నేత్ర న్యూస్, విశాఖపట్నం, ( ప్రత్యేక ప్రతినిధి ) : బురుజుపేట శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పైరవీల పర్వానికి తెరతీశారు. ఆలయంలోకి అక్రమ మార్గంలో చొరబడే భక్తులను కట్టడి చేయాల్సిన ఉద్యోగులే అక్రమ మార్గంలో వస్తుంటే అమ్మవారి ఆదాయాన్ని రక్షించే నాథుడు ఎవరని భక్తులు గుసగుసలాడుకుంటున్నారు. ఆలయంలో నిత్యం చెదురు మదురు ఘటనలతో అమ్మవారి ఆదాయాన్ని గండి కొడుతున్న అధికారులు ఇప్పుడు ఏకంగా కొలువుల వర్షం కురిపిస్తూ అమ్మవారి ఆదాయాన్ని గండి కొట్టిస్తున్నారు. గతంలో స్థానికంగా విధులు నిర్వహించిన ఓ ఈవో తన వాహనానికి డ్రైవర్ కావాలని ఒకరికి ఉద్యోగం ఇస్తే.. ఆ తరువాత వచ్చిన మరో ఈవో నేనేం తక్కువ తినలేదని అక్కడ ఉన్న డ్రైవర్‌ని ఉపయోగించుకోకుండా మరో కొత్త డ్రైవర్‌ని నియమించుకొని ఘనత సృష్టించారు. ఇదే క్రమంలో కొత్తగా ఓ మంత్రి పైరవీ చేశారని ఒకరికి అక్రమ మార్గంలో ఉద్యోగం ఇచ్చిన అధికారులు హాజరు పుస్తకంలో పేరుని నమోదు చేస్తే.. స్థానిక ఎమ్మెల్యే తరుపున మరో ఉద్యోగం కేటాయించమని ఆలయంలో ఓ వ్యక్తి ప్రదక్షిణలు చేయడంతో పాటుగా ఆలయానికి వచ్చే భక్తులపై అధికారం సైతం చలాయిస్తున్నాడు. ఇక ఈ తంతును చూసిన ఆలయ ఛైర్మన్ తరుపున మరో రెండు ఉద్యోగాలు కేటాయించి తన వాటాను సైతం ఉపయోగించుకున్నారు. ఇదే మార్గంలో ఓ ఆలయాధికారి తాము ఏమీ తక్కువ తినలేదని తమకు ఎప్పటికప్పుడు అన్ని విధాలుగా ఉపయోగపడే ఓ మహిళకు సైతం ఏడాది క్రితం ఉద్యోగం కేటాయించిన ఘనత శ్రీకనకమహాలక్ష్మి ఆమ్మవారి ఆలయంలోనే చెల్లింది.
- కొలువుల కల్పనకు కొత్త కొత్త కుట్రలు..
ఆలయంలో కొత్తగా కొలువులు కేటాయించడానికి అక్కడి అధికారులు వేస్తున్న ఎత్తు పైఎత్తులు ఆశ్చర్యాన్ని కల్గించే విధంగా ఉన్నాయని పలువురు ఉద్యోగులు మాటల్లోనే తేటతెల్లం అవుతుంది. ఆలయ ప్రాంగణంలో శుభ్రం చేసే వ్యక్తికి కాపాలదారిగా విధులు కేటాయిస్తే.. శుభ్రం చేసే వ్యక్తి ఉద్యోగం వేసే అవకాశం పుట్టుకొచ్చిందని, డ్రైవర్‌గా విధులు నిర్వహించాల్సిన వ్యక్తికి అన్నదానంలో ఉద్యోగం కేటాయిస్తే కొత్త డ్రైవర్‌ని సృష్టించొచ్చని అక్కడి అధికారుల మాటాల్లో స్పష్టంగా అర్థం అవుతుంది. ఏది ఏమైన ఒక ఏడాదిలో సుమారు ఏడుగురుకి ఉద్యోగాలు కేటాయించి కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ అధికారులు పెద్ద మనసు చాటుకుంటున్నారని పలువురు హేళన చేస్తున్నారు.
- వర్గ పోరులో ఆలయ ఆదాయానికి గండి..
కనకమ్మ ఆలయంలో ఎప్పటి నుంచో పాతుకుపోయిన ఉద్యోగులు, స్థానికంగా పలుకుబడి కోసం పాకులాడుతున్న చోటా మోటా నాయకులు, ఒకవైపు ఆలయ అధికారులు.. మరోవైపు ప్రజా ప్రతినిథులు.. ఇలా ఒక్కరా..? ఇద్దరా..? కంటికి కనిపించే అందరూ వర్గాలుగా ఏర్పడి ఆలయంలో పెత్తనం చలాయిస్తున్నారు. ఒకరు ఉద్యోగం వేశారని మరొకరు.. మరొకరు ఉద్యోగం వేశారని ఇంకొకరు.. ఇలా అందరూ అక్కడ చేస్తున్న చేష్టల వలన అమ్మవారి ఆదాయానికి భారీగా గండి పడుతుందని ఇట్టే అర్థం అవుతుంది. దీనిపై గతంలో దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వెళ్లిన నేటికీ ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైయిందని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ఉద్యోగాలు కేటాయించాలంటే పద్ధతి ప్రకారమే..
ఆలయంలో ఉద్యోగాలు కేటాయించాలంటే ఎవ్వరికైనా ఒకటే పద్ధతి. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు చెప్పారని కేటాయించడం జరగదు. ఏది ఏమైన పద్ధతి ప్రకారమే జరుగుతుంది. మాకు వచ్చిన అర్జీలను పరిశీలించి దేవాదాయశాఖ కమిషనర్ దృష్టిలోకి తీసుకెళ్లి అక్కడ నుంచి అనుమతి వస్తేనే తాత్కలిక పద్ధతిలో ఉద్యోగం కేటాయిస్తాం. నా దృష్టికి ఇంత వరకు ఇటువంటి అంశాలు రాలేదు. దిగుస్థాయి సిబ్బందితో చర్చించి తప్పు జరిగితే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. -కె శిరీష (ఆలయ కార్యనిర్వాహణాధికారిణి).
It’s very interesting!