Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
నేత్ర న్యూస్, విశాఖపట్నం : బాలల దినోత్సవం ప్రపంచ క్రీడా దినోత్సవాన్ని తలపించే విధంగా జరిగిందని ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంఈవోలు ఎం.సునిత, బి.పుష్య రాగం అన్నారు. మంగళవారం సాయంత్రం అక్కయ్యపాలెం, పోర్టు స్టేడియం, విశ్వనాథ్ కన్వెన్షన్స్‌లో స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ ఆధ్వర్యంలో జరిగిన రన ఫర్ ఫన్ కార్యక్రమంలో ఇరువురు ముఖ్య అతిథిలుగా పాల్గొని ఆనందంగా తిలకించారు. ఈ సందర్భంగా గాజువాక ఎంఈవో ఎం.సునిత మాట్లాడుతూ ప్రస్తుత విద్యా విధానంలో ఈ తరహా కార్యక్రమాలు చాలా అవసరమని అన్నారు. క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన మానసిక ఉల్లాసంతో చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఇదే విధంగా అన్ని పాఠశాలల్లో వారానికి రెండు రోజులు చిన్నారులకు క్రీడల వైపు మళ్ళించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహారాణిపేట ఎంఈవో బి.పుష్య రాగం మాట్లాడుతూ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్‌లో వినూత్న రీతిలో చదివించడంతో పాటుగా క్రీడా పరమైన అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపించడం అభినందనీయమని అన్నారు. కరాటీ, డాన్స్, చెస్ వంటి క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి చిన్నారుల అభ్యున్నతికి పునాదులు వేస్తున్న పాఠశాలగా వండర్ కిడ్స్ నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరక్టర్ మళ్ల రామునాయుడు మాట్లాడుతూ బాలల దినోత్సవం అనేది బాలలు ఇష్టపడే విధంగా ఉండాలని, వాళ్ళ ఇష్టానుగుణంగా ఈ రన్ ఫర్ ఫన్ కార్యాక్రమాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ‘సరదా కోసం పరుగు’ పేరిట కార్యక్రమం నిర్వహించడం వలన చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని వివరించారు. అనంతరం చిన్నారులకు పలు రకాల క్రీడల్లో పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులతో పాటుగా పతకాలను అందించారు. కార్యక్రమంలో భాగంగా కేజీ విద్యార్థులు వేసిన నృత్యాలు అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. పలువురు విద్యార్థులు కరాటీ క్రీడలో చేసిన సాహసాలు అబ్బురపరిచాయి. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మరో ఇద్దరు ముఖ్య అతిథులు ఎంఈవోలు బి.పైడపునాయుడు, బి.విశ్వనాథం చిన్నారుల ప్రతిభకు మంత్రముగ్ధులై అభినందనల వెల్లువలు కురిపించారు. కార్యక్రమంలో రాష్ట్ర అపుస్మా మెంటర్ ఎ.కృష్ణారెడ్డి, కోశాధికారి ఎంవీ రావు, విశాఖ జిల్లా అపుస్మా అధ్యక్షులు ఎస్.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎంవీవీ సత్యనారాయణ, పాఠశాల ప్రిన్సిపల్ వాణిశ్రీ, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
నేత్ర న్యూస్, అన్నవరం, (ప్రత్యేక ప్రతినిధి) : మానవుడిగా పుట్టిన వాడికి కాసంత భక్తి భావం ఉండాలని పెద్దలు అన్న విషయం మరోమారు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో కనిపించిందనే చెప్పాలి. అక్కడ కాసంత కాదు.. కొండంత భక్తి ఉందని ఓ భుక్తుడు నిరూపించాడు. ఆ భక్తి పరవశంలో తనతో పాటుగా చుట్టు పక్కల ఉన్నవారు సైతం మునిగి పోవాలని నిబంధన పెట్టడమే అక్కడ అసలు కథ మొదలైంది. తాను భక్తుడే కాకుండా ఆ ఆలయ కార్యనిర్వాహణాధికారి కావడం కొస మెరుపు. తాను చెప్పింది శిరసా వహించకపోతే శిక్షలు తప్పవని హెచ్చరికలు సైతం జారీ చేయడంతో చేసేదేమి లేక సిబ్బంది అందరూ శిరస్సు వంచి మాలధారణ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయ కార్యనిర్వాహణాధికారిగా ఉన్న చంద్రశేఖర్ ఆజాద్ గతంలో శ్రీశైలం శ్రీమల్లిఖార్జున స్వామి ఆలయం, విజయవాడ శ్రీకనక దుర్గమ్మ ఆలయంలో వ్యవరించిన తీరు మరోమారు అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో కనిపించడంపై పలువురు సిబ్బంది మండి పడుతున్నారు. ఏ ఆలయంలో విధులు నిర్వహిస్తే ఆ స్వామివారి మాలధారణ చేయడం ఆయనకు అలవాటుగా అనుకుంటే..
