Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : నగరంలో అక్రమాలను అడ్డుకట్ట వేయడంలో కీలక పాత్ర పోషించాల్సిన ‘టాస్క్‌ఫోర్స్’ పనితీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల రక్షణకై ఏర్పాటైన ఈ విభాగం ఇటీవల కాలంలో రాజకీయ పెద్దల అండదండలతో ‘నీరు కారిపోతోందా’ అన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిడితో సంబంధిత సిబ్బంది అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు సైతం టాస్క్‌ఫోర్స్ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తుంది. నేరాల నియంత్రణలో, వ్యవస్థీకృత నేరాలను ఛేదించడంలో చురుగ్గా వ్యవహరించాల్సిన ఈ ప్రత్యేక బృంద సభ్యులు కొన్ని కీలక కేసుల్లో ఎందుకు పలచబడిపోతున్నారో అర్థం కావడం లేదు. దీని వెనుక కేవలం నిర్లక్ష్యమా..? లేక తెరవెనుక రాజకీయ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయా..? అన్నది అంతుబట్టకుండా ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ మధ్య కాలంలో పాతనగరం సమీప ఓ పెద్ద క్లబ్‌లో పేకాట నగదుతో ఆడుతున్నట్టు నగదుతో పాటుగా లెక్కింపు యంత్రం సైతం బోర్డుపై లభించింది. ఆ సమయంలో దాడులు నిర్వహించగా కొన్ని క్షణాల్లో శాసనసభలో కీలక నేత పైరవీతో అక్కడకక్కడే వదిలి వెళ్లిపోవల్సి వచ్చింది. ఇదే విధంగా గాజువాక ప్రాంతంలో ఓ క్లబ్‌లో దాడులు నిర్వహించగా అక్కడ స్థానిక ప్రజాప్రతినిధి చెప్పడంతో మరోమారు వదిలిపెట్టి వెళ్లిపోయారు. టాస్క్‌ఫోర్స్ స్టేషన్ సమీప ప్రాంతాల్లో కొన్ని హోటల్స్‌లో పేకాటలు ఆడుతున్నట్టు సమాచారం అందుకోని దాడిచేసిన కొన్ని నిమిషాల్లో స్థానిక ప్రజాప్రతినిధి నుంచి ఫోన్‌కాల్ రావడంతో వచ్చిన వేగంతోనే వెనక్కి వెళ్లిపోవడం సాధారణ విషయంగా మారిపోయింది. నగర శివారు ప్రాంతాల్లో పలుమార్లు పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించే సమయంలో సాక్ష్యాత్తు మన ప్రజా ప్రతినిధులను, మాజీ ప్రజాప్రతినిధులను పెద్ద సంఖ్యలో పట్టుకొని వదిలిపెట్టిన సందర్భాలు కోకొల్లలు.
ప్రత్యేక విభాగంగా గుర్తింపు పొందిన టాస్క్‌ఫోర్స్‌కి ఓ ఏసీపీ స్థాయి అధికారి అవసరం ఎంతైనా ఉంది. నగర వ్యాప్తంగా గల 23 పోలీసు స్టేషన్‌ల పరిధిలో విధులు నిర్వహించాల్సిన విభాగంలో కేవలం ఇద్దరు సీఐలు, ఒక ఎస్సై ఉండటంతో టాస్క్‌లు నిర్విహించిన ప్రతీసారి ఇబ్బందులు తప్పడం లేదు. డీసీపీ, ఏడీసీపీ స్థాయి అధికారుల పర్యావేక్షణలో పని చేస్తున్నా.. స్టేషన్‌ల పరిధిలో దాడులు చేసే సమయంలో సీనియర్ సీఐలు మాట టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న సీఐలు, ఎస్సై అప్పుడప్పుడు కొట్టలేకపోవడం ఓ కారణం అయితే.. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ ఒత్తిడితో నిమ్మకుండిపోవడం సాధారణంగా జరుగుతుంది. పైగా రెండు జోన్‌లకు ఒకే ఎస్సై ఉండటం కూడా పని ఒత్తిడిలో కీలక టాస్క్‌లు వదిలిపెట్టడం జరుగుతుందని విశ్వసనీయ సమాచారం. గతంలో ఏసీపీ స్థాయి అధికారి ఉన్నప్పటికి ప్రస్తుతానికి చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని, గతంలో దాడులు చేయాలంటే గోప్యత ఉండేదని, ప్రస్తుతం ముగ్గురి చర్చల్లో కాలం చెల్లిపోతుందని పలువురు ఆరోపిస్తున్నారు.
టాస్క్‌ఫోర్స్ విభాగ పనితీరు నగరంలో ఈ మధ్య జరిగిన రెండు, మూడు కీలక సంఘటనలు పరిశీలిస్తే ఇట్టే అర్థమయిపోతుంది. నగర బహిష్కరణ చేసిన ఓ రౌడీ షీటర్ ఎంవీపీ పోలీసు స్టేషన్ పరిధిలో బెదిరింపులకు పాల్పడుతూ ఓ భూ దందా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎట్టకేలకు సీపీ కార్యాలమంలో బాధితులు బోరుమనడంతో సంబంధిత స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇదే క్రమంలో రుషికొండ సమీపంలో ఎండీఎం డ్రగ్స్‌ని విక్రయం చేస్తున్న నలుగురు నిందితులను టాస్క్‌ఫోర్స్ బృందం అదుపులోకి తీసుకుంది. తీవ్ర రాజకీయ ఒత్తిడితో ఇద్దరు నిందితులను జైలుకి సాగనంపిన సిబ్బంది మరో ఇద్దరు నుంచి భారీ మొత్తంలో దండుకొని ఉచ్చులో ఎర(డెకాయ్)గా ఉపయోగించామని నమ్మించి వదిలిపెట్టారని విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు ఇరువురు నిందితులు మరో వ్యాపార విషయంలో గొడవ పడటంతో ఒకడ్ని మరొకడు బెదిరించడంతో టాస్క్‌ఫోర్స్‌లో చేతివాటం చూపించి ఇరువుర్ని వదిలిపెట్టిన ఆ అధికారి వద్దకు వచ్చి బోరుమన్నాడు. దీంతో ఇరువురు నిందితులను పిలిచి నచ్చచెప్పినట్టు సంబంధిత ఖాకీ సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. గతంలో వారానికి ఓమారు నగరంలో ఉన్న రౌడీషీటర్‌లకు కౌన్సిలింగ్ నిర్వహించడం, స్టేషన్‌ల వారీగా నిఘా కట్టుదిట్టం చేయడంతో పాటుగా టాస్క్‌ఫోర్స్ నుంచి ప్రత్యేక నిఘా ఉండేది. ప్రస్తుతం అటుగా కౌన్సిలింగ్‌లు నిర్వహించకపోవడంతో పలు హత్యకేసుల్లో నిందితుడిగా గుర్తింపు పొంది నగర బహిష్కరణకు గురైన రౌడీషీటర్ టాస్క్‌ఫోర్స్ స్టేషన్‌కి కూతవేటు దూరంలో తన ప్రతాపాన్ని చూపించి పోలీసులకు సవాల్ విసిరిన నాలుగు రోజులకు మేల్కొన్నారు.
నేత్రన్యూస్, పోలాకి రవికుమార్, పత్యేక ప్రతినిధి: సింహాద్రి అప్పన్న భూములకు సంబంధించి ల్యాండ్ రెగ్యులరైజేషన్ సర్టిఫికేట్ (ఎల్‌ఆర్‌సీ) వివాదం ప్రధానంగా పంచగ్రామాలైన వేపగుంట, అడవివరం, చీమలపల్లి, పురుషోత్తపురం, వెంకటాపురం పరిధిలో ఉంది. సింహాచలం దేవస్థానానికి చెందిన సుమారు 12వేల ఎకరాల భూముల్లో తరతరాలుగా 13వేలకు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 1996లో అప్పటి పెందుర్తి, విశాఖపట్నం రూరల్ తహసీల్దార్లు ఈ భూములు సింహాచలం దేవస్థానానికి చెందినవని పేర్కొంటూ రైతువారీ పట్టాలు జారీ చేశారు. తరువాత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఐదు గ్రామాల్లోని స్థానికులు ఆక్రమించుకున్న భూములను క్రమబద్ధీకరించడానికి రెండు జీవోలు జారీ చేశారు. జీవో సంఖ్య 578 ద్వారా కొద్ది శాతం మంది నివాసితులు తమ భూములను క్రమబద్ధీకరించుకుని దేవస్థానం నుండి ఎల్‌ఆర్‌సీ పొందారు. అయితే చాలా మందికి ఎల్‌ఆర్‌సీలు లేకపోవడంతో తమ భూములను విక్రయించడం, రిజిస్ట్రేషన్ చేయలేక పోయారు. ఆ తరువాత 2014లో టీడీపీ ప్రభుత్వం మరో జీవో 296 ను జారీ చేసి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించింది. అయితే వైసీపీ లీగల్ సెల్ దీనిని కోర్టులో సవాలు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.
