Please assign a menu to the primary menu location under menu

Weekly Gadgets

Find Us on Socials

Friday, April 19, 2024

Devotional

Devotional

ఆయన భక్తి అదో రకం

నేత్ర న్యూస్‌, అన్నవరం, (ప్రత్యేక ప్రతినిధి) : మానవుడిగా పుట్టిన వాడికి కాసంత భక్తి భావం ఉండాలని పెద్దలు అన్న విషయం మరోమారు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో కనిపించిందనే చెప్పాలి. అక్కడ కాసంత కాదు.. కొండంత భక్తి ఉందని ఓ భుక్తుడు నిరూపించాడు. ఆ భక్తి పరవశంలో తనతో పాటుగా చుట్టు పక్కల ఉన్నవారు సైతం మునిగి పోవాలని నిబంధన పెట్టడమే అక్కడ అసలు కథ మొదలైంది. తాను భక్తుడే కాకుండా ఆ ఆలయ కార్యనిర్వాహణాధికారి కావడం కొస మెరుపు. తాను చెప్పింది శిరసా వహించకపోతే శిక్షలు తప్పవని హెచ్చరికలు సైతం జారీ చేయడంతో చేసేదేమి లేక సిబ్బంది అందరూ శిరస్సు వంచి మాలధారణ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయ కార్యనిర్వాహణాధికారిగా ఉన్న చంద్రశేఖర్‌ ఆజాద్‌ గతంలో శ్రీశైలం శ్రీమల్లిఖార్జున స్వామి ఆలయం, విజయవాడ శ్రీకనక దుర్గమ్మ ఆలయంలో వ్యవరించిన తీరు మరోమారు అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో కనిపించడంపై పలువురు సిబ్బంది మండి పడుతున్నారు. ఏ ఆలయంలో విధులు నిర్వహిస్తే ఆ స్వామివారి మాలధారణ చేయడం ఆయనకు అలవాటుగా అనుకుంటే..

ఆ ఆలయంలో విధులు నిర్వహిస్తున్న మొత్తం సిబ్బందిని బలవంతంగా మాలధారణ చేయాలని ఆదేశించడం మూర్ఖత్వంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆలయంలో పని చేస్తున్న మొత్తం సిబ్బంది గతంలో శ్రీశైలంలో సిబ్బంది శివమాల, విజయవాడలో సిబ్బంది దుర్గమ్మ మాల వేసినట్టు ఇక్కడ సిబ్బంది సత్యదేవుని మాల వేయాలని ఆదేశించారు. తాను సైతం మంగళవారం ఉదయం వేద పండితుల సమక్ష్యంలో మాలధారణ చేయడంతో పాటుగా ఆలయంలో సుమారు 80శాతం సిబ్బందికి మాలధారణ చేయించారు. మరో 20శాతం సిబ్బంది ఇంట్లో ఉన్న చిన్నపాటి రుతుక్రమ సమస్యలు తీరిన తరువాత తీరిగ్గా.. అది కూడా మరో రెండు రోజుల్లో మాలధారణ చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో సిబ్బంది ముక్కుతూ మూలుగుతూ స్వామివారి మాలధారణ భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుని చీటీ తీసుకురావాలని, తన కుటుంబంలో ఎవరికైనా సమస్యలు ఉంటే సమస్యను వివరిస్తూ సంబంధిత పత్రాలను చూపించాలని షరతులు సైతం పెట్టారని పలువురు ఆగ్రహంతో మండి పడుతున్నారు. ఇటువంటి సమస్యలపై ఇప్పటికే అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లామని, దీనిపై అంతర్గత విచారణ చేపట్టి ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూస్తున్నామని పలువురు సిబ్బంది వెల్లడిస్తున్నారు.

 • మా స్వామివారి భక్తిలో డిస్కౌంట్‌ ఆఫర్లు..
  దైవ భక్తితో చేసిన చేష్టలు చూడటానికి చక్కగా ఉంటే.. దొంగ భక్తితో చేసిన చేష్టలు చికాకు తెస్తున్నాయని ఆలయంలో సిబ్బంది కార్యనిర్వహణాధికారి ఆజాద్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సుమారు వెయ్యి మందికి మాలధారణ చేయమని చెప్పడం ఓ మాదిరిగా ఉన్నా.. ఇంట్లో కుదరలేని సిబ్బంది స్వామివారి మాల వస్త్రాలు మాత్రం తప్పనిసరిగా ధరించి విధులు నిర్వహించాలని నిబంధన పెట్టడంపై పలువురు సిబ్బంది నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. మెడలో మాల లేకపోయినా వస్త్రాలు ధరించి విధులు నిర్వహించడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయగా ఆఖరికి చేసేదేమి లేక పై స్థాయి అధికారి చెప్పినట్టు నడుచుకోవడం మంచిదని సర్ధుకున్నారని సమాచారం. దీనిపై హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి సభ్యులు, స్వామివారి భక్తులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

