Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
నేత్ర న్యూస్, విశాఖపట్నం : జీవీఎంసీకి రూ.కోట్ల ఆదాయాన్ని అందించే ప్రధాన ఆస్తుల్లో పూర్ణా మార్కెట్ (సర్ధార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్) ఒక్కటిగా నిలవడం అందరికీ తెలిసిన విషయమే.. అటువంటి మార్కెట్‌ను రూ.లక్షలకే అప్పనంగా అంటగట్టడానికి చేసిన ప్రయత్నాలు ఫలించాయని అందరూ అనుకుంటున్నారు. ఏడాదికి ఓ బినామీని వేలం పాటలో నిలబెట్టిన ఓ రింగ్ మాస్టార్ ఒకవైపు.. గత కొన్నేళ్లుగా డమ్మీ డీడీలను చెల్లించి పాటలో హడావుడి చేసి ఒక్క రోజులో రూ.లక్షల లాభంతో పక్కదారి పట్టించే డమ్మీ గుత్తేదారుడు మరోవైపు.. ఆడిన రింగులాటకు జీవీఎంసీ అధికారుల సైతం కంగు తిన్నారంటే ఆశ్చర్య పడనవసరం లేదు. ప్రతీ ఏడాది జీఎస్‌టీతో కలుపుతూ రూ.కోటికి పైగా ఆదాయాన్ని అందించే పూర్ణామార్కెట్ ఈ ఏడాది జీఎస్‌టీతో కలిపినా గత పదేళ్లలో సర్కారు వారి పాట మొత్తానికి సైతం సరి తూగడానికి వీలు లేని విధంగా రూ.74.44లక్షలకు రింగు అయిపోయి జీవీఎంసీ ఆదాయాన్ని పక్కదారి పట్టించారని స్పష్టంగా కనిపిస్తుంది. పూర్ణామార్కెట్ ఆశీలకు సంబంధించి బహిరంగ వేలం పాటను నిర్వహిస్తున్నామని ప్రకటించగానే ఓ డమ్మీ గుత్తేదారుడు బ్యాంక్‌కు నేరుగా వెళ్లి డీడీలు చెల్లించి పాటలో కూర్చొని ఎదుట గుత్తేదారుడితో ముందుగా రింగు అయిపోయి రూ.లక్షలతో ఉన్న బ్యాగ్‌ను తీసుకొని వెళ్లిపోయే తీరు ఒకటైతే.. ప్రతీ ఏడాది ఓ కొత్త వ్యక్తిని రంగంలోకి దింపి పాటను కైవసం చేసుకున్న గుత్తేదారుడి తీరు మరొకటి. ఈ క్రమంలో గత ఏడాది 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.45లక్షలు చెల్లించి బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వలేదని రెండు నెలల పది రోజులకే శుభం కార్డుతో పక్కకు వచ్చేసిన బృందం ఈ ఏడాది ఎందుకు పాటకు రాలేదని ఆలోచిస్తే.. గత ఏడాది నష్టపోయిన సొమ్ము ఈ గుత్తేదారుడి వద్ద వసూలు చేసుకొని లాభం పొందడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని అక్కడ ఎంతగా రింగులు తిప్పారో చెప్పడానికి మాటలు సరిపోవడం లేదంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. రూ.60లక్షలకు సర్కార్ వారి పాటను ప్రారంభిస్తే రూ.పది వేల చొప్పున పెంచుతూ రూ.62.40లకు వచ్చిన గుత్తేదారులు జీవీఎంసీ అధికారులు అంగీకరించక పోవడంతో పాటను రూ.5వేల చొప్పున పెంచుతూ రూ.62.50లకు చేర్చారు. అక్కడ నుంచి కొత్త నాటకానికి ఆరంభం పలికి రూ.వెయ్యి చొప్పున పెంచుతూ రూ.62.55లపై రూ.1వెయ్యి అదనంగా వేసి రూ.62.56కి పాటను కైవసం చేసుకోవడం ఆస్కార్ నటనకు అద్దం పట్టినట్టు కనిపించింది. రూ.62.55లక్షలను చెల్లించడానికి సిద్ధమైన గుత్తేదారుడు వెయ్యి రూపాయల తేడాతో ఎదుట గుత్తేదారుడికి పాటను వదిలి పెట్టడం వెనుక రింగులాట ఎంత చక్కగా ఆడారో ఇట్టే అర్థం అయిపోతుంది.