NETRA NEWS > Crime > పక్కదారి పట్టిన ప్లాస్టిక్ రహిత బృందాలు
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : విశాఖ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా చూడాలని జీవీఎంసీ ఉన్నతాధికారులు చేస్తున్న ప్రయత్నం పక్కదారి పడుతుంది. 120మైక్రాన్ కంటే తక్కువగా మైక్రాన్‌లు ఉన్న ప్లాస్టిక్ సంచులతో పాటుగా ఒక్కసారి ఉపయోంగించే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని సైతం పూర్తి స్థాయిలో అరికట్టాలని ప్రారంభించిన ప్రయత్నాలు పలు విమర్శలకు దారి తీస్తుంది. గత నెల ప్రారంభంలో సుమారు రూ.2కోట్లు వరకు ఖర్చు చేసి పది ఇసుజు డీ-మ్యాక్స్ జీవీఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ వాహనాలను ప్రారంభించిన ఉన్నతాధికారులు ముందుగా పలు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇప్పుడు నగరంలో పరువు తీసుకుంటున్నారు. దీనికి తోడు నెలవారీ ఒక్కొక్క వాహనానికి 140లీటర్లు డీజిల్ చొప్పున పది వాహనాలకు 1400 లీటర్లు డీజీల్‌కు గాను రూ.1,37,620లను, గౌరవ వేతనం చొప్పున ఒక్కొక్క వాలంటీర్‌కి రూ.10వేలు చొప్పున 36మందికి రూ.3.60లక్షలను ఖర్చు చేయడం అయోమయానికి గురి చేస్తుంది. వార్డు వాలంటీర్‌కి ఇచ్చిన రూ.5వేలు గౌరవ వేతనంతో పాటుగా అదనంగా రూ.10వేలు చొప్పున చెల్లించినా సంబంధిత వాలంటీర్‌లు వార్డుల్లో చేతివాటం చూపించడంతో పలువురు వ్యాపారుల నుంచి వ్యతిరేకత వినిపిస్తుంది.
దుకాణాల వద్దకు తనిఖీకి వెళ్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ బృంద సభ్యులు ఇష్టానుసారంగా మాట్లాడటంతో పాటుగా అక్రమ మార్గంలో వసూళ్లకు పాల్పడతున్నట్టు పలువురు దుకాణదారులు వెల్లడిస్తున్నారు. అసలు ఈ బృందాలు నగరంలో గల మార్కెట్‌లు, దుకాణాలు, షాపింగ్ మాల్స్, చిరు వ్యాపారాలు, తోపుడు బండ్ల వద్ద ఉపయోగించే ప్లాస్టిక్ సంచులను ఉపయోగించకుండా చూడటం, వాళ్లకు అవగాహన పరచడం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరిమానాలు విధించడం వంటివి చేయాలి. కానీ ఈ బృందాలు చిరు వ్యాపారులకు ఇష్టానుసారంగా జరిమానాలు విధించడంతో పాటుగా ఆమ్యామ్యాలపై మక్కువ చూపిస్తూ పక్కదారి పట్టడంతో నగర ప్రజల నుంచి జీవీఎంసీ అధికారులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- వార్డు వాలంటీర్లకు దాడులు చేసే అధికారమా..?
నెలకు రూ.5వేలు గౌరవ వేతనంతో వార్డు ప్రజలకు సేవలంధించే వార్డు వాలంటీర్లకు దాడులు చేసే అధికారం ఇవ్వడం వ్యాపారుల నుంచి విమర్శల గుప్పుమంటున్నాయి. వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహించడంతో పాటుగా ప్లాస్టిక్ రహిత అమలు బృందాల్లో సభ్యులుగా స్థానం కల్పించడంతో వాలంటీర్‌లు పెచ్చురేగిపోతున్నారు. గన్‌మాన్‌ల మాదిరి సఫారీ దుస్తులు ధరించి దాడులు చేయడానికి వెళ్లే క్రమంలో వాళ్లు ఆడిరదే ఆట.. పాడిరదే పాట..గా తయారైయిందని పలువురు వ్యాపారులు ఇప్పటికే జీవీఎంసీ కమిషనర్‌కి స్పందనలో ఫిర్యాదులు సైతం ఇచ్చారు. రూ.15వేలు గౌరవ వేతనంతో పాటుగా చిన్న చిన్న దుకాణాలు, తోపుడు బండ్ల వద్ద చిరు వ్యాపారులను బెధిరింపులకు గురిచేస్తూ దండీగా దోచుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ వాలంటీర్ గురువారం ఉదయం విధులకు హాజరవ్వడానికి తన ఇంటి నుంచి వెళ్లే క్రమంలో పాతనగరంలో ఓ దుకాణంలోకి చొరబడి తాను జీవీఎంసీ టాస్క్‌ఫోర్స్ టీంగా పరిచయం చేసుకున్నాడు. తన బృందంతో వస్తే భారీగా జరిమానా విధిస్తానని, ఒక్కడిగా రావడంతో మీకు అదృష్టం అనుకోవాలని చెప్పారు. వెంటనే ఇవ్వనవసరం లేదని, సాయంత్రం వచ్చి తీసుకుంటానని చెప్పి అక్కడ నుంచి చల్లగా జారుకోవడమే కాకుండా దుకాణ యజమాని ఫోన్ నెంబర్ సైతం తీసుకొని బేర సారాలు ఆడటం మొదలపెట్టారు. దుకాణ యజమాని పనిపై బయట ఊరు వెళ్తానని చెప్పగా ఊరు వెళ్లడం వాయిదా వేసుకోవాలని, సాయత్రం వచ్చి మాట్లాడుతానని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది.
