Please assign a menu to the primary menu location under menu

Crime

CrimeGovernment

ఆకాశంలో పోలీస్ డ్రోన్లు..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : నగర గగనతలంలో పోలీసు డ్రోన్లు పూర్తి స్థాయిలో చక్కర్లు కొట్టనున్నాయి. ఇప్పటికే సంబంధిత పోలీసు సిబ్బందికి డ్రోన్లు పనితీరుకి సంబంధించిన అన్ని అంశాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న జనాభా, నేర నియంత్రణ, ట్రాఫిక్‌ రద్దీ, పోలీసు సిబ్బంది సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఈ డ్రోన్‌ పోలీసింగ్‌ విధానాన్ని నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చీ ప్రవేశపెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న టెక్నాలజీని పోలీసు విధుల్లో సైతం ఉపయోగించడం వలన మరింత ఫలితాలు సాధ్యమవుతాయని ఆయన ఈ డ్రోన్‌ పోలీసింగ్‌పై దృష్టి కేంద్రికృతం చేశారు. ఇప్పటికే ఓ ప్రైవేటు సంస్థ నుంచి సీఎస్‌ఆర్‌ పేరిట కొన్ని డ్రోన్‌లను పోలీసు విభాగానికి కేటాయించడంతో నగర ఆకాశ వీధిల్లో డ్రోన్‌లు జోరు వేగంతో విధులు నిర్వహిస్తున్నాయి.

మందు బాబులు, అల్లరి మూకలు, ధూమపానం, గంజాయి బ్యాచ్‌లకు ఇక నుంచి చుక్కలు కనిపించనున్నాయి. ఆకాశంలో చుక్కల మాదిరి చక్కర్లు కొడుతూ గుంపులను చెల్లాచెదురు చేయడంతో పాటుగా హై క్వాలిటీ ఫొటోలు, వీడియోలు సేకరించి కేసులు నమోదు చేయడానికి పోలీసు డ్రోన్‌లు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నపాటి సందులు, కొండ ప్రాంతాలు అనే వ్యత్యాసాలు లేకుండా ఒకే రకమైన పోలీసు సేవలు అందించడానికి ఈ డ్రోన్‌లు సిద్ధమయ్యాయి. గోల్డెన్‌ మినిట్స్‌లో కీలక అంశాలను సేకరించడంతో పాటుగా భద్రపరిచి కేసులు పరిష్కారం దిశగా ఈ డ్రోన్‌లు వేగంగా పని చేస్తున్నాయి. నగరంలో 23పోలీసు స్టేషన్‌లకు ఒకటి, రెండు చొప్పున అక్కడి వ్యాసార్థం బట్టి బ్లూకోల్ట్స్‌, డీకోల్ట్స్‌, మొబైల్‌, రక్షక్‌ పేరిట విధులు నిర్వహిస్తున్న విభాగాలకు దీటుగా ఈ డ్రోన్‌లు పరుగులు 24గంటలు పెట్టనున్నాయి. నిర్జన, సంక్షోభిత ప్రాంతాల్లో పోలీసు సైరన్‌ అలార్ట్‌లతో హెచ్చరికలు జారీ చేయడం, నిందితులను వెంబడిరచడానికి డ్రోన్‌లు వేగంగా ఎగురుతున్నాయి. త్వరలో పూర్తిస్థాయిలో డ్రోన్‌ సేవలు అందించడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయని విశాఖ సిటీ సీపీ బాగ్చీ వెల్లడిస్తున్నారు.

  • శాంతిభద్రతల విభాగ సేవల్లో ఓ డేగ కన్ను..

గొడవలు, అల్లర్లు జరిగే ప్రాంతాల్లో సిబ్బంది వెళ్లే సమయాని కంటే ముందుగా పరుగులు పెట్టడానికి ఈ డ్రోన్‌లు మెరుగ్గా పని చేయనున్నాయి. వాహనాలు వెల్లడానికి వీలు లేని ప్రాంతాల్లో సైతం త్వరితగతిన వెల్లడంతో పాటుగ ఘటనా స్థలంలో జరిగిన సంఘటనలు చిత్రికరించి కేసులు వేగవంతంగా చేయడానికి ఆధారాలు సేకరిస్తాయి. వీఐపీల రాకపోకలపై నిఘా కట్టుదిట్టం చేయడం, సమస్యాత్మక ప్రాంతాల్లో అల్లరిమూకలను చెల్లాచెదురు చేయడం, రహదారులపై ఆకతాయిలు మహిళలను వేధింపులకు గురిచేయకుండా అనుక్షణం కనిపెడుతునే ఉంటాయి. ఈ డ్రోన్‌లు పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి వస్తే శాంతిభత్రల సమస్యలు చాలా వరకు సర్ధుమనుగుతాయని విశాఖ పోలీసులు ప్రయోగాత్మకంగా చూపించనున్నారు.

  • ట్రాఫిక్‌, నేర నియంత్రణలో డ్రోన్‌ సేవలు..

నగరంలో వేగంగా పెరుగుతున్న జనాభా, సిబ్బంది కొరత దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్‌, నేర నియంత్రణలో డ్రోన్‌ సేవలు చాలా కీలకంగా ఉండనున్నాయి. ప్రమాదాల నివారణతో పాటుగా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ఈ డ్రోన్‌లు విధులు నిర్వహించడం. ఎటువంటి నేరాలు జరగకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం, ధూమపానం, గంజాయి, మందు బాబుల బృందాలను చెదరగొట్టడంతో పాటుగా కేసులు నమోదు చేయడానికి కీలక ఆధారాలు సేకరిస్తాయి. నిర్మాణుష ప్రాంతాలతో పాటుగా రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో 24గంటలు నిఘా కట్టుదిట్టం చేయడానికి ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో అందుబాటులో ఉన్న డ్రోన్‌లను త్వరలో అన్ని స్టేషన్‌లకు కేటాయించడానికి పలు ప్రైవేటు సంస్థలతో సీఎస్‌ఆర్‌ పద్ధతిలో తీసుకోవడానికి పోలీసు వర్గాలు సిద్ధమయ్యాయి.

  • విశాఖ నగరాన్ని భద్రంగా ఉంచడమే నా ధ్యేయం..

విశాఖ సిటీలో గత పరిస్థితుల కంటే మెరుగ్గా ఉండటానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం. నగర ప్రజల్లో ఏ ఒక్కరూ కూడా శాంతిభత్రలు దృష్ట్య ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, వాళ్ల భద్రతే ధ్యేయంగా నాతో పాటుగా అందరు సిబ్బంది పని చేయాలి. అటుగా ఇప్పటికే చాలా సేవలు ప్రారంభించాం. ఈ క్రమంలో డ్రోన్‌ పోలీసింగ్‌ ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నాం. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ప్రయోగాత్మక స్థితిలో ఉన్న డ్రోన్‌ పోలీసింగ్‌ ప్రజల్లోకి తీసుకెళ్లి మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. నేరాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలతో పాటుగా పరిష్కారానికి డ్రోన్‌ పోలీసింగ్‌ కీలకంగా మారుతుంది. నగర ప్రజలకు శాంతిభద్రతలు, ట్రాఫిక్‌, నేర విభాగాలకు సంబంధించి ఎటువంటి సమస్య ఎదురైనా నా 79950 95799 ఫోన్‌ నెంబర్‌కి కాల్‌ చేయండి. – డాక్టర్‌. శంఖబ్రత బాగ్చీ (విశాఖ సిటీ పోలీసు కమిషనర్‌).

Crime

పోలీస్ స్టేషన్లో దొంగలు పడ్డారు

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : దొంగల నుంచి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన పోలీసు స్టేషన్‌లోనే రక్షణ కరువయ్యింది. స్టేషన్‌లో భద్రపరిచిన కీలక రికార్డులు కనిపించలేదని ఇప్పటికే ఆ స్టేషన్‌ అధికారికి సైతం తెలియజేయడంతో ఎక్కడ ఉన్నతాధికారులకు తెలిసిపోతుందోనని తర్జన భర్జన పడుతున్నారు. నిత్యం రద్ధీగా ఉండే పోలీసు స్టేషన్‌ల్లో ఒకటైన పీఎంపాలెం స్టేషన్‌లో 41ఏ నోటీసు (స్టేషన్‌ బెయిల్‌) ఇచ్చే రికార్డు పుస్తకం గత రెండు రోజులుగా కనిపించడం లేదని ఆలస్యంగా వెలుగు చూసింది. స్టేషన్‌లో జరిగే లావాదేవీల్లో సిబ్బంది మధ్య సమన్వయ లోపం తలెత్తడంతో ఈ రికార్డులు మాయం అయినట్టు స్టేషన్‌లో సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. అన్ని అంశాల్లో నేనే రాజు.. నేనే మంత్రి.. అన్నట్టు స్టేషన్‌ లేఖరి వ్యవహరించడంతో దర్యాప్తు అధికారులు(ఐవో)గా కేసులు నమోదు చేస్తున్న కొందరు సిబ్బంది తస్కరించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు స్టేషన్‌ దర్యాప్తు అధికారులు ఎందుకు దొంగిలించాలి..? ఆ అవసరం వాళ్లకి ఏంటో..? అని ఆరా తియ్యగా స్టేషన్‌ ఖర్చులకు ఓపెన్‌ డ్రిరకింగ్‌లు, రెస్టారెంట్‌లు, బార్‌లు, బిల్డర్‌లు, ఓయో రూమ్‌ల నుంచి నెలవారీ వచ్చిన సొమ్ము సరిపోవడం లేదని, అప్పుల్లో మునిగిపోతున్నానని ఏకంగా స్టేషన్‌ లేఖరి స్థానంలో ఉన్న వ్యక్తి 41ఏ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవ్వడంతో అక్కడ సమస్య తలెత్తింది. తమకి వచ్చిన ఆ వాటలో ఆయన ప్రమేయం ఇష్టం లేక కొందరు సిబ్బంది మాయం చేసారా..? లేదా స్టేషన్‌కి వచ్చిపోయేవారు ఎవరైనా తీసుకెళ్లిపోయారా..? అని అనుమానం వ్యక్తం చేస్తూ ఇప్పకే సిబ్బంది అందర్నీ ప్రశ్నిస్తున్నారు.

  • బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే భారీ జరిమానా..!?

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరిత్యా నేరమని, అటుగా మద్యం సేవించిన వ్యక్తులను స్టేషన్‌కి తీసుకొచ్చి కౌన్సిలింగ్‌ అనంతరం కోర్టులో జరిమానాలు చెల్లించాలని తెల్సిందే.. కానీ ఈ పోలీసు స్టేషన్‌లో మాత్రం కోర్టులో చెల్లించిన జరిమానాల కంటే.. స్టేషన్‌లో చెల్లించిన జరిమానాలు అధికంగా ఉంటాయని అక్కడి రికార్డులను పరిశీలిస్తే ఇట్టే అర్థమైపోతుంది. రోజుకి పదుల సంఖ్యలో ఓపెన్‌ డ్రిరకింగ్‌ (ఓడీ)లను తీసుకొచ్చినట్టు చూపిస్తూ.. కోర్టుకు మాత్రం ఒంటరి సంఖ్యల్లో జరిమానాలకు పంపించడం అక్కడ సాధారణ విషయంగా మారిపోయింది. కొన్ని రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతానికి చెందిన ఆరుగురు వ్యక్తులు బహిరంగంగా మద్యం సేవిస్తున్నారని తీసుకొచ్చి వాళ్ల నుంచి సెల్‌ఫోన్‌లు తీసున్నారు. స్టేషన్‌కి పలుమార్లు తిప్పించడంతో వాళ్లకి సమయం లేదని త్వరగా వెళ్లిపోవాలంటే ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున రూ.6వేలు చెల్లించాలని దౌర్జన్యంగా తీసుకున్నట్టు బాధితులు బోరుమన్నారు. ఇదే క్రమంలో బుధవారం ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు తాటికళ్లు సేవిస్తుండగా పోలీసు సిబ్బందికి పట్టుబడటంతో స్టేషన్‌కి తరలించారు. కోర్టుకి వెళ్లి రూ.3వేలు చెల్లించాలని, స్టేషన్‌లో అయితే రూ.5వేలు చెల్లిస్తే వెంటనే వదిలేస్తామని చెప్పడంతో భయాందోళనకు గురైన విద్యార్థులు అడిగింది చెల్లించి అక్కడ నుంచి జారుకున్నారు.

  • సిబ్బందిపై నిఘా పెట్టారు..!

నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌. శంఖబ్రత బాగ్చీ రోజుకి సుమారు 20గంటలు శ్రమించి ప్రజలకు చేరువులో ఉండటానికి ప్రయత్నిస్తుంటే.. దిగువస్థాయి సిబ్బంది ప్రజలను పట్టి పీడిస్తున్నారనడానికి ఉదాహరణ సీపీ వద్దకు రోజుకి సుమారు 85మందికి పైగా రావడమే. స్టేషన్‌లో సరైన న్యాయం దొరకడం లేదని ఆయన వద్దకు వచ్చి బోరుమంటున్నారు.

స్టేషన్‌లో జరుగుతున్న రోజువారీ అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న నగర పోలీసు కమిషనర్‌ సిబ్బంది చేస్తున్న చేష్టలపై నిఘా కట్టుదిట్టం చేశారు. ఈ మధ్య స్పెషల్‌ బ్రాంచ్‌ సిబ్బందిని మార్పులు చేసినా ఎటువంటి సమాచారం రావడం లేదని ఆయన గ్రహించి ఇప్పటికే ఇద్దర్ని స్థానచలనం చేసిన విషయం అందరికీ తెలిసిందే.. స్టేషన్‌ల వారీగా జనరల్‌ సిబ్బంది చేస్తున్న పనులు, నెలవారీ వసూలు చేస్తున్న అంశాలు తనదైన శైలిలో సీపీ తెలుసుకొని త్వరలో కొరడా రaళిపించడానికి సిద్ధమైనట్టు కనిపిస్తుంది. ప్రజల రక్షణతో పాటుగా సిబ్బంది బాగోగులు చూసుకుంటున్న ఆయన సిబ్బంది చేస్తున్న అవినీతి కార్యకలాపాలపై నిఘా పెట్టారని విశ్వసనీయ సమాచారం.

CrimeGovernment

పోలీస్ స్టేషన్ లో కుర్చీలాట..!

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ముఖ్యంగా ఆ పోలీసు స్టేషన్లో ఓ కుర్చీ కోసం చిన్న స్థాయి యుద్ధమే జరిగిందంటే ఆశ్చర్యపడనవసరం లేదు. ఎత్తులు.. పైఎత్తులు.. వేసుకుంటూ కుర్చీ కోసం పోట్లాడుకున్న పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. దీంతో ఆఖరికి ఎడమొహం.. పెడమొహం.. పెడుతూ సాక్షాత్తు నగర పోలీసు కమిషనర్‌ చెంతకు చేరుకొని సమీప స్టేషన్లకు బదిలీ చేయాలని కోరుతూ ఆర్డర్‌లు సైతం తెచ్చుకున్నారు. అయినా స్టేషన్‌ను విడిచిపెట్టడానికి మనసు అంగీకరించక సంబంధిత సిబ్బంది నేటికి స్టేషన్‌లో సతమతం అవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. నగర వ్యాప్తంగా అధిక ఆదాయాన్ని అందించే స్టేషన్‌లో కీలక పోలీసు స్టేషన్‌గా గుర్తింపు పొందిన ఆ స్టేషన్‌లో జనరల్‌ సిబ్బందిగా చలామణి అవుతున్న ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ చేస్తున్న దందా తోటి సిబ్బంది నుంచే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అడుగడుగున అతని అవినీతి జాడలు అంటించడంతో తమ మనుగడ చాలా కష్టంగా ఉందని బోరుమంటున్నారు. ఎండకు గుక్కెడు నీరు కావాలన్నా ఆ అయ్యగారి అనుమతి కావాలన్నట్టు అక్కడి పరిస్థితులు మారిపోయాయని వాపోతున్నారు. బడా బాబులు, బజారులు, బారుల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఇలా అన్ని చోట్ల పెద్ద మొత్తంలో దండుకుంటున్న అవినీతి జలగపై ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ కన్ను పడిరదని సమాచారం. ఇదే క్రమంలో రోజువారీ స్టేషన్‌కి తీసుకొచ్చే ఓపెన్‌ డ్రిరకింగ్‌ (బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం) వంటి ఫిర్యాదుల్లో దండీగా దండుకుంటున్న సిబ్బంది ఆస్కార్‌ అవార్డును సైతం కైవసం చేసుకునే నటనను ప్రదర్శిస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే జీడీలో నెలకు వందల సంఖ్యలో కేసులు నమోదు చేసి బేరసారాలు కుదరనివి మాత్రమే.. అది కూడా పదుల సంఖ్యలో కోర్టుకు పంపించి జరిమానాలు విధిస్తున్నారని సంబంధిత స్టేషన్‌ సిబ్బంది బహిరంగంగానే గుసగుసలాడుకుంటున్నారు. ఈ స్టేషన్‌లో ప్రతీ అంశానికి ఓ ధరను నిర్ణయించి అధిక ఆదాయాన్ని అందించే స్టేషన్‌గా నడపడంతో స్టేషన్‌లో నలుగురు సిబ్బంది ఠాణా లేఖరి (స్టేషన్‌ రైటర్‌) కుర్చీ కోసం పోట్లాడుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.

  • ఆ పోలీసు స్టేషన్లో అంతా రాజకీయమే..
    రోజువారీ స్టేషన్‌లో జరుగుతున్న కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించే ఇద్దరు సిబ్బంది ఇప్పుడు అర్జీలు పెట్టుకొని బదిలీపై వెళ్లిపోవడం అక్కడ ఉత్కంఠను తలపిస్తుంది. స్టేషన్‌కి అవసరమైన నిధులు సమకూర్చే క్రమంలో నాలుగు రాళ్లు పక్కన వేసుకునే ఇరువురు ఒకేసారి బదిలీపై వెళ్లిపోవడంపై స్టేషన్‌లో అంతర్గత రాజకీయాన్ని తలపిస్తుంది. అదే స్టేషన్‌ పరిధిలో గత ఐదేళ్లు స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగంలో పనిచేసి ఇప్పుడు అదే స్టేషన్‌లో రైటర్‌ కుర్చీలో కూర్చున్న వ్యక్తి వద్ద ఇన్ని రోజులు రాజకీయం చేసిన వ్యక్తులు ఎందుకు కుర్చీని వదులుకున్నారో అర్థం కావడంలేదని సంబంధిత సిబ్బందే తర్జన బర్జన పడుతున్నారు.
  • నగర పోలీసు సిబ్బందిపై నిఘా ఎక్కడా..?
    నగర వ్యాప్తంగా ఉన్న 23పోలీసు స్టేషన్‌లు, అనుబంధ అధికార కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై నిఘా శూన్యంగా మారింది. స్టేషన్‌ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది బాగోగులు చూసుకుంటున్న ఉన్నతాధికారులు, సిబ్బంది చేస్తున్న అవినీతి కార్యకలాపాలపై నిఘా కట్టుదిట్టం చేయడంలో అలసత్వం చూపిస్తున్నారని పలువురు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 23పోలీసు స్టేషన్‌ల పరిధిలో జనరల్‌ సిబ్బంది పేరిట ముద్ర వేసుకొని ఇష్టానుసారంగా దండుకుంటున్నారని, స్టేషన్‌లో జరిగే పదవీ విరమణ కార్యక్రమాలు అంబరాన్ని అంటే సంబరంగా జరగడానికి ఈ జనరల్‌ సిబ్బంది కీలకంగా పనిచేస్తున్నారని బహిరంగ రహస్యం. ఈ క్రమంలో ఓ పోలీసు స్టేషన్‌ ఆవరణంలో కొద్దిరోజుల క్రితం జరిగిన మద్యం పార్టీకి అధిక సంఖ్యలో మద్యం సీసాలు సమకూర్చడంలో ఈ జనరల్‌ సిబ్బంది పనితీరు స్పష్టంగా కనిపించిందంటే అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఇటువంటి అంశాలపై ప్రస్తుత నగర పోలీసు కమిషనర్‌ దృష్టి కేంద్రికరిస్తే.. 2016లో పోలీసు కమిషనర్‌ టి.యోగానంద్‌ జనరల్‌ సిబ్బందిపై కొరడా ఝుళిపించిన సందర్భం గుర్తొస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
CrimeGovernmentPolitical