 • ఉన్నత స్థాయి అధికారికి ఉడతా భక్తి ఉందా..?
  అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉన్నత స్థాయిలో ఉన్న ఈవో చంద్ర శేఖర్‌ ఆజాద్‌కి ఉడత చేసినంత భక్తి ఉందా..? లేదా నటిస్తున్నారా..? అనే సందేహాలు వెంటాడుతునే ఉన్నాయి. గతంలో శ్రీశైలం ఆలయంలో ఈవోగా ఉన్న సమయంలో గుప్త నిధుల వేటతో అక్కడి భక్తుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆయన శివమాల పేరిట అక్కడ సిబ్బందిని హింసకు గురిచేయడం, ఆ తరువాత విజయవాడ దుర్గమ్మ ఆలయంలో అమ్మవారి మాలలు వేయాలని అక్కడ సిబ్బందిని ఇబ్బంది పెట్టిన కొన్ని రోజులకే ఏసీబీ దాడుల్లో దొరికిపోవడం ఆయనకు నిజమైన భక్తి ఉందా..? లేదా భక్తి ఉన్నట్టు నటిస్తున్నారా..? అనే విషయం అర్థం కావడం లేదు. ఇదే క్రమంలో అన్నవరం సత్యనారాయణ స్వామివారి ఆలయంలో తన భక్తిని చాటుకునే క్రమంలో ఆయనతో పాటుగా సిబ్బంది మొత్తం మాలధారణ చేయాలని నిబంధనలు పెట్టడం, మాల వేయలేనివారు వస్త్రాలు ధరించి విధులు నిర్వహించాలని షరతులు పెట్టడం వెనుక పలు సందేహాలు వేధిస్తునే ఉన్నాయని తన తోటి ఉద్యోగులే గుస గుసలాడుకుంటున్నారు. ఇటువంటి వారిని చూసిన తరువాత ఏదిఏమైనా.. ఎవరూ ఏం చేసినా.. హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని నేత్ర న్యూస్‌ గుర్తుచేస్తుంది.

Devotional

విజేయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా జ్యోతిష్య గ్రంధాల ఆవిష్కరణ

నేత్ర న్యూస్, విశాఖపట్నం: బ్రాహ్మశ్రీ నాగులకొండ ఆశ్లేషాచార్య సిద్ధాంతి రచించిన మూడు జ్యోతిష్య గ్రంథాలను శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా ఆవిష్కరించారు. హైందవ ధర్మ ప్రచారంలో భాగముగా వేద విహితమైన జ్యోతిష వాస్తు, ప్రశ్న శాస్త్ర గ్రంధాల ద్వారా ప్రజలు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకుని సుఖమయ జీవనాన్ని సాగించాలని ఆయన అన్నారు. అక్కయ్యపాలెం శంకరమఠంలో పాతగాజువాక జ్యోతిష సరస్వతీ పీఠం నిర్వాహకులు గ్రంధకర్త దైవజ్ఞ రత్న, జ్యోతిష్య విజ్ఞాన భాస్కర్, జ్యోతిష్య వాస్తు విభూషణ్ పండిత నాగులకొండ ఆశ్లేషాచార్య సిద్ధాంతి తెలుగులో అనువదించిన మహాపండిత పద్మప్రభుసూరి ప్రణీత “భువన దీపిక” (13వ శతాబ్దికి చెందిన ప్రముఖ ప్రశ్న గ్రంథము), మహాపండిత మహారాజు శంభుసింహ ప్రణీత “ప్రశ్న జ్ఞాన ప్రదీప” (15వ శతాబ్దికి చెందిన ప్రముఖ ప్రశ్న గ్రంథము), మహాపండిత సుఖదేవ చతుర్వేది ప్రణీత “మూక ప్రశ్న విచార” రచనలను సువర్ణ దివ్య హస్తములతో ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి మాట్లాడుతూ అత్యంత ప్రాచీన జ్యోతిష్య గ్రంథాలను అందరు చదువుకునే విధంగా తెలుగులో అనువాదించడం శుభ పరిణామమన్నారు. నిర్వాహకులు ఆశ్లేష ఆచార్యులు, వెంకట సూర్యచార్యులు, వెంకట యోగాచార్యులు జ్యోతిష్య, వాస్తు విద్యాలయం ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చెయ్యాలని స్వామివారు ఆశీర్వదిస్తూ సూచించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జ్యోతిష్య పండితులు మధురపాల శంకర శర్మ, పాత్రికేయులు పుచ్చా శ్రీనివాసరావు, కొప్పరపు కవుల కళా పీఠం అధినేత మాశర్మ, మోహన్ పబ్లికేషన్స్ అధినేత రామచంద్రరావు అనేకమంది జ్యోతిష్య పండితులు, శాస్త్రాభిలాషులు పాల్గొన్నారు. కార్యక్రమములో నాగులకొండ సూర్యాచారి గౌరవ అతిధులుగా పాల్గొన్నారు.

Devotional

కనకమ్మ ఆలయంలో కస్సు బుస్సులు

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, ( ప్రత్యేక ప్రతినిధి ): కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి.. కొంగు బంగారం చేసే తల్లి.. బురుజుపేట శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాస మహోత్సవ ఏర్పాట్లు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 24నుంచి డిసంబర్‌ 23వరకు జరుగు మహోత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే ముమ్మరం చేశామని సంబంధిత ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె.శిరీష ఓ ప్రకటనలో తెలిపారు. సంబరాలకు సంబంధించిన విషయాలను వెల్లడిరచడానికి శనివారం ఉదయం ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్మకర్తల మండలి సభ్యుల వర్గం, ఆలయ అధికారిక వర్గం మధ్యలో జరిగిన ఘర్షణ ఓ యుద్ధ వాతావరణాన్ని తలపించిందంటే ఆశ్చర్య పడనవసరం లేదు. ఆలయంలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న విభేదాల ఉత్సవం విలేకరుల సమావేశంలో బహిరంగం అయిపోయింది. ఒక వర్గం ప్రత్యర్థి వర్గంపై దాడి చేసే విధంగా మాట్లాడంతో మరో వర్గం దీటుగా ఎదుర్కొన్నట్టు మాట్లాడటం వలన కాసేపు అక్కడ యుద్ధ వాతావరణం కనిపించింది. ఆలయ కార్యనిర్వహణాధికారిణి చేస్తున్న వ్యవహారంలో రెండేళ్ల పాటుగా ఉండే ధర్మకర్తల మండలి సభ్యులకు ఎటువంటి గౌరవం ఇవ్వడం లేదని ఆవేదనతో ఆ వర్గం పెద్దగా గొడవ చేయడంతో.. అన్ని అంశాల్లో గౌరవ స్థానాన్ని కేటాయిస్తున్నామని ఆలయ ఈవో సమాధానం ఇవ్వడంతో ఇరువర్గాల మధ్య జరిగిన విశ్లేషణాత్మక విద్వాంశంలో విలేకరులు పెద్దల పాత్రను పోషించారు. ధర్మకర్తల మండలి సభ్యుల్లో.. సభ్యులకు ఇప్పటి వరకు సవాలక్ష తగాదాలు ఉండగా ఆ వ్యవహారం కాసంత ముదిరి ఆలయ అధికారులకు కూడా తాకడంతో రెండు వర్గాలుగా తయారవ్వడంతో అసలు తంతు ఇక్కడే మొదలైంది.

