Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : విశాఖ దక్షిణంలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి మార్పులు సంతరించుకుంటున్నాయి. గత ఎన్నికల్లో నగరంలో నాలుగు దిక్కుల్లో టీడీపీ ఏర్పాటు చేసుకున్న స్థానాన్ని మరోమారు కైవసం చేసుకోవడానికి చూస్తుందని స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే తరుణంలో దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి గణేష్‌కుమార్ పార్టీ ఫిరాయింపు చేసి వైసీపీకి వెళ్ళినా ప్రస్తుత రాజీకీయ పరిణామాలతో దక్షిణం తిరిగి టీడీపీ కైవసం చేసుకుంటుందని బలంగా వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ-జనసేన కేడర్ బలంగా ఉన్న దక్షిణంలో ఎమ్మెల్యే ప్రజలను మోసగించి తన స్వార్థ ప్రయోజనాలతో పార్టీ మారిపోవడం చాలా మంది ప్రజల జీర్ణించుకోలేదనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేకి గట్టిగానే బుద్ధి చెప్పాలని దక్షిణ ప్రజలు ఎదురుచూస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇదే క్రమంలో వార్డుల వారీగా పార్టీ కేడర్‌ని పెంచాల్సిన కార్పొరేటర్‌లు సైతం పార్టీలో డ్యాన్స్‌లు వేయడంతో వైసీపీ పార్టీపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుందనే చెప్పాలి. నియోజకవర్గంలో పోటీకి సిద్ధమై వార్డులో ప్రజలకు చీరలు, గడియారాలు, క్రీడ వస్తువులు పేరిట పంపిణీ కార్యాక్రమాలు చేయడంతో పాటుగా పలువురు కార్పొరేటర్‌లకు నల్ల కార్లు బహుమతిగా ఇచ్చి తనవైపు మలుచుకున్న బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ఇప్పటికే పార్టీకి గుడ్‌బాయ్ చెప్పడం మరో ఉత్కంఠకి తెరతీసింది. అక్కడితో వదిలిపెట్టకుండా ప్రెస్‌మీట్‌లు పెట్టి పార్టీపై వ్యతిరేక గళం వినిపించడంతో పార్టీ పెద్దలు కన్నెర్ర చేయడం ప్రారంభించారు. ఈ తరుణంలో సీతంరాజుకి బజన చేసే కార్పొరేటర్ బృందంలో నలుగురు కార్పొరేటర్‌లను సైతం పార్టీ పక్కన పెట్టడం దక్షిణంలో రాజకీయం వేడి వేడిగా మారింది. నల్ల కార్లు తీసుకున్న మోజులో ముగ్గురు పక్కన ఉన్నా ఆ నలుగురు కార్పొరేటర్‌లు పైపైకి ఎగరడంతో పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని తెంపి పక్కన పడేసింది.
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉచితంగా అందింస్తున్న కోటా బియ్యం పేదలకు అందకుండానే ఆమడ దూరంలో ఉన్న మిల్లులకు రూ.కోట్ల రూపాయిలకు వెళ్లిపోతున్నాయి. ఉచితంగా ఇచ్చే బియ్యంతో ఉపయోగం లేదని పేదలు రూ.10చొప్పున విక్రయాలు చేస్తున్న విషయం తెలిసి కూడా వారికి అవగాహన పరచకుండా సంబంధిత వీఆర్‌వోలు, పౌరసరఫరాలశాఖ ఆర్‌ఐలు అటుగా పట్టించుకోకపోవడంపై పలువురు నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. నెలవారీ మామ్మూళ్లుతో పాటుగా దాడులు చేయడానికి వస్తున్నామని డీలర్‌కి ముందస్తు సమాచారం అందించడంతో వచ్చే ఆమ్యామ్యాలకు అలవాటు పడిన సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించడంలో అలసత్వం చూపిస్తున్నారని సంబంధిత ఉన్నతాధికారులే పలుమార్లు హెచ్చిరించినట్టు సమాచారం. విశాఖ అర్బన్ జిల్లాలో గల అన్ని సర్కిల్స్ కంటే సర్కిల్-1లో అధిక మొత్తంలో రేషన్ బియ్యం పక్కదారి పడుతుందనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. సంబంధిత సర్కిల్ పరిధిలో ఉన్న జిల్లా పౌరసరఫరాల శాఖ సిబ్బందితో డీలర్లకు, ఎండీయూ (మొబైల్ పంపిణీ యూనిట్)ల సిబ్బందికి పరిచయాలు అధికంగా ఉండటంతో ఆడిరదే ఆట.. పాడిరదే పాట..గా మారి జోరుగా అక్రమ విక్రయాలు చేస్తున్నారని పలువురు దొంగ వ్యాపారులే అనుకుంటున్నారు. దీనిపై ఇప్పటికైన జిల్లా యంత్రాంగంలో పెద్ద అధికారులు పట్టించుకుంటారో లేదా వేచి చూడాలి.
