Please assign a menu to the primary menu location under menu

Saturday, October 5, 2024
GovernmentPolitical

పూర్ణామార్కెట్‌ పరువు తీస్తున్నారు

  •  మార్కెట్‌ వినియోగదారులపై రెచ్చిపోతు దాడులకు పాల్పడుతున్న నకిలీ వ్యాపారులు.. 
  • నిత్యం పలు ఘటనలు జరుగుతున్నా అటుగా పట్టించుకోని పూర్ణామార్కెట్‌ వర్తక సంఘం..
  •  పోలీసు కుటుంబాలపై విరుచుకుపడుతున్న వ్యాపారులను దండిరచని స్థానిక పోలీసులు..
  • పూర్ణామార్కెట్‌పై పలు ఫిర్యాదులు ఇస్తున్నా నేటికి పట్టించుకోని జోన్‌`4 జోనల్‌ కమిషనర్‌..

నేత్రన్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి): హెయిర్‌ పిన్‌ నుంచి ఏరోప్లేన్‌కి ఉపయోగపడే సామాగ్రికి సైతం ఆతిథ్యం అందిస్తున్న పూర్ణామార్కెట్‌ ఇప్పుడు అభాసు పాలవుతుంది. కొంత మంది నకిలీ వ్యాపారులు చేస్తున్న చేష్టల వలన వినియోగదారులు అటుగా రావడానికి సైతం సతమతం అవుతున్నారు. స్థానిక పోలీసు యంత్రాంగం, అద్దెలు వసూలు చేస్తున్న జీవీఎంసీ ఉన్నతాధికారులు అటుగా చర్యలు తీసుకోక పోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని పలువురు వినియోగదారులు బోరుమంటున్నారు. రహదారిపై అనధికారికంగా తిష్టవేసి అక్రమ వ్యాపారాలు చేస్తున్న నకిలీ వ్యాపారుల వలన నిత్యం నరకయాతన పడుతున్నామని రోజువారీ వచ్చే వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ధరలు వ్యత్యాసంపై బేరాలు ఆడితే బెధిరింపులకు పాల్పడుతున్నారని, భయంతో బదులు ఇస్తే కత్తులు బయటకు తీసి దాడులకు పాల్పడుతున్నారని ఓ బాధితురాలు భయంతో సమాధానం ఇచ్చింది. పెద్ద పెద్ద దుకాణాల నుంచి చిన్నపాటి జంగిడీల వరకు సుమారు 600దుకాణాలకు ఆశ్రయం ఇచ్చిన పూర్ణామార్కెట్‌కి ఇప్పుడు పరువు పోతుంది. 92ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఘటనలు భయాందోళన కల్గిస్తున్నాయి. రెండు నెలల క్రితం జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్న ఓ జడ్జి కుటుంబం మార్కెట్‌కి వచ్చి పోయే సమయంలో ఓ వ్యాపారి జడ్జిపై అసభ్యకరంగా మాట్లాడటంతో పాటుగా దాడికి ప్రయత్నించడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందించారు. ఇదే క్రమంలో రెండు రోజుల క్రితం ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీసు భార్య కూరగాయలు కొనుగోలు నిమిత్తం మార్కెట్‌కి వచ్చి వెళ్లే క్రమంలో ఆమెపై స్థానికంగా ఉన్న ఓ మహిళా వ్యాపారి అసభ్యకరమైన పదజాలంతో రెచ్చిపోవడంతో పాటుగా చేతిలో ఉన్న చిన్నపాటి కత్తితో బెధిరింపులకు పాల్పడటంపై పలువురు నుంచి తీవ్ర విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి ఘటనల నేపథ్యంలో రెండు నెలల క్రితం మార్కెట్‌ లోపలి భాగంలో వ్యాపారాలు చేస్తున్న యజమానులు మార్కెట్‌కి స్వచ్ఛందగా బంద్‌ని ప్రకటించిన నేటికి ఎటువంటి ఫలితం లేకపోయింది. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న జోన్‌-4 జోనల్‌ కమిషనర్‌ విధులు సక్రమంగా నిర్వర్తించకుండా చోద్యం చూడటంతో పూర్ణామార్కెట్‌కి ఈ పరిస్థితి పట్టిందని ఓ వృద్ధ వ్యాపారి ఆరోపించారు.