 •  ఆలయంలో ఎడ మొహం.. పెడ మొహం..
  బురుజుపేట శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారు ఆలయంలో ఆలయ అధికారిణి, ధర్మకర్తల మండలి చైర్మన్‌ ఇరువురు ఎడ మొహం, పెడ మొహంగా ఉన్నారని ముందు నుంచే పలు సంకేతాలు కనిపిస్తునే ఉన్నాయి. దీనికి సైతం ఆలయంలో జరుగుతున్న వ్యవహారాల్లో తనకు గౌరవ స్థానం ఇవ్వడం లేదని ఓ వాదన వినిపిస్తుంటే.. చైర్మన్‌ చేసిన చేష్టలు వలన సంబంధిత ఆలయ కార్యనిర్వహణాధికారిణి కఠినంగా వ్యవహరించడమని మరో వాదన సైతం గట్టిగానే వినిపిస్తుంది. కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి దత్తత దేవాలయమైన అంబికాబాగ్‌ కల్యాణ మండపం వ్యవహారంలో ఈవో శిరీష కఠినంగా వ్యవరించడమే దీనికి కారణమని పలువురు సిబ్బంది వెల్లడిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌ నెలలో అంబికాబాగ్‌ ఆలయంలో గల కల్యాణ మండపాన్ని ప్రస్తుత చైర్మన్‌ పదవిలో ఉన్న కొల్లి సింహాచలం తన కుమారుడు కొల్లి శ్రీను పేరిట బహిరంగ వేలం పాటలో కైవసం చేసుకున్నారు. ఆ తరువాత రెండు నెలల్లో ఏర్పాటు అయిన ధర్మకర్తల మండలిలో చైర్మన్‌ పదవిని సైతం కైవసం చేసుకోవడంతో అసలు గొడవ అక్కడ మొదలైందనే చెప్పాలి. ఆలయంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు కానీ.. ఆలయ ఉద్యోగులు కానీ.. వాళ్ల కుటుంబ సభ్యులు కానీ.. ఆలయ ఆస్తులను గుత్తేదారు పద్దతిలో ఇచ్చేటి వంటి అంశాల్లో ఉండకూడదని ఎండోమెంట్‌ ఏక్ట్‌లో ఉందని పలువురు ఇప్పటికే ఫిర్యాదులు సైతం చేశారు. ఇదే క్రమంలో తన ప్రత్యర్థి సైతం విశాఖ జిల్లా ఉన్నతాధికారులు, పార్టీ పెద్దలతో పాటుగా దేవాదాయశాఖ అధికారులకు సైతం ఈ విషయం అర్థం అయ్యే విధంగా అన్ని ఆధారాలు, ఏక్ట్‌లతో అర్జీలు సైతం పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం.

 

 • ధర్మకర్తలకు పెద్ద పీట వేస్తున్నాం..
  శనివారం ఉదయం కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన విలేకరుల సమవేశంలో తమకు గౌరవ స్థానం ఇవ్వడం లేదని ధర్మకర్తల మండలి సభ్యులు వెల్లడిరచారు. దీనికి స్పందించిన ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె.శిరీష స్పందిస్తు ధర్మకర్తల మండలి సభ్యులకు పెద్దపీట వేస్తున్నామని సమాధానం ఇచ్చారు. మార్గశిర మాస మహోత్సవాలకు సంబంధించిన స్వాగత పత్రాల్లో చైర్మన్‌కి ప్రత్యేకంగా ఫొటో ముద్రించలేదని వచ్చిన చిన్నపాటి సమస్య చాలా అంశాలకు దారి తీసిందని తెలిపారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మీటింగ్‌కి తమని పిలవలేదని ఆరోపించిన ధర్మకర్తల మండలి సభ్యులు జేసీ వద్ద నిర్వహించిన గోడపత్రిక ఆవిష్కరణ ఫొటోల్లో ఎలా ఉన్నారని, బయట డిపార్టుమెంట్‌ల కో`ఆర్డినేషన్‌ మీటింగ్‌లో ఆలయంలో ఏర్పాటు చేసిన చిన్న చిన్న కమిటీలకు సంబంధించిన వ్యక్తులను జేసీకి పరిచయం చేయలేదని మరోమారు ఆగ్రహం వ్యక్తం చేయడం సరి కాదని అన్నారు. బయట వ్యక్తులకు సంబంధించిన అంశాల్లో ఆలయ అంశాలు చర్చించడం సరైన పద్ధతి కాదని, ఎటువంటి అనుభవం లేని వ్యక్తులు చెప్పినట్టు నడుచుకుంటే ఆలయానికి చెడ్డ పేరు వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటుగా మార్గశిర మాసం సమయంలో ఫ్రీ పాస్‌లు ఇవ్వాలని, దీనికి తోడు విలేకరుల సమావేశానికి ప్రత్యేకంగా పిలవలేదని ఆరోపించడం సభువుకాదని ఈవో శిరీష వెల్లడిరచారు. ఆలయంలో ఉన్న చిన్నపాటి సమస్యలు ఆలయంలో మీటింగ్‌ పెట్టి తమలో తాము పరిష్కరించుకోవాలని, బహిరంగంగా గొడవలు పెట్టు కోవడం వలన ఆలయానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. తాను ఇక్కడ విధులు నిర్వహించే వరకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పని చేస్తానని, ఎటువంటి ఒత్తుళ్లకు లొంగేది లేదని ఘాటుగా సమాధానం ఇచ్చారు.

