Please assign a menu to the primary menu location under menu

Weekly Gadgets

Find Us on Socials

Monday, September 9, 2024
CrimeGovernment

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గంజాయి విక్రయాలు

  • విశాఖ ఆంధ్ర విశ్వ విద్యాలయంలో గంజాయి విక్రయాల కలకలం..
  • సెక్యూరిటీ గార్డులే గంజాయి విక్రయిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు..
  • 500గ్రాముల గంజాయితో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌..
  • నలుగురు నిందితులను రిమాండ్‌కి తరలించిన త్రీటౌన్‌ పోలీసులు..
  • మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న నిఘా బృందం..
  • వరుస ఘటనలతో ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ పరువు తీస్తున్న వైనం..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం : ఇంటి దొంగలను ఈశ్వరుడైన పట్టుకోలేడు.. అనే సామెత ఆంధ్ర విశ్వ విద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులకు చక్కగా సరిపోతుంది. చాలా రోజులుగా ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో గంజాయి చలామణి అవుతుందని సంబంధిత ఉన్నతాధికారులకు పలు అనుమానాలు ఉన్నా అటుగా ఏ ఒక్క నిఘా అధికారి పట్టించుకోక పోవడంతో విద్యార్థులు గంజాయికి బానిసలై నిర్మాణుష ప్రాంతాల్లో గంజాయి సేవిస్తున్నారని గుర్తించారు. దీంతో పలు ఆధారాలు సేకరించి సాక్షాత్తు ఏయూ వీసీ నగర పోలీసు కమిషనర్‌, టాస్క్‌ఫోర్స్‌తో పాటుగా త్రీటౌన్‌ పోలీసులకు సమాచారం అందించారని విశ్వసనీయ సమాచారం. దీంతో నగర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నాలుగు రోజులు అటుగా నక్కుతూ నిఘా కట్టుదిట్టం చేయడంతో కంగుతిన్న నిజాలు తేటతెల్లమయ్యాయి. ఏయూలో రోజువారీ విద్యార్థులకు గంజాయి అందుతున్న మార్గాలను, విక్రయించే వ్యక్తులను గుర్తించి శుక్రవారం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడితో కథ సుఖాంతం అయిపోయిందని అనుకుంటున్నారా..? అసలు కథ అక్కడే మొదలైయిందని పోలీసులు గుర్తించారు. విద్యార్థులకు గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తులు బయట నుంచి ఏయూ లోపలికి చొరబడి విక్రయించడం లేదని, విశ్వ విద్యాలయం గేటు వద్ద ఉన్న వ్యక్తులే విక్రయిస్తున్నట్టు గుర్తించారు. అంటే అక్కడే అసలు విషయం స్పష్టంగా అర్థం అయిపోతుంది. గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డులే ఆ విక్రయాలు చేస్తున్నట్టు తెలుసుకొని టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది వల వెయ్యడంతో ఏకంగా ముగ్గురు సెక్యూరిటీ గార్డులు అరకేజీ గంజాయితో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. దీంతో సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించి స్థానిక త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌కి అప్పగించడంతో కేసు నమోదు చేసి పెద్దగదిలి, సింహగిరి కాలానీలో నివసిస్తున్న టెంటు చంద్రమోళి(29), ఎంవీపీకాలానీ, శివాజీపాలెంలో నివసిస్తున్న సిత అప్పలరాజు(42), రాజీవ్‌ నగర్‌లో ఉంటున్న పిల్లా ఉదయ్‌ సురేష్‌(30)ని రిమాండ్‌కి తరలించినట్టు సంబంధిత ఎస్సై తెలిపారు. ఆ సమయంలో పోలీసుల నుంచి పరార్‌ అయిన మరో నిందితుడు పి.సంతోష్‌ని సైతం అదుపులోకి తీసుకున్నామని వివరించారు. దీనిపై విచారణ ప్రారంభించగా గంజాయిని సరఫరా చేస్తున్న మరో ముగ్గురు నిందితులు పి.మోహన్‌ సాయి(23), బి.సతీష్‌(25), జి.గోవింద్‌(30)ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం.

  • ఏయూ సెక్యూరిటీ గార్డులే గంజాయి విక్రయదారులు..!

విశ్వ విద్యాలయంలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా నలుదిక్కుల కాపలా కాయవల్సిన కాపాలదారులే కపట ఆలోచనలకు ఆజ్యం పొయ్యడంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. నేరుగా సెక్యూరిటీ గార్డులే విద్యార్థులకు మత్తు పదర్థాలను విక్రయిస్తూ దొరికిపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత యాజమాన్యాలపై మండిపాటు చూపిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు మద్యం సేవించడం, డ్రగ్స్‌ వినియోగం, ఆసాంఘిక కార్యక్రమాలు వంటి ఘటనలు జరిగి ఏయూ పరువు పోయిన పరిస్థితులు ఉన్నా ఈసారి ఏకంగా రక్షణ కాయవల్సిన సెక్యూరిటీ గార్డులే విద్యార్థులకు గంజాయిని విక్రయించడం విస్మయానికి గురిచేస్తుంది.