నేత్ర న్యూస్, విశాఖపట్నం : జీవీఎంసీకి రూ.కోట్ల ఆదాయాన్ని అందించే ప్రధాన ఆస్తుల్లో పూర్ణా మార్కెట్ (సర్ధార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్) ఒక్కటిగా నిలవడం అందరికీ తెలిసిన విషయమే.. అటువంటి మార్కెట్‌ను రూ.లక్షలకే అప్పనంగా అంటగట్టడానికి చేసిన ప్రయత్నాలు ఫలించాయని అందరూ అనుకుంటున్నారు. ఏడాదికి ఓ బినామీని వేలం పాటలో నిలబెట్టిన ఓ రింగ్ మాస్టార్ ఒకవైపు.. గత కొన్నేళ్లుగా డమ్మీ డీడీలను చెల్లించి పాటలో హడావుడి చేసి ఒక్క రోజులో రూ.లక్షల లాభంతో పక్కదారి పట్టించే డమ్మీ గుత్తేదారుడు మరోవైపు.. ఆడిన రింగులాటకు జీవీఎంసీ అధికారుల సైతం కంగు తిన్నారంటే ఆశ్చర్య పడనవసరం లేదు. ప్రతీ ఏడాది జీఎస్‌టీతో కలుపుతూ రూ.కోటికి పైగా ఆదాయాన్ని అందించే పూర్ణామార్కెట్ ఈ ఏడాది జీఎస్‌టీతో కలిపినా గత పదేళ్లలో సర్కారు వారి పాట మొత్తానికి సైతం సరి తూగడానికి వీలు లేని విధంగా రూ.74.44లక్షలకు రింగు అయిపోయి జీవీఎంసీ ఆదాయాన్ని పక్కదారి పట్టించారని స్పష్టంగా కనిపిస్తుంది. పూర్ణామార్కెట్ ఆశీలకు సంబంధించి బహిరంగ వేలం పాటను నిర్వహిస్తున్నామని ప్రకటించగానే ఓ డమ్మీ గుత్తేదారుడు బ్యాంక్‌కు నేరుగా వెళ్లి డీడీలు చెల్లించి పాటలో కూర్చొని ఎదుట గుత్తేదారుడితో ముందుగా రింగు అయిపోయి రూ.లక్షలతో ఉన్న బ్యాగ్‌ను తీసుకొని వెళ్లిపోయే తీరు ఒకటైతే.. ప్రతీ ఏడాది ఓ కొత్త వ్యక్తిని రంగంలోకి దింపి పాటను కైవసం చేసుకున్న గుత్తేదారుడి తీరు మరొకటి. ఈ క్రమంలో గత ఏడాది 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.45లక్షలు చెల్లించి బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వలేదని రెండు నెలల పది రోజులకే శుభం కార్డుతో పక్కకు వచ్చేసిన బృందం ఈ ఏడాది ఎందుకు పాటకు రాలేదని ఆలోచిస్తే.. గత ఏడాది నష్టపోయిన సొమ్ము ఈ గుత్తేదారుడి వద్ద వసూలు చేసుకొని లాభం పొందడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని అక్కడ ఎంతగా రింగులు తిప్పారో చెప్పడానికి మాటలు సరిపోవడం లేదంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. రూ.60లక్షలకు సర్కార్ వారి పాటను ప్రారంభిస్తే రూ.పది వేల చొప్పున పెంచుతూ రూ.62.40లకు వచ్చిన గుత్తేదారులు జీవీఎంసీ అధికారులు అంగీకరించక పోవడంతో పాటను రూ.5వేల చొప్పున పెంచుతూ రూ.62.50లకు చేర్చారు. అక్కడ నుంచి కొత్త నాటకానికి ఆరంభం పలికి రూ.వెయ్యి చొప్పున పెంచుతూ రూ.62.55లపై రూ.1వెయ్యి అదనంగా వేసి రూ.62.56కి పాటను కైవసం చేసుకోవడం ఆస్కార్ నటనకు అద్దం పట్టినట్టు కనిపించింది. రూ.62.55లక్షలను చెల్లించడానికి సిద్ధమైన గుత్తేదారుడు వెయ్యి రూపాయల తేడాతో ఎదుట గుత్తేదారుడికి పాటను వదిలి పెట్టడం వెనుక రింగులాట ఎంత చక్కగా ఆడారో ఇట్టే అర్థం అయిపోతుంది.