టాస్క్‌ ఫోర్స్‌లో మహా మాయగాళ్లు

కీలక టాస్క్‌ల్లో నిందితులకు సమాచారం చేరవేసి చేతివాటం చూపిస్తున్నట్టు పలు ఆరోపణలు..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి): కీలక టాస్క్‌ల్లో నిందితులకు ముందస్తు సమాచారం అందించి చేతివాటం చూపించడంతో పాటుగా క్రికెట్‌ బెట్టింగ్‌లు, పేకాటలు నిర్వహించడంలో టాస్క్‌ఫోర్స్‌ బృందం ప్రత్యేక గుర్తింపు కైవసం చేసుకుందని నగర ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్‌ ముసుగులో గత ఎనిమిదేళ్లుగా సుమారు రూ.150కోట్లకు పైగా క్రికెట్‌ బుకీ లావాదేవీల్లో పల్లా గంగరాజు అనే హెడ్‌ కానిస్టేబుల్‌ని గుర్తించి ఈనెల 15న ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. వాస్తవానికి స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా విధుల నుంచి తొలిగించిన ఈ గంగూభాయ్‌ టాస్క్‌ఫోర్స్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేసినప్పటి నుంచి బొబ్బిలి రవి, లగుడు రవి, తన సోదరుడు పల్లా త్రినాథ్‌తో కలిసి బెట్టింగ్‌ బుకీ నిర్వహించినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాంధ్ర, తూ.గో, ప.గోతో పాటుగా సుధూర ప్రాంతాల్లో ఈ బుకీ కార్యకలాపాలు జరిగినట్టు ఇప్పటికే ప్రత్యేక బృందాలు విచారణ చేపడుతున్నాయి. రోజుకి ఇద్దరు, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్న అధికారులకు విస్తుపోయే నిజాలు బయటపడటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఓ బాధితుడు పీజీఆర్‌ఎస్‌లో నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చీకి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంలో రాజకీయ ఒత్తిడి తీవ్రంగా ఉన్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఇంతటి ఘనతను సాధించినట్టు పలువురు అధికారులు వెల్లడిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్‌ స్టేషన్‌కి సమీపంలో ఎన్నో ఏళ్లుగా ఈ వ్యవహారం జరుగుతున్నా ఇంత ఆలస్యంగా గుర్తించడంలో ఆ హెడ్‌ కానిస్టేబుల్‌తో పాటుగా గతంలో పని చేసిన కీలక అధికారులకు సైతం ముడుపులు అందినట్టు పలు అనుమానాలు వెంటాడుతునే ఉన్నాయి. ఇదే క్రమంలో ప్రస్తుత బృందంలో ఉన్న కొందరు దిగుస్థాయి సిబ్బంది టాస్క్‌లకు వెళ్లే సమయంలో నిందితులకు ముందస్తు సమాచారం చేరవేసి లబ్ధి పొందుతున్నట్టు సంబంధిత విభాగంలోనే గుసగుసలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పోర్టులో సొత్తును కాజేస్తున్న ఇద్దరు మాయ లేడీల నుంచి నెలవారీ వచ్చే ముట్టగొట్ట(లంచం)కి కక్కుర్తి పడటం, గంజాయి తరలింపు కేసుల్లో కీలక ఆధారాలు తీసుకొచ్చి కేసులు నమోదు చేయడంలో ఎంత చాకచక్యం ప్రదర్శిస్తున్నారో అంత కంటే పెద్ద పెద్ద ముఠాలను పక్కదారిలో తరలించడానికి సాయం చేస్తూ ఎంత మొత్తంలో భక్షిస్తున్నారో బహిరంగ రహస్యంగానే సిబ్బంది మనసులో దాచుకున్నారు. నగరంలో ఉన్న రౌడీ షీటర్స్‌, బడా బాబులందరూ జూదం ఆడటానికి ఓ వేదికను ఏర్పాటు చేసే కీలక రౌడీషీటర్‌ కొలుసు కుమార్‌కి సైతం చేదోడు వాదోడుగా ఉంటూ నెలవారీ ముడుపులు తీసుకోవడంలో బిజీ బిజీగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం. అది కూడా ఎంతగా అంటే సంక్రాంతి పండగ అటు ఇటుగా నెలరోజులు స్టేషన్‌కి వచ్చి వారాంతపు సంతకాలు చేయాల్సిన రౌడీషీటర్‌ సైతం జూదం ఆడుకుంటూ రాకపోయినా పట్టించుకోలేనంతగా ఇక్కడ సిబ్బంది స(అ)క్రమంగా విధులు నిర్వహిస్తున్నారు.

  • టాస్క్‌ ఫోర్స్‌లో ఆ షాడోని పట్టుకోవడం కష్టమా..?

తనకి హద్దులను కేటాయించినా నగర వ్యాప్తంగా సంచరిస్తున్న ఆ షాడో రౌడీ షీటర్స్‌తో స్నేహం చేసి దండీగానే దండుకుంటుంది. ఓ మహిళా న్యాయవాది సాయంతో జైల్లో ఉన్న రౌడీ షీటర్‌లకు ములాకత్‌, బెయిల్‌ పెట్టడంలో షాడో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇదే క్రమంలో అక్కడ మగ్గిపోతున్న కొందరు పీడీయాక్ట్‌, డ్రగ్స్‌, గంజాయి కేసుల్లో ఉన్న కేటుగాళ్ల నుంచి కీలక విషయాలను తెలుసుకొని నగరంలో మాయాజాలం ప్రదర్శిస్తుంది. ఓ ఘటనలో ఒక రౌడీషీటర్‌ వద్ద 2గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ గుర్తించి అదే టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పట్టుకుంటే తనకు ఆ రౌడీషీటర్‌ డబుల్‌ ఏజెంట్‌గా ఉన్నాడని ఉన్నతాధికారులను ఒప్పించి వదిలి పెట్టడంలో కీలకంగా వ్యవహరించింది ఆ షాడో. బెల్ట్‌ దుకాణాలు, రేషన్‌ బియ్యం అక్రమంగా తరలించే వ్యక్తుల నుంచి సైతం పెద్ద మొత్తంలో ముడుపులు అందుతున్నట్టు టాస్క్‌ఫోర్స్‌ గోడలు సైతం ఈ షాడో చేష్టలు చూడలేక గగ్గోలు పెడుతున్నాయి.

  • టాస్క్‌ ఫోర్స్‌లో డైరెక్ట్‌ అధికారి అవసరమే..!

నగర వ్యాప్తంగా ఎటువంటి తారతమ్యం, రాజకీయ ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించడానికి టాస్క్‌ఫోర్స్‌లో డైరెక్ట్‌ డీఎస్పీ స్థాయి అధికారి అవసరం అక్కడ ఎంతైన ఉందని పలువురు దీర్ఘకాలిక అనుభం కలిగిన పోలీసు ఉద్యోగులు వెల్లడిస్తున్నారు. నెలరోజులు క్రితం స్టేషన్‌కి సమీపంలో ఓ లాడ్జీలో పేకాట జట్టుని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ బృందానికి తీవ్ర తలనొప్పి తెచ్చిపెట్టింది. ఓ రాజకీయ ఒత్తిడి వలన కొంత సొమ్ముతోనే అదుపులోకి తీసుకోవల్సి వచ్చింది. ఇదే క్రమంలో వారం రోజుల క్రితం ఆనందపురం, రామవరం రోడ్డులో సుమారు వంద మందికి పైగా కోడి పందాలు ఆడుతున్నారని పట్టుకోవడానికి వెళ్లిన సిబ్బందికి ఓ మాజీ ఎమ్మెల్యే ఒత్తిడి తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అప్పటికే ముప్పై మందికి పైగా అదుపులోకి తీసుకొని రూ.2.10లక్షల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. సిబ్బంది కష్టపడినా కార్లులో ఉన్న భారీ మొత్తాన్ని పట్టుకోలేకపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో డైరెక్ట్‌ అధికారి అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు సీఐలు, ఒక ఎస్సై, నలుగురు హెచ్‌సీలు, పద్నాలుగు మంది కానిస్టేబుల్స్‌, ఇద్దరు హోంగార్డు డ్రైవర్‌లతో నడుస్తున్న టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని స్పెషల్‌ బ్రాంచ్‌ ఏడీసీపీతో పాటుగా నగర పోలీసు కమిషనర్‌ పర్యావేక్షించడం ఒక విధంగా మంచిదైనా స్థానికంగా అక్కడ ఓ ఉన్నతాధికారి లేకపోవడం దిగువ స్థాయి అధికారులకు ఇబ్బంది తప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి కంటే అక్కడ సీనియర్‌ స్టేషన్‌ స్థాయి అధికారికి నిందితులను అప్పగించే సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు. పైగా ఎదురు సమాధానం చెప్పలేకపోవడంతో టాస్క్‌ నిర్వహించి సంబంధిత సమీప స్టేషన్‌కి అప్పంగించాల్సిన టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందికి సెంట్రీ డ్యూటీ వేసిన సందర్భాలు కూడా నగరంలో అధికంగానే ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంది.