 

 •  అబింకాబాగ్‌ ఆదాయానికి పంగనామం..
  శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి దత్తత దేవాలయం అయిన అంబికాబాగ్‌ ఆలయ ఆదాయానికి పంగనామం పెడుతున్నారు. ఆలయ అభివృద్ధి నిమిత్తం ఆలయంలో కొంత భాగాన్ని కల్యాణమండపం పేరిట విభజించి గుత్తేదారు పద్ధతిలో గత ఏడాది అక్టోబర్‌లో అద్దెకు ఇచ్చారు. నెలకు సుమారు రూ.2.5లక్షల అద్దె నిమిత్తం కైవసం చేసుకున్న ఆలయ చైర్మన్‌ గత నాలుగు నెలలుగా సుమారు రూ.10లక్షల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీనికి గాను సంబంధిత అధికారులు ఈనెల 7న నోటీసులు సైతం జారీ చేశారు. దీంతో ఆమె ఆగ్రహానికి గురై ఆరోపణలు చేస్తున్నారని పలువురు వెల్లడిస్తున్నారు. వాస్తవానికి ఆలయ చైర్మన్‌ స్థానంలో ఉన్న వ్యక్తికి కానీ.. తన కుటుంబ సభ్యులకు కానీ.. ఆలయానికి సంబంధించిన ఎటువంటి ఆర్థిక వ్యవహారాల్లో ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ సంబంధం ఉండకూడదని ఎండోమెంట్‌ ఏక్ట్‌లో ఉన్నా అటుగా ఏ అధికారి పట్టించుకోకపోవడం అయోమయానికి గురిచేస్తుంది. వాస్తవానికి ఆలయ లావాదేవీల్లో ఉన్న వ్యక్తలకు ఎటువంటి పదవులు ఉండకూడదని, చైర్మన్‌ పదవి సైతం తొలిగించాలని పలువురు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం బయటకు రావడంతో ధర్మకర్తల మండలి సభ్యుల్లో ఓ నేత తన భార్యకి చైర్మన్‌ పదవిని కేటాయించాలని ఇప్పటికే ఓ మంత్రి వద్దకు పలుమార్లు పరుగులు కూడా పెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

 • ఉత్సవాల్లో పైరవీలకు రంగం సిద్ధం..
  కనమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జరిగే మార్గశిర ఉత్సవాల్లో పైరవీలు చేయడానికి ధర్మకర్తల మండలి సభ్యులు సిద్ధమైపోయారు. సంబంధిత ఉన్నతాధికారితో పెద్దగా గొడవ పెట్టుకొని తమ పేరుని ముద్రించిన లెటర్‌హెడ్‌లు భక్తులు తీసుకొస్తే రూ.500ల విశిష్ట దర్శనం క్యూలైనుల్లో ఉచిత దర్శనం కల్పించాలని అర్జీ సైతం పెట్టుకున్నారు. దీనికి గాను సంబంధిత ఈవో నుంచి సానుకూల సమాధానం రాకపోవడంతో గత ఉన్నతాధికారుల సాయంతో పావులు కదుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
DevotionalGovernment

కాలభైరవ కష్టాల మార్గంలో కొలువై ఉన్నావా..!

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : భక్తుల కోర్కెలను తీర్చే భగవంతునికే కష్టాలు తప్పడం లేదు. ఆయన కొలువైన మార్గంలో అడుగడుగునా ఆటంకాలు అడ్డుపడుతూ అగమ్యగోచరాన్ని తలపిస్తున్నాయి. విశాఖపట్నంలో ప్రధమ దేవాలయంగా పేరుగాంచిన సింహాచలం శ్రీ అప్పన్న స్వామి అనుసంధాన దేవాలయం భైరవకోన కాలభైరవుడు కష్టాల మార్గంలో కొలువై ఉన్నారు. అమావాస్య పూజునిగా పేరొందిన కాలభైరవ స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో అడుగడుగునా ఆటంకాలు అడ్డుపడుతూ ప్రజలకు ముప్పతిప్పలు పెట్టిస్తున్నాయంటే ఆశ్చర్యం చెందనవసరం లేదనే చెప్పాలి. మాసంలో అమావాస్య రోజున స్వామి దర్శనానికి సుధూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఓ వైపు ప్రధాన రహదారి ఇబ్బందులకు గురిచేస్తుంటే.. మరోవైపు ఆలయ సిబ్బంది చేస్తున్న చేష్టలతో నరకయాతన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖకు చెందిన ప్రాంతంలో రాకపోకల మార్గం నిర్మించడానికి ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయని.. అంతటిని సైతం దాటుకొస్తున్న భక్తులకు ఆలయ సిబ్బంది చేస్తున్న చేష్టలు చిరాకు తెప్పిస్తున్నాయని మండిపడుతున్నారు. స్థానిక సిబ్బందితో పాటుగా సింహాచలం దేవాస్థానం నుంచి డిప్యూటేషన్‌పై విధులకు వస్తున్న ఆలయ సిబ్బంది చూపిస్తున్న బంధు ప్రీతి ప్రజలను గంటల తరబడి క్యూలైనుల్లో నిలబెట్టిస్తుంది. కిలో మీటర్‌ దూరం క్యూలైన్‌లో ఉన్న భక్తులు గంటలు గడుస్తున్నా ఆ కిలో మీటర్‌ దూరానికే పరిమితం అవ్వడం వలన భక్తుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఆలయ ఉన్నతాధికారులు సరైన పద్ధతులను అవలంభించక పోవడంతో అడుగడుగున భక్తులు అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. ఆలయం వద్ద పైరవీలు పర్వం పెరిగిపోవడంతో క్యూలైనుల్లో పడిగాపులు కాస్తున్న భక్తులు ఎండ వేడికి సొమ్మసిల్లి పోతున్న ఘటనలు కోకొల్లలు. చిల్లరకు కక్కుర్తి పడుతున్న సిబ్బంది ఉన్నంత వరకు ఈ ఆలయ అభివృద్ధి అడవి మధ్యలోనే ఉంటుందని పలువురు పలు రకాలుగా విమర్శిస్తున్నారు. ఈమధ్య పదుల సంఖ్యలో కార్యనిర్వహణాధికారులు మారుతున్న ఈ అరణ్య మార్గంలో ఉన్న కాలభైరవునికి సరైన రోడ్డు మార్గాన్ని నిర్మించలేకపోతున్నారని పలువురు ప్రజలు పరుషంగానే ప్రశ్నిస్తున్నారు.

