Please assign a menu to the primary menu location under menu

Friday, April 19, 2024

Lifestyle

GovernmentLifestyle

వండర్స్‌ సృష్టిస్తున్న వండర్‌ కిడ్స్‌

 • సరికొత్త విద్యా విధానంలో మెలుకువలు నేర్పిస్తున్న ఉపాధ్యాయులు..
 • వందలాది రికార్డులకు కైవసం చేసుకున్న స్కూల్‌ ఆఫ్‌ వండర్‌ కిడ్స్‌..
 • చిట్టి చిన్నారుల భవితకు బంగారు బాటలను వేస్తున్న యాజమాన్యం..
 • కేజీ స్థాయిలో పుస్తకాల భారానికి విముక్తి చెప్పిన విద్యా నైపుణ్యం..
 • నగరంలో పలు విద్యా సంస్థల కంటే మెరుగైన ఫలితాలు కైవసం..

బాల్యాన్ని సక్రమమైన పద్ధతిలో మలుచుకుంటే బంగారు భవిత సొంతమవుతుందని అక్కడి ఉపాధ్యాయుల దృఢ నమ్మకం. అదే మార్గాన్ని అక్కడ అందిపుచ్చుకోవడంతో ఆ విద్యార్ధులకు విజయావకాశాలు పుష్కలంగా అందుతున్నాయి. విద్యా వ్యవస్థలో ఉండే లోటు పాట్లును ప్రయోగాత్మకమైన పద్ధతిలోకి తీసుకొచ్చి ఫలితాలను చూసిన స్కూల్‌ ఆఫ్‌ వండర్‌ కిడ్స్‌ డైరక్టర్‌ మళ్ల రామునాయుడు చేసిన ఓ చిన్న ప్రయత్నం పెద్ద వృక్షమై ఇప్పుడు తియ్యని ఫలాలనందిస్తుందని ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో మార్పులకు అనుగుణంగా విద్యాబోధన అందిస్తునే తమదైన పద్ధతిలో మెలుకువలు నేర్పించడంతో స్కూల్‌ ఆఫ్‌ వండర్‌ కిడ్స్‌లో చిన్నారులు వండర్స్‌ సృష్టిస్తున్నారు. చిట్టి పొట్టి చిన్నారులకు పుస్తకాలతో ఒత్తిడి ఉండకూడదని, ఆడుకునే వయసులో ఆట బొమ్మలు తప్ప పుస్తకాల బరువులు తెలియకూడదని ఆయన దృఢంగా నమ్మారు. సరికొత్త ఆలోచనతో ప్రారంభించిన ప్రయోగంలో మొదట ఒడుదుడుకులు వచ్చినా ఎట్టకేలకు విజయతీరాలను చేరుకొని వందలాది రికార్డులను కైవసం చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఓ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ అక్కడి విద్యార్థులపై చేసిన ప్రయోగం నేటికి వదిలి పెట్టలేదనే చెప్పాలి. అక్కడి చేసిన మొదటి ప్రయత్నంలో చిరు సమస్యలు వచ్చినా పట్టు వదలని విక్రమార్కుడిలా ఆ ప్రయోగాన్ని పట్టి పట్టి ప్రయత్నించడంతో అద్భుతాలు సృష్టించిన వ్యక్తిగా నిలిచారు. ఆ తరువాత 2001లో స్కూల్‌ ఆఫ్‌ వండర్‌ కిడ్స్‌ పేరిట ఓ ప్రయోగశాలనే ప్రారంభించారు. తమ వద్దకు వస్తున్న చిట్టి పొట్టి చిన్నారుల చేతుల్లో బొమ్మలు మాత్రమే చూడాలని, పుస్తకాలను అప్పుడే చూడకూడదని నిర్ణయించుకొని ప్రయోగాలను కొనసాగించారు. త్వరలో దేశమంతట ఉపయోగించనున్న నూతన విద్యా విధానాల అనుగుణ పద్ధతులను 2001లోనే ప్రారంభించి నేటికి 130కి పైగా రికార్డులను కైవసం చేసుకొని దేశ నలుమూలలకు చాటి చెప్పారు. కేజీ నుంచి ఆపై తరగతులు చిన్నారులకు చెప్పే ఉపాధ్యాయులకు కూడా ఇక్కడ ప్రత్యేక తరగతులు ఉంటాయంటే ఆశ్చర్య పడనవసరం లేదు. ప్రతీ అంశంలో ఓ కొత్త పద్ధతిని ప్రయోగించడంలో ఈ పాఠశాలకే దక్కిందని చెప్పాలి. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలకు పుస్తకాలు లేకుండా చెప్పే విధానంలో ఓ వింత సైతం దాగి ఉందని చెప్పడానికి యూకేజీ ఆఖరి రోజుల్లో ఆ చిన్నారులు ఆంగ్ల పత్రికలు సరళమైన పద్ధతిలో చదవి వినిపించడమే.. తరగతుల వారీగా ఉపాధ్యాయులు సోపానాలను వెయ్యడంతో అక్కడి చిన్నారులు విద్యార్థి దశను విజయాల దిశగా మలుచు కుంటున్నారు. జిల్లా స్థాయిలో ప్రారంభించి రాష్ట్రాలకు తమ పాఠశాల ఉనికి తీసుకెళ్లడంతో పాటుగా దేశ ప్రథమ పౌరుడితో ప్రశంసలందుకున్నారంటే వండర్స్‌ సృష్టిస్తున్న ఈ కిడ్స్‌ చేస్తున్న వండర్స్‌ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేటికీ విజయవకాశాలను అందుకుంటున్న స్కూల్‌ ఆఫ్‌ వండర్‌ కిడ్స్‌ని ఓసారి చుట్టి వద్దాం పదండీ..!

