Please assign a menu to the primary menu location under menu

Saturday, October 5, 2024
CrimeGovernment

పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం: పేదలకు అందించాల్సిన పీడీఎస్‌ రైస్‌ని పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏడాది పాటుగా ఉచితంగా ఇవ్వవలసిన బియ్యం, సబ్సిడీలో ఇవ్వవలసిన పప్పు, పంచదార, గోదుమ పిండి సైతం పక్కదారి పట్టి కిరాణా దుకాణాలకు చేరుతున్నాయంటే అశ్చర్యపడనవసరం లేదు. ఓ దొంగ వ్యాపారి సరికొత్త బ్యాండ్‌ బ్యాగ్‌లను తయారు చేసి రైస్‌ మిల్లు నుంచి దుకాణాలకు తరలిస్తున్నట్టు రేషన్‌ బియ్యాన్ని ప్యాకింగ్‌ చేసి పక్కకు తరలిస్తుంటే మరో వ్యాపారి పాత సంచుల్లోనే సామాగ్రిని తరలించినట్టు మూడో కంటికి కనిపించకుండా బియ్యాన్ని చక్కగా మిల్లులకు తరలిస్తున్నారు. మరి కొందరు వ్యాపారస్తులు ఎవ్వరికీ ఎటువంటి అనుమానాలు రాకుండా ప్రభుత్వం ఇచ్చిన ఎండీయూ వాహనాల్లోనే నార సంచుల్లో బియ్యాన్ని మిల్లులకు పంపించి పని కానిస్తున్నారు. ఈ వ్యవహారాలపై ఇప్పటికే సంబంధిత అధికారులకు పలు ఫిర్యాదులు అందించినా అటుగా పట్టించుకోకుండా చోద్యం చేస్తున్నారని బహిరంగంగానే పలు విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. పౌరసరఫరాల శాఖ అధికారులతో పాటుగా విజిలెన్స్‌ విభాగ దిగువ స్థాయి నుంచి ఉన్నతాధికారుల సైతం ఈ నెలవారీ మామ్మూళ్లు మత్తులో ఉండటంతో పక్కదారి పడుతున్న పేదల బియ్యాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పలువురు ఆరోపిస్తున్నారు. నాలుగు నెలల క్రితం ఏపీ ఫుడ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ సీహెచ్‌ విజయ ప్రతాప్‌ రెడ్డి రాష్ట్రంలో పలు జిల్లాలతో పాటుగా విశాఖలో కూడా అకస్మిక తనిఖీలు నిర్వహించి సంబంధిత అధికారులతో పాటుగా డీలర్స్‌, ఎండీయూ సిబ్బందిని సైతం చమటలు పట్టించిన ఘటనలు మరువక ముందే తిరిగి జోరు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారంటే పీడీఎస్‌ బియ్యం వ్యాపారాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఇట్టే అర్థం అవుతుంది. ఉన్నతాధికారుల ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి తూతూ మంత్రంగా ఒకటి రెండు కేసులను నమోదు చేసి రోజుకి వేల సంఖ్యలో బస్తాలు పక్కదారి పడుతున్నా అటుగా పట్టించుకోలేని వ్యవస్థ ఉన్నంత వరకు బియ్యన్ని అక్రమ మార్గంలో తరలించి, ఫ్యాన్సీ నెంబర్‌ కారుల్లో తిరుగుతన్న పెద్దల పబ్బం గడుస్తునే ఉంటుంది. ఈ వ్యవహారాలపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ మరోమారు అక్రమార్కుల అంతు చూస్తే నాణ్యమైన స్వర్ణ రకం మధ్యస్థ సన్న బియ్యం పేదలకు చేరుతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

  • ఎవ్వరికి వారే యమునా తీరే..
    ప్రభుత్వం నుంచి పేదలకు అందించే ఫలాల్లో ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా ఇంటి వద్దకు అందిస్తామని చెప్పిన మాటలు.. మాటలుగానే మిగిలిపోయాయి. ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేసి నెలవారీ వేలకు వేలు ఇస్తూ పోషిస్తున్న ఎండీయూ వ్యవస్థ సైతం పాత డీలర్లు మాదిరి కాసుల కోసం కక్కుర్తి పడటంతో రేషన్‌ బియ్యం పేద ప్రజలకు చేరకుండానే పక్కదారి పడుతున్నాయి. ఎవ్వరికి వారే కేజీకి రెండు, మూడు రూపాయల కమిషన్‌ వ్యాపారాన్ని నమ్ముకొని బియ్యాన్ని అమ్ముకోవడంతో ప్రభుత్వం చేసిన రూ.కోట్ల ఖర్చు వృధాగా బూడిదలో పోసిన పన్నీరు మాదిరి తయారైయిందని పలువురు ఆరోపిస్తున్నారు.

 

  • నెలవారీ మామ్మూళ్లు మత్తులో నిఘా బృందాలు..
    ప్రభుత్వం నుంచి పేదలకు అందించే సంక్షేమ ఫలాలు సక్రమంగా అందుతున్నాయా..? పక్కదారి పడుతున్నాయా..? అని చూసే నిఘా బృందాలు సైతం మామ్మూళ్లు మత్తులో మునిగిపోవడంతో ప్రభుత్వ అందించే పథకాలు ప్రజలకు చేరకుండానే నీరు కారిపోతున్నాయి. పీడీఎస్‌ రైస్‌, సబ్సిడీ కంది పప్పు, పంచదార, గోదుమ పిండి వంటి వస్తువులు పేదలకు అందకుండా పక్కదారి పడుతున్నాయని తెలిసి కూడా స్థానిక పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆ క్రింద ఉన్న పర్యావేక్షణాధికారి, ఏఎస్‌వోలు, ఆర్‌ఐలు, వీఆర్‌వోలు చోద్యం చూస్తున్నారంటే.. అక్కడే ఉన్న పోలీసు విభాగ అధికారులు.. ఆ పక్కనే ఉన్న విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు సైతం చోద్యం చూడటంపై నెలవారీ మామ్మూళ్ల మత్తు అధికంగా ఉందనే చెప్పాలి. డీలర్‌లు, దొంగ వ్యాపారులు, మిల్లు యజమానులు నుంచి వచ్చే నెలవారీ సొమ్మును లెక్కబెట్టుకోవడంలో నిఘా బృందాలు నిమగ్నమైపోవడంతో ప్రభుత్వ పథకాలు నీరు కారిపోతున్నాయి.

  •  నిఘా బృందాలు పనిచేస్తున్నాయి..
    ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు పక్కదారి పట్టకుండా నిఘా బృందాలు పనిచేస్తునే ఉన్నాయి. కానీ ఆ బృందాల్లో సైతం అవినీతి ఉండటంతో వాళ్లపై కూడా ప్రత్యేక దృష్టి పెడతాం. అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాలి. సక్రమ మార్గంలో వ్యవస్థలు పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటాం.  -ఓ అధికారి.

 

RAVI KUMAR
the authorRAVI KUMAR

Leave a Reply