 •  కాలభైరవుని ఆలయంలో పైరవీలు ప్రమాదకరం..
  అమావాస్య రోజున వేలదిగా తరలివస్తున్న భక్తుల మనోభావాలతో ఆలయ అధికారులు ఆడుకుంటున్నారని పలువురు భక్తులు మండి పడుతున్నారు. స్థానిక సిబ్బందితోనే సమస్యలు ఎదురవుతున్నాయంటే డిప్యూటేషన్‌పై విధులకు హాజరవుతున్న సిబ్బందితో మరింత ప్రమాదకరంగా ఉందని ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. బంధు ప్రీతితో క్యూలైన్లుగా వేరుచేస్తున్న బంధాలను సైతం తొలిగించి స్వామి దర్శనం కల్పిస్తున్నారు. దీంతో సాధారణ భక్తులు బారులు తీరుతూ క్యూలైనుల్లో నరకయాతన పడుతున్నారు. దీనికి తోడు బంధువులతో వాలంటీర్‌ పద్ధతులను ప్రారంభించడం వలన ఆ తోపులాటలో మహిళా భక్తులు ఇబ్బందులకు గురవుతున్నామని మండిపడుతున్నారు. అగ్ర దేవాలయంగా పేరొందిన సింహాచలం అనుసంధాన దేవాలయాల్లో ఇంతటి ఇబ్బందులు ఎదురవుతుంటే సాధారణ ఆలయాల్లో పరిస్థితి ఎవ్వరు చక్కబెడతారని పలువురు ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

 •  కాసుల కక్కుర్తిలో కాలభైరవునికి కష్టాలు..
  భక్తుల కష్టాలను తీర్చే కాలభైరవునికే కష్టాలు వెంటాడుతున్నాయంటే ముమ్మాటికి పాలకుల వైఫల్యమనే చెప్పాలి. అటవీ మార్గంలో కొలువైన స్వామికి సరైన రాకపోకల మార్గం ఏర్పాటు చేయడంలో పాలకుల నిర్లక్ష్యం వహించడానికి అటవీశాఖకు సంబంధించిన స్థలంలో రహదారి నిర్మించడానికి సవాలక్ష సమస్యలు ఉన్నాయని చెప్పుతూ తప్పించుకొని తిరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై అక్కడి పరిస్థితిలను తెలుసుకోవడానికి గతంలో పలువురు ఈవోలు ప్రయత్నాలు చేశారని ఆనోట.. ఈనోట.. వినడమే కానీ నేటికి నడక మార్గంపై ఓ స్పష్టత రాలేదు. ఈమధ్య కాలంలో తాత్కలిక, దీర్ఘకాలిక పద్ధతిలో పదుల సంఖ్యలో మారుతూ వస్తున్న ఆలయ కార్యనిర్వహణాధికారులు ఓసారి అటుగా పట్టించుకుంటారా అంటే..? ఏ నిమిషంలో బదిలీ అవుతారో.. ఏ నిమిషంలో పదోన్నతి పొందుతారో.. అనే అర్డర్స్‌ కోసం ఫ్యాక్స్‌ మిషన్‌ వైపు చూసుకోవడానికే సమయం సరిపోతుందని పలువురు ఆలయ సిబ్బందే గుసగుసలాడుకుంటున్నారు. ఇక దిగుస్థాయి సిబ్బందిని కనిపెట్టుకొని విధులు నిర్వహించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్న ఉన్నతాధికారుల వలన కాలభైరవ స్వామి ఆలయంలో చేతివాటంతో సిబ్బంది చెలరేగిపోతున్నారని, స్వామివారి హుండీలోకి రావల్సిన కాసులను మరో కంటికి కనిపించడకుండా కక్కుర్తితో మాయం చేస్తున్నారని పలువురు భక్తులు బహిరంగంగానే వెల్లడిస్తున్నారు.

 •  ట్రాఫిక్‌ సమస్యతో సతమతం..
  అమావాస్య రోజున రద్దీగా ఉండే కాలభైరవ స్వామి ఆలయ మార్గంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రమవ్వడానికి స్థానిక గోపాలపట్నం ట్రాఫిక్‌ పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. సిబ్బంది ముందస్తుగా పార్కింగ్‌ స్థలాలను పరిశీలించి కేటాయించకపోవడంతో రహదారి మధ్యలో వాహనాలను భక్తులు నిలిపి వెళ్లిపోవడంతో అటుగా వచ్చే వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు వాహన చోదకులు ఆరోపిస్తున్నారు. పైగా ఆ మార్గంలో భారీ వాహనాలు సైతం పంపించడంతో గంటల తరబడి వాహన రద్దీ ఉండిపోతుందని పలువురు చోదకులు స్థానిక పోలీసు వాట్సప్‌ నెంబర్‌కి ఫిర్యాదులు సైతం ఇవ్వడం కొస మెరుపు.