CrimeGovernment

పోలీసు విధుల్లో యూనిఫామ్ ధరించాల్సిందే..!

  • సిబ్బంది విధిగా యూనిఫామ్‌ ధరించాలని సీపీ ఆదేశాలు..
  • యూనిఫామ్‌ ధరించకపోతే చర్యలు తీసుకోవాలని హెచ్చరిక..
  • జనరల్‌ సిబ్బంది సైతం యూనిఫామ్‌ ధరించాలని సూచనలు..


నేత్ర న్యూస్‌, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి) : ‘‘మీ సీపీ ఎల్లప్పుడూ యూనిఫామ్‌లో ఉంటే మీరు ఎందుకు యూనిఫాంలో ఉండకూడదు. విధుల్లో ఉన్నప్పుడు 100శాతం అందరూ పోలీసు యూనిఫామ్‌లో ఉండాలి. హోంగార్డు, కానిస్టేబుల్‌ నుంచి ప్రతీ అధికారి యూనిఫామ్‌ ధరించాలి. ఎవ్వరైనా యూనిఫామ్‌లో లేకపోతే వాళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలి.’’ అని సాక్షాత్తు విశాఖ నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చీ మాట్లాడిన మాటలు ఇప్పుడు నగర పోలీసు సిబ్బంది అందరిలో ఓ కొత్త భయాందోళన రేకెత్తించింది. అది కూడా ఎందుకంటే నగర సీపీ మాట్లాడిన మాటలతో పాటుగా ఓ దిగువ స్థాయి సిబ్బంది మరో వాయిస్‌ రికార్డుని జత చేస్తూ ‘‘ఎవరైతే జనరల్‌ డ్యూటీలో ఉన్నారో వాళ్లందరూ తప్పనిసరిగా యూనిఫామ్‌ ధరించాలని, పైగా నిఘా కూడా ఉంది అందరూ సీరియస్‌గా తీసుకోవాలి.’’ అని చెప్పడంతో నగర వ్యాప్తంగా స్టేషన్‌ స్థాయిలో ఇప్పటికీ జనరల్‌ డ్యూటీ (2016 మే 25న మాజీ సీపీ యోగానంద్‌ సమక్షంలో అంతరించి పోయిందని అనుకున్న ప్రత్యేక కలెక్షన్‌ బృందం) ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని విశ్వసనీయ సమాచారం. ప్రజల సమస్యలతో పాటుగా సిబ్బంది బాగోగులు చక్కగ చూస్తున్న నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చీ ఇప్పుడు అవినీతి ముసుగులో మగ్గిపోతున్న కలెక్షన్‌ కింగ్‌లపై పడ్డారా..? అనే భయంతో స్టేషన్‌ పరిధిలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న సుమారు 75శాతం సిబ్బంది మంగళవారం ఉదయం యూనిఫామ్‌లో దర్శనమిచ్చారు. దీంతో పాటుగా ఎప్పుడూ పోలీసు యూనిఫాం ధరించకుండా కలెక్షన్‌ ఏజెంట్లుగా తిరుగుతూ అధిక మొత్తంలో దోచుకుంటున్న దొంగల ముఠా సభ్యులు సైతం ఒక్కసారిగా యూనిఫామ్‌ ధరించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. వాస్తవానికి సోమవారం సీపీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న సమయంలో ఓ దిగువ స్థాయి సిబ్బంది యూనిఫామ్‌ ధరించకుండా అడ్డుగా వచ్చిన సందర్భంలో నగర సీపీ అందరూ యూనిఫాం ధరించాలి అని చెప్పగా ఆ విషయం నగర వ్యాప్తంగా కలెక్షన్‌లో బిజీ బిజీగా ఉన్న సిబ్బందిని ఇబ్బంది పెట్టిందని ఆలస్యంగా వెలుగు చూసింది. ఏది ఏమైన నగర సీపీ అటుగా కూడా నిఘా కట్టుదిట్టం చేశారని పలు సందేహాలు సైతం వేడి వేడిగా వినిపిస్తున్నాయి.

  • జనరల్‌ సిబ్బంది చేష్టలు చిర్రెత్తి పోతున్నాయి..

నగర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీసు స్టేషన్‌ల్లో జనరల్‌ (కలెక్షన్‌ నిమిత్తం) సిబ్బందిని నియమించి ఇష్టానుసారంగా దండుకుంటున్నారని ఇప్పటికే నగర సీపీకి సైతం పీజీఆర్‌ఎస్‌లో పలు ఫిర్యాదులు సైతం వచ్చాయి. దీనిపై ఆయన తనదైన శైలిలో చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు పలువురు సిబ్బంది వెల్లడిస్తున్నారు. ఓ స్టేషన్‌ పరిధిలో గత 20ఏళ్లుగా ఉన్న హోంగార్డు జనరల్‌ సిబ్బందిగా చలామణి అవుతూ ట్రావెల్స్‌ యాజమాన్యల నుంచి దండుకుంటే.. మరో స్టేషన్‌ పరిధిలో హోటల్స్‌, సినిమా థియేటర్‌ల వద్ద ఈ ఏజెంట్‌ తన పనితీరుని చూపిస్తున్నాడు. ఇంకొక స్టేషన్‌ పరిధిలో ఓ కానిస్టేబుల్‌ బిల్డింగ్‌లు నిర్మించే బిల్డర్‌ల వద్ద రూ.లక్షల్లో దోచుకుంటుంటే.. మరో స్టేషన్‌ పరిధిలో షిప్పింగ్‌ కంపెనీలు, కార్గో యజమానుల నుంచి సరుకును దోచుకునే దొంగల నుంచి దండుకుంటున్నారు. ఇలా నగర వ్యాప్తంగా మామూళ్లు మత్తులో ఉన్న జనరల్‌ సిబ్బందిపై ప్రస్తుత పోలీసు కమిషనర్‌ చర్యలకు ఎప్పుడు పచ్చ జెండా ఊపుతారో అని నిజాయితీగా ఉన్న కొందరు పోలీసు సిబ్బంది ఆశగా ఎదురు చూస్తున్నారు.

  • యూనిఫామ్‌ ధరించడం వలన కలిగే ప్రయోజనాలు..

పోలీసు యూనిఫామ్‌ ధరించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని, అంతే కాకుండా ఖాకీ రంగుకి కూడా ప్రత్యేక అర్థం ఉందని పలువురు విరమణ ఉద్యోగులు సైతం వెల్లడిస్తున్నారు. ఖాకీ రంగు దుమ్మును దాచిపెట్టడానికి ఉపయోగపడుతుందని, అంతే కాకుండా ఇది శాంతి, క్రమశిక్షణను సూచిస్తుందని వెల్లడిస్తున్నారు. పోలీసు యూనిఫామ్‌ల చరిత్ర కూడా చాలా ఆసక్తికరమైనదని, బిటిష్‌ కాలంలో బ్రిటిష్‌ వారు భారతదేశంలో తెల్లని రంగు యూనిఫామ్‌లను ఉపయోగించేవారని కానీ అవి త్వరగా మురికి అవ్వడంతో 1847లో సర్‌ హ్యారీ లమ్స్‌డెన్‌ అధికారికంగా ఖాకీ రంగు యూనిఫారాన్ని వాడుకలోకి తీసుకొచ్చారు. పోలీసు విభాగంలో నేటికి కొనసాగుతునే ఉంది.

  • గుర్తింపు: యూనిఫామ్‌ పోలీసును సామాన్య ప్రజల నుండి వేరు చేస్తుంది. ఇది ప్రజలకు భద్రతా భావాన్ని కలిగిస్తుంది.
  • అధికారం: యూనిఫామ్‌ పోలీసులకు ఒక నిర్దిష్ట అధికారాన్ని సూచిస్తుంది. ఇది వారి పనిని సులభతరం చేస్తుంది.
  • శ్రేణిని నిర్వచించడం: వివిధ రకాల యూనిఫామ్‌లు పోలీసు అధికారి యొక్క శ్రేణిని సూచిస్తాయి. ఇది ఆదేశాలను అమలు చేయడంలో సహాయపడుతుంది.
  • క్రమశిక్షణ: యూనిఫామ్‌ ధరించడం వల్ల పోలీసులలో క్రమశిక్షణ పెరుగుతుంది.
  • ఏకత్వం: ఒకే రకమైన యూనిఫామ్‌ను ధరించడం వల్ల పోలీసు దళంలో ఏకత్వం పెరుగుతుంది.
  • భద్రత: యూనిఫామ్‌ ధరించడం వల్ల పోలీసులు తమను తాము భద్రంగా భావిస్తారు.
  • శ్రద్ధ: యూనిఫామ్‌ ధరించడం వల్ల పోలీసులు తమ విధులను నిర్వర్తించేటప్పుడు మరింత శ్రద్ధగా ఉంటారు.
CrimeGovernment

స్టాక్ మార్కెట్ వేడిలో సిబ్బందిపై ఫైర్..

