నేత్ర న్యూస్, విశాఖపట్నం: బ్రాహ్మశ్రీ నాగులకొండ ఆశ్లేషాచార్య సిద్ధాంతి రచించిన మూడు జ్యోతిష్య గ్రంథాలను శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా ఆవిష్కరించారు. హైందవ ధర్మ ప్రచారంలో భాగముగా వేద విహితమైన జ్యోతిష వాస్తు, ప్రశ్న శాస్త్ర గ్రంధాల ద్వారా ప్రజలు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకుని సుఖమయ జీవనాన్ని సాగించాలని ఆయన అన్నారు. అక్కయ్యపాలెం శంకరమఠంలో పాతగాజువాక జ్యోతిష సరస్వతీ పీఠం నిర్వాహకులు గ్రంధకర్త దైవజ్ఞ రత్న, జ్యోతిష్య విజ్ఞాన భాస్కర్, జ్యోతిష్య వాస్తు విభూషణ్ పండిత నాగులకొండ ఆశ్లేషాచార్య సిద్ధాంతి తెలుగులో అనువదించిన మహాపండిత పద్మప్రభుసూరి ప్రణీత “భువన దీపిక” (13వ శతాబ్దికి చెందిన ప్రముఖ ప్రశ్న గ్రంథము), మహాపండిత మహారాజు శంభుసింహ ప్రణీత “ప్రశ్న జ్ఞాన ప్రదీప” (15వ శతాబ్దికి చెందిన ప్రముఖ ప్రశ్న గ్రంథము), మహాపండిత సుఖదేవ చతుర్వేది ప్రణీత “మూక ప్రశ్న విచార” రచనలను సువర్ణ దివ్య హస్తములతో ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి మాట్లాడుతూ అత్యంత ప్రాచీన జ్యోతిష్య గ్రంథాలను అందరు చదువుకునే విధంగా తెలుగులో అనువాదించడం శుభ పరిణామమన్నారు. నిర్వాహకులు ఆశ్లేష ఆచార్యులు, వెంకట సూర్యచార్యులు, వెంకట యోగాచార్యులు జ్యోతిష్య, వాస్తు విద్యాలయం ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చెయ్యాలని స్వామివారు ఆశీర్వదిస్తూ సూచించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జ్యోతిష్య పండితులు మధురపాల శంకర శర్మ, పాత్రికేయులు పుచ్చా శ్రీనివాసరావు, కొప్పరపు కవుల కళా పీఠం అధినేత మాశర్మ, మోహన్ పబ్లికేషన్స్ అధినేత రామచంద్రరావు అనేకమంది జ్యోతిష్య పండితులు, శాస్త్రాభిలాషులు పాల్గొన్నారు. కార్యక్రమములో నాగులకొండ సూర్యాచారి గౌరవ అతిధులుగా పాల్గొన్నారు.