 • ఆలయంలో స్థానికుల హవా..
  కాలభైరవుని దర్శనంలో సమస్యలు ఎదురవ్వడానికి స్థానికుల హవా సైతం పెద్ద ఇబ్బందిగా తయారైయింది. స్థానిక పలుకుబడితో క్యూలైన్ల నుంచి రాకుండా పక్కనే ఉన్న తిరుగు మార్గంలో చొరబడి మరీ దర్శనం చేసుకుంటున్నారంటే అక్కడ హవా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో మరో కొత్త అంశం ఏమిటంటే ఈ స్థానిక హవాదారులు ఆలయానికి వచ్చే మార్గంలో రహదారిపై కూర్చున్న యాచకులను సైతం బెధిరింపులకు గురిచేసి వాళ్లు చెప్పిన ప్రాంతంలోనే కూర్చోవాలని ఆదేశాలు జారీ చేయడం కూడా కనిపిస్తున్నాయి. ఆలయ అధికారులు రాకపోకలకు సరైన మార్గాన్ని ఏర్పాటు చేయలేకపోవడంతో పాటుగా ఆలయంలో సరైన మార్గాన్ని అనుసరించక పోవడంతో అక్కడ ఓ ప్రైవేటు సైన్యమే రాజ్యమేలుతుంది. ఈ పరిస్థితుల నుంచి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్యనిర్వహణాధికారైన కాపాడుతారో.. లేదా కాలభైరవ స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో ఏర్పడిన పెద్ద పెద్ద బురద గుంటల్లో పడేస్తారో వేచి చూడాలి. సాధారణ రోజుల్లో ఒకరిద్దరు భక్తులతో పూజలందుకుంటున్న స్వామి ఏది ఏమైన ఓ నమ్మకంతో అమావాస్య రోజున లక్షలాది భక్త జనంతో ప్రత్యేక పూజలు అందుకుంటున్న స్వామికి కనీస సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత ఆలయ అధికారులపై ఎంతైన ఉందని పలువురు ప్రజలు వెల్లడిస్తున్నారు.
DevotionalGovernment

కనకమ్మ ఆలయంలో కల్తీల రాజ్యం

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, ( ప్రత్యేక ప్రతినిధి ):రోజు రోజుకి భక్తజనం నుంచి విశేష ఆదరణ నోచుకుంటున్న బురుజుపేట శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కల్తీల లీలలు ఎక్కువైపోయాయి. ఉద్యోగం ముసుగులో చేస్తున్న మాయ పదుల సంఖ్యలో సీసీ కెమెరాలు సైతం పసిగట్టడం లేదంటే నిర్వహణలో డొల్లతనం డబ్బాల్లో దాచిపెడుతున్నట్టు ఇట్టే అర్థమైపోతుంది. డొల్లతనం.. డబ్బాల్లో దాచిపెట్టడం ఏంటో అని ఆశ్చర్యం చెందనవసరం లేదు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే ఆలయంలో కీలకమైన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న సన్నివేశాలు ఆనోట.. ఈనోట.. బయటకు పొక్కకుండ, పత్రికల్లో ముద్రించి రాకుండ ఉంటే చాలు అన్ని అక్కడే పరిష్కరం అయిపోతాయి. కనకమ్మ అమ్మవారు కోర్కెలు తీర్చినట్టు అక్కడి చోటా మోటా అధికారులు అన్నిటిని పరిష్కరిస్తారు. ఆలయంలో జరుగుతున్న చోరీలు.. అసభ్యకరమైన పనులు, అమ్మవారి ఆదాయన్ని పక్కదారి పట్టించడం, ప్రసాదాల కార్ఖానా నుంచి సరుకులు ఖాళీ అవ్వడం వంటి అన్ని అంశాలు అక్కడే పరిష్కరించి అమ్మవారి ఆదాయాన్ని గండికొడుతున్నారు. ఈ అంశాలు ఉన్నతాధికారులకు తెలియక తెలిసిన అటుగా పట్టించుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదని పలువురు భక్తులతో పాటుగా ఆలయంలో పని చేస్తున్న సిబ్బందే గుసగుసలాడుకుంటున్నారు.

– పాల ప్యాకెట్లు పక్కదారి పడుతున్నాయి..
ఆలయంలో దీర్ఘకాలిక సిబ్బందితో పాటుగా తాత్కలికంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది చేస్తున్న చేష్టలు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆలయానికి వచ్చే భక్తులు అమ్మవారికి గతంలో పాలాభిషేకం నిర్వహించేవారు. ఈ మధ్య కరోనా నుంచి అటువంటి పద్ధతిని పట్టాలు ఎక్కించడంతో భక్తులు తీసుకొచ్చిన పాల ప్యాకెట్లు ఆ పక్కనే ఉన్న డబ్బాలో వెయ్యడంతో అసలు కథ అక్కడే మొదలైయింది. ఆ పాల ప్యాకెట్లును అక్కడే పని చేస్తున్న దీర్ఘకాలిక సిబ్బందితో పాటుగా తాత్కలిక సిబ్బంది పలుమార్లు పదుల సంఖ్యలో పక్కదారి పట్టించడం సంబంధిత అధికారుల దృష్టికి వచ్చినా దోచుకున్న సిబ్బందిని దాగుడుమూతల ఆటలో దొంగల పేరిట వదిలిపెట్టడంపై విమర్శలు వస్తునే ఉన్నాయి. దీనిపై పైస్థాయి అధికారులు ఏమైన స్పందించి చర్యలు తీసుకున్నారా..? అని ఆరా తీస్తే నాలుగు గోడల మధ్య రహస్య ఒప్పందాలు జరిగినట్టు జరిగి అసలైన దొంగల చేతికే తాళాలను కట్టబెట్టారని పలువురు ఆలయ సిబ్బంది వాపోతున్నారు. కాసేపు పాల ప్యాకెట్లు విషయం పక్కన పెడితే ఆలయంలో ఎప్పటికప్పుడు మాయమవుతున్న పసాదాల తయారీ వస్తువులు, ఆయిల్‌ ట్యాంక్‌లు, ఓ ప్లాస్టిక్‌ దుకాణం ఇస్తున్న ప్లాస్టిక్‌ వస్తువులు, హుండీ ఆదాయం, పైరవీల పర్వం ఇలా ఒకటా..? రెండా..? లెక్కకు మించి జరుగుతున్నాయని సంబంధిత సిబ్బందే కస్సు బుస్సు లాడుకుంటున్నారు.