– క్యాంపు రాజకీయాల్లో చంద్రబాబు దేశంలోనే నంబర్ వన్..
– ఎవ్వరు క్రాస్ ఓటు వేసారో మేము కనిపెట్టాము. సరైన టైమ్ లో సరైన నిర్ణయం తీసుకొంటాం..
– ఏదో సాధించామని టీడీపీ అనుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయాలి: సజ్జల రామకృష్ణ రెడ్డి..
నేత్ర న్యూస్, అమరావతి : ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగడంపై ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వాస్తవానికి వైసీపీ మొత్తం 7 సీట్లు గెలుపొందేందుకు అన్ని అవకాశాలు ఉండగా చంద్రబాబు క్యాంపు రాజకీయలు, ప్రలోభాలకు గురి చేసి ఒక స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. ప్రలోభాలకు లోనైన వారు వారి భవిష్యత్‌ను గురించి ఆలోచించలేదని కౌంటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడి సజ్జల పేర్కొన్నారు.
క్యాంప్ రాజకీయాలకు, ప్రలోభాలకు గురి చేయడంలో చంద్రబాబు దేశంలోనే నంబర్‌వన్ అని అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ కి చెందిన ఇద్దరు ప్రలోభాలకు గురై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. క్రాస్ ఓటింగ్ పై వైసీపీ సీనియర్ నాయకులు లోతుగా విశ్లేషించి తగు చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. “ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డవారిని గుర్తించాము. అయితే వారి పేర్లు ఇప్పుడు చెప్పము. సరైన సమయంలో వారిపై చర్యలుంటాయి,” అని సజ్జల వ్యాఖ్యానించారు.
గతంలోనూ అలాగే టీడీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని, ఇప్పుడు కూడా అదే చేశారన్నారు. టీడీపీ వాళ్లు ఎవరినో కొనుగోలు చేసినట్లు ఉన్నారని సజ్జల పేర్కొన్నారు. ఈ ఒక్క గెలుపు చూసుకుని తాము ఏదో సాధించామని టీడీపీ అనుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు.
నేత్ర న్యూస్, విశాఖపట్నం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ స్థాపించి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని పదవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో పలు సేవ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మద్దిలపాలెం, పిఠాపురం కాలనీ కళాభారతి వద్ద జనసేన ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా జనసేన జెండాను ఎగరవేయాగ జనసైనికులు జెండా వందనం చేశారు. అనంతరం పది కేజీల కేక్ కట్ చేసి జనసైనికులకు అందజేసి పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు.