- ప్లాస్టిక్ రహిత అమలు బృందాలు పని ఏంటీ..?
విశాఖ పాస్టిక్ రహిత నగరంగా చూడాలని జీవీఎంసీ ఉన్నతాధికారులు గతనెల ప్రారంభంలో సుమారు రూ.2కోట్లు ఖర్చు చేసి 10వాహనాలను ప్రారంభించారు. ఎనిమిది జోన్‌లకు 8వాహనాలను కేటాయించి రెండు వాహనాలను రిజర్వుగా ఆర్‌ఎఫ్‌వో కార్యాలయం వద్ద ఉంచారు. దీనికి గాను జీవీఎంసీ ప్రాంతీయ అగ్నిమాపకాధికారి కో`ఆర్డీనేటర్‌గా వ్యవరిస్తారు. 36మంది వాలంటీర్‌లను ఈ విభాగంలో ఉపయోగించుకోవడానికి ఒప్పందం కుదుర్చుకొని ఎంపిక చేశారు. అందులో ఒక వాలంటీర్ టీం లీడర్‌గా వ్యవరించి మరో 35మంది సభ్యులు నలుగురు చొప్పున ఎనిమిది వాహనాల్లో తమకు కేటాయించిన జోన్ పరిధిలో తిరుగుతూ ప్లాస్టిక్ కవర్లు, ఒక్కసారి ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులు వలన కలిగే ప్రమాదాలను వివరిస్తూ అవగాహన పరచాలి. అవగాహన కల్పించిన వ్యాపారస్తుడు మరోమారు స్పందించకపోతే అక్కడ లభ్యమయ్యే ప్లాస్టిక్ కవర్ల సామర్థ్యాన్ని బట్టి జరిమానాలు విధించాలి. అదీ కూడా ఆన్‌లైన్ పద్ధతిలో రశీదు పొందుతూ నగదు చెల్లించాలి. ఈ బృందాలకు వాలంటీర్‌గా నెలవారీ వచ్చే రూ.5వేలతో పాటుగా ఈ బృందంలో పనిచేస్తున్నందుకు మరో రూ.10వేలు అదనంగా గౌరవ వేతనం ఇస్తున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడిరచారు. పైగా ఈ బృందాలు రోజువారీ తిరగడానికి ఒక్కొక్క వాహనానికి నెలకు 140 లీటర్లు డీజిల్ చొప్పున పది వాహనాలకు రూ.1,37,620 ఖర్చు చేస్తున్నారు. ఈ బృందాలకు రోజువారీ సూచనలు, సలహాలు, శిక్షణ ఇచ్చి వ్యాపారులతో సక్రమంగా నడుచుకునేందుకు అవసరమైన అంశాలతో పాటుగా పనితీరు, ప్రయాణించే ప్రదేశాలు, విధులు వంటి వాటిని జీవీఎంసీ ప్రాంతీయ అగ్నిమాపక అధికారి చూసుకుంటారు.
- విధులకు దూరంగా విలాశాలకు దగ్గరగా..!
పాస్టిక్ రహిత అమలు బృందాలుగా గుర్తింపు పొందిన బృందాలు విధులు నిర్వహించడంలో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తుంది. నలుగురు చొప్పున ఏసీ కారులో దర్జాగా బీచ్‌లు, పార్కుల్లో చక్కర్లు కొడుతూ కనిపిస్తున్నారు. వీవీఐపీలకు కేటాయించే పోలీసు అధికారులకు ఎక్కడా కూడా తీసుపోయే విధంగా ఈ వేషధారణ ఉండటంతో దుకాణాల్లో ఒక్కసారిగా చొరబడి సినీఫక్కి తరహాలో చొరబడి చిరు వ్యాపారులపై దాడులు నిర్వహిస్తున్నారు. కనీస ఉద్యోగ భద్రత లేని వ్యవస్థకు అన్ని అధికారులు ఇస్తే..? అనే విధంగా ఈ బృందాలు నగర రహదారులపై చెలరేగిపోతున్నాయి.
- అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటాం..!
ఈ బృందాలు నియమించడంలో ప్రధాన ఉద్ధేశం విశాఖ అభివృద్ధి. ప్లాస్టిక్ రహిత నగరంగా ఉండాలని ఇంత ఖర్చు చేసి ఈ తరహాలో పనిచేస్తున్నాం. సిబ్బంది ఇప్పటి వరకు అవినీతికి పాల్పడినట్టు సమాచారం లేదు. విధులు నిర్వహించడంలో సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. తమకు ఫిర్యాదులు ఇస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం. -యాగంటి హనుమంత్‌రావు (ప్రాంతీయ అగ్నిమాపక అధికారి, జీవీఎంసీ).
NETRA NEWS
All posts byNETRA NEWS
You Might Also Like
బియ్యం దొంగలు-2
December 2, 2023
ఉత్సాహంగా రన్ ఫర్ ఫన్
November 15, 2023
నగర వ్యాప్తంగా ‘స్పా’ లపై పోలీసుల దాడులు
November 5, 2023
బియ్యం దొంగలు
November 3, 2023
అధికారుల అండతో చీకటి వ్యాపారం
June 2, 2023
పోలీస్ బాస్ ఆట ఆరంభం
May 13, 2023