అప్పన్న భూముల్లో భూ బకాసురులు రోజురోజుకి భరితెగిస్తున్నారు. పంచగ్రామాలకు సంబంధించి హైకోర్టులో కేసు ఉన్నప్పటికీ అడివివరం బీఆర్‌టీఎస్ రోడ్డు విస్తీరణ నెపంతో ఆక్రమణకు పాల్పడుతున్నారు. భవనాలను నిర్మించే విషయంలో కొత్తగా టీడీఆర్‌లని చూపిస్తూ గతంలో ఇచ్చిన ఎల్‌ఆర్‌సీల మాట వినిపించకుండా చేస్తున్నారు. హైకోర్టులో అప్పన్న భూముల కేసు పరిష్కారం అయ్యే వరకు ఆలయ ఆస్తులను పరిరక్షించాల్సిన ఆలయ అధికారులు సైతం ఆక్రమణదారులతో చేతులు కలపడంతో అప్పన్న భూములు ఆవిరైపోతున్నాయి. కొత్తగా టీడీఆర్‌లు ఇచ్చిన భూముల్లో ఇష్టానుసారంగా భారీ భవనాలు నిర్మించుకోవచ్చని కొలతలు వేసి మరీ.. అప్పన్న భూములను అప్పనంగా అప్పగించడంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 28ఏళ్ల నుంచి ఎల్‌ఆర్‌సీలు లేనివారు భవనాలు నిర్మించకూడదని కఠిన నిబంధనలు ఉన్నా ఆలయ అధికారులు అటుగా పట్టించుకోకపోవడంతో టీడీఆర్ ముసుగులో భారీ భవనాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఓ వైసీపీ నాయకుడు రహదారిపై ఉన్న భవనానికి ఎల్‌ఆర్‌సీ ఉందని ఆ భవనం వెనుక ఉన్న భారీ స్థలంలో ఎల్‌ఆర్‌సీ లేకుండా కల్యాణ మండపం నిర్మించడం అందరికీ తెల్సిందే.. భవనాన్ని నిర్మిస్తున్న క్రమంలో కూటమి నాయకులు అటుగా కన్నెర్ర చెయ్యడంతో చేసేది ఏమి లేక రెండు రోజులకు ముందు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయినా అప్పన్న భూముల్లో అక్రమంగా ఆ భారీ భవనం నిర్మించడానికి ఆయనకు అవకాశం దక్కుతుందో.. లేదో.. వేచి చూద్దాం.
- పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న భవనాలు..
సింహాచలం అడివివరం రహదారి విస్తీర్ణ సమయంలో ఇచ్చిన టీడీఆర్‌లను ఆధారంగా చేసుకొని భారీ భవనాలు నిర్మిస్తున్నారు. రహదారి పొడుగున పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న భవనాలకు ఎటువంటి ఎల్‌ఆర్‌సీలు లేకపోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అనుమతులు లేకపోయిన సంబంధిత ఆలయ అధికారులు అటుగా అడ్డగించకుండా కొలతలు వేసి మరీ భవనాలకు నిర్మించుకోవడానికి అనుమతులు ఇవ్వడం చుట్టుపక్కల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో భవనాలు తెల్లగొడలుగా దర్శనం ఇవ్వడం, మరికొన్ని పునాదులు, పిల్లర్లతో కనిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల చిన్నపాటి రేకుల షేడ్‌లు నిర్మించి తరువాత ఆ స్థలాన్ని తన ఖాతాలో వేసుకుంటున్నారు.
- దుకాణాలు, పొదలు ఉన్నచోట ఎల్‌ఆర్‌సీలు ఎలా..?
పంచగ్రామాల సమస్యతో సుమారు 28ఏళ్లు పొదలతో నిండిపోయిన భూముల్లో ఇప్పుడు భారీ భవనాలు దర్శనమిస్తున్నాయి. న్యాయస్థానంలో కేసు పెండిరగ్‌లో ఉన్నా సంబంధిత అధికారుల పర్యావేక్షణ లోపంతో ఇప్పటి వరకు పొదల్లో ఉన్న భూములు భవనాలుగా మారిపోతున్నాయి. ఏఈవో స్థాయి అధికారులను విభాగాల వారీగా కేటాయించినా అప్పన్న భూములు కబ్జాలు ఆగడం లేదు. తాయిలాలుకు కక్కుర్తి పడుతున్న ఆలయ అధికారులు అప్పన్న భూముల్లో జరుగుతున్న వ్యవహారాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడంతో ఇప్పటికే భారీ భవనాల రూపంలో వాళ్ల తప్పులు దర్శనమిస్తున్నాయి. ఇప్పటి వరకు చిన్న చిన్న బడ్డీల రూపంలో ఉన్న స్థలంలో ఎల్‌ఆర్‌సీలు లేకుండా భవనాలు నిర్మిస్తున్నా అటుగా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని పలువురు అప్పన్న భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ఈ వ్యవహారంలో ఎవరికి ఎంత లాభం..?
సింహాద్రి అప్పన్న భూముల్లో నిబంధనలకు వ్యతిరేకంగా భవనాలు నిర్మించడం వలన భవన యజమానులకంటే.. ఆలయ అధికారులకే అధిక లాభం దక్కుతుందని ఎల్‌ఆర్‌సీలు లేకుండా భవనాలు నిర్మిస్తున్న యజమానులు వెల్లడిస్తున్నారు. టీడీఆర్ రూపంలో వచ్చిన సొమ్ములో కొంత శాతం తమకి చదివించడంతో టీడీఆర్ ముసుగులో భవనాలు శెరవేగంగా నిర్మించుకోవాలని సూచించారని పలువురు ఆక్రమణదారులు వివరిస్తున్నారు. ఎల్‌ఆర్‌సీలు లేకుండా నిర్మాణాలు చేపట్టకూడదని ఇప్పటికే నోటీసు బోర్డులను ఏర్పాటు చేసిన సిబ్బంది అటుగా ఆ స్థలాల్లో భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకోకపోవడం కొసమెరుపు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు స్వామివారి స్థలంలో దురాక్రమణదారులు శిక్షార్హులు అని ఏర్పాటు చేసిన బోర్డులు నామమాత్రంగానే ఉన్నాయి.
స్టాండిరగ్ కమిటీ తీర్మానం లేకుండా జీవీఎంసీ ఆస్తుల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠాలు
నేత్ర న్యూస్, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి): జీవీఎంసీకి రూ.కోట్ల ఆదాయాన్ని అందించే కీలక మార్కెట్‌లు ప్రస్తుతం దొంగల చేతుల్లో చిక్కుకున్నాయి. ఇంటి దొంగల సంరక్షణలో ఉండాల్సిన ఆస్తులను సైతం కమీషన్‌లకు కకుర్తిపడి బయట దొంగలకు అప్పగించినట్టు ఇట్టే అర్థమైపోతుంది. ఈ తరహా తంతుని చూసి ప్రశ్నించాల్సిన స్థానిక స్టాండిరగ్ కమిటీ సభ్యుడు సైతం ఆ ముఠాలతో చేతులు కలిపినట్టే కనిపిస్తుంది. ఏడాదికి రూ.కోటికి పైగా అధిక ఆదాయాన్ని అందించే పూర్ణామార్కెట్, సుమారు రూ.30లక్షలకు పైగా అందించే రామకృష్ణ కూరగాయల మార్కెట్ ఈ ఏడాది అంతర్గత లెక్కలు లెక్కించిన అధికారుల లెక్కల ప్రకారం పూర్ణామార్కెట్‌ని 18శాతం జీఎస్టీ, 0.5 స్వచ్ఛభారత్‌తో కలిపి రూ.97.28లక్షలకు, అదే రామకృష్ణ కూరగాయల మార్కెట్‌ని 18శాతం జీఎస్టీ, 0.5 స్వచ్ఛభారత్‌తో కలిపి రూ.23.10లక్షలకు బహిరంగ వేలం పాట ద్వారా ఖరారు చేశారు. ఈనెల మొదటి నుంచి పాట పాడిన వ్యక్తులకు అప్పగించడానికి కుతూహలంతో ఉన్న జోనల్ స్థాయి అధికారులు స్టాండిరగ్ కమిటీ తీర్మాణం లేకుండానే ఇవ్వడం వెనుక మర్మం ఏంటో అని మార్కెట్‌లో వ్యాపారులే ఆసక్తి చూపుతున్నారు. బయట సమాజాన్ని నమ్మించడానికి 15మంది సచివాలయ కార్యదర్శిలు, ముగ్గురు మజ్దూర్‌లను, ఒక ట్యాక్స్ కలెక్టర్, ఒక పబ్లిక్ అండ్ హెల్త్ ఉద్యోగిని నియమించినట్టు గతనెల 29న సంతకాలు చేసి ఆదేశాలను జారీ చేశారు. కానీ వాస్తవానికి ఈ ఉద్యోగులు ఈనెల 1నుంచి నేటి వరకు అదే జోనల్ కార్యాలయ సీసీ కెమెరాల పరిధిలోనే పనిచేసినట్టు రికార్డింగ్‌లు సంబంధిత విభాగంలోనే భద్రపరిచి ఉండటం కొసమెరుపు. నకిలీ అదేశాలను జారీ చేసిన అధికారులు అటుగా సిబ్బందిని కేటాయించిన స్థానంలో పని చేస్తున్నట్టు అక్కడ సీసీ కెమెరాల్లో సైతం ఉంటే బాగుండేదని పలువురు వ్యాపారులు హేళన చేస్తున్నారు.
