Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
నేత్రన్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి): ఆ అధికారి ఆడిన ఆటలో అమాయక సిబ్బంది సతమతమవుతున్నామని ఏకంగా పోలీసు బాస్‌కే ఫిర్యాదుల పరంపర నడపడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆయనపై కోపంతో ఓ కానిస్టేబుల్ కొన్ని రోజులు కనిపించకుండా పోవడం సాధారణంగా విషయంగా తీసుకుంటే.. సీఐ స్థానంలో ఉన్న మహిళా అధికారి పరుగులు పెడుతూ పోలీసు కమిషనర్‌కి ఫిర్యాదు చేయడం అసాధారణమైన విషయంగానే పరిగణించాలని ఆనోట.. ఈనోట.. గట్టిగానే వినిపిస్తుంది. మొదటి నుంచి ఆ అధికారి మాట తీరు, వ్యవహార శైలి సక్రంగా లేకపోవడంతో ఉన్నతాధికారుల దండనకు గురవ్వడమే కాకుండా పలుమార్లు సస్పెండ్ అయినా ఆయన తీరు ఏ మాత్రం మారకపోవడం అందర్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంచలంచలుగా పెరుగుతూ అధికారి హోదాకి వచ్చినా కాసంత కూడా కనికారం లేదని కన్నీరు కారుస్తున్నారు. ఆయనకు మరో కొత్త అలవాటు రావడంతో సిబ్బంది పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టు అయ్యిందని ఆవేదన సైతం వ్యక్తం చేస్తున్నారు. రెండు సెల్‌ఫోన్‌లతో స్టేషన్‌కి వచ్చిన అధికారి నిత్యం ఓ సెల్‌ఫోన్‌లో మార్కెట్ సమయానుగుణంగా ఇంట్రాడే ట్రేడిరగ్ చేయడం, మధ్య మధ్యలో అమ్మాలా..? కొనాలా..? అనే సంభషణలు చేయడం స్టేషన్‌లో కిటికీలు, తలుపులు సైతం ఓ కంట కనిపెడుతునే ఉన్నాయి. అందులో ఏదైనా వ్యత్యాసం వస్తే అక్కడ ఉన్న సిబ్బందికి తిట్టుల దండకం తప్పదని దీనికి సంబంధించిన పూర్తి అంశాలు సీసీ కెమెరాలు పరిశీలిస్తే తెలుస్తుందని వెల్లడిస్తున్నారు. చీటికి మాటికి సిబ్బందిపై కస్సుబుస్సులు ఆడటంతో సిబ్బంది అక్కడక్కడ
ప్రయత్నించి బదిలీపై వెళ్లిపోవడానికి సైతం సిద్ధమవుతున్నారు. గతంలో హార్బర్ స్టేషన్‌లో ట్రాఫిక్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో నకిలీ చలానా పుస్తకాలు సృష్టించి అధిక మొత్తంలో దోచుకోవడం గుర్తించిన అప్పటి పోలీసు బాస్ సస్పెండ్ చేసినా ఆయనలో మార్పు ఏ మాత్రం కనిపించలేదనే చెప్పాలి. అక్కడికి కొన్నేళ్ల తరువాత ఇన్‌స్పెక్టర్ హోదాలో ఓ కానిస్టేబుల్‌ని కొట్టడంతో మరోమారు సస్పెండ్ అయినా దిగువ స్థాయి సిబ్బందిని ఏమాత్రం చూసుకోవడం రాలేదనే చెప్పాలి. మరో సంఘటనలో ఈయన చేసిన చేష్టలకు ఓ కానిస్టేబుల్ తుఫాకీ ఎక్కుపెట్టిన ఘటన ఆ రోజుల్లో అందర్నీ భయబ్రాంతులకు గురిచేసినా ఉపయోగం లేదనే చెప్పాలి. ఇదే క్రమంలో నగరంలో కీలక విభాగానికి అధికారిగా వ్యవహరిస్తున్న ఆయన ఓ కోర్టు కానిస్టేబుల్‌పై నిప్పులు చెరగడంతో మనస్థాపానికి గురైన