  • మాజీ అడిషనల్‌ ఎస్పీ స్థాయి అధికారి నిఘా శూన్యం..

విశ్వ విద్యాలయంలో తన సిబ్బందితో పాటుగా విద్యార్థుల అడుగుజాడలను నిత్యం కనిపెడుతూ ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చూడాల్సిన సెక్యూరిటీ వ్యవహారాల పర్యవేక్షక ఉన్నతాధికారి నిఘా శూన్యంగా కనిపిస్తుంది. ఆయన గతంలో నగరంలో అడిషనల్‌ ఎస్పీ స్థాయిలో విధులు నిర్వహించి పదవీ విరమణ అనంతరం ఏయూలో ఓ ప్రత్యేక స్థానాన్ని తన కోసం సృష్టించి ఉద్యోగంలో చేరారని ఆనోట.. ఈనోట.. గుస గుసలు గట్టిగానే వినిపించాయి. ప్రభుత్వంలో కీలక వ్యక్తి పైరవీలతో లేని పోస్టులను సైతం సృష్టించి భారీ జీతం ఇవ్వడం ప్రారంభించిన విషయం అందరికీ విధితమే.. కానీ అక్కడ అంత మొత్తంలో జీతం తీసుకొని తన వద్ద డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్‌ టెంటు చంద్రమోళి(29) సైతం గంజాయి విక్రయిస్తూ పట్టుబడటంపై ఆయన విధి నిర్వహణ ఇట్టే అర్థం అయిపోతుంది. గతంలో అడిషనల్‌ ఎస్పీ స్థాయిలో విధులు నిర్వహించిన పనితీరు కాసంత కూడా ఇక్కడ చూపించకుండా ఏయూ సెక్యూరిటీ వ్యవహారాల పర్యావేక్షక అధికారి హోదాను, ఓ సఫారీ కారుని, తన రక్షణకు నలుగురు గార్డులతో పాటుగా పలు సేవలను ఏ విధంగా అనుభవిస్తున్నారో సంబంధిత అధికారులే వెల్లడిరచాలి. ఆయన పర్యావేక్షణలో ఉన్న ముగ్గురు నిందితుల్లో ఒకడైన చంద్రమోళి గతంలో రాత్రి గస్తీ నిర్వహించి మహిళా విద్యార్థులపై అసభ్యకరంగా ప్రవర్తించడం, ఇంజనీరింగ్‌ విద్యార్థులు మద్యం సేవిస్తున్నారని గుర్తించి వాళ్లను బెధిరించి డబ్బులు గుంజుకోవడం వంటి విషయాలు తెలిసినా విధుల్లో కొనసాగించడంపై ఉన్నతాధికారుల పర్యావేక్షణ ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

  • విశ్వ విద్యాలయం పరువు ప్రతిష్టలకు భంగం..

విశ్వంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉన్న పరువు ప్రతిష్టలు బుగ్గిపాలు అవుతున్నా సంబంధిత ఉన్నతాధికారులు అటుగా పట్టించుకోకపోవడంపై పలు వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో విద్యార్థులు మద్యం సేవించడం, అసాంఘిక కార్యక్రమాలు, మాదక ద్రవ్యాలు ఉపయోగంచడం వంటి ఘటనలు జరుగుతున్నాయని గుర్తించి చర్యలు తీసుకున్నా తాజా సంఘటన మరోమారు ఉలిక్కి పడే విధంగా చేసిందనే చెప్పాలి. కాపాల కాసే సెక్యూరిటీ గార్డులే గంజాయి వంటి మత్తు పదర్థాలను విక్రయిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటం మరోమారు ఏయూ పరువు పోయిందనే చెప్పాలి. ఏస్‌ఈబీ, టస్క్‌ఫోర్స్‌ బృందాలు జాయింట్‌ ఆఫరేషన్‌ని నిర్విహించి ఈ వ్యవహారాన్ని బయట పెట్టినా మీడియాకు రెండు రోజుల తరువాత తెలియడం ఆలోచించాల్సిన విషయం..? మీడియా ముందు గుట్టుగా ఉన్న ఉన్నతాధికారులు తమ గుమ్మంలో జరుగుతున్న వ్యవహారాలను పట్టించుకోవడంలో ఎందుకు నీరు కారుతున్నారో అని పలు వర్గాలు ప్రశ్నిస్తునే ఉన్నాయి. అంగులు ఆర్భాటాలకు పోయి ఎప్పుడూ లేని సెక్యూరిటీ ఆఫీషర్‌ స్థాయిని కేటాయించి భారీ మొత్తంలో జీతాలను, కారులను, వ్యక్తిగత రక్షణ సిబ్బందిని కేటాయిస్తున్న సమయంలో సైతం ఈ ఘటనలు బయట పడటం విశ్వ విద్యాలయం పరువు బుగ్గిపాలు చేస్తున్నట్టే అని పలువురు విద్యార్థి నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

NETRA NEWS
the authorNETRA NEWS

Leave a Reply