ఆ ఆలయంలో విధులు నిర్వహిస్తున్న మొత్తం సిబ్బందిని బలవంతంగా మాలధారణ చేయాలని ఆదేశించడం మూర్ఖత్వంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆలయంలో పని చేస్తున్న మొత్తం సిబ్బంది గతంలో శ్రీశైలంలో సిబ్బంది శివమాల, విజయవాడలో సిబ్బంది దుర్గమ్మ మాల వేసినట్టు ఇక్కడ సిబ్బంది సత్యదేవుని మాల వేయాలని ఆదేశించారు. తాను సైతం మంగళవారం ఉదయం వేద పండితుల సమక్ష్యంలో మాలధారణ చేయడంతో పాటుగా ఆలయంలో సుమారు 80శాతం సిబ్బందికి మాలధారణ చేయించారు. మరో 20శాతం సిబ్బంది ఇంట్లో ఉన్న చిన్నపాటి రుతుక్రమ సమస్యలు తీరిన తరువాత తీరిగ్గా.. అది కూడా మరో రెండు రోజుల్లో మాలధారణ చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో సిబ్బంది ముక్కుతూ మూలుగుతూ స్వామివారి మాలధారణ భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుని చీటీ తీసుకురావాలని, తన కుటుంబంలో ఎవరికైనా సమస్యలు ఉంటే సమస్యను వివరిస్తూ సంబంధిత పత్రాలను చూపించాలని షరతులు సైతం పెట్టారని పలువురు ఆగ్రహంతో మండి పడుతున్నారు. ఇటువంటి సమస్యలపై ఇప్పటికే అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లామని, దీనిపై అంతర్గత విచారణ చేపట్టి ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూస్తున్నామని పలువురు సిబ్బంది వెల్లడిస్తున్నారు.
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : నగర వ్యాప్తంగా ఉన్న స్పా సెంటర్‌లపై పోలీసు బృందాలు ఏక కాలంలో దాడులు నిర్వహిస్తున్నాయి. ఆదివారం రాత్రి 7గంటల సమయంలో ప్రారంభించిన దాడులు ఉరుకులు పరుగుల నడుమ జరుగుతునే ఉన్నాయి. నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఏజీడీ డాక్టర్ ఎ.రవి శంకర్ నాటి నుండే తనదైన శైలిలో విధులు నిర్వహించడం ప్రారంభించారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగానే చెప్పాలి. తాను బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే తన విభాగంలో ప్రత్యేక నిఘా కట్టుదిట్టం చేసి ఇప్పటికే పలువురు సిబ్బందిని సస్పెండ్ చేసిన విషయం మరిచిపోక ముందే రెండు రోజుల క్రితం నగరంలో పలువురు ఇన్‌స్పెక్టర్‌లను బదిలీ చేసిన తీరుతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ క్రమంలో తన సిబ్బందితో పాటుగా నగరంలో జరుగుతున్న కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన ఆయన ముందస్తు వ్యూహంతో సిద్ధం చేసుకున్న టాస్క్‌ని సిబ్బందికి ఇచ్చారు. నగరంలో చట్ట విరుద్ధ, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న కేంద్రాలను గుర్తించి దాడులకు ముహుర్తం ఖరారు చేశారు. ఈ క్రమంలో నగర వ్యాప్తంగా గల బ్యూటీ స్పాలు, మసాజ్ సెంటర్‌లపై ఏక కాలంలో దాడులు నిర్వహించడానికి పదుల సంఖ్యలో బృందాలను సిద్ధం చేశారని విశ్వసనీయ సమాచారం. స్పెషల్ బ్రాంచ్, టాస్క్‌ఫోర్స్, ఇంటెలిజెన్సీ విభాగ సిబ్బందితో పాటుగా స్థానిక స్టేషన్ స్థాయి నేర విభాగ, శాంతిభద్రతల సిబ్బందిని సైతం కలుపుతూ దాడులు చేస్తున్నారు. ఇప్పటికే పలు సెంటర్‌లపై దాడులు నిర్వహించిన సిబ్బంది కీలక ఆధారాలు సైతం స్వీకరించడంతో పాటుగా పలువురు వ్యభిచార ముఠాలను, విటులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు బాగోట..