కానిస్టేబుల్ ఎవ్వరికీ చెప్పకుండా స్టేషన్‌లో తన వస్తువులు అన్ని వదిలిపెట్టి అటుగా కనిపించకుండా వెళ్లిపోయాడని తోటి సిబ్బంది గుసగుసలాడుకున్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పీఎంపాలెం పోలీసు స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ 558/2024 నమోదు చేసిన కొన్ని రోజుల్లో తిరిగి రావడంతో కథ సుకాంతం అయ్యిందనే సమయానికే ఓ మహిళా ఏఎస్సై తనకు మూడు రోజులు సెలవు కోరిన విషయంలో లేఖలో నన్ను చాలా సార్లు అవమానపరిచారు, ఆడ వాళ్లకి చాలా బాధలు ఉంటాయి అర్థం చేసుకోవాలని ప్రాధేయపడటమే కాకుండా సెలవు ఇవ్వకపోతే కమిషనర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం కూడా కొసమెరుపు. అదే సమయంలో మరో మహిళా హెడ్ కానిస్టేబుల్‌పై ఆసభ్యకరంగా మాట్లాడటం, ఓ కానిస్టేబుల్‌ని బెధిరించడం చేసిన ఆయనపై ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతునే ఉంది. స్టేషన్‌లో మహిళా ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ బాధితురాలు తన వద్దకు వచ్చిన ఫిర్యాదుల్లో వచ్చే సన్నివేశాలు పరిష్కరించడానికి ప్రయత్నించే క్రమంలో తాను కూడా ఎదుర్కొవడంతో నేరుగా ఉన్నతాధికారి కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయడం అందర్నీ ఆయోమయానికి గురిచేసిందనే చెప్పాలి. దీంతో స్పందించిన పోలీసు బాస్ తనపై ఉన్న అధికారుల దృష్టికి సైతం ఈ విషయాన్ని తీసుకెళ్లారని విశ్వసనీయ సమాచారం.
మొదటి నుంచి చట్ట వ్యతిరేక మార్గంలో ప్రయాణించడం ఆయనకే దక్కిందని నగరంలో విధులు నిర్వహిస్తున్న ఆయన తోటి సిబ్బంది సైతం వెల్లడిస్తున్నారు. నకిలీ ట్రాఫిక్ చలానాలు సృష్టించి జరిమానాలు పక్కదారి పట్టించడం, కేసులకు సంబంధం లేకుండా బస్ వారెంట్‌లతో శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు ప్రయాణించడం వంటి అంశాలు డీజీపీ స్థాయి అధికారి దృష్టిలో ఉన్నా తన తీరుని ఏమాత్రం మార్చుకోకుండా సిబ్బందిపై చిందులు వెయ్యడం ఆయనకే దక్కిందని చెప్పాలి. దీనికి తోడు కొత్తగా ఉద్యోగ సమయంలో వ్యక్తిగత వ్యాపారాలు, పెట్టుబడులపై నిబంధనలు పాటించకుండా సీసీ కెమెరాల పర్యావేక్షణలో స్టాక్ మార్కెట్ ఇంట్రాడే ట్రేడిరగ్ చేయడం అందులో ఎదురయ్యే సంఘర్షణల వలన దిగువ స్థాయి సిబ్బందిపై మండి పడటం ఇప్పటికే పోలీసు బాస్ దృష్టికి పలువురు సిబ్బంది తీసుకెళ్లారు. దీనిపై ఆకాశ రామన్న ఉత్తరాలు సైతం వెయ్యడంతో ఆ దిశగా విచారణ కొనసాగుతుందని విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైన ఇటువంటి అధికారి వద్ద పని చేయడం సూది కంటిలో తాను పోయడం లాంటిదని సిబ్బంది బోరుమంటున్నారు.