  • స్టాక్‌ మార్కెట్‌ మత్తులో సిబ్బందిని చిత్తు చిత్తు చేస్తున్న ఓ పోలీసు అధికారి..
  • ఆ అధికారిపై ఇప్పటికే నగర పోలీసు కమిషనర్‌కి సైతం ఫిర్యాదుల పరంపర..
  • గతంలో పలుమార్లు సస్పెండ్‌ అయినప్పటికీ ఏమాత్రం మారని ఆయన తీరు..
  • స్టేషన్‌ నుంచి బదిలీపై వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్న పలువురు సిబ్బంది..

నేత్రన్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి): ఆ అధికారి ఆడిన ఆటలో అమాయక సిబ్బంది సతమతమవుతున్నామని ఏకంగా పోలీసు బాస్‌కే ఫిర్యాదుల పరంపర నడపడం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఆయనపై కోపంతో ఓ కానిస్టేబుల్‌ కొన్ని రోజులు కనిపించకుండా పోవడం సాధారణంగా విషయంగా తీసుకుంటే.. సీఐ స్థానంలో ఉన్న మహిళా అధికారి పరుగులు పెడుతూ పోలీసు కమిషనర్‌కి ఫిర్యాదు చేయడం అసాధారణమైన విషయంగానే పరిగణించాలని ఆనోట.. ఈనోట.. గట్టిగానే వినిపిస్తుంది. మొదటి నుంచి ఆ అధికారి మాట తీరు, వ్యవహార శైలి సక్రంగా లేకపోవడంతో ఉన్నతాధికారుల దండనకు గురవ్వడమే కాకుండా పలుమార్లు సస్పెండ్‌ అయినా ఆయన తీరు ఏ మాత్రం మారకపోవడం అందర్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంచలంచలుగా పెరుగుతూ అధికారి హోదాకి వచ్చినా కాసంత కూడా కనికారం లేదని కన్నీరు కారుస్తున్నారు. ఆయనకు మరో కొత్త అలవాటు రావడంతో సిబ్బంది పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టు అయ్యిందని ఆవేదన సైతం వ్యక్తం చేస్తున్నారు. రెండు సెల్‌ఫోన్‌లతో స్టేషన్‌కి వచ్చిన అధికారి నిత్యం ఓ సెల్‌ఫోన్‌లో మార్కెట్‌ సమయానుగుణంగా ఇంట్రాడే ట్రేడిరగ్‌ చేయడం, మధ్య మధ్యలో అమ్మాలా..? కొనాలా..? అనే సంభషణలు చేయడం స్టేషన్‌లో కిటికీలు, తలుపులు సైతం ఓ కంట కనిపెడుతునే ఉన్నాయి. అందులో ఏదైనా వ్యత్యాసం వస్తే అక్కడ ఉన్న సిబ్బందికి తిట్టుల దండకం తప్పదని దీనికి సంబంధించిన పూర్తి అంశాలు సీసీ కెమెరాలు పరిశీలిస్తే తెలుస్తుందని వెల్లడిస్తున్నారు. చీటికి మాటికి సిబ్బందిపై కస్సుబుస్సులు ఆడటంతో సిబ్బంది అక్కడక్కడ

ప్రయత్నించి బదిలీపై వెళ్లిపోవడానికి సైతం సిద్ధమవుతున్నారు. గతంలో హార్బర్‌ స్టేషన్‌లో ట్రాఫిక్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో నకిలీ చలానా పుస్తకాలు సృష్టించి అధిక మొత్తంలో దోచుకోవడం గుర్తించిన అప్పటి పోలీసు బాస్‌ సస్పెండ్‌ చేసినా ఆయనలో మార్పు ఏ మాత్రం కనిపించలేదనే చెప్పాలి. అక్కడికి కొన్నేళ్ల తరువాత ఇన్‌స్పెక్టర్‌ హోదాలో ఓ కానిస్టేబుల్‌ని కొట్టడంతో మరోమారు సస్పెండ్‌ అయినా దిగువ స్థాయి సిబ్బందిని ఏమాత్రం చూసుకోవడం రాలేదనే చెప్పాలి. మరో సంఘటనలో ఈయన చేసిన చేష్టలకు ఓ కానిస్టేబుల్‌ తుఫాకీ ఎక్కుపెట్టిన ఘటన ఆ రోజుల్లో అందర్నీ భయబ్రాంతులకు గురిచేసినా ఉపయోగం లేదనే చెప్పాలి. ఇదే క్రమంలో నగరంలో కీలక విభాగానికి అధికారిగా వ్యవహరిస్తున్న ఆయన ఓ కోర్టు కానిస్టేబుల్‌పై నిప్పులు చెరగడంతో మనస్థాపానికి గురైన కానిస్టేబుల్‌ ఎవ్వరికీ చెప్పకుండా స్టేషన్‌లో తన వస్తువులు అన్ని వదిలిపెట్టి అటుగా కనిపించకుండా వెళ్లిపోయాడని తోటి సిబ్బంది గుసగుసలాడుకున్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పీఎంపాలెం పోలీసు స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ 558/2024 నమోదు చేసిన కొన్ని రోజుల్లో తిరిగి రావడంతో కథ సుకాంతం అయ్యిందనే సమయానికే ఓ మహిళా ఏఎస్సై తనకు మూడు రోజులు సెలవు కోరిన విషయంలో లేఖలో నన్ను చాలా సార్లు అవమానపరిచారు, ఆడ వాళ్లకి చాలా బాధలు ఉంటాయి అర్థం చేసుకోవాలని ప్రాధేయపడటమే కాకుండా సెలవు ఇవ్వకపోతే కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం కూడా కొసమెరుపు. అదే సమయంలో మరో మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌పై ఆసభ్యకరంగా మాట్లాడటం, ఓ కానిస్టేబుల్‌ని బెధిరించడం చేసిన ఆయనపై ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతునే ఉంది. స్టేషన్‌లో మహిళా ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ బాధితురాలు తన వద్దకు వచ్చిన ఫిర్యాదుల్లో వచ్చే సన్నివేశాలు పరిష్కరించడానికి ప్రయత్నించే క్రమంలో తాను కూడా ఎదుర్కొవడంతో నేరుగా ఉన్నతాధికారి కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయడం అందర్నీ ఆయోమయానికి గురిచేసిందనే చెప్పాలి. దీంతో స్పందించిన పోలీసు బాస్‌ తనపై ఉన్న అధికారుల దృష్టికి సైతం ఈ విషయాన్ని తీసుకెళ్లారని విశ్వసనీయ సమాచారం.

Silhouette bull versus bear mascot characters in front of a stock market or profit graph concept
  • వ్యతిరేక మార్గంలో ప్రయాణించడం ఆయనకే దక్కింది..

మొదటి నుంచి చట్ట వ్యతిరేక మార్గంలో ప్రయాణించడం ఆయనకే దక్కిందని నగరంలో విధులు నిర్వహిస్తున్న ఆయన తోటి సిబ్బంది సైతం వెల్లడిస్తున్నారు. నకిలీ ట్రాఫిక్‌ చలానాలు సృష్టించి జరిమానాలు పక్కదారి పట్టించడం, కేసులకు సంబంధం లేకుండా బస్‌ వారెంట్‌లతో శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు ప్రయాణించడం వంటి అంశాలు డీజీపీ స్థాయి అధికారి దృష్టిలో ఉన్నా తన తీరుని ఏమాత్రం మార్చుకోకుండా సిబ్బందిపై చిందులు వెయ్యడం ఆయనకే దక్కిందని చెప్పాలి. దీనికి తోడు కొత్తగా ఉద్యోగ సమయంలో వ్యక్తిగత వ్యాపారాలు, పెట్టుబడులపై నిబంధనలు పాటించకుండా సీసీ కెమెరాల పర్యావేక్షణలో స్టాక్‌ మార్కెట్‌ ఇంట్రాడే ట్రేడిరగ్‌ చేయడం అందులో ఎదురయ్యే సంఘర్షణల వలన దిగువ స్థాయి సిబ్బందిపై మండి పడటం ఇప్పటికే పోలీసు బాస్‌ దృష్టికి పలువురు సిబ్బంది తీసుకెళ్లారు. దీనిపై ఆకాశ రామన్న ఉత్తరాలు సైతం వెయ్యడంతో ఆ దిశగా విచారణ కొనసాగుతుందని విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైన ఇటువంటి అధికారి వద్ద పని చేయడం సూది కంటిలో తాను పోయడం లాంటిదని సిబ్బంది బోరుమంటున్నారు.

CrimeGovernmentPolitical

జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రచ్చ.. రచ్చ..

విశాఖపట్నం జాయింట్‌ సబ్‌ రిస్ట్రార్‌లో రోజు రోజుకి ముదురుతున్న ముసలం..

– కొత్త సిబ్బంది పనితీరు, సమన్వయ లోపంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు..

పర్సంటేజ్‌లు పంచుకోవడంలో వ్యత్యాసం రావడంతోనే అసలు రచ్చ.. రచ్చ..

– అన్నీ ఉంటే 0.5% లేకపోతే 1% నుంచి మా ఇష్టమంటున్న మధ్యవర్తులు..

– జిల్లా అధికారికి అధిక సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఇప్పటికే మందలింపు..