 • రోజు ప్రయోగాలు జరుగుతునే ఉంటాయి..!

స్కూల్‌ ఆఫ్‌ వండర్‌ కిడ్స్‌.. ఈ పదం పాఠశాల కంటే ప్రయోగశాలగానే అందరికీ సుపరిచితం. రికార్డులకు రుజువైన మార్గాన్ని చూపించే ఓ విద్యాలయంగా ఇప్పటికే వందలాది రికార్డులను కైవసం చేసుకొని ప్రథమ స్థానంలో నిలిచింది. స్నేహపూర్వక, ఉల్లాసభరితమైన వాతావరణంలో విద్యార్థుల బల, బలహీనతలను విశ్లేషించి అత్యుత్తమమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది ఈ స్కూల్‌ ఆఫ్‌ వండర్‌ కిడ్స్‌. తమ పిల్లలపై చేసిన ప్రయోగమే పాఠశాలని ప్రయోగశాలగా మార్చడానికి కారణమని డైరక్టర్‌ మళ్ల రామునాయుడు మాటల్లో పలుమార్లు వెల్లడిరచారు. తమ పెద్ద కుమార్తె రజితపై ఈ తరహా విద్యా విధానాన్ని ప్రయోగించడంతో 1996లో హెచ్‌ఆర్‌డీ మంత్రి ఎస్‌.ఆర్‌.బొమ్మై చేతుల మీదుగా జాతీయ బాలల అవార్డును ఆరేళ్ల ప్రాయంలో గెలుచుకున్నారంటే ఆయన చేసిన ప్రయోగ స్థాయికి వందలాది రికార్డులు అద్ధం పడుతున్నాయని చెప్పాలి. నాటి నుంచి ఆ మార్గంలో విద్యార్థులకు కొత్త కొత్త మెలుకువలు నేర్పిస్తూ విద్యావంతులుగా చేస్తున్నారు.