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : ప్రభుత్వం నుంచి పేదలకు అందిస్తున్న కోటా బియ్యం రూ.కోట్ల వ్యాపారాన్ని దాటేస్తుందని అనడంలో అతిశయోక్తి లేదు. పేదలకు అందకుండానే ఆమడ దూరంలో దళారుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. బియ్యం పంపిణీ విషయమై డీలర్ వద్ద అక్రమాలు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంటి వద్దనే ఇచ్చే విధంగా మొబైల్ పంపిణీ యూనిట్ (ఎండీయూ) వాహనాలను ప్రారంభిస్తే.. మొబైల్ పంపిణీ యూనిట్ సిబ్బంది డీలర్‌ల స్థాయిని సైతం మించిపోతున్నారని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వినిపిస్తుంది. ఈ క్రమంలో ప్రతీ నెల పేద ప్రజలకు బియ్యం ఇవ్వల్సింది పోయి వారికి బియ్యానికి బదులు కేజీకి రూ.10 చొప్పున సొమ్ము ఇస్తున్నారు. కొందరు మాత్రం బియ్యం కావాలని పట్టు పట్టి కూర్చుంటే రేపు రావాలి.. మరుసటి రోజు రావాలి.. అనే నెపంతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఇప్పటికే పలువురు ప్రజలు మండి పడుతున్నారు. ఉచితంగా ఇచ్చే బియ్యం వద్ద రూ.10 వస్తుందని ప్రజలు తీసుకుంటున్నారు కానీ తద్వార ప్రభుత్వానికి ఎంత మొత్తంలో గండి కొడుతున్నామని ఏ ఒక్కరూ ఆలోచించకపోవడం శోచనీయం. నాడు డీలర్‌ల నుంచి వందల టన్నుల్లో బియ్యం పక్కదారి పడితే నేడు వేల టన్నుల్లో మాయమైపోతున్నాయి. దీనికి తోడు ప్రతీ అంశంలో ప్రభుత్వ అధికారుల మాదిరి లంచం తినడంలో మొదటి వరసలో ఈ ఎండీయూల సిబ్బంది ఉన్నారు.
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : విశాఖ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా చూడాలని జీవీఎంసీ ఉన్నతాధికారులు చేస్తున్న ప్రయత్నం పక్కదారి పడుతుంది. 120మైక్రాన్ కంటే తక్కువగా మైక్రాన్‌లు ఉన్న ప్లాస్టిక్ సంచులతో పాటుగా ఒక్కసారి ఉపయోంగించే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని సైతం పూర్తి స్థాయిలో అరికట్టాలని ప్రారంభించిన ప్రయత్నాలు పలు విమర్శలకు దారి తీస్తుంది. గత నెల ప్రారంభంలో సుమారు రూ.2కోట్లు వరకు ఖర్చు చేసి పది ఇసుజు డీ-మ్యాక్స్ జీవీఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ వాహనాలను ప్రారంభించిన ఉన్నతాధికారులు ముందుగా పలు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇప్పుడు నగరంలో పరువు తీసుకుంటున్నారు. దీనికి తోడు నెలవారీ ఒక్కొక్క వాహనానికి 140లీటర్లు డీజిల్ చొప్పున పది వాహనాలకు 1400 లీటర్లు డీజీల్‌కు గాను రూ.1,37,620లను, గౌరవ వేతనం చొప్పున ఒక్కొక్క వాలంటీర్‌కి రూ.10వేలు చొప్పున 36మందికి రూ.3.60లక్షలను ఖర్చు చేయడం అయోమయానికి గురి చేస్తుంది. వార్డు వాలంటీర్‌కి ఇచ్చిన రూ.5వేలు గౌరవ వేతనంతో పాటుగా అదనంగా రూ.10వేలు చొప్పున చెల్లించినా సంబంధిత వాలంటీర్‌లు వార్డుల్లో చేతివాటం చూపించడంతో పలువురు వ్యాపారుల నుంచి వ్యతిరేకత వినిపిస్తుంది.