జీవీఎంసీలో జరిగిన ఆర్థిక లావాదేవీలను స్టాండిరగ్ కమిటీ తీర్మాణంతో కేటాయించాల్సి ఉన్నా.. జోన్-4 రెవెన్యూ అధికారులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏడాదికి రూ.కోట్లు ఆదాయాన్ని ఇచ్చే పూర్ణామార్కెట్, రూ.30లక్షలకు పైగా ఆదాయాన్ని ఇచ్చే రామకృష్ణ కూరగాయల మార్కెట్‌ని ఎటువంటి అనుమతులు లేకుండా జీవీఎంసీ కమిషనర్ పేరిట టోకెన్లను ముద్రించి బయట వ్యక్తులకు అప్పగించారు. నామ మాత్రంగా బృందాలను కేటాయించి పూర్తిస్థాయిలో బయట వ్యక్తులతో ఆశీలు వసూళ్లు చేయిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులను ప్రశ్నించగా తమ సిబ్బంది మాత్రమే వసూలు చేస్తున్నారని వివరిస్తున్న అధికారులు ఇప్పటి వరకు జీవీఎంసీ సౌకర్యంలో ఎంత మొత్తంలో జమ చేశారో లెక్కలు చూపించాలని పలువురు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. స్టాండిరగ్ కమిటీ అనుమతి కూడా లేకుండా బయట వ్యక్తులతో రెండు మార్కెట్‌ల్లో వసూలు చెయిస్తున్నారంటే సంబంధిత అధికారులు ఎంత మొత్తంలో నకిలీ బృందాల నుంచి వసూలు చేశారో లెక్కలు చూడాల్సి ఉంది.
ఆశీల పాటను నిర్వహించిన అధికారులు గెజిట్ లెక్కల ఆధారంగా వసూలు చేయాలని గుత్తేదారులకు ముందుగానే అవగాహన పరుస్తారు. వాటికి అనుగుణంగానే అధికారులు వాళ్లకు పాటను కేటాయించి అటుగా వసూళ్లు చేయాలని సూచిస్తారు. కానీ ఇక్కడ ఎటువంటి సంబంధం లేని వ్యక్తులకు అక్రమ మార్గంలో ఆశీల వసూళ్లకు అవకాశం కల్పించి ఇష్టానుసారంగా దండుకుంటున్నా అటుగా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. పూర్ణామార్కెట్‌లో ద్విచక్ర వాహనానికి రూ.10, కార్లుకి రూ.20 వసూలు చేస్తున్నారు. ఇదే క్రమంలో భారీ వాహనాలకు రూ.300, సరుకులు రవాణాకు ఉపయోగించే వాహనాలకు రూ.200 దౌర్జన్యంగా తీసుకుంటున్నారు. రామకృష్ణ కూరగాయల మార్కెట్‌లో రూ.20కి బదులుగా దుకాణానికి రూ.50, రహదారిపై తాత్కాలికంగా వ్యాపారం చేసి వెళ్లిపోయే రైతుల వద్ద రూ.100 నుంచి రూ.150వరకు వసూలు చేస్తున్నారని పలువురు వ్యాపారులు బోరుమంటున్నారు. గెజిట్‌లో లెక్కలను పెద్ద పెద్ద అక్షరాలతో ముద్రించి ప్రధాన మార్గంలో గోడలకు మాత్రమే పరిమితం చేసి పెద్ద మొత్తంలో దండుకుంటున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం రద్దీగా ఉండే పూర్ణామార్కెట్ ప్రధాన రహదారిపై తొలిగించిన వ్యాపారాలు యధావిధిగా పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ స్థానిక నాయకున్ని మంగళవారం తీసుకొచ్చి ఆశీలు వసూళ్లు చేయడానికి అర్హత లేని గుత్తేదారులు రహదారిపై దండలతో సన్మానాలు చేసి ఆయన్ని మచ్చిక చేసుకుంటున్నారు. మనిషికి రెండు జంగిడీల చొప్పున కేటాయించి వ్యాపారాలు జరపడానికి చూస్తున్నారు. ఈ జంగిడీలు రహదారిపై పెట్టి వ్యాపారం చేస్తే గుత్తేదారులకు అక్షరాల రూ.40లక్షల వరకు లాభం వస్తుందని మాజీ గుత్తేదారులు సైతం వెల్లడిస్తున్నారు. వ్యాపారులపై ఉన్న ప్రేమ కంటే రూ.40లక్షలపై ఎక్కువ ప్రేమ ఉందని స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై నగర పోలీసు కమిషనర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : నగర గగనతలంలో పోలీసు డ్రోన్లు పూర్తి స్థాయిలో చక్కర్లు కొట్టనున్నాయి. ఇప్పటికే సంబంధిత పోలీసు సిబ్బందికి డ్రోన్లు పనితీరుకి సంబంధించిన అన్ని అంశాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న జనాభా, నేర నియంత్రణ, ట్రాఫిక్ రద్దీ, పోలీసు సిబ్బంది సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఈ డ్రోన్ పోలీసింగ్ విధానాన్ని నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ ప్రవేశపెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న టెక్నాలజీని పోలీసు విధుల్లో సైతం ఉపయోగించడం వలన మరింత ఫలితాలు సాధ్యమవుతాయని ఆయన ఈ డ్రోన్ పోలీసింగ్‌పై దృష్టి కేంద్రికృతం చేశారు. ఇప్పటికే ఓ ప్రైవేటు సంస్థ నుంచి సీఎస్‌ఆర్ పేరిట కొన్ని డ్రోన్‌లను పోలీసు విభాగానికి కేటాయించడంతో నగర ఆకాశ వీధిల్లో డ్రోన్‌లు జోరు వేగంతో విధులు నిర్వహిస్తున్నాయి.
మందు బాబులు, అల్లరి మూకలు, ధూమపానం, గంజాయి బ్యాచ్‌లకు ఇక నుంచి చుక్కలు కనిపించనున్నాయి. ఆకాశంలో చుక్కల మాదిరి చక్కర్లు కొడుతూ గుంపులను చెల్లాచెదురు చేయడంతో పాటుగా హై క్వాలిటీ ఫొటోలు, వీడియోలు సేకరించి కేసులు నమోదు చేయడానికి పోలీసు డ్రోన్‌లు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నపాటి సందులు, కొండ ప్రాంతాలు అనే వ్యత్యాసాలు లేకుండా ఒకే రకమైన పోలీసు సేవలు అందించడానికి ఈ డ్రోన్‌లు సిద్ధమయ్యాయి. గోల్డెన్ మినిట్స్‌లో కీలక అంశాలను సేకరించడంతో పాటుగా భద్రపరిచి కేసులు పరిష్కారం దిశగా ఈ డ్రోన్‌లు వేగంగా పని చేస్తున్నాయి. నగరంలో 23పోలీసు స్టేషన్‌లకు ఒకటి, రెండు చొప్పున అక్కడి వ్యాసార్థం బట్టి బ్లూకోల్ట్స్, డీకోల్ట్స్, మొబైల్, రక్షక్ పేరిట విధులు నిర్వహిస్తున్న విభాగాలకు దీటుగా ఈ డ్రోన్‌లు పరుగులు 24గంటలు పెట్టనున్నాయి. నిర్జన, సంక్షోభిత ప్రాంతాల్లో పోలీసు సైరన్ అలార్ట్‌లతో హెచ్చరికలు జారీ చేయడం, నిందితులను వెంబడిరచడానికి డ్రోన్‌లు వేగంగా ఎగురుతున్నాయి. త్వరలో పూర్తిస్థాయిలో డ్రోన్ సేవలు అందించడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయని విశాఖ సిటీ సీపీ బాగ్చీ వెల్లడిస్తున్నారు.
గొడవలు, అల్లర్లు జరిగే ప్రాంతాల్లో సిబ్బంది వెళ్లే సమయాని కంటే ముందుగా పరుగులు పెట్టడానికి ఈ డ్రోన్‌లు మెరుగ్గా పని చేయనున్నాయి. వాహనాలు వెల్లడానికి వీలు లేని ప్రాంతాల్లో సైతం త్వరితగతిన వెల్లడంతో పాటుగ ఘటనా స్థలంలో జరిగిన సంఘటనలు చిత్రికరించి కేసులు వేగవంతంగా చేయడానికి ఆధారాలు సేకరిస్తాయి. వీఐపీల రాకపోకలపై నిఘా కట్టుదిట్టం చేయడం, సమస్యాత్మక ప్రాంతాల్లో అల్లరిమూకలను చెల్లాచెదురు చేయడం, రహదారులపై ఆకతాయిలు మహిళలను వేధింపులకు గురిచేయకుండా అనుక్షణం కనిపెడుతునే ఉంటాయి. ఈ డ్రోన్‌లు పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి వస్తే శాంతిభత్రల సమస్యలు చాలా వరకు సర్ధుమనుగుతాయని విశాఖ పోలీసులు ప్రయోగాత్మకంగా చూపించనున్నారు.