 • ఉపాధ్యాయులకు సైతం ప్రత్యేక శిక్షణ..
  ఈ పాఠశాలలో విద్యార్థులతో పాటుగా ఉపాధ్యాయులకు సైతం ప్రత్యేక వారాంతపు తరగతులు ఉంటాయంటే కొత్తగా ఆశ్చర్యపడనవసరం లేదు. చిన్నారులకు నేర్పించే విలువైన విద్యలో విజ్ఞానం మాత్రమే ఉండాలని ప్రత్యేక శ్రద్ధతో ఉపాధ్యాయులకు తరగతులు నిర్వహిస్తారు. వారంలో విద్యార్థులకు చెప్పిన విషయ సూచికను సైతం తెలుసుకొని సరికొత్త విద్యా విధానానికి నాంది పలుకుతున్నారు. విద్యార్థులపై ఉన్న పర్యావేక్షణ ఉపాధ్యాయులపై కూడా ఉండటంతో ఇక్కడ ప్రతీ ఒక్క విద్యార్థి విజయ సోపానాన్ని చేరుకుంటున్నారు.

 • పరీక్షలకు మాత్రమే పరిమితం కానీ చదువులు..
  నాటికి మాత్రమే కాటికి కాదు అనే విధానానికి పూర్తి వ్యతిరేకతను చూపించే పాఠశాలల్లో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్న స్కూల్‌ ఆఫ్‌ వండర్‌ కిడ్స్‌ విద్యా విధానం ఓ అద్భుతంగానే చెప్పాలి. పరీక్షలకు ఉపయోగ పడిన చదువు నిజ జీవితంలో ఏ విధంగా ఉపయోగించాలి, ఎక్కడ ఏ పరిస్థితిని ఎలా పరిష్కరించాలి అనే విషయాలను సున్నిత మార్గాల్లో నేర్పించడం ఈ పాఠశాల ప్రత్యేకతగానే చెప్పాలి. బట్టి పట్టిన పిల్లలుగా కాకుండా బట్టి పట్టిన పుస్తకాల మాదిరి విజ్ఞానాన్ని మెదడులో భద్రపరుచుకోవడం స్కూల్‌ ఆఫ్‌ వండర్‌ కిడ్స్‌ ప్రత్యేకత.

 • సోపాన పద్ధతిలో విద్యార్థులకు విద్యా బోధన..
  సరికొత్త విద్యా విధానాన్ని అవలంభించడంలో స్కూల్‌ ఆఫ్‌ వండర్‌ కిడ్స్‌ ముఖ్య మెలుకువ ఈ సోపాన పద్ధతిగానే చెప్పాలి. విద్యార్థి దశను దృష్టిలో ఉంచుకొని విపుల పద్ధతిలో విద్యను నేర్పిస్తారు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలో చిన్నారులకు పుస్తకాలకు ఎటువంటి సంబంధం లేకుండా విద్యా బోధన ఉంటుందని స్కూల్‌ ప్రిన్సిపల్‌ మళ్ల వాణిశ్రీ వెల్లడిస్తున్నారు. ఈ మూడు తరగతిల్లో పుస్తకాల భారానికి స్వస్తి పలుకుతూ విద్యా బోధన ఉంటుందని, ఆ రెండున్నారేళ్ల తరువాత యూకేజీ ఆఖరిలో ఆంగ్ల దిన పత్రికల్లో విషయాలను క్షుణ్ణంగా చదవడం చేస్తారని ఆమె వివరించారు. ఆ తరువాత మొదటి తరగతిలో అన్ని అంశాల్లో తర్ఫీదు ఇస్తునే ఆంగ్లంపై పట్టు సాధించే విధంగా పాఠ్య పుస్తకాలను నేర్పిస్తామని తెలిపారు. ఆ విద్యార్థులకు ఆ సంవత్సరం ఆఖరిలో ఐదోవ తరగతిలో ఉపయోగిస్తున్న పాఠ్య పుస్తకాల్లో పలు అంశాలను తల్లిదండ్రుల సమక్ష్యంలో చెప్తే విద్యార్థి చూడకుండా చక్కటి దస్తూరితో రాసే విధంగా తయారవుతారన్నారు. రెండోవ తరగతిలో హిందీపై అధిక తర్ఫీదునిస్తామని ఆ సంవత్సరం ఆఖరిలో దిల్లీలో చదువుతున్న ఐదోవ తరగతి విద్యార్థి పాఠ్య పుస్తకాలల్లో అంశాలను ఉపాధ్యాయులు చెప్పిన విధంగా విద్యార్థి చూడకుండా చక్కటి దస్తూరితో రాయడం జరుగుతుందన్నారు. పది మంది విద్యార్థుల పుస్తుకాలను చూస్తే అందరి చేతిరాత ఒకే విధంగా ఉంటుందని వివరించారు. మూడోవ తరగతిలో తెలుగుపై మక్కువను పెంచే విధంగా నేర్పించడం జరుగుతుందని, ఆ సంవత్సరం ఆఖరిలో తెలుగు దినపత్రికలను సునాయాసంగా చదువుతారని, అంతే చక్కటి దస్తూరితో రాస్తారని తెలిపారు. నాల్గోవ తరగతిలో లెక్కలపై పట్టు సాధించే విధంగా ఆ తరువాత తరగతుల్లో జ్ఞాపకశక్తి పెంపొందించే విధంగా మెలికువలు నేర్పించడంతో పాటుగా విషయ పరిజ్ఞానాన్ని పెంచుకునే విధంగా చిన్నారులకు విద్యను నేర్పించడం జరుగుందని ఆమె వివరించారు. ఇదే క్రమంలో లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌, ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌, వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌, జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ వంటి 130కి పైగా రికార్డ్‌లను తమ విద్యార్థులు కైవసం చేసుకున్నారని తెలిపారు.

