Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
నేత్ర న్యూస్, అన్నవరం, (ప్రత్యేక ప్రతినిధి) : మానవుడిగా పుట్టిన వాడికి కాసంత భక్తి భావం ఉండాలని పెద్దలు అన్న విషయం మరోమారు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో కనిపించిందనే చెప్పాలి. అక్కడ కాసంత కాదు.. కొండంత భక్తి ఉందని ఓ భుక్తుడు నిరూపించాడు. ఆ భక్తి పరవశంలో తనతో పాటుగా చుట్టు పక్కల ఉన్నవారు సైతం మునిగి పోవాలని నిబంధన పెట్టడమే అక్కడ అసలు కథ మొదలైంది. తాను భక్తుడే కాకుండా ఆ ఆలయ కార్యనిర్వాహణాధికారి కావడం కొస మెరుపు. తాను చెప్పింది శిరసా వహించకపోతే శిక్షలు తప్పవని హెచ్చరికలు సైతం జారీ చేయడంతో చేసేదేమి లేక సిబ్బంది అందరూ శిరస్సు వంచి మాలధారణ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయ కార్యనిర్వాహణాధికారిగా ఉన్న చంద్రశేఖర్ ఆజాద్ గతంలో శ్రీశైలం శ్రీమల్లిఖార్జున స్వామి ఆలయం, విజయవాడ శ్రీకనక దుర్గమ్మ ఆలయంలో వ్యవరించిన తీరు మరోమారు అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో కనిపించడంపై పలువురు సిబ్బంది మండి పడుతున్నారు. ఏ ఆలయంలో విధులు నిర్వహిస్తే ఆ స్వామివారి మాలధారణ చేయడం ఆయనకు అలవాటుగా అనుకుంటే..
ఆ ఆలయంలో విధులు నిర్వహిస్తున్న మొత్తం సిబ్బందిని బలవంతంగా మాలధారణ చేయాలని ఆదేశించడం మూర్ఖత్వంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆలయంలో పని చేస్తున్న మొత్తం సిబ్బంది గతంలో శ్రీశైలంలో సిబ్బంది శివమాల, విజయవాడలో సిబ్బంది దుర్గమ్మ మాల వేసినట్టు ఇక్కడ సిబ్బంది సత్యదేవుని మాల వేయాలని ఆదేశించారు. తాను సైతం మంగళవారం ఉదయం వేద పండితుల సమక్ష్యంలో మాలధారణ చేయడంతో పాటుగా ఆలయంలో సుమారు 80శాతం సిబ్బందికి మాలధారణ చేయించారు. మరో 20శాతం సిబ్బంది ఇంట్లో ఉన్న చిన్నపాటి రుతుక్రమ సమస్యలు తీరిన తరువాత తీరిగ్గా.. అది కూడా మరో రెండు రోజుల్లో మాలధారణ చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో సిబ్బంది ముక్కుతూ మూలుగుతూ స్వామివారి మాలధారణ భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుని చీటీ తీసుకురావాలని, తన కుటుంబంలో ఎవరికైనా సమస్యలు ఉంటే సమస్యను వివరిస్తూ సంబంధిత పత్రాలను చూపించాలని షరతులు సైతం పెట్టారని పలువురు ఆగ్రహంతో మండి పడుతున్నారు. ఇటువంటి సమస్యలపై ఇప్పటికే అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లామని, దీనిపై అంతర్గత విచారణ చేపట్టి ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూస్తున్నామని పలువురు సిబ్బంది వెల్లడిస్తున్నారు.