దుకాణాల వద్దకు తనిఖీకి వెళ్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ బృంద సభ్యులు ఇష్టానుసారంగా మాట్లాడటంతో పాటుగా అక్రమ మార్గంలో వసూళ్లకు పాల్పడతున్నట్టు పలువురు దుకాణదారులు వెల్లడిస్తున్నారు. అసలు ఈ బృందాలు నగరంలో గల మార్కెట్‌లు, దుకాణాలు, షాపింగ్ మాల్స్, చిరు వ్యాపారాలు, తోపుడు బండ్ల వద్ద ఉపయోగించే ప్లాస్టిక్ సంచులను ఉపయోగించకుండా చూడటం, వాళ్లకు అవగాహన పరచడం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరిమానాలు విధించడం వంటివి చేయాలి. కానీ ఈ బృందాలు చిరు వ్యాపారులకు ఇష్టానుసారంగా జరిమానాలు విధించడంతో పాటుగా ఆమ్యామ్యాలపై మక్కువ చూపిస్తూ పక్కదారి పట్టడంతో నగర ప్రజల నుంచి జీవీఎంసీ అధికారులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : పేద ప్రజలకు అందించాల్సిన పీడీఎస్ రైస్ పక్కదారి పట్టడానికి ప్రభుత్వ అధికారులే కీలకంగా వ్యవరిస్తున్నారని ఒకటి రెండు ఘటనలు పరిశీలిస్తే ఇట్టే అర్థం అయిపోతుంది. నెల చివరిలో వచ్చే జీతాలు కంటే నెలవారీ వస్తున్న మామ్మూళ్లు మత్తులో అధికారులు విధులు నిర్వహించడంతో పేదల బియ్యం పక్కదారి పడుతుంది. పీడీఎస్ రైస్‌ని అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు అందినకాడికి దోచుకోని వదిలేయడంతో ఓ ఫిర్యాదు దారుడు జిల్లా అధికారికి సైతం ఫిర్యాదు అందించడానికి సిద్ధమయ్యాడంటే దిగువ స్థాయిలో సిబ్బంది చేస్తున్న చేష్టలు హద్దులు మీరుతున్నాయనే చెప్పాలి. గురువారం రాత్రి సుమారు10.50గంటల సమయంలో అరిశెట్టి మహేశ్వరరావు అనే వ్యాపారి అల్లిపురం బజారు ప్రాంతంలో 750కేజీల పీడీఎస్ రైస్‌ని ఆటోలో అక్రమంగా తరలిస్తున్న సమాచారం అందుకున్న ఓ సర్కిల్-1 ఆర్‌ఐ రూ.20వేలు లంచం తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే క్రమంలో సర్కిల్-3 పరిధిలో విధులు నిర్వహిస్తున్న మరో ఆర్‌ఐ ఓ పీడీఎస్ రైస్ వ్యాపారిపై దాడులు నిర్వహించి రూ.15వేలు, ఓ మిల్లు యజమాని నుంచి ఇంకొక ఆర్‌ఐ రూ.15వేలు తీసుకోవడం అధికారుల పనితీరు కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనే చెప్పాలి.