 • నైతిక విలువులకు ప్రాధాన్యత ఇచ్చే విద్యార్థిని తయారు చేస్తాం..

స్కూల్‌ ఆఫ్‌ వండర్‌ కిడ్స్‌లో విద్యార్థులకు విద్యను నేర్పించడం ఎంతటి బాధ్యతగా స్వీకరిస్తామో నైతిక విలువలకు సైతం ప్రాధాన్యత ఇచ్చే విధంగా విద్యార్థులను తయారుచేస్తాం. ఉపాధి సంపాధించడం కంటే సమాజంలో ఉత్తమంగా ఉండే విధంగా తయారు చేసి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో విద్యార్థులను నిలబెడతాం. ఒక రూపాయిని సక్రమమైన మార్గంలో సంపాధించడంతో పాటుగా ఆ రూపాయిని అదే మార్గంలో ఖర్చు చేసే విధానం సైతం నేర్పించడం మా ప్రత్యేకత. మారుతున్న కాలంలో తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను పూర్తి స్థాయిలో అరికట్టే విధంగా విద్యార్థులకు నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా చేస్తాం. – మళ్ల రామునాయుడు, వాణిశ్రీ (స్కూల్‌ ఆఫ్‌ వండర్‌ కిడ్స్‌ డైరక్టర్‌, ప్రిన్సిపల్‌).

CrimeLifestyle

పోలీస్‌ ముసుగులో ఫైనాన్స్ దందా..!

