Please assign a menu to the primary menu location under menu

GovernmentPolitical

పూర్ణామార్కెట్‌లో దొంగలు పడ్డారు..

స్టాండిరగ్‌ కమిటీ తీర్మానం లేకుండా జీవీఎంసీ ఆస్తుల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠాలు

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి): జీవీఎంసీకి రూ.కోట్ల ఆదాయాన్ని అందించే కీలక మార్కెట్‌లు ప్రస్తుతం దొంగల చేతుల్లో చిక్కుకున్నాయి. ఇంటి దొంగల సంరక్షణలో ఉండాల్సిన ఆస్తులను సైతం కమీషన్‌లకు కకుర్తిపడి బయట దొంగలకు అప్పగించినట్టు ఇట్టే అర్థమైపోతుంది. ఈ తరహా తంతుని చూసి ప్రశ్నించాల్సిన స్థానిక స్టాండిరగ్‌ కమిటీ సభ్యుడు సైతం ఆ ముఠాలతో చేతులు కలిపినట్టే కనిపిస్తుంది. ఏడాదికి రూ.కోటికి పైగా అధిక ఆదాయాన్ని అందించే పూర్ణామార్కెట్‌, సుమారు రూ.30లక్షలకు పైగా అందించే రామకృష్ణ కూరగాయల మార్కెట్‌ ఈ ఏడాది అంతర్గత లెక్కలు లెక్కించిన అధికారుల లెక్కల ప్రకారం పూర్ణామార్కెట్‌ని 18శాతం జీఎస్టీ, 0.5 స్వచ్ఛభారత్‌తో కలిపి రూ.97.28లక్షలకు, అదే రామకృష్ణ కూరగాయల మార్కెట్‌ని 18శాతం జీఎస్టీ, 0.5 స్వచ్ఛభారత్‌తో కలిపి రూ.23.10లక్షలకు బహిరంగ వేలం పాట ద్వారా ఖరారు చేశారు. ఈనెల మొదటి నుంచి పాట పాడిన వ్యక్తులకు అప్పగించడానికి కుతూహలంతో ఉన్న జోనల్‌ స్థాయి అధికారులు స్టాండిరగ్‌ కమిటీ తీర్మాణం లేకుండానే ఇవ్వడం వెనుక మర్మం ఏంటో అని మార్కెట్‌లో వ్యాపారులే ఆసక్తి చూపుతున్నారు. బయట సమాజాన్ని నమ్మించడానికి 15మంది సచివాలయ కార్యదర్శిలు, ముగ్గురు మజ్దూర్‌లను, ఒక ట్యాక్స్‌ కలెక్టర్‌, ఒక పబ్లిక్‌ అండ్‌ హెల్త్‌ ఉద్యోగిని నియమించినట్టు గతనెల 29న సంతకాలు చేసి ఆదేశాలను జారీ చేశారు. కానీ వాస్తవానికి ఈ ఉద్యోగులు ఈనెల 1నుంచి నేటి వరకు అదే జోనల్‌ కార్యాలయ సీసీ కెమెరాల పరిధిలోనే పనిచేసినట్టు రికార్డింగ్‌లు సంబంధిత విభాగంలోనే భద్రపరిచి ఉండటం కొసమెరుపు. నకిలీ అదేశాలను జారీ చేసిన అధికారులు అటుగా సిబ్బందిని కేటాయించిన స్థానంలో పని చేస్తున్నట్టు అక్కడ సీసీ కెమెరాల్లో సైతం ఉంటే బాగుండేదని పలువురు వ్యాపారులు హేళన చేస్తున్నారు.

File source: https://commons.wikimedia.org/wiki/File:Purna_Market_in_Visakhapatnam.jpg
  • స్టాండిరగ్‌ కమిటీ అదేశాలు ఎక్కడ..?