నేత్ర న్యూస్, విశాఖపట్నం : లోక కల్యాణం కోసం మూడు లోకములను మూడు మూడడుగులుగా కొలిచి.. రాక్షస గుణం కలిగిన బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన ఘటన నాడు ఆ త్రివిక్రముడు (వామనుడు) చేస్తే.. విశాఖ నగరంలో ప్రజలను చిత్ర హింసలకు గురిచేసి, రూ.లక్షలాది సొమ్మును కాజేస్తూ రాక్షసులుగా ప్రవర్తించిన ముగ్గురు సీఐలను ఈ త్రివిక్రముడు విశాఖ రేంజ్‌కి బదిలీ చేయడంతో పోలీసు వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. గతంలో డీసీపీగా విధులు నిర్వహించిన డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మ నగరంలో అన్ని అంశాలను తనదైన శైలిలో తెలుసుకొని పోలీసు కమిషనర్‌గా అడుగు పెట్టిన నాటి నుంచే తన పని ప్రారంభించారని స్పష్టంగా కనిపిస్తుంది. ముగ్గురు సీఐలను రేంజ్‌కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చెయ్యడమే కాకుండా వాళ్ల స్థానాలను వెంటనే వదిలిపెట్టి రేంజ్ డీఐజీ వద్ద హాజరయ్యే విధంగా చూడాలని సంబంధిత సబ్ డివిజన్ స్థాయి ఏసీపీలకు ఆదేశాలు జారీ చెయ్యడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పాలి. గత పోలీసు కమిషనర్ హయాంలో నగరంలోకి చొరబడి ఆర్థిక లావాదేవీల్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ముగ్గురు సీఐలను ముప్పై రోజుల్లో గుర్తించి విధుల నుంచి తప్పించడం పలువురు నుంచి హర్షం వ్యక్తమవుతుంది.
నేత్ర న్యూస్, విశాఖపట్నం : బయట ప్రపంచానికి కనిపించకుండా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ యంత్రాంగాల్లో ఒకటైన లీగల్ మెట్రాలజీ శాఖ (తూనికలు కొలతలు) విభాగం చేస్తున్న చేష్టలకు చిరు వ్యాపారులు బోరుమంటున్నారు. ఏడాదికి ఓమారు తనిఖీల పేరిట చిరు దుకాణాలు, తోపుడు బండ్లు వద్దకు వచ్చిన లీగల్ మెట్రాలజీ అధికార సిబ్బంది చేసే హడావుడితో వ్యాపారులు హడలెత్తిపోతున్నారనే చెప్పాలి. జీవోలో ముద్రించిన విధంగానే జరిమానాలు వసూళ్లు చేస్తున్నామని చెప్పిన అధికారులు ఇచ్చిన రశీదు కంటే అదనంగా వసూళ్లు చేస్తున్న సొమ్మును ఏ లెక్కల్లో చూపిస్తారో వాళ్లకే తెలియాలి. పెద్ద పెద్ద మార్కెట్‌లు, షాపింగ్ మాల్స్, పెద్ద డిపార్టుమెంటెల్ స్టోర్స్ నుంచి ఏడాది ఓమారు అప్పనంగా వచ్చే మామ్మూళ్లు మత్తులో అటుగా తనిఖీలు చేయని లీగల్ మెట్రాలజీ విభాగ సిబ్బంది రహదారులపై కాయగూరలు, పండ్లు అమ్ముకునే చిరు వ్యాపారులపై ఒక్కసారిగా పడి అందినకాడికి దోచుకుంటున్నారని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయం నుంచి ఏడాదికి ఓమారు దుకాణాల వద్దకు వచ్చి కాటాలకు వేసిన ముద్రణలతో కూడుకున్న సీల్స్‌ను మార్చాల్సిన సిబ్బంది అటుగా కనిపించకపోవడంతో ప్రైవేటు వ్యక్తులు రాజ్యమేలుతున్నారని ఆరోపిస్తున్నారు. కేజీలకు అనువుగా ఒక్కొక్క కాటాకు ఓ మొత్తంలో తీసుకోవల్సిన ప్రైవేటు వ్యక్తులు సైతం అదనంగా రూ.2వేల నుంచి రూ.3వేలు డిమాండ్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారని వెల్లడిస్తున్నారు. దీనిపై సంబంధిత ప్రైవేటు వ్యక్తులను వివరణ కోరగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానాతో పాటుగా ప్రభుత్వ అధికారులకు చెల్లిస్తున్న చిల్లర సొమ్ము కలుపుతూ అదనంగా వసూలు చేస్తున్నామని వెల్లడిస్తున్నారు. భారీ మొత్తంలో సొమ్మును చెల్లించలేమని బాధితులు బోరుమంటే సంబంధిత సిబ్బందిని దుకాణాల మీదకు ఎక్కించే ఘనమైన ఘనత కూడా వాళ్ల సొంతం. ఏడాదికి ఓసారి వచ్చి అడిగిన సొమ్మును చెల్లించకపోతే జరిమానా విధించి కాటాలను తీసుకెళ్లిపోతామని పలుమార్లు ప్రైవేటు వ్యక్తులే బెధిరింపులకు పాల్పడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