– మహారాణిపేట ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌లో ఫైనాన్స్‌ వ్యాపారులు..
– విధుల మధ్యలో దర్జాగా ఫైనాన్స్‌ కలెక్షన్‌ చేస్తున్న ట్రాఫిక్‌ సిబ్బంది..
– యూనిఫాంతో దర్జాగా తమ పరిధిలో చిట్టీలు, వడ్డీ వ్యాపారం..
– కూడళ్లలో ట్రాఫిక్‌ సమస్యలు ఎదురైనా పట్టించుకోని ఇరువురు..
– భారీ వడ్డీలతో పేద ప్రజలను పట్టి పీడిస్తున్న ఇద్దరు హోమ్‌ గార్డులు..
– అనాధికారంగా ఫైనాన్స్‌ చేస్తున్న చోద్యం చూస్తున్న ప్రత్యేక విభాగం..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి): నిత్యం రద్ధీగా ఉండే కూడళ్లలో విధులు నిర్వహించాల్సిన సిబ్బంది సమయాన్ని పాటించడం లేదు. తమకు కేటాయించిన డ్యూటీలను సైతం పక్కన పెట్టి భారీగా పెట్టిన పెట్టుబడులను వసూలు చేసుకోవడానికి పరుగులు పెడుతున్నారు. సాధారణ రోజుల్లోనే రద్ధీగా ఉండే మహారాణిపేట పోలీసు స్టేషన్‌ పరిధి కూడళ్లలో ఇక పండగ వస్తే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వస్త్ర, బంగారం దుకాణాలతో పాటుగా ఇతర వస్తువులను విక్రయించే దుకాణాలకు భారీ సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగించడం వలన ఆ కూడళ్లలో తీవ్ర రద్ధీ ఏర్పడుతుంది. అటువంటి ప్రధాన జంక్షన్‌లో సైతం రోజువారీ విధులు నిర్వహించాల్సిన ఇద్దరు హోమ్‌గార్డ్‌లు మాత్రం తమకు కేటాయించిన విధులను సైతం పక్కన పెట్టి దసరా చిట్టీలు, ఫైనాన్స్‌, వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నారు. సాధారణంగా రోజుకి 8గంటల పాటు విధులు నిర్వహించాల్సిన సిబ్బంది సమయం మధ్యలోనే కూడళ్లను గాలికి వదిలిపెట్టి వడ్డీ వ్యాపారం చేసుకోవడంలో నిమగ్నమైపోయారు. విధుల మధ్యలో కలెక్షన్‌కి పరుగులు పెట్టిన సిబ్బంది తన పైస్థాయి అధికారి బీట్‌ చెకింగ్‌కి వచ్చే సమయానికి మాత్రం యథాస్థానంలో ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మహారాణిపేట ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో హోమ్‌గార్డులుగా విధులు నిర్వహిస్తున్న కె.గణేష్‌ (హెచ్‌జీ నంబర్‌-459), పి.లక్ష్మీనారాయణ (హెచ్‌జీ నంబర్‌-189)లు పోలీసు వ్యవస్థకు వ్యతిరేక మార్గంలో ప్రయాణిస్తున్నారు. సంబంధిత స్టేషన్‌ పరిధిలో ఉన్న పలు చిరువ్యాపారులకు అనాధికారంగా దసరా చిట్టీలతో పాటుగా ఫైనాన్స్‌ ఇచ్చి రోజువారీ వడ్డీ, అసలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ సాధారణ సమయంలో చేస్తున్నారని అనుకుంటున్నారా..? అలా అనుకుంటే మీరు పప్పులో కాదు తప్పులో కాలేసినట్టే..! వాళ్లకి కేటాయించిన కూడల్లో ట్రాఫిక్‌ రద్ధీ అధికంగా ఉండే సాయంత్రం 7.30గంటల నుంచి 9.30గంటల సమయంలో మాత్రమే ఈ ఫైనాన్స్‌ కలెక్షన్‌ చేస్తున్నారని ‘నేత్ర న్యూస్‌’ నిఘా బృందం పలు వీడియో రికార్డింగ్‌ల ద్వారా ఆధారాలు సైతం స్వీకరించారు. ప్రధాన కూడళ్లలో గత వారం రోజుల్లో సమయానుగుణంగా విధులు నిర్వహించాల్సిన అదే సిబ్బంది ఫైనాన్స్‌ కలెక్షన్‌ చేస్తూ వీడియో కెమెరాలకు చిక్కారు.