అనంతరం రోటరీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జనసైనికులు, అభిమానులు కార్యక్రమంలో పాల్గొని రక్త దానం చేశారు. ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ వైసిపి అరాచక పాలనలో రాష్ట్ర ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారన్నారు. ముఖ్యంగా చదువుకున్న యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం వలన తీవ్ర నిరాశ నిసృహులకులోనై ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో యువత పవన్ కళ్యాణ్ కి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. అందుకు ఇటీవల రణస్థలంలో జరిగిన యువగళం సభ విజయవంతం కావడమే నిదర్శనం అన్నారు. పార్టీ కార్యకర్తలు, శ్రేణులు జనసేన అభివృద్ధికి, రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడానికి ఇంత మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు రావడాన్ని ఆయన అభినందించారు. సుమారు 100కి పైగా జనసైనికులు, వీర మహిళలు రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో చైతన్య, రూప, శేఖర్, పీతల మదుసూదన్ రావు, పండు, సత్యం, తిరుమల, రవి, కిషోర్ పాల్గొన్నారు.
నేత్రన్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి): హెయిర్ పిన్ నుంచి ఏరోప్లేన్‌కి ఉపయోగపడే సామాగ్రికి సైతం ఆతిథ్యం అందిస్తున్న పూర్ణామార్కెట్ ఇప్పుడు అభాసు పాలవుతుంది. కొంత మంది నకిలీ వ్యాపారులు చేస్తున్న చేష్టల వలన వినియోగదారులు అటుగా రావడానికి సైతం సతమతం అవుతున్నారు. స్థానిక పోలీసు యంత్రాంగం, అద్దెలు వసూలు చేస్తున్న జీవీఎంసీ ఉన్నతాధికారులు అటుగా చర్యలు తీసుకోక పోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని పలువురు వినియోగదారులు బోరుమంటున్నారు. రహదారిపై అనధికారికంగా తిష్టవేసి అక్రమ వ్యాపారాలు చేస్తున్న నకిలీ వ్యాపారుల వలన నిత్యం నరకయాతన పడుతున్నామని రోజువారీ వచ్చే వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ధరలు వ్యత్యాసంపై బేరాలు ఆడితే బెధిరింపులకు పాల్పడుతున్నారని, భయంతో బదులు ఇస్తే కత్తులు బయటకు తీసి దాడులకు పాల్పడుతున్నారని ఓ బాధితురాలు భయంతో సమాధానం ఇచ్చింది. పెద్ద పెద్ద దుకాణాల నుంచి చిన్నపాటి జంగిడీల వరకు సుమారు 600దుకాణాలకు ఆశ్రయం ఇచ్చిన పూర్ణామార్కెట్‌కి ఇప్పుడు పరువు పోతుంది. 92ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఘటనలు భయాందోళన కల్గిస్తున్నాయి. రెండు నెలల క్రితం జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్న ఓ జడ్జి కుటుంబం మార్కెట్‌కి వచ్చి పోయే సమయంలో ఓ వ్యాపారి జడ్జిపై అసభ్యకరంగా మాట్లాడటంతో పాటుగా దాడికి ప్రయత్నించడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందించారు. ఇదే క్రమంలో రెండు రోజుల క్రితం ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీసు భార్య కూరగాయలు కొనుగోలు నిమిత్తం మార్కెట్‌కి వచ్చి వెళ్లే క్రమంలో ఆమెపై స్థానికంగా ఉన్న ఓ మహిళా వ్యాపారి అసభ్యకరమైన పదజాలంతో రెచ్చిపోవడంతో పాటుగా చేతిలో ఉన్న చిన్నపాటి కత్తితో బెధిరింపులకు పాల్పడటంపై పలువురు నుంచి తీవ్ర విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి ఘటనల నేపథ్యంలో రెండు నెలల క్రితం మార్కెట్ లోపలి భాగంలో వ్యాపారాలు చేస్తున్న యజమానులు మార్కెట్‌కి స్వచ్ఛందగా బంద్‌ని ప్రకటించిన నేటికి ఎటువంటి ఫలితం లేకపోయింది. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న జోన్-4 జోనల్ కమిషనర్ విధులు సక్రమంగా నిర్వర్తించకుండా చోద్యం చూడటంతో పూర్ణామార్కెట్‌కి ఈ పరిస్థితి పట్టిందని ఓ వృద్ధ వ్యాపారి ఆరోపించారు.
