Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
ఓవైపు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి.. మరోవైపు తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో వసూలు..
నేత్ర న్యూస్, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి) : చదువుల బరువు మోసి చిన్నారి మనసులు చితికి పోయే.. మార్కుల కోసం పరుగులెత్తి బాల్యం దూరమయ్యే.. అనే పదాలను పద్య రూపంలో ఓ సమకాలీన కవి నాడు చెప్పినట్టే నేడు ప్రైవేట్ పాఠశాలల్లో వ్యవహరిస్తున్న తీరు చిన్నారుల బాల్యాన్ని శూన్యం దిశగా సాగిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. పొరుగు పాఠశాలలతో పోటీ పడుతూ విద్యార్థుల ఆసక్తులు, సామర్థ్యాలను గుర్తించకుండా పాఠశాల యాజమాన్యలు తీవ్ర ఒత్తిడిని కలిగించడం చాలా ప్రమాదకరమని పలువురు పరిశోధనాత్మక విద్యావేత్తలు వివరిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ సరైన సూచనలు జారీ చేయకపోవడం, జారీ చేసిన సూచనలపై పర్యవేక్షణ లేకపోవడంతో ఈ సమస్య అధికంగా వేధిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆరోపిస్తున్నారు. జిల్లాను 11మండలాలుగా విభజించి వాటికి ఇద్దరు చొప్పున ఎంఈవోలను కేటాయించి, ఒక్కొక్క మండలంలో కొన్ని సమూహాలు(క్లస్టర్‌లు)గా విడదీసి సీఆర్‌పీలను నియమించినా పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. విద్యార్థులకు చదువుపై ఆసక్తిని పెంచడానికి అన్ని అంశాల్లో మరింత చురుకుగా పాల్గొని ఆహ్లాదకరమైన విద్యను అభ్యసించాల్సిన విద్యార్థులు పాఠశాలలపై అసభ్యకరమైన పదజాలంతో ఫిర్యాదులు చేస్తున్నారంటే విద్యా విధానం ఎటుగా ప్రయాణిస్తుందో అర్థమవుతుంది. ప్రభుత్వం పదోవ తరగతి విద్యార్థులకు సరైన ప్రణాళికతో చదవడానికి 100రోజుల యాక్షన్ ప్లాన్‌ని ప్రారంభించగా ప్రైవేటు పాఠశాలలు పాటించే తీరు విద్యార్థులను ఒత్తిడి దిశగా తీసుకెళ్తుందని పలువురు విద్యార్థులే వెల్లడిస్తున్నారు. ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు పాఠశాలకే పరిమితం చేయడం, సెలవు దినాలు, ఆదివారాల్లో సైతం తరగతులు నిర్వహించడం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని రోధిస్తున్నారు. ఒత్తిడి లేని విద్యను అందించే దిశగా కొన్ని పాఠశాలలు ప్రణాళికలను రచిస్తుంటే మరికొన్ని డబ్బా పాఠశాలలు ఆర్భాటం చేయడంలోనే పనితనం చూపించి ఫలితాల్లో శూన్యం చూపిస్తున్నారు. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే సెలవు దినాలు, సమయాన్ని పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవల్సిన విద్యాశాఖ సిబ్బంది సంబంధిత పాఠశాలలకు వత్తాసు పలకడంతో విద్యా వ్యవస్థ దిక్కుతోచని స్థితిలో ఉందని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక ఫీజులు నియంత్రణ అంశాలు పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నా ఏ ఒక్కరూ అటుగా ప్రశ్నించకపోవడం అందర్నీ అయోమయానికి గురిచేస్తుందనే చెప్పాలి.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సమానంగా విద్యా విధానాన్ని రూపొందించడం, పాఠశాలల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, విద్యా ప్రమాణాల పర్యవేక్షణ అంశాల్లో మాత్రమే శ్రద్ధ చూపించాల్సిన విద్యాశాఖ ప్రైవేటు పాఠశాలలపై అమితమైన ప్రేమ చూపిస్తూ ద్వంద వైఖరిగా వ్యవహరించడం పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల నుంచి లాభాపేక్ష అధికంగా ఉండటంతో దిగువ స్థాయిలో ఉండే సీఆర్‌పీలు, ఎంఈవోలతో కలిసి సహాయ అధికారులు, ఉన్నతాధికారులు సైతం విద్యా ప్రమాణాలు పాటించని పాఠశాలలకు చేదోడు వాదోడుగా ఉండటం గమనార్హం. ప్రత్యేక తరగతుల పేరిట ఉదయం 8నుంచి రాత్రి 8గంటల వరకు పాఠశాలలు నిర్వహించడం, పాఠశాలలోనే ప్రత్యేక బోధన పేరిట ట్యూషన్ తరగతులు పెట్టడం, సెలవు దినాల్లో పాఠశాలల్లో తరగతులు జరపడం వంటివి చేస్తున్నా సంబంధిత విద్యాశాఖ అధికారులు చోద్యం చూడటంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