  • మార్కెట్‌ విషయంలో జోనల్‌ కమిషనర్‌ ఫెయిల్‌..
    ఏడాదికి రూ.కోట్ల ఆదాయాన్ని జీవీఎంసీకి అందిస్తున్న పూర్ణామార్కెట్‌ పరువు తీయడంలో స్థానిక జోన్‌`4 జోనల్‌ కమిషనర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారని పలువురు వ్యాపారులు, వినియోగదారులు ఆరోపిస్తున్నారు. మార్కెట్‌లో సమస్యలు అధిగమిస్తున్నాయని పలుమార్లు జీవీఎంసీ జోనల్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసే వ్యాపారులను కాసంత కూడా కనికరించకుండా వదిలిపెట్టడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. పూర్ణామార్కెట్‌లో సమస్యల పరిష్కారం దిశగా స్వచ్ఛందంగా బంద్‌ని ప్రకటించి రహదారులపై బెఠాయిస్తే బిచ్చగాళ్లు మాదిరి చూసి వెళ్లిపోయారని మండి పడ్డారు. స్థానిక నాయకుల బూటకపు మాటల మాటున న్యాయం చేయకుండా చోద్యం చూశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారులపై వ్యాపారాలను పెట్టకూడదని తూతూ మంత్ర మాటలతో అటుగా కనిపించకుండా మాయమైపోయారని పలువురు వ్యాపారులు మండి పడుతున్నారు. ఫిర్యాదు ఇచ్చే వ్యాపారులపై ఎదురు దాడి చేసి మీరు ముందు వ్యాపారాలను సక్రమంగా చేయండి లేకపోతే దుకాణాలను రద్దుచేసి వెనక్కి తీసుకుంటామని బెధిరించారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • జీవీఎంసీ కౌన్సిల్‌ సైతం చోద్యం చూస్తుంది..
    జీవీఎంసీకి అధిక ఆదాయాన్ని అందించే పూర్ణామార్కెట్‌ ఇప్పుడు చిల్లర వసూలకు మాత్రమే పరిమితం అవ్వడానికి జీవీఎంసీ కౌన్సిల్‌ పెద్దలే కారణమని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. పూర్ణామార్కెట్‌లో సమస్యలను జీవీఎంసీ మేయర్‌ దృష్టికి తీసుకెళ్తే అటుగా పట్టించుకోవడంలో చిన్న ప్రయత్నం కూడా చేయలేదని మండి పడుతున్నారు. మూడు రోజుల్లో మార్కెట్‌ రహదారులపై అక్రమ వ్యాపారాలను తొలిగిస్తామని హామీ ఇచ్చి మూడు నెలలు గడుస్తున్నా ఏ ఒక్కరూ అటుగా కనిపించకపోవడం సిగ్గుచేటు అని వ్యాపారులు హేళన సైతం చేస్తున్నారు. స్థానిక కార్పొరేటర్‌ చెప్పిన బూటకపు మాటలతో మార్కెట్‌ని గాలికి వదిలిపెట్టడం వలన రూ.కోట్ల ఆదాయాన్ని జీవీఎంసీ కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

  • ఒకరిపై ఒకరు చెప్పుతూ తప్పించుకుంటున్నారు..
    మార్కెట్‌ చుట్టు పక్కల రహదారులపై రాకపోకలు సాగించే సమయంలో వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, స్థానిక ట్రాఫిక్‌ పోలీసులకు ఫిర్యాదులు అందిస్తే.. ఆ పని జీవీఎంసీ, శాంతిభద్రత పోలీసులకు సంబంధించిందని ఓ ట్రాఫిక్‌ అధికారి వెల్లడిరచారు. ఇక శాంతిభద్రతల అధికారుల దృష్టికి ఆ సమస్యను తీసుకెళ్తే జీవీఎంసీకి చెందిన మార్కెట్‌లో జీవీఎంసీకి, రహదారిపై సమస్య ఉందని ట్రాఫిక్‌ పోలీసులకు చెందుతుందని అక్కడి అధికారులు సమాధానం ఇచ్చారు. ఇక అద్దెలు వసూలు చేస్తున్న జీవీఎంసీ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తే స్థానిక పోలీసులు చేయాల్సిన పనులు మేము ఎలా చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని పలువురు వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జీవీఎంసీ, పోలీసు ఉన్నతాధికారులు స్పందించి దిగువ స్థాయిలో సిబ్బంది చేస్తున్న లాలూచీ పనులకు శుభం కార్డు వేయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

RAVI KUMAR
the authorRAVI KUMAR

Leave a Reply