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : పూర్ణామార్కెట్ పార్కింగ్ ప్రాంతంలో అక్రమంగా చేస్తున్న వ్యాపారాలను వెంటనే తొలిగించి తమకు న్యాయం చేయాలని సర్ధార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో పూర్ణామార్కెట్‌కి బుధవారం సంపూర్ణ బంద్‌ని ప్రకటించి నిరసన చేపట్టారు. ఉదయం ఆరు గంటల సమయంలో రహదారిపై బైఠాయించిన వ్యాపారులు సంబంధిత అధికారులు హామి ఇచ్చే వరకు నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. అనంతరం మార్కెట్ ఆవరణంలో వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సందర్భంగా సంఘ అధ్యక్షుడు కొండా రామకృష్ణ మాట్లాడుతూ పార్కింగ్ ప్రాంతంలో ఎటువంటి వ్యాపారాలకు అనుమతి లేదని, కొంత మంది కుట్రపూరిత చర్యల వలన రహదారులపై ఈ తరహా వ్యాపారాలు పెరిగిపోయాయని తెలిపారు. దీంతో తమ వ్యాపారాలు పూర్తి స్థాయిలో జరగడం లేదన్నారు. మార్కెట్ లోపలి భాగంలో వ్యాపారాలు లేక సంబంధిత వ్యాపారులు అప్పులలో మునిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటుగా సంబంధిత జీవీఎంసీ అధికారులకు, ట్రాఫిక్ పోలీసులకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ బంద్‌ని ప్రకటించి నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు.
మార్కెట్‌లో ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తున్న వ్యాపారులు అప్పులపాలైపోతుంటే కొత్తగా వస్తున్న నకిలీ వ్యక్తులు వ్యాపారులుగా మారీ రహదారులపై ఇష్టానుసారంగా వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని దండీగా సంపాధిస్తున్నారని మండి పడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన న్యాయం జరగకపోవడంతో దుకాణాలకు తాళాలు వేసి నిరసన తెలుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం స్వచ్ఛంగా దుకాణాలకు తాళాలు వెయ్యడం 92ఏళ్లలో మొదటసారి అని పలువురు వ్యాపారులు వెల్లడిరచారు. అధికారులు హామి ఇచ్చే వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతునే ఉంటామని నిరసన కార్యక్రమంలో నినాదాలు చేశారు. ఒక వైపు ఎండ తీవ్రత పెరుగుతున్న పట్టించుకోకుండా నిరసన జ్వలలను రేపారు.
పూర్ణామార్కెట్లో నిత్యం వేలాది వినియోగదారులు వస్తుంటారు. పండగల సమయంలో అసలు చూడక్కర్లేదు. అలాంటిది అక్కడ సరైన పార్కింగ్ వసతి లేదు. కార్లు వస్తే నిమిషాల పాటు ట్రాఫిక్ జాం. ఒక్కోసారి దుకాణాల ముందే వాహనాలు నిలిపేస్తున్నారు. దీంతో తమకు ఇబ్బందులు తప్పడం లేదని, చిరు వ్యాపారులు సిండికేట్గా మారి తమపైనే దౌర్జన్యాలకు దిగు తున్నారని వాపోతున్నారు. పోలీసులు బీట్ కాస్తున్నా తమకు రక్షణ లేకుండా పోయిందని, జీవీఎంసీ అధికారులు అప్పుడప్పుడు మాత్రమే వచ్చి తనిఖీలు చేసుకుని వెళ్లిపోతున్నారని ఆరోపిస్తున్నారు. అత్యధిక ఆదాయం వచ్చే అలాంటి చోట అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో చెప్పాలని, మామ్మూళ్లు వసూలు చేసుకుని తమ పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.