నగరంలో వేగంగా పెరుగుతున్న జనాభా, సిబ్బంది కొరత దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్, నేర నియంత్రణలో డ్రోన్ సేవలు చాలా కీలకంగా ఉండనున్నాయి. ప్రమాదాల నివారణతో పాటుగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఈ డ్రోన్‌లు విధులు నిర్వహించడం. ఎటువంటి నేరాలు జరగకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం, ధూమపానం, గంజాయి, మందు బాబుల బృందాలను చెదరగొట్టడంతో పాటుగా కేసులు నమోదు చేయడానికి కీలక ఆధారాలు సేకరిస్తాయి. నిర్మాణుష ప్రాంతాలతో పాటుగా రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో 24గంటలు నిఘా కట్టుదిట్టం చేయడానికి ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో అందుబాటులో ఉన్న డ్రోన్‌లను త్వరలో అన్ని స్టేషన్‌లకు కేటాయించడానికి పలు ప్రైవేటు సంస్థలతో సీఎస్‌ఆర్ పద్ధతిలో తీసుకోవడానికి పోలీసు వర్గాలు సిద్ధమయ్యాయి.
విశాఖ సిటీలో గత పరిస్థితుల కంటే మెరుగ్గా ఉండటానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం. నగర ప్రజల్లో ఏ ఒక్కరూ కూడా శాంతిభత్రలు దృష్ట్య ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, వాళ్ల భద్రతే ధ్యేయంగా నాతో పాటుగా అందరు సిబ్బంది పని చేయాలి. అటుగా ఇప్పటికే చాలా సేవలు ప్రారంభించాం. ఈ క్రమంలో డ్రోన్ పోలీసింగ్ ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నాం. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ప్రయోగాత్మక స్థితిలో ఉన్న డ్రోన్ పోలీసింగ్ ప్రజల్లోకి తీసుకెళ్లి మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. నేరాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలతో పాటుగా పరిష్కారానికి డ్రోన్ పోలీసింగ్ కీలకంగా మారుతుంది. నగర ప్రజలకు శాంతిభద్రతలు, ట్రాఫిక్, నేర విభాగాలకు సంబంధించి ఎటువంటి సమస్య ఎదురైనా నా 79950 95799 ఫోన్ నెంబర్‌కి కాల్ చేయండి. – డాక్టర్. శంఖబ్రత బాగ్చీ (విశాఖ సిటీ పోలీసు కమిషనర్).
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : వరాహ నృశింహునిగా.. శ్రీమహావిష్ణువు స్వయంభువుగా.. ద్వయ రూపాలతో వెలసిన పవిత్ర దివ్యధామం సింహాచలంలో అయోమయం సంతరించుకుంది. ఆలయ అధికారుల పర్యావేక్షణ లోపం, పనిలో సిబ్బంది అలసత్వం ప్రదర్శించడంతో అప్పన్న దర్శనానికి తండోపతండాలుగా వచ్చే భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాల్సిన ఆలయ అధికారులు అటుగా ఆలోచనలు చేయకపోవడంతో మధ్యాహ్న సమయంలో భక్తజనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రూ.లక్షల్లో జీతభత్యాలు తీసుకునే ఉద్యోగులు శీతల గదులకు పరిమితమైపోవడంతో తాత్కలిక పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న చిరు ఉద్యోగులు, ప్రైవేటు సెక్యూరిటీ సంస్థల సిబ్బందికి ఇష్టారాజ్యమైపోయింది. రాజమార్గంగా ఉపయోగించే గాలిగోపురం వద్ద అన్ని బాధ్యతలను సెక్యూరిటీ సిబ్బంది చేతుల్లో వదిలిపెట్టడం, పీఆర్‌వో కార్యాలయంలో ఎక్కువగా సెక్యూరిటీ సిబ్బందిని ఉపయోగించడం, ఆ సిబ్బందితో పాటుగా సంబంధిత ప్రైవేటు సంస్థకు మంచి ఆదాయాన్ని అందుతుందనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. స్వామి దర్శనానికి సెక్యూరిటీ సంస్థ ప్రతినిథులు, వాళ్ళ బంధువులు, సెక్యూరిటీ సిబ్బంది బంధువులు వస్తే వీవీఐపీ దర్శన భాగ్యాన్ని కలిగించడంలో మంచి నైపుణ్యం సంపాధించారు. ఈ అంశాలు కొందరు ఆలయ అధికారులకు తెలిసినా వాళ్ళ బంధువులకు అదే పద్ధతిలో దర్శనాలు చేయించడానికి ఉపయోగపడతారని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో స్వామివారి ఆలయ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. ఏది ఏమైన అధిక సంఖ్యలో సిబ్బంది కలిగిన సింహాచలంలో ప్రైవేటు సిబ్బంది పెత్తనం ముందు ముందు చాలా ప్రమాదకరం.
ఆలయ పీఆర్‌వో కార్యాలయంలో సిబ్బంది చక్కగా స్థిర పడ్డారనడంలో ఆశ్చర్య పడనవసరం లేదు. మూడు నుంచి ఐదు నెలలకు ఒకసారి అన్ని విభాగాల్లో సిబ్బందిని మార్పులు చేర్పులు చేసే అధికారులును సైతం తమ చేతుల్లో పెట్టుకొని పీఆర్‌వో కార్యాలయంలో కొందరు సిబ్బంది ఏళ్ల తరబడి పాతుకుపోయారు. ప్రైవేటు సంస్థ నుంచి సెక్యూరిటీలుగా తీసుకున్న సిబ్బందిని పీఆర్‌వో కార్యాలయంలో సహాయకులుగా ఉపయోగించడంలో పెద్ద కుట్ర జరుగుతుందని, దర్శనాలు చేయించే సమయంలో భారీగా ముడుపులు అందుకుంటున్నట్టు పలు ఆధారాలు సైతం బహిరంగంగానే కనిపిస్తున్నాయి. ఆలయానికి మొదటిసారి వచ్చే భక్తులు రెండోసారి పీఆర్‌వో కార్యాలయానికి వెళ్లకుండానే వ్యక్తిగత నెంబర్లను ఇచ్చి క్యాష్ చేసుకుంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం అక్కడ స్థిర పడిపోయిన సిబ్బంది మార్పుతోనే సాధ్యపడుతుందని పలువురు భక్తులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అప్పన్న స్వామి ఆలయంలో భక్తులు తలనీలాలు చెల్లించడంలో ఎదుర్కొనే ఇబ్బందులు అక్కడ సిబ్బంది కొరత కారణమని స్పష్టంగా కనిపిస్తుంది. ఆలయంలో తాత్కాలిక నాయిబ్రాహ్మణ సిబ్బందిని పెంచడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 69మంది సిబ్బందితో కొనసాగుతున్న కేశఖండనశాలలో 5గురు మాత్రమే పూర్తిస్థాయి ఆలయ ఉద్యోగులు కావడం, మనిషికి 60టికెట్లు చొప్పున ఐదుగురికి రోజుకి 300 టికెట్లకు గాను రూ.12వేలుని ఆలయానికి ఇచ్చి మిగిలిన మొత్తం అక్కడి నాయిబ్రాహ్మణులు సమాన వాటాలతో సొమ్ము పంచుకోవడం ఇక్కడి ఆనవాయితీ. శని, ఆదివారం వంటి వారాంతాలతో పాటుగా సెలవు దినాల్లో భక్తులు అధికంగా వచ్చే సమయంలో రద్దీ తీవ్రంగా ఉండగా అధిక మొత్తం సంపాధించాలనే ఉద్ధేశంతో పొరుగు సిబ్బంది రాకుండా ఇక్కడ కీలక వ్యక్తులు పావులు కదుపుతున్నారని సమాచారం.
స్వామి ఆలయానికి వచ్చే భక్తులు స్వామి హుండీల్లో చెల్లించిన ముడుపులుకంటే ఆలయ సిబ్బందికే ఎక్కువ కానుకలు చెల్లిస్తున్నారు. గాలిగోపుం గుండా స్వామిని దర్శించుకోవడానికి ఓ ప్రత్యేక ధర చెల్లించిన భక్తులతో పాటుగా ప్రోటోకాల్ భక్తులను పంపించాలని నిబంధనలు ఉన్నా.. కాసుల కక్కుర్తిలో గాలిగోపురం గుండా పైరవీలు చేసే వ్యక్తులకు, కానుకలు ఇచ్చే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఆలయ గాలిగోపురం వద్ద పూర్తిస్థాయి ఉద్యోగిని నియమించకుండా ప్రైవేటు సెక్యూరిటీలకు పెత్తనం ఇవ్వడంతో వాళ్ళు ఆడింది ఆట.. పాడింది పాట.. అన్నట్టుగా తయారైయింది. దీనికి తోడు తాత్కాలిక సిబ్బంది టికెట్లు తియ్యకుండా సగం తీసుకొని దొంగ మార్గంలో భక్తులను దర్శనాలకు పంపిస్తున్నట్టు ఇప్పటికే పలువురు భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికైనా ఆలయ ఉన్నతాధికారి స్పందిస్తారో..? లేదో..? వేచి చూడాలి.