జీవీఎంసీలో జరిగిన ఆర్థిక లావాదేవీలను స్టాండిరగ్‌ కమిటీ తీర్మాణంతో కేటాయించాల్సి ఉన్నా.. జోన్‌-4 రెవెన్యూ అధికారులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏడాదికి రూ.కోట్లు ఆదాయాన్ని ఇచ్చే పూర్ణామార్కెట్‌, రూ.30లక్షలకు పైగా ఆదాయాన్ని ఇచ్చే రామకృష్ణ కూరగాయల మార్కెట్‌ని ఎటువంటి అనుమతులు లేకుండా జీవీఎంసీ కమిషనర్‌ పేరిట టోకెన్లను ముద్రించి బయట వ్యక్తులకు అప్పగించారు. నామ మాత్రంగా బృందాలను కేటాయించి పూర్తిస్థాయిలో బయట వ్యక్తులతో ఆశీలు వసూళ్లు చేయిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులను ప్రశ్నించగా తమ సిబ్బంది మాత్రమే వసూలు చేస్తున్నారని వివరిస్తున్న అధికారులు ఇప్పటి వరకు జీవీఎంసీ సౌకర్యంలో ఎంత మొత్తంలో జమ చేశారో లెక్కలు చూపించాలని పలువురు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. స్టాండిరగ్‌ కమిటీ అనుమతి కూడా లేకుండా బయట వ్యక్తులతో రెండు మార్కెట్‌ల్లో వసూలు చెయిస్తున్నారంటే సంబంధిత అధికారులు ఎంత మొత్తంలో నకిలీ బృందాల నుంచి వసూలు చేశారో లెక్కలు చూడాల్సి ఉంది.

  • గెజిట్‌ లెక్కలు గోడలకు మాత్రమే పరిమితం..

ఆశీల పాటను నిర్వహించిన అధికారులు గెజిట్‌ లెక్కల ఆధారంగా వసూలు చేయాలని గుత్తేదారులకు ముందుగానే అవగాహన పరుస్తారు. వాటికి అనుగుణంగానే అధికారులు వాళ్లకు పాటను కేటాయించి అటుగా వసూళ్లు చేయాలని సూచిస్తారు. కానీ ఇక్కడ ఎటువంటి సంబంధం లేని వ్యక్తులకు అక్రమ మార్గంలో ఆశీల వసూళ్లకు అవకాశం కల్పించి ఇష్టానుసారంగా దండుకుంటున్నా అటుగా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. పూర్ణామార్కెట్‌లో ద్విచక్ర వాహనానికి రూ.10, కార్లుకి రూ.20 వసూలు చేస్తున్నారు. ఇదే క్రమంలో భారీ వాహనాలకు రూ.300, సరుకులు రవాణాకు ఉపయోగించే వాహనాలకు రూ.200 దౌర్జన్యంగా తీసుకుంటున్నారు. రామకృష్ణ కూరగాయల మార్కెట్‌లో రూ.20కి బదులుగా దుకాణానికి రూ.50, రహదారిపై తాత్కాలికంగా వ్యాపారం చేసి వెళ్లిపోయే రైతుల వద్ద రూ.100 నుంచి రూ.150వరకు వసూలు చేస్తున్నారని పలువురు వ్యాపారులు బోరుమంటున్నారు. గెజిట్‌లో లెక్కలను పెద్ద పెద్ద అక్షరాలతో ముద్రించి ప్రధాన మార్గంలో గోడలకు మాత్రమే పరిమితం చేసి పెద్ద మొత్తంలో దండుకుంటున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • రహదారిపై వ్యాపారాలకు విశ్వ ప్రయత్నాలు..

నిత్యం రద్దీగా ఉండే పూర్ణామార్కెట్‌ ప్రధాన రహదారిపై తొలిగించిన వ్యాపారాలు యధావిధిగా పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ స్థానిక నాయకున్ని మంగళవారం తీసుకొచ్చి ఆశీలు వసూళ్లు చేయడానికి అర్హత లేని గుత్తేదారులు రహదారిపై దండలతో సన్మానాలు చేసి ఆయన్ని మచ్చిక చేసుకుంటున్నారు. మనిషికి రెండు జంగిడీల చొప్పున కేటాయించి వ్యాపారాలు జరపడానికి చూస్తున్నారు. ఈ జంగిడీలు రహదారిపై పెట్టి వ్యాపారం చేస్తే గుత్తేదారులకు అక్షరాల రూ.40లక్షల వరకు లాభం వస్తుందని మాజీ గుత్తేదారులు సైతం వెల్లడిస్తున్నారు. వ్యాపారులపై ఉన్న ప్రేమ కంటే రూ.40లక్షలపై ఎక్కువ ప్రేమ ఉందని స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై నగర పోలీసు కమిషనర్‌ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

RAVI KUMAR
the authorRAVI KUMAR

Leave a Reply