నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : వరాహ నృశింహునిగా.. శ్రీమహావిష్ణువు స్వయంభువుగా.. ద్వయ రూపాలతో వెలసిన పవిత్ర దివ్యధామం సింహాచలంలో అయోమయం సంతరించుకుంది. ఆలయ అధికారుల పర్యావేక్షణ లోపం, పనిలో సిబ్బంది అలసత్వం ప్రదర్శించడంతో అప్పన్న దర్శనానికి తండోపతండాలుగా వచ్చే భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాల్సిన ఆలయ అధికారులు అటుగా ఆలోచనలు చేయకపోవడంతో మధ్యాహ్న సమయంలో భక్తజనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రూ.లక్షల్లో జీతభత్యాలు తీసుకునే ఉద్యోగులు శీతల గదులకు పరిమితమైపోవడంతో తాత్కలిక పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న చిరు ఉద్యోగులు, ప్రైవేటు సెక్యూరిటీ సంస్థల సిబ్బందికి ఇష్టారాజ్యమైపోయింది. రాజమార్గంగా ఉపయోగించే గాలిగోపురం వద్ద అన్ని బాధ్యతలను సెక్యూరిటీ సిబ్బంది చేతుల్లో వదిలిపెట్టడం, పీఆర్‌వో కార్యాలయంలో ఎక్కువగా సెక్యూరిటీ సిబ్బందిని ఉపయోగించడం, ఆ సిబ్బందితో పాటుగా సంబంధిత ప్రైవేటు సంస్థకు మంచి ఆదాయాన్ని అందుతుందనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. స్వామి దర్శనానికి సెక్యూరిటీ సంస్థ ప్రతినిథులు, వాళ్ళ బంధువులు, సెక్యూరిటీ సిబ్బంది బంధువులు వస్తే వీవీఐపీ దర్శన భాగ్యాన్ని కలిగించడంలో మంచి నైపుణ్యం సంపాధించారు. ఈ అంశాలు కొందరు ఆలయ అధికారులకు తెలిసినా వాళ్ళ బంధువులకు అదే పద్ధతిలో దర్శనాలు చేయించడానికి ఉపయోగపడతారని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో స్వామివారి ఆలయ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. ఏది ఏమైన అధిక సంఖ్యలో సిబ్బంది కలిగిన సింహాచలంలో ప్రైవేటు సిబ్బంది పెత్తనం ముందు ముందు చాలా ప్రమాదకరం.

- పీఆర్‌వో కార్యాలయాన్ని ముడుపులు కోసం పట్టి పీడిస్తున్నారు..
ఆలయ పీఆర్‌వో కార్యాలయంలో సిబ్బంది చక్కగా స్థిర పడ్డారనడంలో ఆశ్చర్య పడనవసరం లేదు. మూడు నుంచి ఐదు నెలలకు ఒకసారి అన్ని విభాగాల్లో సిబ్బందిని మార్పులు చేర్పులు చేసే అధికారులును సైతం తమ చేతుల్లో పెట్టుకొని పీఆర్‌వో కార్యాలయంలో కొందరు సిబ్బంది ఏళ్ల తరబడి పాతుకుపోయారు. ప్రైవేటు సంస్థ నుంచి సెక్యూరిటీలుగా తీసుకున్న సిబ్బందిని పీఆర్‌వో కార్యాలయంలో సహాయకులుగా ఉపయోగించడంలో పెద్ద కుట్ర జరుగుతుందని, దర్శనాలు చేయించే సమయంలో భారీగా ముడుపులు అందుకుంటున్నట్టు పలు ఆధారాలు సైతం బహిరంగంగానే కనిపిస్తున్నాయి. ఆలయానికి మొదటిసారి వచ్చే భక్తులు రెండోసారి పీఆర్‌వో కార్యాలయానికి వెళ్లకుండానే వ్యక్తిగత నెంబర్లను ఇచ్చి క్యాష్ చేసుకుంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం అక్కడ స్థిర పడిపోయిన సిబ్బంది మార్పుతోనే సాధ్యపడుతుందని పలువురు భక్తులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- కేశఖండనశాలలో రద్దీ తీవ్రమవుతుంది..
అప్పన్న స్వామి ఆలయంలో భక్తులు తలనీలాలు చెల్లించడంలో ఎదుర్కొనే ఇబ్బందులు అక్కడ సిబ్బంది కొరత కారణమని స్పష్టంగా కనిపిస్తుంది. ఆలయంలో తాత్కాలిక నాయిబ్రాహ్మణ సిబ్బందిని పెంచడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 69మంది సిబ్బందితో కొనసాగుతున్న కేశఖండనశాలలో 5గురు మాత్రమే పూర్తిస్థాయి ఆలయ ఉద్యోగులు కావడం, మనిషికి 60టికెట్లు చొప్పున ఐదుగురికి రోజుకి 300 టికెట్లకు గాను రూ.12వేలుని ఆలయానికి ఇచ్చి మిగిలిన మొత్తం అక్కడి నాయిబ్రాహ్మణులు సమాన వాటాలతో సొమ్ము పంచుకోవడం ఇక్కడి ఆనవాయితీ. శని, ఆదివారం వంటి వారాంతాలతో పాటుగా సెలవు దినాల్లో భక్తులు అధికంగా వచ్చే సమయంలో రద్దీ తీవ్రంగా ఉండగా అధిక మొత్తం సంపాధించాలనే ఉద్ధేశంతో పొరుగు సిబ్బంది రాకుండా ఇక్కడ కీలక వ్యక్తులు పావులు కదుపుతున్నారని సమాచారం.