చందనోత్సవంలో ఏర్పాట్లు..?
స్వామివారి ఆలయంలో తీవ్ర రద్దీని తలపించే చందనోత్సవ కార్యాక్రమంలో ఆలయ అధికారుల పనితీరు రెండేళ్లు క్రితం జరిగిన ఇబ్బందికర పరిస్థితులను గుర్తు చేస్తున్నట్టే ఉంది. ఇంచార్జి స్థాయిలో ఎటువంటి వ్యవహారంలో తల దూర్చకూడదని మడికట్టుకొని కూర్చున్న ఉన్నతాధికారి తీరుకి ఉత్సవ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతాయో అని పలువురు సిబ్బంది అయో మయానికి గురవుతున్నట్టు అనుమనాలు వ్యక్త పరుస్తున్నారు.
వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) రోజు ఏప్రిల్ 30న జరిగే చందనోత్సవంలో భక్తుల సౌకర్యార్థం జిల్లా కలెక్టర్ ఇప్పటికే పలు శాఖలతో సమన్వయం చేస్తున్నారు. భారీ భక్తుల రద్దీని నియంత్రించడానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుతో పాటుగా రవాణా, భద్రత, తాగునీరు, దర్శనం, వసతి, వైద్యం, ప్రసాదం వంటి వసతులు కల్పిస్తున్నారు. ఆ రోజున రూ.300, రూ.1000, రూ.1500 ధరల్లో టికెట్లను అందుబాటులో ఉంచారు. ఈ టికెట్లు ఆఫ్‌లైన్‌తో పాటుగా www.aptemples.ap.gov.in లో
విక్రయిస్తున్నారు.
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ముఖ్యంగా ఆ పోలీసు స్టేషన్లో ఓ కుర్చీ కోసం చిన్న స్థాయి యుద్ధమే జరిగిందంటే ఆశ్చర్యపడనవసరం లేదు. ఎత్తులు.. పైఎత్తులు.. వేసుకుంటూ కుర్చీ కోసం పోట్లాడుకున్న పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. దీంతో ఆఖరికి ఎడమొహం.. పెడమొహం.. పెడుతూ సాక్షాత్తు నగర పోలీసు కమిషనర్ చెంతకు చేరుకొని సమీప స్టేషన్లకు బదిలీ చేయాలని కోరుతూ ఆర్డర్‌లు సైతం తెచ్చుకున్నారు. అయినా స్టేషన్‌ను విడిచిపెట్టడానికి మనసు అంగీకరించక సంబంధిత సిబ్బంది నేటికి స్టేషన్‌లో సతమతం అవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. నగర వ్యాప్తంగా అధిక ఆదాయాన్ని అందించే స్టేషన్‌లో కీలక పోలీసు స్టేషన్‌గా గుర్తింపు పొందిన ఆ స్టేషన్‌లో జనరల్ సిబ్బందిగా చలామణి అవుతున్న ఓ హెడ్ కానిస్టేబుల్ చేస్తున్న దందా తోటి సిబ్బంది నుంచే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అడుగడుగున అతని అవినీతి జాడలు అంటించడంతో తమ మనుగడ చాలా కష్టంగా ఉందని బోరుమంటున్నారు. ఎండకు గుక్కెడు నీరు కావాలన్నా ఆ అయ్యగారి అనుమతి కావాలన్నట్టు అక్కడి పరిస్థితులు మారిపోయాయని వాపోతున్నారు. బడా బాబులు, బజారులు, బారుల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఇలా అన్ని చోట్ల పెద్ద మొత్తంలో దండుకుంటున్న అవినీతి జలగపై ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ కన్ను పడిరదని సమాచారం. ఇదే క్రమంలో రోజువారీ స్టేషన్‌కి తీసుకొచ్చే ఓపెన్ డ్రిరకింగ్ (బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం) వంటి ఫిర్యాదుల్లో దండీగా దండుకుంటున్న సిబ్బంది ఆస్కార్ అవార్డును సైతం కైవసం చేసుకునే నటనను ప్రదర్శిస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే జీడీలో నెలకు వందల సంఖ్యలో కేసులు నమోదు చేసి బేరసారాలు కుదరనివి మాత్రమే.. అది కూడా పదుల సంఖ్యలో కోర్టుకు పంపించి జరిమానాలు విధిస్తున్నారని సంబంధిత స్టేషన్ సిబ్బంది బహిరంగంగానే గుసగుసలాడుకుంటున్నారు. ఈ స్టేషన్‌లో ప్రతీ అంశానికి ఓ ధరను నిర్ణయించి అధిక ఆదాయాన్ని అందించే స్టేషన్‌గా నడపడంతో స్టేషన్‌లో నలుగురు సిబ్బంది ఠాణా లేఖరి (స్టేషన్ రైటర్) కుర్చీ కోసం పోట్లాడుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఓవైపు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి.. మరోవైపు తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో వసూలు..
నేత్ర న్యూస్, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి) : చదువుల బరువు మోసి చిన్నారి మనసులు చితికి పోయే.. మార్కుల కోసం పరుగులెత్తి బాల్యం దూరమయ్యే.. అనే పదాలను పద్య రూపంలో ఓ సమకాలీన కవి నాడు చెప్పినట్టే నేడు ప్రైవేట్ పాఠశాలల్లో వ్యవహరిస్తున్న తీరు చిన్నారుల బాల్యాన్ని శూన్యం దిశగా సాగిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. పొరుగు పాఠశాలలతో పోటీ పడుతూ విద్యార్థుల ఆసక్తులు, సామర్థ్యాలను గుర్తించకుండా పాఠశాల యాజమాన్యలు తీవ్ర ఒత్తిడిని కలిగించడం చాలా ప్రమాదకరమని పలువురు పరిశోధనాత్మక విద్యావేత్తలు వివరిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ సరైన సూచనలు జారీ చేయకపోవడం, జారీ చేసిన సూచనలపై పర్యవేక్షణ లేకపోవడంతో ఈ సమస్య అధికంగా వేధిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆరోపిస్తున్నారు. జిల్లాను 11మండలాలుగా విభజించి వాటికి ఇద్దరు చొప్పున ఎంఈవోలను కేటాయించి, ఒక్కొక్క మండలంలో కొన్ని సమూహాలు(క్లస్టర్‌లు)గా విడదీసి సీఆర్‌పీలను నియమించినా పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. విద్యార్థులకు చదువుపై ఆసక్తిని పెంచడానికి అన్ని అంశాల్లో మరింత చురుకుగా పాల్గొని ఆహ్లాదకరమైన విద్యను అభ్యసించాల్సిన విద్యార్థులు పాఠశాలలపై అసభ్యకరమైన పదజాలంతో ఫిర్యాదులు చేస్తున్నారంటే విద్యా విధానం ఎటుగా ప్రయాణిస్తుందో అర్థమవుతుంది. ప్రభుత్వం పదోవ తరగతి విద్యార్థులకు సరైన ప్రణాళికతో చదవడానికి 100రోజుల యాక్షన్ ప్లాన్‌ని ప్రారంభించగా ప్రైవేటు పాఠశాలలు పాటించే తీరు విద్యార్థులను ఒత్తిడి దిశగా తీసుకెళ్తుందని పలువురు విద్యార్థులే వెల్లడిస్తున్నారు. ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు పాఠశాలకే పరిమితం చేయడం, సెలవు దినాలు, ఆదివారాల్లో సైతం తరగతులు నిర్వహించడం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని రోధిస్తున్నారు. ఒత్తిడి లేని విద్యను అందించే దిశగా కొన్ని పాఠశాలలు ప్రణాళికలను రచిస్తుంటే మరికొన్ని డబ్బా పాఠశాలలు ఆర్భాటం చేయడంలోనే పనితనం చూపించి ఫలితాల్లో శూన్యం చూపిస్తున్నారు. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే సెలవు దినాలు, సమయాన్ని పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవల్సిన విద్యాశాఖ సిబ్బంది సంబంధిత పాఠశాలలకు వత్తాసు పలకడంతో విద్యా వ్యవస్థ దిక్కుతోచని స్థితిలో ఉందని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక ఫీజులు నియంత్రణ అంశాలు పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నా ఏ ఒక్కరూ అటుగా ప్రశ్నించకపోవడం అందర్నీ అయోమయానికి గురిచేస్తుందనే చెప్పాలి.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సమానంగా విద్యా విధానాన్ని రూపొందించడం, పాఠశాలల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, విద్యా ప్రమాణాల పర్యవేక్షణ అంశాల్లో మాత్రమే శ్రద్ధ చూపించాల్సిన విద్యాశాఖ ప్రైవేటు పాఠశాలలపై అమితమైన ప్రేమ చూపిస్తూ ద్వంద వైఖరిగా వ్యవహరించడం పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల నుంచి లాభాపేక్ష అధికంగా ఉండటంతో దిగువ స్థాయిలో ఉండే సీఆర్‌పీలు, ఎంఈవోలతో కలిసి సహాయ అధికారులు, ఉన్నతాధికారులు సైతం విద్యా ప్రమాణాలు పాటించని పాఠశాలలకు చేదోడు వాదోడుగా ఉండటం గమనార్హం. ప్రత్యేక తరగతుల పేరిట ఉదయం 8నుంచి రాత్రి 8గంటల వరకు పాఠశాలలు నిర్వహించడం, పాఠశాలలోనే ప్రత్యేక బోధన పేరిట ట్యూషన్ తరగతులు పెట్టడం, సెలవు దినాల్లో పాఠశాలల్లో తరగతులు జరపడం వంటివి చేస్తున్నా సంబంధిత విద్యాశాఖ అధికారులు చోద్యం చూడటంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
చిన్నారులకు ఉన్నతమైన విద్యను అందించే దిశగా తల్లిదండ్రులు పస్తులుండి రూ.లక్షల్లో ఫీజులు చెల్లించడంపై గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఏ మాత్రం ఉపయోగం లేకపోయింది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ (ఏపీఎస్‌ఈఆర్‌ఎంసీ) గ్రామ పంచాయితీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌ల వారీగా విభజిస్తూ సరసమైన పద్ధతిలో ఫీజులను తీసుకోవాలని ఆదేశాలు కేటాయించినా ఏ ఒక్క ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు కూడా పట్టించుకోలేదు. దీనిని పర్యావేక్షించాల్సిన విద్యాశాఖ సైతం చోద్యం చూడటంపై ప్రైవేట్ పాఠశాలల తీరు చాలా కుటుంబాలను చిన్నాభిన్నాం చేసిందనడంలో ఆశ్చర్య పడనవసరం లేదనే చెప్పాలి. ఏపీఎస్‌ఈఆర్‌ఎంసీ ప్రకారం గత మూడేళ్లుగా నర్సరీ నుంచి ఐదో తరగతికి గ్రామ పంచాయితీల్లో రూ.10వేలు, మున్సిపాల్టీల్లో రూ.11వేలు, కార్పొరేషన్‌లల్లో రూ.12వేలుగా అదే ఉన్నత విద్య 6నుంచి 10 తరగతి వరకు పంచాయితీల్లో రూ.12వేలు, మున్సిపాల్టీల్లో రూ.15వేలు, కార్పొరేషన్‌ల్లో రూ.18వేలుగా కేటాయించినా అటుగా ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం పట్టించుకోకపోవడం దుర్మార్గం. దీనిని పర్యావేక్షించాల్సిన విద్యాశాఖ సైతం చూసి చూడనట్టు వ్యవహరించడం కొసమెరుపు.