– సిబ్బంది పైరవీలు పెరిగిపోతున్నాయి..
నిత్యం రద్దీగా ఉండే ఆలయాల్లో పైరవీలు జరగడం కొంత సాధ్యమైన విషయం. కానీ ఈ అమ్మవారి ఆలయంలో సిబ్బంది చేస్తున్న నయా దందా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే తెల్లటి చొక్కా.. తెల్లటి పంచె.. కట్టుకున్న సిబ్బంది ఆలయం బయట తిరుగుతూ వచ్చి పోయే భక్తులకు సుపరిచితం. దీనికి కారణం గతంలో ఆ భక్తులు ఈ సిబ్బంది ద్వారా దొంగ మార్గంలో అమ్మవారి దర్శనం చేసుకున్నవారు కాబటి.్ట.! ఆలయంలో దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తుల నుంచి ముందస్తుగా కొంత సొమ్మును తీసుకొని వీఐపీ, వీవీఐపీ దర్శనం కల్పించడం ఈ సిబ్బందికే దక్కింది. ముందుగా సొమ్ము చెల్లించిన భక్తులను ప్రధాన మార్గంలో వీఐపీ మాదిరి తీసుకొని వెళ్లి ఆలయ గర్భ గుడిలో ప్రత్యేక పూజలు చేయించి అదే మార్గంలో బయటకు తీసుకొచ్చి వదిలిపెడతారు. ఈ క్రమంలో ఆ సిబ్బందికి ఇంచు మించు భక్తుల సంఖ్యను బట్టి వేలల్లో ముడుపులు అందుతాయని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఇదే క్రమంలో ఎవ్వరైన వేరొక ఉద్యోగి ఎవ్వరు..? అని అడిగితే ఉన్నతాధికారుల బంధువులు, పోలీసు అధికారుల చుట్టాలు, ప్రోటోకాల్‌, పొట్లకాయ అని లోపలికి తీసుకెళ్లి అమ్మవారి చెందాల్సిన చందా సొమ్మును కాజేస్తున్నారు. ఈ వ్యవహారంపై ‘నేత్ర న్యూస్‌’ నిఘా పెట్టగా ఆ ఉద్యోగి పరుశంగా మాట్లాడటం కొస మెరుపు.

– ఆలయంలో ప్లాస్టిక్‌ సామాగ్రి మాయం..
బురుజుపేట శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి ధన రూపేనా, వస్తు రూపేనా వచ్చే ఆదాయాన్ని వాటాలు వేసుకొని పంచుకోవడం పలుమార్లు సిబ్బంది మధ్య పెద్ద పెద్ద గొడవులు సైతం వచ్చాయి. ఆలయానికి అర్ధ కిలో మీటర్‌ దూరంలో గల పూర్ణామార్కెట్‌ కూడలి ఓ ప్లాస్టిక్‌ దుకాణ యజమాని ఆలయంలో అవసరాల నిమిత్తం ప్రతీసారి విరాళంగా ఇచ్చే ప్లాస్టిక్‌ వస్తువులు లెక్కల్లో చూపించకుండానే లెక్కలు వేసుకొని పక్కన పెట్టుకోవడం పలుమార్లు జరిగాయని అక్కడి సిబ్బంది మాట్లాడుకుంటున్న గుసగుసల్లో గుట్టు బయటపడిరది. ఈ విషయంలో కొందరు అధికారుల చేతులు సైతం చక్కబెట్టు కోవడానికి గతంలో ప్రయత్నించాయని, అంతటి స్థాయిలో ఉన్న వ్యక్తులే చేస్తున్నప్పుడు తాము చేయడం తప్పులేదని తెలివిగా చెప్పుతూ తప్పించుకుంటున్నారు.

– వ్రతాల సొమ్ము జేబులోకి వెళ్తుంది..?
అమ్మవారి ఆలయంలో ప్రత్యేక రోజుల్లో నిర్వహించే వ్రతాల సొమ్ము సిబ్బంది సొంత అవసరాలకు వాడుకుంటున్నారన్న అనుమానాలు బలంగానే వినిపిస్తున్నాయి. గతంలో ఈ వ్రతాల సొమ్ము విషయంలో ఇద్దరు అధికారుల మధ్యలో చిచ్చు రేగిందని వినికిడి. ఆలయంలో ప్రత్యేక రోజుల్లో నిర్వహించే వ్రతాలకు తీసుకునే రుసుము తమ జేబుల్లోకి వేసుకొని లెక్కలు తరువాత చెప్పే విధంగా సొంతానికి వాడుకుంటున్నారని అక్కడి సిబ్బందే చెప్పుతూ ఉంటారు. ఈ వ్యవహారం ఎప్పటి నుంచో జరుగుతుందని, ఏ ఒక్క అధికారి కూడా ఈ విషయమై పట్టించుకోలేదని సమాచారం. నూతనంగా వచ్చిన ఆలయ ఈవో కె.శిరిషా (సహాయ కమిషనర్‌) ఈ మధ్య ఓ ప్రకటనలో తెలిపినట్టు ఆలయాల్లో ఆడిట్‌ విధానం తప్పని సరీ.. అన్నట్టు ఈ ఆలయంలో ఆడిట్‌ విధానం పాటిస్తే నక్కి నక్కి ఉన్న దొంగలు ఒక్కసారిగా బయట పడటం కాయం.