నేత్ర న్యూస్, విశాఖపట్నం : లోక కల్యాణం కోసం మూడు లోకములను మూడు మూడడుగులుగా కొలిచి.. రాక్షస గుణం కలిగిన బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన ఘటన నాడు ఆ త్రివిక్రముడు (వామనుడు) చేస్తే.. విశాఖ నగరంలో ప్రజలను చిత్ర హింసలకు గురిచేసి, రూ.లక్షలాది సొమ్మును కాజేస్తూ రాక్షసులుగా ప్రవర్తించిన ముగ్గురు సీఐలను ఈ త్రివిక్రముడు విశాఖ రేంజ్‌కి బదిలీ చేయడంతో పోలీసు వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. గతంలో డీసీపీగా విధులు నిర్వహించిన డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మ నగరంలో అన్ని అంశాలను తనదైన శైలిలో తెలుసుకొని పోలీసు కమిషనర్‌గా అడుగు పెట్టిన నాటి నుంచే తన పని ప్రారంభించారని స్పష్టంగా కనిపిస్తుంది. ముగ్గురు సీఐలను రేంజ్‌కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చెయ్యడమే కాకుండా వాళ్ల స్థానాలను వెంటనే వదిలిపెట్టి రేంజ్ డీఐజీ వద్ద హాజరయ్యే విధంగా చూడాలని సంబంధిత సబ్ డివిజన్ స్థాయి ఏసీపీలకు ఆదేశాలు జారీ చెయ్యడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పాలి. గత పోలీసు కమిషనర్ హయాంలో నగరంలోకి చొరబడి ఆర్థిక లావాదేవీల్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ముగ్గురు సీఐలను ముప్పై రోజుల్లో గుర్తించి విధుల నుంచి తప్పించడం పలువురు నుంచి హర్షం వ్యక్తమవుతుంది.
నేత్ర న్యూస్, విశాఖపట్నం, మార్చి 20: ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ తో దుర్భాసలాడి బెదిరించిన మేయర్ భర్త గొలగాని శ్రీనివాసరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ సోమవారం పోలీస్ కమిషనరేట్ లోని స్పందనలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 13న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆరిలోవలోని తోటగరువు స్కూల్ వద్ద గల పోలింగ్ బూత్ దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ స్వామి విధులు నిర్వహిస్తుండగా, షాడో మేయర్ గొలగాని శ్రీనివాస్ అక్కడికి చేరుకొని, ఆ పోలీసుతో అమానుషంగా దుర్భాసలాడి బెదిరించి భయభ్రాంతులకు గురి చేయడం దారుణం అన్నారు. రక్షక భటులైన పోలీసులను గౌరవించాల్సింది పోయి గూబ పగల గొడతానని, సస్పెండ్ చేసి పారేస్తాను అంటూ దుర్భాసలాడిన విషయం అన్ని చానల్లో, పత్రికల్లో వచ్చాయని తెలిపారు. శ్రీనివాస్ ఒక మంత్రి, ఎమ్మెల్యే, అధికార కార్పొరేటర్ కాదని, వైసీపీ సాధారణ కార్యకర్త అని ఏం అధికారం ఉందని విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పై దారుణంగా దుర్భాషలాడుతారా అంటూ మండిపడ్డారు. పోలీసులు సుమోటో గా కేసు నమోదు చేసి ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. చట్టాలపై పోలీసులపై వైసీపీ నేతలకు గౌరవ లేదని, అందుకు ఉదాహరణ ఈ సంఘటన అన్నారు. సాక్షాత్తు పోలీసులను నడి రోడ్డుపై బెదిరించి విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. ఇప్పటికే షాడో మేయర్ గా శ్రీనివాస్ వ్యవహరిస్తూ జీవీఎంసీ అధికారులను బెదిరిస్తూ ప్రజా ధనాన్ని దోచుకు తింటున్నారని ఆరోపించారు. అదే వేరే పార్టీ వారు ఇలా చేసి ఉంటే ఈ పాటికి కేసులు పెట్టేవారన్నారు. వైసీపీ నాయకులకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. ఆధారాలతో స్పందనలో ఏడీసీపీ రామకృష్ణంరాజుకు ఫిర్యాదు చేశానని, స్పందించిన ఆయన చర్యలు తీసుకోమని ఆరిలోవ పోలీసులకు ఆదేశించారన్నారు. పోలీసు అధికారుల సంఘం ఇప్పటికైనా స్పందించాలన్నారు. ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.