2009ని ఎవరు పాటిస్తున్నారో..?
రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్
2009 అనేది భారతదేశంలో పిల్లలకు ఉచిత, నిర్భంధ విద్యను అందించే చట్టంగా ప్రవేశపెట్టారు. 6నుంచి 14సంవత్సరాల వయస్సు గల ప్రతి బిడ్డకు తన నివాస స్థలానికి సమీపంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో విద్యను అభ్యసించే హక్కు ఉంది. ఈ పద్ధతిలో ప్రైవేట్ పాఠశాలలు బలహీన వర్గాల పిల్లలకు 25శాతం సీట్లను రిజర్వ్ చేయాలి. కానీ జిల్లాలో కొన్ని పాఠశాలలు మాత్రమే ఈ విధానాన్ని నామమాత్రంగా స్వీకరించి ఉచిత సీటులను కేటాయిస్తే.. మరికొన్ని పాఠశాలలు అటువంటి అవకాశాలు లేవని ఖచ్చితంగా వెల్లడిరచాయి. ఇంకొన్ని పాఠశాలల్లో అర్హత పొందినా విద్యార్థి వయస్సు సరిపోలేదని, ఆ చట్టం అందుబాటులో లేదని కల్లబొల్లి కబుర్లు చెప్పుతూ తప్పించుకున్నారు. దీనిపై ఇప్పటికే గత జిల్లా విద్యాశాఖ అధికారికి పలుమార్లు విద్యార్థుల తల్లిదండ్రులు పలుమార్లు మొరపెట్టుకున్నా ఎటువంటి ఉపయోగం లేకపోయింది. దీనిపై పాఠశాలల వారీగా పర్యవేక్షించాల్సిన దిగువస్థాయి సిబ్బంది సైతం చోద్యం చూస్తూ ఉండిపొయారు. ఒత్తిడి విద్యను అందిస్తూ అధిక ఫీజులను వసూలు చేస్తున్న పాఠశాల యాజమాన్యాలతో పాటుగా అటుగా పట్టించుకోని విద్యాశాఖ సైతం పైశాచికత్వంగా ఉందని స్పష్టంగా అర్థమవుతుంది.
నేత్ర న్యూస్, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి): కీలక టాస్క్‌ల్లో నిందితులకు ముందస్తు సమాచారం అందించి చేతివాటం చూపించడంతో పాటుగా క్రికెట్ బెట్టింగ్‌లు, పేకాటలు నిర్వహించడంలో టాస్క్‌ఫోర్స్ బృందం ప్రత్యేక గుర్తింపు కైవసం చేసుకుందని నగర ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్ ముసుగులో గత ఎనిమిదేళ్లుగా సుమారు రూ.150కోట్లకు పైగా క్రికెట్ బుకీ లావాదేవీల్లో పల్లా గంగరాజు అనే హెడ్ కానిస్టేబుల్‌ని గుర్తించి ఈనెల 15న ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వాస్తవానికి స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్‌గా విధుల నుంచి తొలిగించిన ఈ గంగూభాయ్ టాస్క్‌ఫోర్స్ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేసినప్పటి నుంచి బొబ్బిలి రవి, లగుడు రవి, తన సోదరుడు పల్లా త్రినాథ్‌తో కలిసి బెట్టింగ్ బుకీ నిర్వహించినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాంధ్ర, తూ.గో, ప.గోతో పాటుగా సుధూర ప్రాంతాల్లో ఈ బుకీ కార్యకలాపాలు జరిగినట్టు ఇప్పటికే ప్రత్యేక బృందాలు విచారణ చేపడుతున్నాయి. రోజుకి ఇద్దరు, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్న అధికారులకు విస్తుపోయే నిజాలు బయటపడటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఓ బాధితుడు పీజీఆర్‌ఎస్‌లో నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీకి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంలో రాజకీయ ఒత్తిడి తీవ్రంగా ఉన్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఇంతటి ఘనతను సాధించినట్టు పలువురు అధికారులు వెల్లడిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ స్టేషన్‌కి సమీపంలో ఎన్నో ఏళ్లుగా ఈ వ్యవహారం జరుగుతున్నా ఇంత ఆలస్యంగా గుర్తించడంలో ఆ హెడ్ కానిస్టేబుల్‌తో పాటుగా గతంలో పని చేసిన కీలక అధికారులకు సైతం ముడుపులు అందినట్టు పలు అనుమానాలు వెంటాడుతునే ఉన్నాయి. ఇదే క్రమంలో ప్రస్తుత బృందంలో ఉన్న కొందరు దిగుస్థాయి సిబ్బంది టాస్క్‌లకు వెళ్లే సమయంలో నిందితులకు ముందస్తు సమాచారం చేరవేసి లబ్ధి పొందుతున్నట్టు సంబంధిత విభాగంలోనే గుసగుసలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పోర్టులో సొత్తును కాజేస్తున్న ఇద్దరు మాయ లేడీల నుంచి నెలవారీ వచ్చే ముట్టగొట్ట(లంచం)కి కక్కుర్తి పడటం, గంజాయి తరలింపు కేసుల్లో కీలక ఆధారాలు తీసుకొచ్చి కేసులు నమోదు చేయడంలో ఎంత చాకచక్యం ప్రదర్శిస్తున్నారో అంత కంటే పెద్ద పెద్ద ముఠాలను పక్కదారిలో తరలించడానికి సాయం చేస్తూ ఎంత మొత్తంలో భక్షిస్తున్నారో బహిరంగ రహస్యంగానే సిబ్బంది మనసులో దాచుకున్నారు. నగరంలో ఉన్న రౌడీ షీటర్స్, బడా బాబులందరూ జూదం ఆడటానికి ఓ వేదికను ఏర్పాటు చేసే కీలక రౌడీషీటర్ కొలుసు కుమార్‌కి సైతం చేదోడు వాదోడుగా ఉంటూ నెలవారీ ముడుపులు తీసుకోవడంలో బిజీ బిజీగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం. అది కూడా ఎంతగా అంటే సంక్రాంతి పండగ అటు ఇటుగా నెలరోజులు స్టేషన్‌కి వచ్చి వారాంతపు సంతకాలు చేయాల్సిన రౌడీషీటర్ సైతం జూదం ఆడుకుంటూ రాకపోయినా పట్టించుకోలేనంతగా ఇక్కడ సిబ్బంది స(అ)క్రమంగా విధులు నిర్వహిస్తున్నారు.