నేత్ర న్యూస్, విశాఖపట్నం : జీవీఎంసీకి రూ.కోట్ల ఆదాయాన్ని అందించే ప్రధాన ఆస్తుల్లో పూర్ణా మార్కెట్ (సర్ధార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్) ఒక్కటిగా నిలవడం అందరికీ తెలిసిన విషయమే.. అటువంటి మార్కెట్‌ను రూ.లక్షలకే అప్పనంగా అంటగట్టడానికి చేసిన ప్రయత్నాలు ఫలించాయని అందరూ అనుకుంటున్నారు. ఏడాదికి ఓ బినామీని వేలం పాటలో నిలబెట్టిన ఓ రింగ్ మాస్టార్ ఒకవైపు.. గత కొన్నేళ్లుగా డమ్మీ డీడీలను చెల్లించి పాటలో హడావుడి చేసి ఒక్క రోజులో రూ.లక్షల లాభంతో పక్కదారి పట్టించే డమ్మీ గుత్తేదారుడు మరోవైపు.. ఆడిన రింగులాటకు జీవీఎంసీ అధికారుల సైతం కంగు తిన్నారంటే ఆశ్చర్య పడనవసరం లేదు. ప్రతీ ఏడాది జీఎస్‌టీతో కలుపుతూ రూ.కోటికి పైగా ఆదాయాన్ని అందించే పూర్ణామార్కెట్ ఈ ఏడాది జీఎస్‌టీతో కలిపినా గత పదేళ్లలో సర్కారు వారి పాట మొత్తానికి సైతం సరి తూగడానికి వీలు లేని విధంగా రూ.74.44లక్షలకు రింగు అయిపోయి జీవీఎంసీ ఆదాయాన్ని పక్కదారి పట్టించారని స్పష్టంగా కనిపిస్తుంది. పూర్ణామార్కెట్ ఆశీలకు సంబంధించి బహిరంగ వేలం పాటను నిర్వహిస్తున్నామని ప్రకటించగానే ఓ డమ్మీ గుత్తేదారుడు బ్యాంక్‌కు నేరుగా వెళ్లి డీడీలు చెల్లించి పాటలో కూర్చొని ఎదుట గుత్తేదారుడితో ముందుగా రింగు అయిపోయి రూ.లక్షలతో ఉన్న బ్యాగ్‌ను తీసుకొని వెళ్లిపోయే తీరు ఒకటైతే.. ప్రతీ ఏడాది ఓ కొత్త వ్యక్తిని రంగంలోకి దింపి పాటను కైవసం చేసుకున్న గుత్తేదారుడి తీరు మరొకటి. ఈ క్రమంలో గత ఏడాది 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.45లక్షలు చెల్లించి బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వలేదని రెండు నెలల పది రోజులకే శుభం కార్డుతో పక్కకు వచ్చేసిన బృందం ఈ ఏడాది ఎందుకు పాటకు రాలేదని ఆలోచిస్తే.. గత ఏడాది నష్టపోయిన సొమ్ము ఈ గుత్తేదారుడి వద్ద వసూలు చేసుకొని లాభం పొందడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని అక్కడ ఎంతగా రింగులు తిప్పారో చెప్పడానికి మాటలు సరిపోవడం లేదంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. రూ.60లక్షలకు సర్కార్ వారి పాటను ప్రారంభిస్తే రూ.పది వేల చొప్పున పెంచుతూ రూ.62.40లకు వచ్చిన గుత్తేదారులు జీవీఎంసీ అధికారులు అంగీకరించక పోవడంతో పాటను రూ.5వేల చొప్పున పెంచుతూ రూ.62.50లకు చేర్చారు. అక్కడ నుంచి కొత్త నాటకానికి ఆరంభం పలికి రూ.వెయ్యి చొప్పున పెంచుతూ రూ.62.55లపై రూ.1వెయ్యి అదనంగా వేసి రూ.62.56కి పాటను కైవసం చేసుకోవడం ఆస్కార్ నటనకు అద్దం పట్టినట్టు కనిపించింది. రూ.62.55లక్షలను చెల్లించడానికి సిద్ధమైన గుత్తేదారుడు వెయ్యి రూపాయల తేడాతో ఎదుట గుత్తేదారుడికి పాటను వదిలి పెట్టడం వెనుక రింగులాట ఎంత చక్కగా ఆడారో ఇట్టే అర్థం అయిపోతుంది.