మార్కెట్ రహదారులపై వ్యాపారాలు నిర్వహిస్తే సహించేది లేదని, ఎవ్వరికి కేటాయించిన దుకాణాల్లో వాళ్లు వ్యాపారాలు చేసుకుంటే అందరు బాగుంటారని వెల్లడిరచారు. నిత్యవసర సరుకులు కొనుగోలుకు వస్తున్న వినియోగదారులపై నకిలీ వ్యాపారులు దాడులకు దిగడంతో మార్కెట్ పరువు పోతుందని, ఇప్పటికైనా శాంతిభద్రతల పోలీసులు స్థానికంగా బీట్ బుక్ పెట్టి వ్యాపారులకు రక్షణ కల్పించాలని ప్రాధేయ పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా బీట్ సిబ్బందిని పెంచి రహదారులపై వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులపై చర్యలకు సిద్ధం కావాలని కోరుతున్నారు. స్థానిక ప్రజా ప్రతినిథుల పైరవీలతో వ్యాపారాలు చేసినా సహించేది లేదని తేల్చి చెప్పారు. మరోసారి వ్యాపారాలు రహదారిపైకి వస్తే తాము తీసుకోవల్సిన చర్యలు తీసుకుంటామని వెల్లడిరచారు.
మార్కెట్ వ్యాపారులు చేసిన నిరసన కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని సర్ధార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ వర్తక సంఘ సభ్యులు వెల్లడిరచారు. స్థానిక శాంతిభద్రతల పోలీసులతో పాటుగా ట్రాఫిక్ పోలీసులు ఎంతో సహకరించారని వెల్లడిరచారు. జీవీఎంసీ జోనల్ కమిషనర్‌తో పాటుగా మేయర్ నుంచి కూడా మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. నిరసనకు సహకరించిన అందరికీ ధన్యవాదలు సైతం చెప్పారు.
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : జీవీఎంసీ జోన్-4లో టౌన్‌ప్లానింగ్ రింగ్ మాస్టర్‌లు రెచ్చిపోతున్నారు. వార్డు స్థాయిలో జీవీఎంసీ ఉన్నతాధికారుల పర్యావేక్షణ లోపంతో ఇష్టానుసారంగా అనధికార అంతస్తులతో భవనాలను నిర్మిస్తున్న యజమానులకు అండగా ఉంటూ దండుకుంటున్నారు. సక్రమంగా నిర్మించే భవనాలకు అనుమతులు ఇవ్వడానికి రూ.లక్షల్లో దండుకుంటున్న టౌన్‌ప్లానింగ్ అధికారులు అక్రమంగా అదనపు అంతస్తులతో నిర్మించే భవనాల వద్ద ఎంత మొత్తంలో వసూలు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాతనగరంలో గల పలు వార్డుల్లో తమదైన శైలిలో విరుచుకుపడుతూ టౌన్‌ప్లానింగ్ సిబ్బంది వీరంగం సృష్టిస్తున్నారని పలు సమాచార మార్గాల ద్వారా సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నా అటుగా పట్టించుకునే నాథుడే లేడని పలువురు ఆరోపిస్తున్నారు.
జోన్-4 టౌన్‌ప్లానింగ్ విభాగంలో చాలా ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బంది తాము ఆడిరదే ఆటగా.. పాడిరదే పాటగా.. మారిపోయిందని, దీనికి తోడు కొత్తగా వచ్చిన వార్డు సచివాలయ సిబ్బంది తమదైన శైలిలో విధులు నిర్వహించకుండా బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్, చైన్‌మాన్ సిబ్బంది కనుసైగల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. దీనికి గాను అప్పనంగా వచ్చిన ఆమ్యామ్యాలు తీసుకొని తప్పించుకుంటున్నారు. ఇరుకు సందుల్లో నాలుగైదు అంతస్తులు నిర్మిస్తూ స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నా అటుగా సంబంధిత జీవీఎంసీ అధికారులు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం తీవ్ర విస్మయానికి గురిచేస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికైనా సంబంధిత జీవీఎంసీ ఉన్నతాధికారులు స్పందించి జోన్-4 టౌన్‌ప్లానింగ్ సిబ్బంది, వార్డు ప్లానింగ్ సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ప్రజల నుంచి రూ.లక్షలు కాజేస్తున్న కాటికాపరుల నుంచి ఇప్పటికైనా పూర్తి స్థాయిలో విముక్తి కల్పించాలని పలువురు ప్రజలు ప్రాధేయపడుతున్నారు.
వార్డు స్థాయిలో విధులు నిర్వహించే టౌన్‌ప్లానింగ్ చైన్‌మెన్ సిబ్బంది చేస్తున్న చేష్టలకు పేద ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. జోన్-4 పరిధిలో పనిచేస్తున్న చైన్‌మాన్‌లు జీవీఎంసీ అనుమతి పొందిన సర్వేయర్‌లతో చేతులు కలిపి అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. తీరా బిల్డింగ్‌లకు అనుమతి ఉందా..? అని ప్రశ్నిస్తే అన్ని అనుమతులు ఉన్నాయని, సర్వేయర్‌ల నుంచి తీసుకున్న నకిలీ ప్లాన్‌లను చూపించి తప్పించుకుంటున్నారు. వార్డు పరిధిలో ఎక్కడ నిర్మాణం నిర్మిస్తున్న టౌన్‌ప్లానింగ్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందరూ పెళ్లికి వెళ్లినట్టు గుంపుగా వెళ్లి బేరసారాలు చేస్తున్నారు. అక్కడ వ్యతిరేక పరిణామాలు ఎదురైతే వెంటనే కన్నెర్ర చేసి నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. జోన్`4లో ఎన్నో ఏళ్ల తరబడి ఒకే విభాగంలో పాతుకుపోయిన టౌన్‌ప్లానింగ్ సిబ్బంది వార్డులో చేసిందే చట్టంగా మారింది. ఇప్పటికే రూ.లక్షలాది సొమ్మును దండుకున్న టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్, చైన్‌మాన్ సిబ్బంది ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టుకున్నారని జోన్-4లో విధులు నిర్వహిస్తున్న తోటి ఉద్యోగులే గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికైనా జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగంపై అవినీతి నిరోధక శాఖ దృష్టి కేంద్రీకృతం చేయాలని పలువురు ప్రజలు ప్రాధేయపడుతున్నారు.
– పోలమాంబ అమ్మవారి ఆలయంలో 1001 కొబ్బరికాయలతో ప్రత్యేక పూజలు..
– మానసిక వికలాంగుల పాఠశాలలో కేక్ కటింగ్..
– విమ్స్ లో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ..
నేత్ర న్యూస్, విశాఖపట్నం: జనసేన కొర్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద వాల్తేర్ కరక చెట్టు పొలమంబ అమ్మవారి దేవాలయంలో పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి 1001 కొబ్బరి కాయలు కొట్టి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ఉండాలని వేడుకున్నారు.
ఆదర్శ్ నగర్ హిడెన్ స్పోర్ట్స్ మానసిక వికలాంగుల పాఠశాలలో కేక్ కట్టింగ్ చేసి మానసిక వికలాంగుల చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం విమ్స్ హాస్పిటల్ లో రోగుల అందరికీ పండ్లు, రొట్టెలు, పానీయాలు పంపిణీ చేసి జనసైనికులు సంబరాల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పవర్ ఏంటో అధికార పార్టీకి చూపిస్తామన్నారు. ఆంధ్రలో ప్రతీ ఒక్కరూ పవన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరుగుతున్న పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ సంబరాలే దీనికి ఉదాహరణ అన్నారు. పవన్ అభిమానులు, జన సైనికులకు, ప్రజలు ఒక పండుగలా పవన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం రాష్టానికి కొత్త నాయకత్వాని ఆహ్వానించండమేనన్నారు. పవన్ జనాదరణకు అధికార, ప్రతిపక్ష పార్టీలు బయపడ్తున్నాయన్నారు. ఆయన పుట్టిన రోజున సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. కార్యక్రంలో పెద్ద ఎత్తున పాల్గున్న పవన్ అభిమానులు, మెగా అభిమానులు పాల్గున్నారు.
– పెండింగ్ అక్రిడేషన్లు తక్షణమే జారీ చేయాలి..
– జర్నలిస్టులపై ఐ అండ్ పీఆర్ అధికారులు, సిబ్బంది వివక్ష, వేధింపులు తగదు..
– జిల్లా కలెక్టర్ కు లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ వినతి..
నేత్ర న్యూస్, విశాఖపట్నం: నిబంధనలకు లోబడి స్థానిక పత్రికలను నిర్వహిస్తున్నప్పటికీ వాటికి ఇప్పటి వరకు అక్రిడేషన్ల జారీ చేయడంలో అన్యాయం జరుగుతుందని లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ (ఎల్ఎన్ఏ) ప్రతినిధి బృందం జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున దృష్టికి తీసుకెళ్లారు. గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో ఆయన్ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. స్థానిక దినపత్రికలు, పిరియాడికల్స్ లో పని చేస్తున్న జర్నలిస్టులు అక్రిడేషన్ల కోసం దరఖాస్తులు చేసుకొని రెండేళ్లు అవుతున్న ఇప్పటి వరకు చాలా మందికి జారీ చేయలేదని కలెక్టర్ కు తెలిపారు. కొన్ని డైలీ దిన పత్రికలకు నిబంధనల ప్రకారం 20 అక్రిడేషన్లు రావాల్సి ఉండగా పదిలోపే పరిమితం చేసారని వివరించారు.
పీరియాడికల్స్ కు రెండు అక్రిడేషన్లు రావాల్సి ఉండగా ఒకటికే పరిమితం చేశారని తెలిపారు. చాలా పత్రికలకు ఆ మాత్రం కూడా ఇంత వరకు ఇవ్వకుండా వివక్ష చూపుతూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆయనకు ఫిర్యాదు చేశారు. దరఖాస్తులను మాయం చేయటం, కొన్ని దరఖాస్తులను స్వీకరించకపోవడం, అక్రిడేషన్ల జారీలో తీవ్ర జాప్యం పాటిస్తున్నారని ఆయనకు తెలిపారు.
సమాచార, పౌర సంబంధాల శాఖలో అవినీతి ఆరోపణలు అధికంగా ఉన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తప్పుడు సమాచారాన్ని పైస్థాయి అధికారులకు అందజేస్తూ అక్రిడేషన్ల జారీకి అడ్డుపడుతున్నారని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ తో ఫోన్ లో వెంటనే మాట్లాడారు. నాలుగు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించాలని, కొందరికి ఇచ్చి కొందరకు నిరాకరించారనే ఆరోపణలు రాకూడదని ఆదేశించారు. అక్రిడేషన్ లకు సంబంధించిన సమాచారాన్ని రాతపూర్వకంగా జర్నలిస్టులకు అందజేయాలని తెలిపారు. అదే విధంగా అధికార పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో హామీ మేరకు జర్నలిస్టులకు 300 గజాల ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ జీవో 142 సవరణ, కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం, అక్రిడేషన్ల జారీకి జీఎస్టీ నిబంధన రద్దు, కమిటీలలో జర్నలిస్టు సంఘాలకు ప్రాధాన్యత తదితర జర్నలిస్టుల డిమాండ్లతో కూడిన మరో వినతిపత్రాన్ని ముఖ్యమంత్రి పంపే నిమిత్తం కలెక్టర్ కు అందజేశారు.
దీన్ని ప్రభుత్వానికి పంపిస్తామని ఆయన తెలిపారు. కలెక్టర్లను కలిసిన లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందంలో అధ్యక్షుడు పి. సత్యనారాయణ, కార్యదర్శి ధవళేశ్వరపు రవికుమార్, ప్రతినిధులు నిట్టల శ్రీనివాస్, బి. నారాయణరావు, బి. శివప్రసాద్, హరనాథ్, మహేష్, అర్.అబ్బాస్, చక్రవర్తి, బి.ఎ. నాయుడు, ఎస్.సన్యాసిరావు, శివ కుమార్ రెడ్డి, ఎం.శ్రీహరి తదితరులు పాల్గున్నారు.