- గాలిగోపురం వద్ద సిబ్బంది చేతివాటం చూపిస్తున్నారు..
స్వామి ఆలయానికి వచ్చే భక్తులు స్వామి హుండీల్లో చెల్లించిన ముడుపులుకంటే ఆలయ సిబ్బందికే ఎక్కువ కానుకలు చెల్లిస్తున్నారు. గాలిగోపుం గుండా స్వామిని దర్శించుకోవడానికి ఓ ప్రత్యేక ధర చెల్లించిన భక్తులతో పాటుగా ప్రోటోకాల్ భక్తులను పంపించాలని నిబంధనలు ఉన్నా.. కాసుల కక్కుర్తిలో గాలిగోపురం గుండా పైరవీలు చేసే వ్యక్తులకు, కానుకలు ఇచ్చే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఆలయ గాలిగోపురం వద్ద పూర్తిస్థాయి ఉద్యోగిని నియమించకుండా ప్రైవేటు సెక్యూరిటీలకు పెత్తనం ఇవ్వడంతో వాళ్ళు ఆడింది ఆట.. పాడింది పాట.. అన్నట్టుగా తయారైయింది. దీనికి తోడు తాత్కాలిక సిబ్బంది టికెట్లు తియ్యకుండా సగం తీసుకొని దొంగ మార్గంలో భక్తులను దర్శనాలకు పంపిస్తున్నట్టు ఇప్పటికే పలువురు భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికైనా ఆలయ ఉన్నతాధికారి స్పందిస్తారో..? లేదో..? వేచి చూడాలి.

చందనోత్సవంలో ఏర్పాట్లు..?
స్వామివారి ఆలయంలో తీవ్ర రద్దీని తలపించే చందనోత్సవ కార్యాక్రమంలో ఆలయ అధికారుల పనితీరు రెండేళ్లు క్రితం జరిగిన ఇబ్బందికర పరిస్థితులను గుర్తు చేస్తున్నట్టే ఉంది. ఇంచార్జి స్థాయిలో ఎటువంటి వ్యవహారంలో తల దూర్చకూడదని మడికట్టుకొని కూర్చున్న ఉన్నతాధికారి తీరుకి ఉత్సవ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతాయో అని పలువురు సిబ్బంది అయో మయానికి గురవుతున్నట్టు అనుమనాలు వ్యక్త పరుస్తున్నారు.
- స్వామివారిని కనులారా చూద్దాం రండీ..
వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) రోజు ఏప్రిల్ 30న జరిగే చందనోత్సవంలో భక్తుల సౌకర్యార్థం జిల్లా కలెక్టర్ ఇప్పటికే పలు శాఖలతో సమన్వయం చేస్తున్నారు. భారీ భక్తుల రద్దీని నియంత్రించడానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుతో పాటుగా రవాణా, భద్రత, తాగునీరు, దర్శనం, వసతి, వైద్యం, ప్రసాదం వంటి వసతులు కల్పిస్తున్నారు. ఆ రోజున రూ.300, రూ.1000, రూ.1500 ధరల్లో టికెట్లను అందుబాటులో ఉంచారు. ఈ టికెట్లు ఆఫ్‌లైన్‌తో పాటుగా www.aptemples.ap.gov.in లో
విక్రయిస్తున్నారు.