తనకి హద్దులను కేటాయించినా నగర వ్యాప్తంగా సంచరిస్తున్న ఆ షాడో రౌడీ షీటర్స్‌తో స్నేహం చేసి దండీగానే దండుకుంటుంది. ఓ మహిళా న్యాయవాది సాయంతో జైల్లో ఉన్న రౌడీ షీటర్‌లకు ములాకత్, బెయిల్ పెట్టడంలో షాడో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇదే క్రమంలో అక్కడ మగ్గిపోతున్న కొందరు పీడీయాక్ట్, డ్రగ్స్, గంజాయి కేసుల్లో ఉన్న కేటుగాళ్ల నుంచి కీలక విషయాలను తెలుసుకొని నగరంలో మాయాజాలం ప్రదర్శిస్తుంది. ఓ ఘటనలో ఒక రౌడీషీటర్ వద్ద 2గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ గుర్తించి అదే టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పట్టుకుంటే తనకు ఆ రౌడీషీటర్ డబుల్ ఏజెంట్‌గా ఉన్నాడని ఉన్నతాధికారులను ఒప్పించి వదిలి పెట్టడంలో కీలకంగా వ్యవహరించింది ఆ షాడో. బెల్ట్ దుకాణాలు, రేషన్ బియ్యం అక్రమంగా తరలించే వ్యక్తుల నుంచి సైతం పెద్ద మొత్తంలో ముడుపులు అందుతున్నట్టు టాస్క్‌ఫోర్స్ గోడలు సైతం ఈ షాడో చేష్టలు చూడలేక గగ్గోలు పెడుతున్నాయి.
నగర వ్యాప్తంగా ఎటువంటి తారతమ్యం, రాజకీయ ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించడానికి టాస్క్‌ఫోర్స్‌లో డైరెక్ట్ డీఎస్పీ స్థాయి అధికారి అవసరం అక్కడ ఎంతైన ఉందని పలువురు దీర్ఘకాలిక అనుభం కలిగిన పోలీసు ఉద్యోగులు వెల్లడిస్తున్నారు. నెలరోజులు క్రితం స్టేషన్‌కి సమీపంలో ఓ లాడ్జీలో పేకాట జట్టుని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ బృందానికి తీవ్ర తలనొప్పి తెచ్చిపెట్టింది. ఓ రాజకీయ ఒత్తిడి వలన కొంత సొమ్ముతోనే అదుపులోకి తీసుకోవల్సి వచ్చింది. ఇదే క్రమంలో వారం రోజుల క్రితం ఆనందపురం, రామవరం రోడ్డులో సుమారు వంద మందికి పైగా కోడి పందాలు ఆడుతున్నారని పట్టుకోవడానికి వెళ్లిన సిబ్బందికి ఓ మాజీ ఎమ్మెల్యే ఒత్తిడి తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అప్పటికే ముప్పై మందికి పైగా అదుపులోకి తీసుకొని రూ.2.10లక్షల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. సిబ్బంది కష్టపడినా కార్లులో ఉన్న భారీ మొత్తాన్ని పట్టుకోలేకపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో డైరెక్ట్ అధికారి అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు సీఐలు, ఒక ఎస్సై, నలుగురు హెచ్‌సీలు, పద్నాలుగు మంది కానిస్టేబుల్స్, ఇద్దరు హోంగార్డు డ్రైవర్‌లతో నడుస్తున్న టాస్క్‌ఫోర్స్ బృందాన్ని స్పెషల్ బ్రాంచ్ ఏడీసీపీతో పాటుగా నగర పోలీసు కమిషనర్ పర్యావేక్షించడం ఒక విధంగా మంచిదైనా స్థానికంగా అక్కడ ఓ ఉన్నతాధికారి లేకపోవడం దిగువ స్థాయి అధికారులకు ఇబ్బంది తప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి కంటే అక్కడ సీనియర్ స్టేషన్ స్థాయి అధికారికి నిందితులను అప్పగించే సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు. పైగా ఎదురు సమాధానం చెప్పలేకపోవడంతో టాస్క్ నిర్వహించి సంబంధిత సమీప స్టేషన్‌కి అప్పంగించాల్సిన టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి సెంట్రీ డ్యూటీ వేసిన సందర్భాలు కూడా నగరంలో అధికంగానే ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంది.
నేత్ర న్యూస్, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి) : ‘‘మీ సీపీ ఎల్లప్పుడూ యూనిఫామ్‌లో ఉంటే మీరు ఎందుకు యూనిఫాంలో ఉండకూడదు. విధుల్లో ఉన్నప్పుడు 100శాతం అందరూ పోలీసు యూనిఫామ్‌లో ఉండాలి. హోంగార్డు, కానిస్టేబుల్ నుంచి ప్రతీ అధికారి యూనిఫామ్ ధరించాలి. ఎవ్వరైనా యూనిఫామ్‌లో లేకపోతే వాళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలి.’’ అని సాక్షాత్తు విశాఖ నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ మాట్లాడిన మాటలు ఇప్పుడు నగర పోలీసు సిబ్బంది అందరిలో ఓ కొత్త భయాందోళన రేకెత్తించింది. అది కూడా ఎందుకంటే నగర సీపీ మాట్లాడిన మాటలతో పాటుగా ఓ దిగువ స్థాయి సిబ్బంది మరో వాయిస్ రికార్డుని జత చేస్తూ ‘‘ఎవరైతే జనరల్ డ్యూటీలో ఉన్నారో వాళ్లందరూ తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని, పైగా నిఘా కూడా ఉంది అందరూ సీరియస్‌గా తీసుకోవాలి.’’ అని చెప్పడంతో నగర వ్యాప్తంగా స్టేషన్ స్థాయిలో ఇప్పటికీ జనరల్ డ్యూటీ (2016 మే 25న మాజీ సీపీ యోగానంద్ సమక్షంలో అంతరించి పోయిందని అనుకున్న ప్రత్యేక కలెక్షన్ బృందం) ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని విశ్వసనీయ సమాచారం. ప్రజల సమస్యలతో పాటుగా సిబ్బంది బాగోగులు చక్కగ చూస్తున్న నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ ఇప్పుడు అవినీతి ముసుగులో మగ్గిపోతున్న కలెక్షన్ కింగ్‌లపై పడ్డారా..? అనే భయంతో స్టేషన్ పరిధిలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న సుమారు 75శాతం సిబ్బంది మంగళవారం ఉదయం యూనిఫామ్‌లో దర్శనమిచ్చారు. దీంతో పాటుగా ఎప్పుడూ పోలీసు యూనిఫాం ధరించకుండా కలెక్షన్ ఏజెంట్లుగా తిరుగుతూ అధిక మొత్తంలో దోచుకుంటున్న దొంగల ముఠా సభ్యులు సైతం ఒక్కసారిగా యూనిఫామ్ ధరించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. వాస్తవానికి సోమవారం సీపీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ నిర్వహిస్తున్న సమయంలో ఓ దిగువ స్థాయి సిబ్బంది యూనిఫామ్ ధరించకుండా అడ్డుగా వచ్చిన సందర్భంలో నగర సీపీ అందరూ యూనిఫాం ధరించాలి అని చెప్పగా ఆ విషయం నగర వ్యాప్తంగా కలెక్షన్‌లో బిజీ బిజీగా ఉన్న సిబ్బందిని ఇబ్బంది పెట్టిందని ఆలస్యంగా వెలుగు చూసింది. ఏది ఏమైన నగర సీపీ అటుగా కూడా నిఘా కట్టుదిట్టం చేశారని పలు సందేహాలు సైతం వేడి వేడిగా వినిపిస్తున్నాయి.
నగర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీసు స్టేషన్‌ల్లో జనరల్ (కలెక్షన్ నిమిత్తం) సిబ్బందిని నియమించి ఇష్టానుసారంగా దండుకుంటున్నారని ఇప్పటికే నగర సీపీకి సైతం పీజీఆర్‌ఎస్‌లో పలు ఫిర్యాదులు సైతం వచ్చాయి. దీనిపై ఆయన తనదైన శైలిలో చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు పలువురు సిబ్బంది వెల్లడిస్తున్నారు. ఓ స్టేషన్ పరిధిలో గత 20ఏళ్లుగా ఉన్న హోంగార్డు జనరల్ సిబ్బందిగా చలామణి అవుతూ ట్రావెల్స్ యాజమాన్యల నుంచి దండుకుంటే.. మరో స్టేషన్ పరిధిలో హోటల్స్, సినిమా థియేటర్‌ల వద్ద ఈ ఏజెంట్ తన పనితీరుని చూపిస్తున్నాడు. ఇంకొక స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్ బిల్డింగ్‌లు నిర్మించే బిల్డర్‌ల వద్ద రూ.లక్షల్లో దోచుకుంటుంటే.. మరో స్టేషన్ పరిధిలో షిప్పింగ్ కంపెనీలు, కార్గో యజమానుల నుంచి సరుకును దోచుకునే దొంగల నుంచి దండుకుంటున్నారు. ఇలా నగర వ్యాప్తంగా మామూళ్లు మత్తులో ఉన్న జనరల్ సిబ్బందిపై ప్రస్తుత పోలీసు కమిషనర్ చర్యలకు ఎప్పుడు పచ్చ జెండా ఊపుతారో అని నిజాయితీగా ఉన్న కొందరు పోలీసు సిబ్బంది ఆశగా ఎదురు చూస్తున్నారు.