నేత్రన్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి): విశాఖపట్నం జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సిబ్బంది మధ్య జరుగుతున్న జగడం ఆనోట.. ఈనోట.. పలుకుతూ పైస్థాయి అధికారుల దృష్టికి సైతం వెళ్లడం ప్రస్తుతం చర్చనీయంగా మారింది. అక్కడి అధికారుల నుంచి దిగువ స్థాయి సిబ్బంది వరకు సమాన వాటాలతో రావల్సిన పర్సంటేజ్‌లో వ్యత్యాసాలు కనిపించడం సిబ్బంది మధ్య గత నెలరోజులుగా కుమ్ములాట జరుగుతుందని విశ్వసనీయ సమాచారం. దీంతో రోజువారీ కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మండిపడుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో జరగాల్సిన చిన్న చిన్న పనులు సైతం నత్తనడకన సాగుతూ వారాలు గడిచిపోతున్నాయని పలువురు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త సిబ్బందికి సక్రమంగా పనులు చేయడం రాకపోవడంతో రాబందుల మాదిరి చుట్టుపక్కల కాసుకొని కూర్చున్న కొందరు ప్రైవేటు డాక్యుమెంట్‌ రైటర్‌లతో పనులు చేయిస్తున్నారని కూడా బహిరంగంగా వెల్లడిస్తున్నారు. రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నగదు రహిత పనులు జరగాలని ప్రభుత్వం అన్నింటిని ఆన్‌లైన్‌ ద్వారా పెట్టడంతో మరింత సమస్యగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారి లేదా సిబ్బంది వద్దకు వెళ్లినప్పుడు లంచం అడిగితే అవినీతి నిరోధకశాఖకు ఫిర్యాదులు అందించే అవకాశం లేకుండానే రిజిస్ట్రార్‌ కార్యాలయానికి దూతలుగా వ్యవహరిస్తున్న ప్రైవేటు డాక్యుమెంట్‌ రైటర్‌ల వద్దనే అన్ని లావాదేవీలు జరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రిజిస్ట్రేషన్‌ సమయంలో అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే 0.5శాతం, పత్రాల్లో వ్యత్యాసాలు ఉంటే 1శాతం నుంచి ఎదుట వ్యక్తి ఆలోచనలో పడినంత పర్సంటేజ్‌ని వసూలు చేసి అధికారులకు, అక్కడి సిబ్బందికి ఇవ్వడంలో ఈ డాక్యుమెంట్‌ రైటర్‌లు కీలకంగా ఉన్నారని ఇట్టే అర్థం అవుతుంది. జిల్లా కార్యాలయానికి, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి అనుసంధానంగా పనిచేసే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బందికి సైతం ఇక్కడ తీసుకున్న పర్సంటేజ్‌ల్లో సమాన వాటాలను సైతం ఇస్తున్నారని పలువురు డాక్యుమెంట్‌ రైటర్‌లే బహిరంగ రహస్యంగా చెప్పుతున్నారు. ఇక్కడ జరుగుతున్న అన్ని అంశాలను పలువురు ప్రజలు ఫిర్యాదుల రూపంలో జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లడంతో ఇప్పటికే ఆయన వచ్చి సిబ్బందిని ఆయన తీరులో మందలించడం కూడా జరిగింది. రూ.కోట్లల్లో జరుగుతున్న ఆర్థిక లావాదేవీల్లో కీలకంగా వ్యవహరించే రెవెన్యూ వ్యవస్థ విధించిన పర్సంటేజ్‌లు ఎంత లాభాన్ని లెక్కకడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతీ వ్యవహారానికి ప్రభుత్వం విధించిన స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, యూజర్‌ ఛార్జీల పేరిట విపులంగా పెద్ద పెద్ద బోర్డులను అమర్చినా ప్రజల్లో చైతన్యం రాకుండా అవితీకి ఆజ్యం పోస్తున్నట్టు పర్సంటేజ్‌లు చెల్లించడం ప్రజలు చేస్తున్న పెద్ద తప్పుగానే పరిగిణించాలి.

  • రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరుగుతున్న తంతు తెలిసినా చోద్యం ఎందుకు..?
    ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని అందించే కీలక వ్యవస్థల్లో రిజిస్ట్రార్‌ కార్యాలయాలు మొదటి ఐదు స్థానాల్లో నిలుస్తాయని అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. అటువంటి వ్యవహారాలు జరిగే కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ అప్పుడప్పుడు చుట్టం చూపుగా చూడటంపై కొందరి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. అన్ని సేవలు ఆన్‌లైన్‌ పేరిట ఉన్నా సంబంధిత వ్యవహారాలపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఎట్టకేలకు కార్యాలయాలకు దూతలుగా వ్యవహరిస్తున్న డాక్యుమెంట్‌ రైటర్‌లనే ఆశ్రయించి నిలువుదోపిడికి గురవుతున్నారు. ఈ తరహా వ్యవహారాల దృష్ట్య ప్రస్తుత కాలంలో అవినీతి అధికారులని, సిబ్బందిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి అవకాశం లేదని తెలిసినా సంబంధిత ఏసీబీ అధికారులు అటుగా డాక్యుమెంట్‌ రైటర్‌లపై దృష్టి కేంద్రీకృతం చేయడంలో చోద్యం ఎందుకు అని పలు ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. పర్సంటేజ్‌లు పుచ్చుకునే కార్యాలయాల్లో అన్ని అంశాల గురించి పూర్తి అవగాహాన ఉన్న అవినీతి నిరోధక శాఖ చక చక పనులు ప్రారంభిస్తే ఇట్టే అవినీతి తిమింగళాలను పట్టుకోవచ్చు. ఇదే జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 2.ఓ పరిస్థితికి ముందు చాలా మంది అవినీతి అధికారులను పట్టుకొని కటకటాల వెనక్కి నెట్టిన ఘనత ఏసీబీకి చాలా సార్లు దక్కింది. గతంలో ఇదే చోట పనిచేసి పలుమార్లు ఇదే స్థానంలో రావడానికి ఇష్టపడుతున్న అధికారులు, ఎక్కడి స్థానంలో అక్కడ ఉండిపోవడానికి అత్యాశ చూపించే గత సిబ్బంది, ఇదో ఏదో బాగుందే అని పనులు రాకపోయిన నెట్టుకొస్తున్న కొత్త సిబ్బంది తీరుని గమనిస్తే ఎంతటి స్థాయిలో అవినీతి జరుగుతుందో ఇట్టే అర్థం అయిపోతుంది. కార్యాలయ ప్రాంగణంలో అవినీతి జరగకపోయినా అవినీతికి పాల్పడిన అధికారులు దూతల ద్వారా అధిక శాతం కోరుతున్న ఘటనలు ఈ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గోడలు, కిటికీలు నిరంతరం కనిపెడుతునే ఉన్నాయి.
Crime

నగర వ్యాప్తంగా ‘స్పా’ లపై పోలీసుల దాడులు

  •  స్పా ముసుగులో చేసే గలీజ్‌ దందాపై కొరడా ఝళిపించిన సీపీ రవి శంకర్‌..
  •  ఏక కాలంలో అన్ని స్పా సెంటర్‌లపై దాడులు నిర్వహిస్తున్న పోలీసు బృందాలు..
  •  వందల మంది పోలీసు సిబ్బందితో ప్రత్యేక తనిఖీలకు ఆదేశించిన నగర సీపీ..
  •  ప్రత్యేక విభాగాలతో పాటుగా స్థానిక స్టేషన్‌ సిబ్బంది సైతం దాడులకు హాజరు..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : నగర వ్యాప్తంగా ఉన్న స్పా సెంటర్‌లపై పోలీసు బృందాలు ఏక కాలంలో దాడులు నిర్వహిస్తున్నాయి. ఆదివారం రాత్రి 7గంటల సమయంలో ప్రారంభించిన దాడులు ఉరుకులు పరుగుల నడుమ జరుగుతునే ఉన్నాయి. నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఏజీడీ డాక్టర్‌ ఎ.రవి శంకర్‌ నాటి నుండే తనదైన శైలిలో విధులు నిర్వహించడం ప్రారంభించారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగానే చెప్పాలి. తాను బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే తన విభాగంలో ప్రత్యేక నిఘా కట్టుదిట్టం చేసి ఇప్పటికే పలువురు సిబ్బందిని సస్పెండ్‌ చేసిన విషయం మరిచిపోక ముందే రెండు రోజుల క్రితం నగరంలో పలువురు ఇన్‌స్పెక్టర్‌లను బదిలీ చేసిన తీరుతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ క్రమంలో తన సిబ్బందితో పాటుగా నగరంలో జరుగుతున్న కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన ఆయన ముందస్తు వ్యూహంతో సిద్ధం చేసుకున్న టాస్క్‌ని సిబ్బందికి ఇచ్చారు. నగరంలో చట్ట విరుద్ధ, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న కేంద్రాలను గుర్తించి దాడులకు ముహుర్తం ఖరారు చేశారు. ఈ క్రమంలో నగర వ్యాప్తంగా గల బ్యూటీ స్పాలు, మసాజ్‌ సెంటర్‌లపై ఏక కాలంలో దాడులు నిర్వహించడానికి పదుల సంఖ్యలో బృందాలను సిద్ధం చేశారని విశ్వసనీయ సమాచారం. స్పెషల్‌ బ్రాంచ్‌, టాస్క్‌ఫోర్స్‌, ఇంటెలిజెన్సీ విభాగ సిబ్బందితో పాటుగా స్థానిక స్టేషన్‌ స్థాయి నేర విభాగ, శాంతిభద్రతల సిబ్బందిని సైతం కలుపుతూ దాడులు చేస్తున్నారు. ఇప్పటికే పలు సెంటర్‌లపై దాడులు నిర్వహించిన సిబ్బంది కీలక ఆధారాలు సైతం స్వీకరించడంతో పాటుగా పలువురు వ్యభిచార ముఠాలను, విటులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు బాగోట..

