrimeGovernment

పోలీస్ స్టేషన్ లో కుర్చీలాట..!

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ముఖ్యంగా ఆ పోలీసు స్టేషన్లో ఓ కుర్చీ కోసం చిన్న స్థాయి యుద్ధమే జరిగిందంటే ఆశ్చర్యపడనవసరం లేదు. ఎత్తులు.. పైఎత్తులు.. వేసుకుంటూ కుర్చీ కోసం పోట్లాడుకున్న పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. దీంతో ఆఖరికి ఎడమొహం.. పెడమొహం.. పెడుతూ సాక్షాత్తు నగర పోలీసు కమిషనర్‌ చెంతకు చేరుకొని సమీప స్టేషన్లకు బదిలీ చేయాలని కోరుతూ ఆర్డర్‌లు సైతం తెచ్చుకున్నారు. అయినా స్టేషన్‌ను విడిచిపెట్టడానికి మనసు అంగీకరించక సంబంధిత సిబ్బంది నేటికి స్టేషన్‌లో సతమతం అవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. నగర వ్యాప్తంగా అధిక ఆదాయాన్ని అందించే స్టేషన్‌లో కీలక పోలీసు స్టేషన్‌గా గుర్తింపు పొందిన ఆ స్టేషన్‌లో జనరల్‌ సిబ్బందిగా చలామణి అవుతున్న ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ చేస్తున్న దందా తోటి సిబ్బంది నుంచే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అడుగడుగున అతని అవినీతి జాడలు అంటించడంతో తమ మనుగడ చాలా కష్టంగా ఉందని బోరుమంటున్నారు. ఎండకు గుక్కెడు నీరు కావాలన్నా ఆ అయ్యగారి అనుమతి కావాలన్నట్టు అక్కడి పరిస్థితులు మారిపోయాయని వాపోతున్నారు. బడా బాబులు, బజారులు, బారుల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఇలా అన్ని చోట్ల పెద్ద మొత్తంలో దండుకుంటున్న అవినీతి జలగపై ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ కన్ను పడిరదని సమాచారం. ఇదే క్రమంలో రోజువారీ స్టేషన్‌కి తీసుకొచ్చే ఓపెన్‌ డ్రిరకింగ్‌ (బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం) వంటి ఫిర్యాదుల్లో దండీగా దండుకుంటున్న సిబ్బంది ఆస్కార్‌ అవార్డును సైతం కైవసం చేసుకునే నటనను ప్రదర్శిస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే జీడీలో నెలకు వందల సంఖ్యలో కేసులు నమోదు చేసి బేరసారాలు కుదరనివి మాత్రమే.. అది కూడా పదుల సంఖ్యలో కోర్టుకు పంపించి జరిమానాలు విధిస్తున్నారని సంబంధిత స్టేషన్‌ సిబ్బంది బహిరంగంగానే గుసగుసలాడుకుంటున్నారు. ఈ స్టేషన్‌లో ప్రతీ అంశానికి ఓ ధరను నిర్ణయించి అధిక ఆదాయాన్ని అందించే స్టేషన్‌గా నడపడంతో స్టేషన్‌లో నలుగురు సిబ్బంది ఠాణా లేఖరి (స్టేషన్‌ రైటర్‌) కుర్చీ కోసం పోట్లాడుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.

  • ఆ పోలీసు స్టేషన్లో అంతా రాజకీయమే..
    రోజువారీ స్టేషన్‌లో జరుగుతున్న కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించే ఇద్దరు సిబ్బంది ఇప్పుడు అర్జీలు పెట్టుకొని బదిలీపై వెళ్లిపోవడం అక్కడ ఉత్కంఠను తలపిస్తుంది. స్టేషన్‌కి అవసరమైన నిధులు సమకూర్చే క్రమంలో నాలుగు రాళ్లు పక్కన వేసుకునే ఇరువురు ఒకేసారి బదిలీపై వెళ్లిపోవడంపై స్టేషన్‌లో అంతర్గత రాజకీయాన్ని తలపిస్తుంది. అదే స్టేషన్‌ పరిధిలో గత ఐదేళ్లు స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగంలో పనిచేసి ఇప్పుడు అదే స్టేషన్‌లో రైటర్‌ కుర్చీలో కూర్చున్న వ్యక్తి వద్ద ఇన్ని రోజులు రాజకీయం చేసిన వ్యక్తులు ఎందుకు కుర్చీని వదులుకున్నారో అర్థం కావడంలేదని సంబంధిత సిబ్బందే తర్జన బర్జన పడుతున్నారు.
  • నగర పోలీసు సిబ్బందిపై నిఘా ఎక్కడా..?
    నగర వ్యాప్తంగా ఉన్న 23పోలీసు స్టేషన్‌లు, అనుబంధ అధికార కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై నిఘా శూన్యంగా మారింది. స్టేషన్‌ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది బాగోగులు చూసుకుంటున్న ఉన్నతాధికారులు, సిబ్బంది చేస్తున్న అవినీతి కార్యకలాపాలపై నిఘా కట్టుదిట్టం చేయడంలో అలసత్వం చూపిస్తున్నారని పలువురు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 23పోలీసు స్టేషన్‌ల పరిధిలో జనరల్‌ సిబ్బంది పేరిట ముద్ర వేసుకొని ఇష్టానుసారంగా దండుకుంటున్నారని, స్టేషన్‌లో జరిగే పదవీ విరమణ కార్యక్రమాలు అంబరాన్ని అంటే సంబరంగా జరగడానికి ఈ జనరల్‌ సిబ్బంది కీలకంగా పనిచేస్తున్నారని బహిరంగ రహస్యం. ఈ క్రమంలో ఓ పోలీసు స్టేషన్‌ ఆవరణంలో కొద్దిరోజుల క్రితం జరిగిన మద్యం పార్టీకి అధిక సంఖ్యలో మద్యం సీసాలు సమకూర్చడంలో ఈ జనరల్‌ సిబ్బంది పనితీరు స్పష్టంగా కనిపించిందంటే అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఇటువంటి అంశాలపై ప్రస్తుత నగర పోలీసు కమిషనర్‌ దృష్టి కేంద్రికరిస్తే.. 2016లో పోలీసు కమిషనర్‌ టి.యోగానంద్‌ జనరల్‌ సిబ్బందిపై కొరడా ఝుళిపించిన సందర్భం గుర్తొస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
CrimeGovernment

పోలీసు విధుల్లో యూనిఫామ్ ధరించాల్సిందే..!

  • సిబ్బంది విధిగా యూనిఫామ్‌ ధరించాలని సీపీ ఆదేశాలు..
  • యూనిఫామ్‌ ధరించకపోతే చర్యలు తీసుకోవాలని హెచ్చరిక..
  • జనరల్‌ సిబ్బంది సైతం యూనిఫామ్‌ ధరించాలని సూచనలు..


నేత్ర న్యూస్‌, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి) : ‘‘మీ సీపీ ఎల్లప్పుడూ యూనిఫామ్‌లో ఉంటే మీరు ఎందుకు యూనిఫాంలో ఉండకూడదు. విధుల్లో ఉన్నప్పుడు 100శాతం అందరూ పోలీసు యూనిఫామ్‌లో ఉండాలి. హోంగార్డు, కానిస్టేబుల్‌ నుంచి ప్రతీ అధికారి యూనిఫామ్‌ ధరించాలి. ఎవ్వరైనా యూనిఫామ్‌లో లేకపోతే వాళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలి.’’ అని సాక్షాత్తు విశాఖ నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చీ మాట్లాడిన మాటలు ఇప్పుడు నగర పోలీసు సిబ్బంది అందరిలో ఓ కొత్త భయాందోళన రేకెత్తించింది. అది కూడా ఎందుకంటే నగర సీపీ మాట్లాడిన మాటలతో పాటుగా ఓ దిగువ స్థాయి సిబ్బంది మరో వాయిస్‌ రికార్డుని జత చేస్తూ ‘‘ఎవరైతే జనరల్‌ డ్యూటీలో ఉన్నారో వాళ్లందరూ తప్పనిసరిగా యూనిఫామ్‌ ధరించాలని, పైగా నిఘా కూడా ఉంది అందరూ సీరియస్‌గా తీసుకోవాలి.’’ అని చెప్పడంతో నగర వ్యాప్తంగా స్టేషన్‌ స్థాయిలో ఇప్పటికీ జనరల్‌ డ్యూటీ (2016 మే 25న మాజీ సీపీ యోగానంద్‌ సమక్షంలో అంతరించి పోయిందని అనుకున్న ప్రత్యేక కలెక్షన్‌ బృందం) ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని విశ్వసనీయ సమాచారం. ప్రజల సమస్యలతో పాటుగా సిబ్బంది బాగోగులు చక్కగ చూస్తున్న నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చీ ఇప్పుడు అవినీతి ముసుగులో మగ్గిపోతున్న కలెక్షన్‌ కింగ్‌లపై పడ్డారా..? అనే భయంతో స్టేషన్‌ పరిధిలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న సుమారు 75శాతం సిబ్బంది మంగళవారం ఉదయం యూనిఫామ్‌లో దర్శనమిచ్చారు. దీంతో పాటుగా ఎప్పుడూ పోలీసు యూనిఫాం ధరించకుండా కలెక్షన్‌ ఏజెంట్లుగా తిరుగుతూ అధిక మొత్తంలో దోచుకుంటున్న దొంగల ముఠా సభ్యులు సైతం ఒక్కసారిగా యూనిఫామ్‌ ధరించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. వాస్తవానికి సోమవారం సీపీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న సమయంలో ఓ దిగువ స్థాయి సిబ్బంది యూనిఫామ్‌ ధరించకుండా అడ్డుగా వచ్చిన సందర్భంలో నగర సీపీ అందరూ యూనిఫాం ధరించాలి అని చెప్పగా ఆ విషయం నగర వ్యాప్తంగా కలెక్షన్‌లో బిజీ బిజీగా ఉన్న సిబ్బందిని ఇబ్బంది పెట్టిందని ఆలస్యంగా వెలుగు చూసింది. ఏది ఏమైన నగర సీపీ అటుగా కూడా నిఘా కట్టుదిట్టం చేశారని పలు సందేహాలు సైతం వేడి వేడిగా వినిపిస్తున్నాయి.