పోలీసు యూనిఫామ్ ధరించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని, అంతే కాకుండా ఖాకీ రంగుకి కూడా ప్రత్యేక అర్థం ఉందని పలువురు విరమణ ఉద్యోగులు సైతం వెల్లడిస్తున్నారు. ఖాకీ రంగు దుమ్మును దాచిపెట్టడానికి ఉపయోగపడుతుందని, అంతే కాకుండా ఇది శాంతి, క్రమశిక్షణను సూచిస్తుందని వెల్లడిస్తున్నారు. పోలీసు యూనిఫామ్‌ల చరిత్ర కూడా చాలా ఆసక్తికరమైనదని, బిటిష్ కాలంలో బ్రిటిష్ వారు భారతదేశంలో తెల్లని రంగు యూనిఫామ్‌లను ఉపయోగించేవారని కానీ అవి త్వరగా మురికి అవ్వడంతో 1847లో సర్ హ్యారీ లమ్స్‌డెన్ అధికారికంగా ఖాకీ రంగు యూనిఫారాన్ని వాడుకలోకి తీసుకొచ్చారు. పోలీసు విభాగంలో నేటికి కొనసాగుతునే ఉంది.
గుర్తింపు: యూనిఫామ్ పోలీసును సామాన్య ప్రజల నుండి వేరు చేస్తుంది. ఇది ప్రజలకు భద్రతా భావాన్ని కలిగిస్తుంది.
శ్రేణిని నిర్వచించడం: వివిధ రకాల యూనిఫామ్‌లు పోలీసు అధికారి యొక్క శ్రేణిని సూచిస్తాయి. ఇది ఆదేశాలను అమలు చేయడంలో సహాయపడుతుంది.
ఏకత్వం: ఒకే రకమైన యూనిఫామ్‌ను ధరించడం వల్ల పోలీసు దళంలో ఏకత్వం పెరుగుతుంది.
నేత్ర న్యూస్, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి) : ఒత్తిడి లేని విద్యను అందిస్తూ విద్యార్థి సృజనాత్మకతను పెంపొందించడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తూ విద్యార్థుల భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావం చూపించడానికి కొన్ని అంటే కొన్నే పాఠశాలలు పనిచేస్తుంటే.. విద్యార్థి భవిష్యత్తుపై ఎటువంటి ప్రభావం చూపించని డబ్బా పాఠశాలలు చేస్తున్న నిర్వాకం విద్యాశాఖను సైతం అభాసుపాలు చేస్తున్నట్టే ఉంది. పండగ సమయంలో విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం, విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యమని పలువురు విద్యావేత్తలు వెల్లడిస్తున్నా నూటికి 30శాతం ఉత్తీర్ణతను ఇచ్చే డబ్బా పాఠశాల లు పండగ సమయంలో విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తూ తరగతులు నిర్వహించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వం నుంచి ఈనెల 7న ఆర్‌సీ నెంబర్ ఏసీఏడీ/2308989/2025 పేరిట పండగ సెలవుల నిమిత్తం సర్కులర్‌ని విడుదల చేసినా అటుగా ఆచరించవలసిన పాఠశాలలు, అనుసరించవలసిన విద్యాశాఖ పట్టించుకోకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. నూటికి నూరు శాతం ఫలితాలు ఇచ్చే పాఠశాలలో విద్యార్థులు ఒత్తిడి గురికాకుండా ఉండటానికి ప్రత్యేక సెలవులు ప్రకటిస్తుంటే.. నూటికి 30శాతం ఫలితాలు ఇచ్చే డబ్బా పాఠశాలలు తరగతులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐఐటీ ` నీట్ కోచింగ్ సెంటర్‌లు మినహా అన్ని విద్యా సంస్థలు ఈనెల 10నుంచి 19వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిన అటుగా ఉత్తమ డబ్బా పాఠశాలలు పట్టించుకోకపోవడం గమనార్హం. మరోవైపు ఆదేశాలను అనుసరించాల్సిన జిల్లా విద్యాశాఖ సైతం నామమాత్రపు ఆదేశాలు జారీ చేసి చేతులు కడుక్కున్నారని స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై సంబంధిత జిల్లా ఉన్నతాధికారులను కార్యాలయంలో కలవడానికి ముందుగానే ప్రయత్నించినా ఇరువురు అధికారులు కార్యాలయాల్లో లేకపోవడం ఎటువంటి సమాధానం దొరకలేదు. పైగా దిగువస్థాయి సిబ్బందితో జిల్లా విద్యాశాఖాధికారి తరుపున అని పత్రికా ప్రకటనలో సంతం పెట్టి విడుదల చేయడం కొసమెరుపు.
సంక్రాంతి పండగ సెలవుల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి విడుదలైన సర్కులర్‌ని జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటుగా అన్ని పాఠశాలలు విధిగా పాటించాలని ఆదేశించినా ఆర్భాటం ఎక్కువగా చేసే కొన్ని డబ్బా పాఠశాలలు పాటించకుండా తుంగలో తొక్కడం సరికాదని పలువురు విద్యావేత్తలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహాలో కల్తీ విద్యను పాఠశాలలు బోధించడం వలన విద్యార్థులు ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని కోల్పోవడానికి ఎక్కువ అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. పాఠశాలల పనితీరుని నిరంతరం కనిపెట్టాల్సిన విద్యాశాఖ దిగువ స్థాయిలో ఎంఈవోలు, సీఆర్‌పీలను కేటాయించినా అటుగా ఆ సిబ్బంది పని చేయకపోవడం అసలు సమస్య ఉత్పన్నం అవుతుంది. కొందరు సిబ్బంది పాఠశాలలను తమ కనుసైగల్లో పెట్టుకొని నెలవారీ మామూళ్లు, ఇండెంట్లు మత్తులో పాఠశాల యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నారని ఇట్టే అర్థం అయిపోతుంది. ఎంతగా అంటే సెలవు దినంలో కూడా స్వేచ్ఛగా తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి పాఠశాలల్లో తరగతులు నిర్వహించడం. దీనిపై సంబంధిత పాఠశాల యాజమాన్యాలను ప్రశ్నించగా పాఠశాలలు నడపడంలో మాకు అన్ని పద్ధతులు తెలుసు అని వ్యంగ్యంగా సమాధానం ఇవ్వడం ఆశ్చర్యం.
తుఫానులు, పండగల సమయంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పభుత్వం తరుపున జిల్లా కలెక్టర్ పాఠశాలలకు సెలవులు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసిన ప్రతీసారి కొన్ని డబ్బా పాఠశాలలు బేఖాతరుగా వ్యవరించడం చాలా సందర్భాలు ఉన్నాయి. గతనెల 21న భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సెలవును ప్రకటించినా ఏ మాత్రం పట్టించుకోలేదు. గత అక్టోబర్‌లో 12రోజులు దసరా సెలవులు ప్రకటిస్తే ఏదో అత్యుత్తమమైన ర్యాంక్‌లు సాధించినట్టు ఈ డబ్బా పాఠశాలలు పది రోజులు తరగతులను నిర్వహించారు. గత సెప్టెంబర్ 2న భారీ వర్షాల కారణంగా సెలవు ప్రకటిస్తే ఈ పాఠశాలలు పాటించకపోగా సంబంధిత విద్యాశాఖ దిగువ స్థాయి సిబ్బందికి ఆమ్యామ్యాలు ఇచ్చి ఇష్టారాజ్యంగా వ్యవరించారని పాఠశాలల యాజమాన్యలే బహిరంగంగా గుసగుసలాడుకుంటున్నారు. ఇదే క్రమంలో గత కృష్ణాష్టమికి సైతం సెలవు లేకుండా ఉత్తమ ర్యాంక్‌లు సాధించడానికి కృషి చేసిన ఈ డబ్బా పాఠశాలలు తీరుకి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. దీనిపై ప్రతీసారి సంబంధిత ఎంఈవోలకు, సీఆర్‌పీలకు ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఈ అంశాలపై నకిలీ పత్రికలు నడుపుతున్న కొందరు నకిలీ విలేకరులు ప్రశ్నించడంతో వాళ్లను మచ్చిక చేసుకోవడానికి సంబంధిత విద్యాశాఖ అధికారులే అన్ని పాఠశాలలకు సంబంధించిన సమాచార అంశాలను ఇచ్చి ప్రకటనల రూపంలో రూ.లక్షలు దోచుకోవడానికి సాయం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎంతగా అంటే ఓ నకిలీ పత్రిక ఏకంగా సుమారు 50పాఠశాలలకు ఫోన్ ద్వారా బెధిరించి ప్రకటనల రూపంలో రూ.లక్షలు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసినంత వరకు. ఈ అంశాలన్ని జిల్లా పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుని(ఆర్‌జేడీ) దృష్టిలో సైతం ఉందని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం.