నేత్ర న్యూస్, విశాఖపట్నం, ( ప్రత్యేక ప్రతినిధి ): కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి.. కొంగు బంగారం చేసే తల్లి.. బురుజుపేట శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాస మహోత్సవ ఏర్పాట్లు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 24నుంచి డిసంబర్ 23వరకు జరుగు మహోత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే ముమ్మరం చేశామని సంబంధిత ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె.శిరీష ఓ ప్రకటనలో తెలిపారు. సంబరాలకు సంబంధించిన విషయాలను వెల్లడిరచడానికి శనివారం ఉదయం ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్మకర్తల మండలి సభ్యుల వర్గం, ఆలయ అధికారిక వర్గం మధ్యలో జరిగిన ఘర్షణ ఓ యుద్ధ వాతావరణాన్ని తలపించిందంటే ఆశ్చర్య పడనవసరం లేదు. ఆలయంలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న విభేదాల ఉత్సవం విలేకరుల సమావేశంలో బహిరంగం అయిపోయింది. ఒక వర్గం ప్రత్యర్థి వర్గంపై దాడి చేసే విధంగా మాట్లాడంతో మరో వర్గం దీటుగా ఎదుర్కొన్నట్టు మాట్లాడటం వలన కాసేపు అక్కడ యుద్ధ వాతావరణం కనిపించింది. ఆలయ కార్యనిర్వహణాధికారిణి చేస్తున్న వ్యవహారంలో రెండేళ్ల పాటుగా ఉండే ధర్మకర్తల మండలి సభ్యులకు ఎటువంటి గౌరవం ఇవ్వడం లేదని ఆవేదనతో ఆ వర్గం పెద్దగా గొడవ చేయడంతో.. అన్ని అంశాల్లో గౌరవ స్థానాన్ని కేటాయిస్తున్నామని ఆలయ ఈవో సమాధానం ఇవ్వడంతో ఇరువర్గాల మధ్య జరిగిన విశ్లేషణాత్మక విద్వాంశంలో విలేకరులు పెద్దల పాత్రను పోషించారు. ధర్మకర్తల మండలి సభ్యుల్లో.. సభ్యులకు ఇప్పటి వరకు సవాలక్ష తగాదాలు ఉండగా ఆ వ్యవహారం కాసంత ముదిరి ఆలయ అధికారులకు కూడా తాకడంతో రెండు వర్గాలుగా తయారవ్వడంతో అసలు తంతు ఇక్కడే మొదలైంది.
- ఆలయంలో ఎడ మొహం.. పెడ మొహం..
బురుజుపేట శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారు ఆలయంలో ఆలయ అధికారిణి, ధర్మకర్తల మండలి చైర్మన్ ఇరువురు ఎడ మొహం, పెడ మొహంగా ఉన్నారని ముందు నుంచే పలు సంకేతాలు కనిపిస్తునే ఉన్నాయి. దీనికి సైతం ఆలయంలో జరుగుతున్న వ్యవహారాల్లో తనకు గౌరవ స్థానం ఇవ్వడం లేదని ఓ వాదన వినిపిస్తుంటే.. చైర్మన్ చేసిన చేష్టలు వలన సంబంధిత ఆలయ కార్యనిర్వహణాధికారిణి కఠినంగా వ్యవహరించడమని మరో వాదన సైతం గట్టిగానే వినిపిస్తుంది. కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి దత్తత దేవాలయమైన అంబికాబాగ్ కల్యాణ మండపం వ్యవహారంలో ఈవో శిరీష కఠినంగా వ్యవరించడమే దీనికి కారణమని పలువురు సిబ్బంది వెల్లడిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ నెలలో అంబికాబాగ్ ఆలయంలో గల కల్యాణ మండపాన్ని ప్రస్తుత చైర్మన్ పదవిలో ఉన్న కొల్లి సింహాచలం తన కుమారుడు కొల్లి శ్రీను పేరిట బహిరంగ వేలం పాటలో కైవసం చేసుకున్నారు. ఆ తరువాత రెండు నెలల్లో ఏర్పాటు అయిన ధర్మకర్తల మండలిలో చైర్మన్ పదవిని సైతం కైవసం చేసుకోవడంతో అసలు గొడవ అక్కడ మొదలైందనే చెప్పాలి. ఆలయంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు కానీ.. ఆలయ ఉద్యోగులు కానీ.. వాళ్ల కుటుంబ సభ్యులు కానీ.. ఆలయ ఆస్తులను గుత్తేదారు పద్దతిలో ఇచ్చేటి వంటి అంశాల్లో ఉండకూడదని ఎండోమెంట్ ఏక్ట్‌లో ఉందని పలువురు ఇప్పటికే ఫిర్యాదులు సైతం చేశారు. ఇదే క్రమంలో తన ప్రత్యర్థి సైతం విశాఖ జిల్లా ఉన్నతాధికారులు, పార్టీ పెద్దలతో పాటుగా దేవాదాయశాఖ అధికారులకు సైతం ఈ విషయం అర్థం అయ్యే విధంగా అన్ని ఆధారాలు, ఏక్ట్‌లతో అర్జీలు సైతం పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం.
- ధర్మకర్తలకు పెద్ద పీట వేస్తున్నాం..
శనివారం ఉదయం కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన విలేకరుల సమవేశంలో తమకు గౌరవ స్థానం ఇవ్వడం లేదని ధర్మకర్తల మండలి సభ్యులు వెల్లడిరచారు. దీనికి స్పందించిన ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె.శిరీష స్పందిస్తు ధర్మకర్తల మండలి సభ్యులకు పెద్దపీట వేస్తున్నామని సమాధానం ఇచ్చారు. మార్గశిర మాస మహోత్సవాలకు సంబంధించిన స్వాగత పత్రాల్లో చైర్మన్‌కి ప్రత్యేకంగా ఫొటో ముద్రించలేదని వచ్చిన చిన్నపాటి సమస్య చాలా అంశాలకు దారి తీసిందని తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మీటింగ్‌కి తమని పిలవలేదని ఆరోపించిన ధర్మకర్తల మండలి సభ్యులు జేసీ వద్ద నిర్వహించిన గోడపత్రిక ఆవిష్కరణ ఫొటోల్లో ఎలా ఉన్నారని, బయట డిపార్టుమెంట్‌ల కో`ఆర్డినేషన్ మీటింగ్‌లో ఆలయంలో ఏర్పాటు చేసిన చిన్న చిన్న కమిటీలకు సంబంధించిన వ్యక్తులను జేసీకి పరిచయం చేయలేదని మరోమారు ఆగ్రహం వ్యక్తం చేయడం సరి కాదని అన్నారు. బయట వ్యక్తులకు సంబంధించిన అంశాల్లో ఆలయ అంశాలు చర్చించడం సరైన పద్ధతి కాదని, ఎటువంటి అనుభవం లేని వ్యక్తులు చెప్పినట్టు నడుచుకుంటే ఆలయానికి చెడ్డ పేరు వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటుగా మార్గశిర మాసం సమయంలో ఫ్రీ పాస్‌లు ఇవ్వాలని, దీనికి తోడు విలేకరుల సమావేశానికి ప్రత్యేకంగా పిలవలేదని ఆరోపించడం సభువుకాదని ఈవో శిరీష వెల్లడిరచారు. ఆలయంలో ఉన్న చిన్నపాటి సమస్యలు ఆలయంలో మీటింగ్ పెట్టి తమలో తాము పరిష్కరించుకోవాలని, బహిరంగంగా గొడవలు పెట్టు కోవడం వలన ఆలయానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. తాను ఇక్కడ విధులు నిర్వహించే వరకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పని చేస్తానని, ఎటువంటి ఒత్తుళ్లకు లొంగేది లేదని ఘాటుగా సమాధానం ఇచ్చారు.
- అబింకాబాగ్ ఆదాయానికి పంగనామం..
శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి దత్తత దేవాలయం అయిన అంబికాబాగ్ ఆలయ ఆదాయానికి పంగనామం పెడుతున్నారు. ఆలయ అభివృద్ధి నిమిత్తం ఆలయంలో కొంత భాగాన్ని కల్యాణమండపం పేరిట విభజించి గుత్తేదారు పద్ధతిలో గత ఏడాది అక్టోబర్‌లో అద్దెకు ఇచ్చారు. నెలకు సుమారు రూ.2.5లక్షల అద్దె నిమిత్తం కైవసం చేసుకున్న ఆలయ చైర్మన్ గత నాలుగు నెలలుగా సుమారు రూ.10లక్షల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీనికి గాను సంబంధిత అధికారులు ఈనెల 7న నోటీసులు సైతం జారీ చేశారు. దీంతో ఆమె ఆగ్రహానికి గురై ఆరోపణలు చేస్తున్నారని పలువురు వెల్లడిస్తున్నారు. వాస్తవానికి ఆలయ చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తికి కానీ.. తన కుటుంబ సభ్యులకు కానీ.. ఆలయానికి సంబంధించిన ఎటువంటి ఆర్థిక వ్యవహారాల్లో ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ సంబంధం ఉండకూడదని ఎండోమెంట్ ఏక్ట్‌లో ఉన్నా అటుగా ఏ అధికారి పట్టించుకోకపోవడం అయోమయానికి గురిచేస్తుంది. వాస్తవానికి ఆలయ లావాదేవీల్లో ఉన్న వ్యక్తలకు ఎటువంటి పదవులు ఉండకూడదని, చైర్మన్ పదవి సైతం తొలిగించాలని పలువురు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం బయటకు రావడంతో ధర్మకర్తల మండలి సభ్యుల్లో ఓ నేత తన భార్యకి చైర్మన్ పదవిని కేటాయించాలని ఇప్పటికే ఓ మంత్రి వద్దకు పలుమార్లు పరుగులు కూడా పెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
- ఉత్సవాల్లో పైరవీలకు రంగం సిద్ధం..
కనమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జరిగే మార్గశిర ఉత్సవాల్లో పైరవీలు చేయడానికి ధర్మకర్తల మండలి సభ్యులు సిద్ధమైపోయారు. సంబంధిత ఉన్నతాధికారితో పెద్దగా గొడవ పెట్టుకొని తమ పేరుని ముద్రించిన లెటర్‌హెడ్‌లు భక్తులు తీసుకొస్తే రూ.500ల విశిష్ట దర్శనం క్యూలైనుల్లో ఉచిత దర్శనం కల్పించాలని అర్జీ సైతం పెట్టుకున్నారు. దీనికి గాను సంబంధిత ఈవో నుంచి సానుకూల సమాధానం రాకపోవడంతో గత ఉన్నతాధికారుల సాయంతో పావులు కదుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.