చిన్నారులకు ఉన్నతమైన విద్యను అందించే దిశగా తల్లిదండ్రులు పస్తులుండి రూ.లక్షల్లో ఫీజులు చెల్లించడంపై గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఏ మాత్రం ఉపయోగం లేకపోయింది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ (ఏపీఎస్‌ఈఆర్‌ఎంసీ) గ్రామ పంచాయితీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌ల వారీగా విభజిస్తూ సరసమైన పద్ధతిలో ఫీజులను తీసుకోవాలని ఆదేశాలు కేటాయించినా ఏ ఒక్క ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు కూడా పట్టించుకోలేదు. దీనిని పర్యావేక్షించాల్సిన విద్యాశాఖ సైతం చోద్యం చూడటంపై ప్రైవేట్ పాఠశాలల తీరు చాలా కుటుంబాలను చిన్నాభిన్నాం చేసిందనడంలో ఆశ్చర్య పడనవసరం లేదనే చెప్పాలి. ఏపీఎస్‌ఈఆర్‌ఎంసీ ప్రకారం గత మూడేళ్లుగా నర్సరీ నుంచి ఐదో తరగతికి గ్రామ పంచాయితీల్లో రూ.10వేలు, మున్సిపాల్టీల్లో రూ.11వేలు, కార్పొరేషన్‌లల్లో రూ.12వేలుగా అదే ఉన్నత విద్య 6నుంచి 10 తరగతి వరకు పంచాయితీల్లో రూ.12వేలు, మున్సిపాల్టీల్లో రూ.15వేలు, కార్పొరేషన్‌ల్లో రూ.18వేలుగా కేటాయించినా అటుగా ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం పట్టించుకోకపోవడం దుర్మార్గం. దీనిని పర్యావేక్షించాల్సిన విద్యాశాఖ సైతం చూసి చూడనట్టు వ్యవహరించడం కొసమెరుపు.
2009ని ఎవరు పాటిస్తున్నారో..?
రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్
2009 అనేది భారతదేశంలో పిల్లలకు ఉచిత, నిర్భంధ విద్యను అందించే చట్టంగా ప్రవేశపెట్టారు. 6నుంచి 14సంవత్సరాల వయస్సు గల ప్రతి బిడ్డకు తన నివాస స్థలానికి సమీపంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో విద్యను అభ్యసించే హక్కు ఉంది. ఈ పద్ధతిలో ప్రైవేట్ పాఠశాలలు బలహీన వర్గాల పిల్లలకు 25శాతం సీట్లను రిజర్వ్ చేయాలి. కానీ జిల్లాలో కొన్ని పాఠశాలలు మాత్రమే ఈ విధానాన్ని నామమాత్రంగా స్వీకరించి ఉచిత సీటులను కేటాయిస్తే.. మరికొన్ని పాఠశాలలు అటువంటి అవకాశాలు లేవని ఖచ్చితంగా వెల్లడిరచాయి. ఇంకొన్ని పాఠశాలల్లో అర్హత పొందినా విద్యార్థి వయస్సు సరిపోలేదని, ఆ చట్టం అందుబాటులో లేదని కల్లబొల్లి కబుర్లు చెప్పుతూ తప్పించుకున్నారు. దీనిపై ఇప్పటికే గత జిల్లా విద్యాశాఖ అధికారికి పలుమార్లు విద్యార్థుల తల్లిదండ్రులు పలుమార్లు మొరపెట్టుకున్నా ఎటువంటి ఉపయోగం లేకపోయింది. దీనిపై పాఠశాలల వారీగా పర్యవేక్షించాల్సిన దిగువస్థాయి సిబ్బంది సైతం చోద్యం చూస్తూ ఉండిపొయారు. ఒత్తిడి విద్యను అందిస్తూ అధిక ఫీజులను వసూలు చేస్తున్న పాఠశాల యాజమాన్యాలతో పాటుగా అటుగా పట్టించుకోని విద్యాశాఖ సైతం పైశాచికత్వంగా ఉందని స్పష్టంగా అర్థమవుతుంది.
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉచితంగా అందింస్తున్న కోటా బియ్యం పేదలకు అందకుండానే ఆమడ దూరంలో ఉన్న మిల్లులకు రూ.కోట్ల రూపాయిలకు వెళ్లిపోతున్నాయి. ఉచితంగా ఇచ్చే బియ్యంతో ఉపయోగం లేదని పేదలు రూ.10చొప్పున విక్రయాలు చేస్తున్న విషయం తెలిసి కూడా వారికి అవగాహన పరచకుండా సంబంధిత వీఆర్‌వోలు, పౌరసరఫరాలశాఖ ఆర్‌ఐలు అటుగా పట్టించుకోకపోవడంపై పలువురు నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. నెలవారీ మామ్మూళ్లుతో పాటుగా దాడులు చేయడానికి వస్తున్నామని డీలర్‌కి ముందస్తు సమాచారం అందించడంతో వచ్చే ఆమ్యామ్యాలకు అలవాటు పడిన సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించడంలో అలసత్వం చూపిస్తున్నారని సంబంధిత ఉన్నతాధికారులే పలుమార్లు హెచ్చిరించినట్టు సమాచారం. విశాఖ అర్బన్ జిల్లాలో గల అన్ని సర్కిల్స్ కంటే సర్కిల్-1లో అధిక మొత్తంలో రేషన్ బియ్యం పక్కదారి పడుతుందనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. సంబంధిత సర్కిల్ పరిధిలో ఉన్న జిల్లా పౌరసరఫరాల శాఖ సిబ్బందితో డీలర్లకు, ఎండీయూ (మొబైల్ పంపిణీ యూనిట్)ల సిబ్బందికి పరిచయాలు అధికంగా ఉండటంతో ఆడిరదే ఆట.. పాడిరదే పాట..గా మారి జోరుగా అక్రమ విక్రయాలు చేస్తున్నారని పలువురు దొంగ వ్యాపారులే అనుకుంటున్నారు. దీనిపై ఇప్పటికైన జిల్లా యంత్రాంగంలో పెద్ద అధికారులు పట్టించుకుంటారో లేదా వేచి చూడాలి.