  • జనరల్‌ సిబ్బంది చేష్టలు చిర్రెత్తి పోతున్నాయి..

నగర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీసు స్టేషన్‌ల్లో జనరల్‌ (కలెక్షన్‌ నిమిత్తం) సిబ్బందిని నియమించి ఇష్టానుసారంగా దండుకుంటున్నారని ఇప్పటికే నగర సీపీకి సైతం పీజీఆర్‌ఎస్‌లో పలు ఫిర్యాదులు సైతం వచ్చాయి. దీనిపై ఆయన తనదైన శైలిలో చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు పలువురు సిబ్బంది వెల్లడిస్తున్నారు. ఓ స్టేషన్‌ పరిధిలో గత 20ఏళ్లుగా ఉన్న హోంగార్డు జనరల్‌ సిబ్బందిగా చలామణి అవుతూ ట్రావెల్స్‌ యాజమాన్యల నుంచి దండుకుంటే.. మరో స్టేషన్‌ పరిధిలో హోటల్స్‌, సినిమా థియేటర్‌ల వద్ద ఈ ఏజెంట్‌ తన పనితీరుని చూపిస్తున్నాడు. ఇంకొక స్టేషన్‌ పరిధిలో ఓ కానిస్టేబుల్‌ బిల్డింగ్‌లు నిర్మించే బిల్డర్‌ల వద్ద రూ.లక్షల్లో దోచుకుంటుంటే.. మరో స్టేషన్‌ పరిధిలో షిప్పింగ్‌ కంపెనీలు, కార్గో యజమానుల నుంచి సరుకును దోచుకునే దొంగల నుంచి దండుకుంటున్నారు. ఇలా నగర వ్యాప్తంగా మామూళ్లు మత్తులో ఉన్న జనరల్‌ సిబ్బందిపై ప్రస్తుత పోలీసు కమిషనర్‌ చర్యలకు ఎప్పుడు పచ్చ జెండా ఊపుతారో అని నిజాయితీగా ఉన్న కొందరు పోలీసు సిబ్బంది ఆశగా ఎదురు చూస్తున్నారు.

  • యూనిఫామ్‌ ధరించడం వలన కలిగే ప్రయోజనాలు..

పోలీసు యూనిఫామ్‌ ధరించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని, అంతే కాకుండా ఖాకీ రంగుకి కూడా ప్రత్యేక అర్థం ఉందని పలువురు విరమణ ఉద్యోగులు సైతం వెల్లడిస్తున్నారు. ఖాకీ రంగు దుమ్మును దాచిపెట్టడానికి ఉపయోగపడుతుందని, అంతే కాకుండా ఇది శాంతి, క్రమశిక్షణను సూచిస్తుందని వెల్లడిస్తున్నారు. పోలీసు యూనిఫామ్‌ల చరిత్ర కూడా చాలా ఆసక్తికరమైనదని, బిటిష్‌ కాలంలో బ్రిటిష్‌ వారు భారతదేశంలో తెల్లని రంగు యూనిఫామ్‌లను ఉపయోగించేవారని కానీ అవి త్వరగా మురికి అవ్వడంతో 1847లో సర్‌ హ్యారీ లమ్స్‌డెన్‌ అధికారికంగా ఖాకీ రంగు యూనిఫారాన్ని వాడుకలోకి తీసుకొచ్చారు. పోలీసు విభాగంలో నేటికి కొనసాగుతునే ఉంది.

  • గుర్తింపు: యూనిఫామ్‌ పోలీసును సామాన్య ప్రజల నుండి వేరు చేస్తుంది. ఇది ప్రజలకు భద్రతా భావాన్ని కలిగిస్తుంది.
  • అధికారం: యూనిఫామ్‌ పోలీసులకు ఒక నిర్దిష్ట అధికారాన్ని సూచిస్తుంది. ఇది వారి పనిని సులభతరం చేస్తుంది.
  • శ్రేణిని నిర్వచించడం: వివిధ రకాల యూనిఫామ్‌లు పోలీసు అధికారి యొక్క శ్రేణిని సూచిస్తాయి. ఇది ఆదేశాలను అమలు చేయడంలో సహాయపడుతుంది.
  • క్రమశిక్షణ: యూనిఫామ్‌ ధరించడం వల్ల పోలీసులలో క్రమశిక్షణ పెరుగుతుంది.
  • ఏకత్వం: ఒకే రకమైన యూనిఫామ్‌ను ధరించడం వల్ల పోలీసు దళంలో ఏకత్వం పెరుగుతుంది.
  • భద్రత: యూనిఫామ్‌ ధరించడం వల్ల పోలీసులు తమను తాము భద్రంగా భావిస్తారు.
  • శ్రద్ధ: యూనిఫామ్‌ ధరించడం వల్ల పోలీసులు తమ విధులను నిర్వర్తించేటప్పుడు మరింత శ్రద్ధగా ఉంటారు.