  • నగర వ్యాప్తంగా ఏక కాలంలో దాడులు నిర్వహించడం ఇదే మొదటిసారి..
    స్పా సెంటర్‌లలో జరుగుతున్న కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు వస్తున్న ఫిర్యాదులపై స్పందించిన నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ ఎ.రవి శంకర్‌ తనదైన శైలిలో దాడులకు ఆదేశాలు ఇచ్చారు. తన సిబ్బందికే ముందస్తు సమాచారం లేకుండా ఏక కాలంలో అందరికీ సమాచారం అందించి బృందాలను సిద్ధం చేశారు. సీఐలు, ఎస్సైలతో కూడిన బృందాలు ఒకేసారి దాడుల్లో పాల్గొనే విధంగా పథకం వేశారు. ఆదివారం.. పైగా రాత్రి సమయం.. కావడంతో చాలా మంది అసాంఫీుక కార్యకలాపాల్లో పాల్గొని పట్టుబడతారనే నెపంతో రాత్రి 7గంటల సమయంలో దాడులు ప్రారంభించారు. ఈ తరహాలో ఒకేసారి నగర వ్యాప్తంగా స్పా సెంటర్‌లపై దాడులు నిర్వహించడం ఇదే మొదటిసారి. దాడులపై పూర్తి వివరాలు ఉన్నతాధికారులు త్వరలో వెల్లడిరచనున్నారు.
CrimeGovernment

బియ్యం దొంగలు

  •  పెద్ద మొత్తంలో పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న ఎండీయూ సిబ్బంది..
  •  బియ్యం పంపిణీలో జాయింట్‌ కలెక్టర్‌ హెచ్చరికలు సైతం బేఖాతరు..
  •  కోటా బియ్యం విక్రయాల్లో చేతులు మారుతున్న రూ.కోట్ల సొమ్ము..
  •  ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టిస్తున్న పౌర సరఫరా శాఖ సిబ్బంది..
  •  కాసుల కక్కుర్తిలో పర్యవేక్షణను గాలికొదిలిన రెవెన్యూ యంత్రాంగం..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : ప్రభుత్వం నుంచి పేదలకు అందిస్తున్న కోటా బియ్యం రూ.కోట్ల వ్యాపారాన్ని దాటేస్తుందని అనడంలో అతిశయోక్తి లేదు. పేదలకు అందకుండానే ఆమడ దూరంలో దళారుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. బియ్యం పంపిణీ విషయమై డీలర్‌ వద్ద అక్రమాలు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంటి వద్దనే ఇచ్చే విధంగా మొబైల్‌ పంపిణీ యూనిట్‌ (ఎండీయూ) వాహనాలను ప్రారంభిస్తే.. మొబైల్‌ పంపిణీ యూనిట్‌ సిబ్బంది డీలర్‌ల స్థాయిని సైతం మించిపోతున్నారని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వినిపిస్తుంది. ఈ క్రమంలో ప్రతీ నెల పేద ప్రజలకు బియ్యం ఇవ్వల్సింది పోయి వారికి బియ్యానికి బదులు కేజీకి రూ.10 చొప్పున సొమ్ము ఇస్తున్నారు. కొందరు మాత్రం బియ్యం కావాలని పట్టు పట్టి కూర్చుంటే రేపు రావాలి.. మరుసటి రోజు రావాలి.. అనే నెపంతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఇప్పటికే పలువురు ప్రజలు మండి పడుతున్నారు. ఉచితంగా ఇచ్చే బియ్యం వద్ద రూ.10 వస్తుందని ప్రజలు తీసుకుంటున్నారు కానీ తద్వార ప్రభుత్వానికి ఎంత మొత్తంలో గండి కొడుతున్నామని ఏ ఒక్కరూ ఆలోచించకపోవడం శోచనీయం. నాడు డీలర్‌ల నుంచి వందల టన్నుల్లో బియ్యం పక్కదారి పడితే నేడు వేల టన్నుల్లో మాయమైపోతున్నాయి. దీనికి తోడు ప్రతీ అంశంలో ప్రభుత్వ అధికారుల మాదిరి లంచం తినడంలో మొదటి వరసలో ఈ ఎండీయూల సిబ్బంది ఉన్నారు.

  •  దసరా మామ్మూళ్లు పేరిట రూ.లక్షల్లో సొమ్మును కాజేశారు..
    తాత్కలిక పద్ధతిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఏడాదికి ఓమారు దసరా మామ్మూళ్లు వసూలు చేస్తే ఓమాదిరి వినడానికి వినసొంపుగా ఉంటే.. వాహనాల ద్వారా రేషన్‌ బియ్యం పంపిణీ చేయాల్సిన ఎండీయూలు వారికి పైన ఉన్న వీఆర్‌వోలు, ఆర్‌ఐలు, డీటీలు, పౌరసరఫరా శాఖ సిబ్బంది పేరిట రూ.లక్షల్లోనే వసూలు జరిగింది. వాహనం వద్దకు వచ్చి బియ్యం తీసుకొని, రూ.10 చొప్పున తీసుకొని విక్రయించే ప్రతీ ఒక్కరి వద్ద రూ.20చొప్పున సుమారు 5లక్షల కార్డులకు ఎంత మొత్తంలో వసూలు అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభుత్వం నుంచి జీతం, డీలర్‌ నుంచి కమీషన్‌, ప్రజల నుంచి మామ్మూళ్లు ఇలా నలు రకాలుగా వసూళ్లకు పాల్పడి నాలుగు రాళ్లు వెనకేసుకున్నారని ప్రతి పక్షపార్టీ నాయకులు సైతం బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. దీనిపై ఇప్పటికే జేసీ డీలర్‌లు, ఆర్‌ఐలతో ఓ సమావేశమై చర్చించగా ఒకరిపై ఒకరు చెప్పుకొని సంఘ నాయకులపై నెట్టడంతో తర్జన భర్జనల నడుమ సమస్య సద్దుమనిగిందనే చెప్పాలి. కానీ ఈ వ్యవహారంపై నేటికీ విచారణ కొనసాగుతుందని సమాచారం.

 

  • పేదల బువ్వకు ఉపయోగించే బియ్యం కేజీ రూ.10 మాత్రమే..?
    ప్రభుత్వం అధిక మొత్తంలో కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా ఇస్తుంటే.. ఉచిత బియ్యంపై కేజీకి రూ.10 వస్తుందని ఎండీయూ సిబ్బందికే వదిలిపెడుతున్న ప్రజల చేష్టలను బియ్యం దొంగలు చిల్లర చేసుకుంటున్నారు. టన్నుల చొప్పున వాహనాల్లో అక్రమ రవాణా చేసి రూ.కోట్లల్లో విక్రయాలు చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా పౌర సరఫరా శాఖతో పాటుగా ప్రత్యేక నిఘా బృందాలతో విధులు నిర్వహిస్తున్న పోలీసు యంత్రాంగానికి సైతం బహిరంగ రహస్యంగానే తెలుసు. నెలవారీ మామ్మూళ్లు మత్తులో ఈ వ్యవహారం చూసి చూడనట్టు ఉండటం వలన ఎఫ్‌సీఐ గిడ్డంగుల నుంచి వచ్చిన బియ్యం పేదోడి కంచంలో బువ్వగా మారకుండానే మిల్లులకు ప్రయాణమవుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై విశాఖ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కేఎస్‌ విశ్వనాథన్‌ తీవ్ర ఆగ్రహంతో ఉన్నా ఆయన కంటికి కనిపించకుండా జోరు వ్యాపారాలు సాగేందుకు సంబంధిత విభాగ సిబ్బందే పరోక్షంగా పనిచేస్తున్నారని వినికిడి.

  •  పర్యావేక్షణ లోపంతో పక్కదారి పడుతున్న కోటా బియ్యం..
    కోటా బియ్యం పక్కదారి పట్టకుండా పౌర సరఫరా శాఖ అధికారులతో పాటుగా రెవెన్యూ, పోలీసు విభాగాలకు పూర్తి అధికారాలు ఉన్నా టన్నులు, టన్నులు బియ్యం పక్కదారి పట్టడం వెనుక అసలు రహస్యం అమ్యామ్యాలు మత్తులో కనిపించడం లేదనే చెప్పాలి. నెలవారీ వచ్చే మామ్మూళ్లుతో పాటుగా దాడులు నిర్వహించిన ప్రతీసారి పచ్చనోట్లు రావడంతో పర్యావేక్షణ పూర్తీగా లోపించిందనే పలువురు ప్రజలు వెల్లడిస్తున్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికైనా ఇంటి దొంగలపై కొరడా ఝుళిపిస్తే ప్రయోజనం ఉంటుందని సంబంధిత విభాగంలో దిగువ స్థాయి సిబ్బంది రహస్య అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
CrimeGovernment

పక్కదారి పట్టిన ప్లాస్టిక్‌ రహిత బృందాలు

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : విశాఖ నగరాన్ని ప్లాస్టిక్‌ రహిత నగరంగా చూడాలని జీవీఎంసీ ఉన్నతాధికారులు చేస్తున్న ప్రయత్నం పక్కదారి పడుతుంది. 120మైక్రాన్‌ కంటే తక్కువగా మైక్రాన్‌లు ఉన్న ప్లాస్టిక్‌ సంచులతో పాటుగా ఒక్కసారి ఉపయోంగించే ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగాన్ని సైతం పూర్తి స్థాయిలో అరికట్టాలని ప్రారంభించిన ప్రయత్నాలు పలు విమర్శలకు దారి తీస్తుంది. గత నెల ప్రారంభంలో సుమారు రూ.2కోట్లు వరకు ఖర్చు చేసి పది ఇసుజు డీ-మ్యాక్స్‌ జీవీఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వాహనాలను ప్రారంభించిన ఉన్నతాధికారులు ముందుగా పలు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇప్పుడు నగరంలో పరువు తీసుకుంటున్నారు. దీనికి తోడు నెలవారీ ఒక్కొక్క వాహనానికి 140లీటర్లు డీజిల్‌ చొప్పున పది వాహనాలకు 1400 లీటర్లు డీజీల్‌కు గాను రూ.1,37,620లను, గౌరవ వేతనం చొప్పున ఒక్కొక్క వాలంటీర్‌కి రూ.10వేలు చొప్పున 36మందికి రూ.3.60లక్షలను ఖర్చు చేయడం అయోమయానికి గురి చేస్తుంది. వార్డు వాలంటీర్‌కి ఇచ్చిన రూ.5వేలు గౌరవ వేతనంతో పాటుగా అదనంగా రూ.10వేలు చొప్పున చెల్లించినా సంబంధిత వాలంటీర్‌లు వార్డుల్లో చేతివాటం చూపించడంతో పలువురు వ్యాపారుల నుంచి వ్యతిరేకత వినిపిస్తుంది.