– పెండింగ్ అక్రిడేషన్లు తక్షణమే జారీ చేయాలి..
– జర్నలిస్టులపై ఐ అండ్ పీఆర్ అధికారులు, సిబ్బంది వివక్ష, వేధింపులు తగదు..
– జిల్లా కలెక్టర్ కు లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ వినతి..
నేత్ర న్యూస్, విశాఖపట్నం: నిబంధనలకు లోబడి స్థానిక పత్రికలను నిర్వహిస్తున్నప్పటికీ వాటికి ఇప్పటి వరకు అక్రిడేషన్ల జారీ చేయడంలో అన్యాయం జరుగుతుందని లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ (ఎల్ఎన్ఏ) ప్రతినిధి బృందం జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున దృష్టికి తీసుకెళ్లారు. గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో ఆయన్ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. స్థానిక దినపత్రికలు, పిరియాడికల్స్ లో పని చేస్తున్న జర్నలిస్టులు అక్రిడేషన్ల కోసం దరఖాస్తులు చేసుకొని రెండేళ్లు అవుతున్న ఇప్పటి వరకు చాలా మందికి జారీ చేయలేదని కలెక్టర్ కు తెలిపారు. కొన్ని డైలీ దిన పత్రికలకు నిబంధనల ప్రకారం 20 అక్రిడేషన్లు రావాల్సి ఉండగా పదిలోపే పరిమితం చేసారని వివరించారు.
పీరియాడికల్స్ కు రెండు అక్రిడేషన్లు రావాల్సి ఉండగా ఒకటికే పరిమితం చేశారని తెలిపారు. చాలా పత్రికలకు ఆ మాత్రం కూడా ఇంత వరకు ఇవ్వకుండా వివక్ష చూపుతూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆయనకు ఫిర్యాదు చేశారు. దరఖాస్తులను మాయం చేయటం, కొన్ని దరఖాస్తులను స్వీకరించకపోవడం, అక్రిడేషన్ల జారీలో తీవ్ర జాప్యం పాటిస్తున్నారని ఆయనకు తెలిపారు.
సమాచార, పౌర సంబంధాల శాఖలో అవినీతి ఆరోపణలు అధికంగా ఉన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తప్పుడు సమాచారాన్ని పైస్థాయి అధికారులకు అందజేస్తూ అక్రిడేషన్ల జారీకి అడ్డుపడుతున్నారని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ తో ఫోన్ లో వెంటనే మాట్లాడారు. నాలుగు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించాలని, కొందరికి ఇచ్చి కొందరకు నిరాకరించారనే ఆరోపణలు రాకూడదని ఆదేశించారు. అక్రిడేషన్ లకు సంబంధించిన సమాచారాన్ని రాతపూర్వకంగా జర్నలిస్టులకు అందజేయాలని తెలిపారు. అదే విధంగా అధికార పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో హామీ మేరకు జర్నలిస్టులకు 300 గజాల ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ జీవో 142 సవరణ, కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం, అక్రిడేషన్ల జారీకి జీఎస్టీ నిబంధన రద్దు, కమిటీలలో జర్నలిస్టు సంఘాలకు ప్రాధాన్యత తదితర జర్నలిస్టుల డిమాండ్లతో కూడిన మరో వినతిపత్రాన్ని ముఖ్యమంత్రి పంపే నిమిత్తం కలెక్టర్ కు అందజేశారు.
దీన్ని ప్రభుత్వానికి పంపిస్తామని ఆయన తెలిపారు. కలెక్టర్లను కలిసిన లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందంలో అధ్యక్షుడు పి. సత్యనారాయణ, కార్యదర్శి ధవళేశ్వరపు రవికుమార్, ప్రతినిధులు నిట్టల శ్రీనివాస్, బి. నారాయణరావు, బి. శివప్రసాద్, హరనాథ్, మహేష్, అర్.అబ్బాస్, చక్రవర్తి, బి.ఎ. నాయుడు, ఎస్.సన్యాసిరావు, శివ కుమార్ రెడ్డి, ఎం.శ్రీహరి తదితరులు పాల్గున్నారు.