నేత్ర న్యూస్, విశాఖపట్నం : ఈ నెల 28, 29 తేదీలలో జరుగనున్న జి-20 సదస్సు కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి విశాఖ నగరానికి విచ్చేస్తున్న ప్రతినిధులను, అతిధులను ఆకట్టుకునేలా విశాఖ నగరాన్ని సుందరీకరణ పనులను మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి, జీవీఎంసీ కమిషనర్ పి.రాజబాబు, డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్, అధికారులు తో కలిసి మేయర్ గొలగాని హరి వెంకట్ కుమారి పర్యటించి పరిశీలించారు. దీనిలో భాగంగా మాధవధారలో ఉన్న పంప్ హౌస్ కు చేరుకొని దీని ద్వారా 24/7 నీటి సరఫరా ఆ ప్రాంత ప్రజలకు నిరాటంకంగా అందించడం జరుగుతుందని, నీటి సరఫరాలో ఎక్కడ అంతరాయాలు లేకుండా వున్నాయని, ఎలక్ట్రికల్ సిస్టం ద్వారా లైన్ లోకి వెళ్లకుండానే తాగునీరు ఆపే విధానం తోపాటు ఎక్కడైనా లేఖలు ఉన్నట్లయితే త్రాగునీటి వృధా అవకుండా సిస్టం ద్వారా తెలుసుకొని అరికట్టవచ్చని ఈ పంప్ హౌస్ ఎ.డి.బి. నిధులతో ఏర్పాటు చేయడమైనదని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వారికి వివరించి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ కు తెలిపారు. అనంతరం మూఢసరలోవ రిజర్వేయర్ లో ఉన్న సోలార్ ప్రాజెక్ట్ లను ఏర్పాటు చేసి, విద్యుత్ ను ఆదా చేయడమే కాకుండా, కాలుష్యాన్ని నివారిస్తూ, ఆర్ధిక లాభం జివిఎంసి పొందుతుందన్నారు. 24 గంటలు ప్రజలకు మంచి నీటి సరఫారాను అందించడం జరుగుతుందన్నారు. వేస్ట్ వాటర్ ను రీసైక్లింగ్ చేయడం ద్వారా వచ్చిన మంచి నీటిని నగరంలో గల పరిశ్రమలకు సరఫరా చేయడం ద్వారా జివిఎంసి కు ఆదాయం చేకూరుతుంది అని మంత్రి ఆదిమలకు సురేష్ కు అధికారులు వివరించారు. జి.20 సంబంధించి అభివృద్ధి పనులను, సుందరీకరణ పనులను ఆయన పరిశీలించి త్వరితగతిన పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. విశాఖ నగరాన్ని టాప్ -10 సిటీలలో ఒక సిటీగా ఉండేటట్లు తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పమని, ఆయన ఆదేశాల మేరకు విశాఖ నగరాన్ని మరింత సుందర నగరంగా అభివృద్ధి చేయడంతో పాటు పరిపాలన రాజధానిగా తీర్చిదిద్దాలనే స్థాయికి విశాఖ నగరం ముస్తాబ్ అవుతుందని తెలిపారు.
అనంతరం సీత కొండ బీచ్ వద్ద వ్యూ పాయింట్ ను పరిశీలించారు ఈ వ్యూ పాయింట్ను డాక్టర్ వైఎస్ఆర్ వ్యూ పాయింట్గా (సీతకొండ) దగ్గర అనే నామకరణం చేసేందుకు ప్రతిపాదనలను మంత్రి ఆదిమలకు సురేష్, గుడివాడ అమర్నాథ్ కు తెలియజేశారు. ఈ సదస్సు నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కార్పొరేటర్లు రొయ్యి వెంకటరమణ, కె స్వాతి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.