దుకాణాల వద్దకు తనిఖీకి వెళ్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృంద సభ్యులు ఇష్టానుసారంగా మాట్లాడటంతో పాటుగా అక్రమ మార్గంలో వసూళ్లకు పాల్పడతున్నట్టు పలువురు దుకాణదారులు వెల్లడిస్తున్నారు. అసలు ఈ బృందాలు నగరంలో గల మార్కెట్‌లు, దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌, చిరు వ్యాపారాలు, తోపుడు బండ్ల వద్ద ఉపయోగించే ప్లాస్టిక్‌ సంచులను ఉపయోగించకుండా చూడటం, వాళ్లకు అవగాహన పరచడం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరిమానాలు విధించడం వంటివి చేయాలి. కానీ ఈ బృందాలు చిరు వ్యాపారులకు ఇష్టానుసారంగా జరిమానాలు విధించడంతో పాటుగా ఆమ్యామ్యాలపై మక్కువ చూపిస్తూ పక్కదారి పట్టడంతో నగర ప్రజల నుంచి జీవీఎంసీ అధికారులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • వార్డు వాలంటీర్లకు దాడులు చేసే అధికారమా..?
    నెలకు రూ.5వేలు గౌరవ వేతనంతో వార్డు ప్రజలకు సేవలంధించే వార్డు వాలంటీర్లకు దాడులు చేసే అధికారం ఇవ్వడం వ్యాపారుల నుంచి విమర్శల గుప్పుమంటున్నాయి. వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహించడంతో పాటుగా ప్లాస్టిక్‌ రహిత అమలు బృందాల్లో సభ్యులుగా స్థానం కల్పించడంతో వాలంటీర్‌లు పెచ్చురేగిపోతున్నారు. గన్‌మాన్‌ల మాదిరి సఫారీ దుస్తులు ధరించి దాడులు చేయడానికి వెళ్లే క్రమంలో వాళ్లు ఆడిరదే ఆట.. పాడిరదే పాట..గా తయారైయిందని పలువురు వ్యాపారులు ఇప్పటికే జీవీఎంసీ కమిషనర్‌కి స్పందనలో ఫిర్యాదులు సైతం ఇచ్చారు. రూ.15వేలు గౌరవ వేతనంతో పాటుగా చిన్న చిన్న దుకాణాలు, తోపుడు బండ్ల వద్ద చిరు వ్యాపారులను బెధిరింపులకు గురిచేస్తూ దండీగా దోచుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ వాలంటీర్‌ గురువారం ఉదయం విధులకు హాజరవ్వడానికి తన ఇంటి నుంచి వెళ్లే క్రమంలో పాతనగరంలో ఓ దుకాణంలోకి చొరబడి తాను జీవీఎంసీ టాస్క్‌ఫోర్స్‌ టీంగా పరిచయం చేసుకున్నాడు. తన బృందంతో వస్తే భారీగా జరిమానా విధిస్తానని, ఒక్కడిగా రావడంతో మీకు అదృష్టం అనుకోవాలని చెప్పారు. వెంటనే ఇవ్వనవసరం లేదని, సాయంత్రం వచ్చి తీసుకుంటానని చెప్పి అక్కడ నుంచి చల్లగా జారుకోవడమే కాకుండా దుకాణ యజమాని ఫోన్‌ నెంబర్‌ సైతం తీసుకొని బేర సారాలు ఆడటం మొదలపెట్టారు. దుకాణ యజమాని పనిపై బయట ఊరు వెళ్తానని చెప్పగా ఊరు వెళ్లడం వాయిదా వేసుకోవాలని, సాయత్రం వచ్చి మాట్లాడుతానని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది.

  • ప్లాస్టిక్‌ రహిత అమలు బృందాలు పని ఏంటీ..?
    విశాఖ పాస్టిక్‌ రహిత నగరంగా చూడాలని జీవీఎంసీ ఉన్నతాధికారులు గతనెల ప్రారంభంలో సుమారు రూ.2కోట్లు ఖర్చు చేసి 10వాహనాలను ప్రారంభించారు. ఎనిమిది జోన్‌లకు 8వాహనాలను కేటాయించి రెండు వాహనాలను రిజర్వుగా ఆర్‌ఎఫ్‌వో కార్యాలయం వద్ద ఉంచారు. దీనికి గాను జీవీఎంసీ ప్రాంతీయ అగ్నిమాపకాధికారి కో`ఆర్డీనేటర్‌గా వ్యవరిస్తారు. 36మంది వాలంటీర్‌లను ఈ విభాగంలో ఉపయోగించుకోవడానికి ఒప్పందం కుదుర్చుకొని ఎంపిక చేశారు. అందులో ఒక వాలంటీర్‌ టీం లీడర్‌గా వ్యవరించి మరో 35మంది సభ్యులు నలుగురు చొప్పున ఎనిమిది వాహనాల్లో తమకు కేటాయించిన జోన్‌ పరిధిలో తిరుగుతూ ప్లాస్టిక్‌ కవర్లు, ఒక్కసారి ఉపయోగించే ప్లాస్టిక్‌ వస్తువులు వలన కలిగే ప్రమాదాలను వివరిస్తూ అవగాహన పరచాలి. అవగాహన కల్పించిన వ్యాపారస్తుడు మరోమారు స్పందించకపోతే అక్కడ లభ్యమయ్యే ప్లాస్టిక్‌ కవర్ల సామర్థ్యాన్ని బట్టి జరిమానాలు విధించాలి. అదీ కూడా ఆన్‌లైన్‌ పద్ధతిలో రశీదు పొందుతూ నగదు చెల్లించాలి. ఈ బృందాలకు వాలంటీర్‌గా నెలవారీ వచ్చే రూ.5వేలతో పాటుగా ఈ బృందంలో పనిచేస్తున్నందుకు మరో రూ.10వేలు అదనంగా గౌరవ వేతనం ఇస్తున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడిరచారు. పైగా ఈ బృందాలు రోజువారీ తిరగడానికి ఒక్కొక్క వాహనానికి నెలకు 140 లీటర్లు డీజిల్‌ చొప్పున పది వాహనాలకు రూ.1,37,620 ఖర్చు చేస్తున్నారు. ఈ బృందాలకు రోజువారీ సూచనలు, సలహాలు, శిక్షణ ఇచ్చి వ్యాపారులతో సక్రమంగా నడుచుకునేందుకు అవసరమైన అంశాలతో పాటుగా పనితీరు, ప్రయాణించే ప్రదేశాలు, విధులు వంటి వాటిని జీవీఎంసీ ప్రాంతీయ అగ్నిమాపక అధికారి చూసుకుంటారు.

  • విధులకు దూరంగా విలాశాలకు దగ్గరగా..!
    పాస్టిక్‌ రహిత అమలు బృందాలుగా గుర్తింపు పొందిన బృందాలు విధులు నిర్వహించడంలో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తుంది. నలుగురు చొప్పున ఏసీ కారులో దర్జాగా బీచ్‌లు, పార్కుల్లో చక్కర్లు కొడుతూ కనిపిస్తున్నారు. వీవీఐపీలకు కేటాయించే పోలీసు అధికారులకు ఎక్కడా కూడా తీసుపోయే విధంగా ఈ వేషధారణ ఉండటంతో దుకాణాల్లో ఒక్కసారిగా చొరబడి సినీఫక్కి తరహాలో చొరబడి చిరు వ్యాపారులపై దాడులు నిర్వహిస్తున్నారు. కనీస ఉద్యోగ భద్రత లేని వ్యవస్థకు అన్ని అధికారులు ఇస్తే..? అనే విధంగా ఈ బృందాలు నగర రహదారులపై చెలరేగిపోతున్నాయి.
  • అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటాం..!
    ఈ బృందాలు నియమించడంలో ప్రధాన ఉద్ధేశం విశాఖ అభివృద్ధి. ప్లాస్టిక్‌ రహిత నగరంగా ఉండాలని ఇంత ఖర్చు చేసి ఈ తరహాలో పనిచేస్తున్నాం. సిబ్బంది ఇప్పటి వరకు అవినీతికి పాల్పడినట్టు సమాచారం లేదు. విధులు నిర్వహించడంలో సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. తమకు ఫిర్యాదులు ఇస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం. -యాగంటి హనుమంత్‌రావు (ప్రాంతీయ అగ్నిమాపక అధికారి, జీవీఎంసీ).

 

1 2 3
Page 1 of 3