– కార్ఖానాలో ప్రసాదాల సరుకులు స్వాహా..
ఆలయంలో నిరంతర పర్యావేక్షణ లేకపోవడం ప్రసాదాల కార్ఖానాలో చాలా సామాగ్రిని సొంతానికి ఉపయోగించు కుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. నూనె డబ్బాలు, నెయ్యి ప్యాకెట్లుతో పాటుగా పప్పులు, ఉప్పులు తప్పుడు మార్గంలో బయటకు వెళ్లడం ఇక్కడ సాధారణ విషయమని వెల్లడిస్తున్నారు. పాత డబ్బాల్లో సరుకులు కొత్త రూపాన్ని సంతరించు కుంటున్నాయని సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. ఇదే క్రమంలో ఆలయానికి రాలేని భక్తులు బయట ఉన్న ఇనుప ఊచల మధ్యలో నుంచి ఇచ్చిన చిల్లర సొమ్మును సైతం హుండీల్లో వెయ్యకుండా సిబ్బంది చేతులు మారుస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఆలయంలో జరుగుతున్న కార్యకలాపాలపై దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించాలని పలువురు భక్తులు కోరుతున్నారు.

Devotional

దశావతారాల్లో జగన్నాథుడు

నేత్రన్యూస్, విశాఖపట్నం: నగరంలో టౌన్ కొత్తరోడ్డు ప్రాంతంలో కొలువైవున్న శ్రీ జగన్నాథ స్వామి ఆలయం రథోత్సవానికి సిద్ధమవుతోంది. జులై 1 నుంచి స్వామి తొలిరథయాత్ర ప్రారంభం రథయ కానుంది. తిరుగురథయాత్రతో ఉత్సవాలు ముగుస్తాయి. అందుకు తగ్గట్టుగా ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేస్తున్నారని ఆలయ కార్యనిర్వాహణాధి కారిణి సాదనాల ప్రసన్నలక్ష్మీ, ఓ ప్రకటనలో తెలిపారు.

– జగన్నాథ స్వామివారి ఆలయ చరిత్ర..
నగరంలోని శ్రీజగన్నాథస్వామి దేవాలయానికి 190 ఏళ్ల చరిత్ర ఉంది. క్రీ.శ.1832లో ప్రస్తుత ఆలయం ఉన్న ప్రాంతంలో గరుడా జగన్నాయకులు వారి కుటుంబీకులు తవ్వకాలు జరిపినప్పుడు ప్రస్తుతం దేవాలయం ఉన్నచోట మహావిష్ణువు రూపుడైన రంగనాథ స్వామి పంచలోహ విగ్రహం బయటపడింది. దీంతో స్వామికి చిన్న తాటాకుల పందిరి వేసి దాంట్లో చలమయ్య దీక్షితులు అర్చకులుగా నియమించారు. ఆ తరువాత గరుడ వంశీయుల ఆరాధ్యదైవమైన జగన్నాథస్వామికి ఆలయం నిర్మించడానికి పూనుకొని క్రీ.శ. 1862లో ఆలయ నిర్మాణం పూర్తి చేసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పూరీ నుంచి శ్రీజగన్నాథ, సుభద్ర, బలభద్ర స్వామి విగ్రహాలను తీసుకువచ్చి ప్రతిష్టించారు. 1864 నుంచి నేటి వరకు రథయాత్ర మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

– రథం చూడటానికి రారండయ్..!
ఏటా ఆషాఢ మాస శుక్లపక్ష విదియ రోజు స్వామివారి రథయాత్ర మహోత్సవాలు ప్రారంభిస్తారు. ఆషాఢ శుద్ధ ద్వాదశి వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. రథోత్సవాల్లో భాగంగా స్వామివారి ఆలయం నుంచి ట్రర్నర్ సత్రం వరకు రథోత్సవం నిర్వహించి, సత్రంలో పదిరోజుల పాటు పూజలు నిర్వహిస్తారు.
ఆ ప్రాంతంలో స్వామివారు దశావతారాల్లో భక్తులకు
దర్శనమిస్తారు.

– దశావతారాల్లో జగన్నాథ స్వామి..

జులై 1న స్వామివారి తొలి రథయాత్ర
2 – మత్స్యావతారం
3 – కూర్మావతారం
4 వరాహావతారం
5 – నృసింహావతారం
6 వామనావతారం
7 – పరశురామావతారం
8 – రామావతారం
9 – బలరామ, కృష్ణావతారం
10 – శేషపాన్పు అవతారం
11 – తిరుగు రథయాత్ర

– స్వామి దర్శనానికి బస్సు సౌకర్యం..
స్వామివారి రథోత్సవం సందర్భంగా టర్నర్ సత్రం (గుండిచా దేవి ఆలయం)లో ఈనెల 01 నుంచి 11వ తేదీ వరకు స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఈ ప్రాంతానికి నగరంలోని పలు ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. 6, 6సీ, 12, 123, 14, 16, 1729, 20, 20, 25, 258, 256, 2508, 256/65. 253, 36, 48, 48, 526, 52, 528, 525/5, 60, 60సీ, 60హెచ్, 64ఎ, 65ఎఫ్, 66వ, 99, 99ఎ/సీ, 993, 333 నెంబరు గల బస్సులు ఈ మార్గం మీదుగా ప్రయాణిస్తాయి.

– ఏర్పాట్లు ముమ్మరం చేశాం..
ఆలయంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ క్యూలైన్లు ఏర్పాటు చేశాం. భక్తులకు ఉచిత దర్శనంతో పాటుగా ప్రత్యేక దర్శనం రూ.20, శీఘ్ర దర్శనం రూ.50, విశిష్ఠ దర్శనం రూ.200ల దర్శన లైన్లను ఏర్పాటు చేస్తున్నాం. గుండిచా దేవి ఆలయం (టర్నర్ సత్రం) వద్ద ఎటువంటి పైరవీలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రోజువారీ 500నుంచి వెయ్యి మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నాం. – సాదనాల ప్రసన్నలక్ష్మీ (ఆలయ కార్యనిర్వాహణాధికారిణి).