– ఒకరు హోటల్‌ సౌందర్య ఇన్‌లో, మరొకరు జిల్లా కోర్టులో..
నగర రహదారుల రద్దీ దృష్ట్యా అధికారులు విధించిన విధులను సక్రమంగా చేయాల్సిన సిబ్బంది మొండిచేయి చూపిస్తున్నారు. కూడళ్లలో ట్రాఫిక్‌ కంట్రోల్‌ చేయాల్సిన సిబ్బంది చేతులో సెల్‌ఫోన్‌లు పట్టుకొని వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇంస్టాగ్రామ్‌, రీల్స్‌తో పాటుగా రమ్మీ, పబ్‌`జీ, క్యారమ్స్‌, క్యాండీ క్రష్‌, 8బాల్‌ పూల్‌, లూడో కింగ్‌ వంటి ఆటలను ఆడుకోవడం, యూ ట్యూబ్‌లో పాత పాటలు, హాస్య సన్నివేశాలు, ఇతర వీడియోలు చూడటంలో నిమగ్నమై పోతున్నారు. ఇదే క్రమంలో మహారాణిపేట ట్రాఫిక్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోమ్‌గార్డ్‌ కె.గణేష్‌ అయితే రెండు గంటల ముందే తనకు కేటాయించిన కూడలిని గాలికి వదిలేసి జగదాంబ సమీపంలో గల మక్కా మసీద్‌ ఎదురుగా ఉన్న హోటల్‌ సౌందర్య ఇన్‌లో కూర్చోని తనకి రావల్సిన కలెక్షన్‌ సొమ్మును లెక్కబెట్టుకొని పలుమార్లు చుట్టు పక్కల దుకాణాలకు వెళ్లి వసూలు చేసి ఆఖరికి హోటల్‌కి చేరుకుంటారు. హోమ్‌గార్డ్‌ పి.లక్ష్మీనారాయణ అయితే గంట ముందే కూడలిని వదిలిపెట్టి తన ప్రియురాలితో నేరుగా విశాఖపట్నం జిల్లా కోర్టుల సముదాయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. చీకటిగా ఉన్న ప్రాంతంలో ఇరువురు ముచ్చట్లు ఆడుకుంటూ ఒక గంట సమయాన్ని గడిపేస్తారు. అనంతరం ఆమెను మార్గంలో మధ్యలో వదిలిపెట్టి స్టేషన్‌ పరిధిలో ఉన్న పలు చిరు దుకాణాలు, హోటల్స్‌, తోపుడు బండ్లు, ఇళ్ల వద్దకు వెళ్లి రోజువారీ ఫైనాన్స్‌ కలెక్షన్‌ వసూలు చేస్తుంటారు.

హోమ్‌గార్డులు పోలీసు ముసుగులో ఫైనాన్స్‌ చేస్తున్నారు..
నగరంలో చాలా మంది పోలీసు సిబ్బంది ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నారని సంబంధిత పోలీసు ప్రత్యేక విభాగ (స్పెషల్‌ బ్రాంచ్‌) అధికారుల దృష్టిలో సమాచారం ఉన్నా అటుగా ఎందుకు అడుగులు వెయ్యడం లేదో తెలియాల్సి ఉంది. నెలవారీ వచ్చే వేతనాలతో పాటుగా రోజువారీ వచ్చే అక్రమార్జన (వస్సూళ్లు, వడ్డీలు)లను లెక్కిస్తే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేయాల్సిన అవినీతి నిరోధక శాఖ సైతం అటుగా చూడటం లేదు. ఇక ఈ ఇద్దరు సిబ్బంది విషయానికొస్తే విధుల మధ్యలో ఫైనాన్స్‌ కలెక్షన్‌కి వెళ్లే సమయంలో తనతో పాటుగా ఉన్న వాకీ టాకీ సెట్‌(సమాచార యంత్రం) అందరికీ వినిపించే విధంగా పెద్దగా శబ్ధం చేసి ఫైనాన్స్‌ సొమ్మును వసూలు చేస్తున్నారు. దీనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవల్సిన యంత్రాంగం సైతం అటుగా చూడటం లేదు. ఏది ఏమైన పోలీసు విభాగంలో పనిచేస్తూ ఫైనాన్స్‌ చేసే హోమ్‌గార్డ్‌ సిబ్బందిపై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని పలువురు సిబ్బంది కోరుతున్నారు.