Please assign a menu to the primary menu location under menu

Weekly Gadgets

Find Us on Socials

Saturday, October 5, 2024
CrimeGovernment

విక్రయాల్లో.. అక్రమాలు..

నేత్రన్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి): సూపర్‌బజార్‌ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్ర్రార్స్‌ కార్యాలయంలో సిబ్బంది నిత్యం చేస్తున్న చేష్టలకు సాధారణ ప్రజలకు సమస్యలు తప్పడం లేదు. స్టాంప్‌ పేపర్స్‌ కొనుగోలు సమయంలో అక్కడ జరుగుతున్న నాటకీయ పరిణామాలతో స్టాంప్‌ పేపర్స్‌ కొనుగోలుదారులు విసుగెత్తిపోతున్నారు. కార్యాలయంలో స్టాంప్‌ పేపర్స్‌ని విక్రయించే ఉద్యోగి విధులకు హాజరు కాకపోతే ఆ తంతుని తుంగలో తొక్కేస్తున్నారు. ఆ ఉద్యోగి వచ్చే వరకు పేపర్స్‌ విక్రయాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా జరగవని పరుశంగానే వెల్లడిస్తున్నారు. ఇదే అదును చూసుకున్న ప్రభుత్వ లైసెన్స్‌ స్టాంప్‌ పేపర్స్‌ విక్రయదారులు అందినకాడికి దోచుకోవడానికి సిద్ధమైపోయారని స్పష్టంగా కనిపిస్తుంది. వారం రోజుల క్రితం స్టాంప్‌ పేపర్‌లు తీసుకురావడానికి ఆ ఉద్యోగి అమరావతి వెళ్లగా ఇక్కడ ఎటువంటి కార్యకలాపాలు జరగకపోవడంతో లైసెన్స్‌ స్టాంప్‌ విక్రయదారులు దండీగానే దండుకున్నారు. ఆ తరువాత కొత్తగా ఏర్పడిన ఏఎస్‌ఆర్‌ జిల్లాలో పూర్తి స్థాయిలో కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి చూస్తున్న అధికారులు ఆ ఉద్యోగిని మరోమారు పాడేరు కార్యాలయానికి డిప్యూటేషన్‌పై పంపించడంతో ఇక్కడి లైసెన్స్‌ స్టాంప్‌ విక్రయదారులు ఆడిరదే ఆట.. పాడిరదే పాటగా.. తయారైయింది. రూ.10 స్టాంప్‌ పేపర్‌ రూ.30కి, రూ.20 స్టాంప్‌ పేపర్‌ రూ.50కి విక్రయించారు. ఇదే క్రమంలో రూ.50 స్టాంప్‌ పేపర్‌ రూ.100కి, రూ.100 స్టాంప్‌ పేపర్‌ ఏకంగా రూ.200లకు విక్రయించడంతో కొనుగోలుదారులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సంబంధిత ఉద్యోగి సెలవుపై వెళ్తే మరొక ఉద్యోగితో విక్రయాలు జరపాలి కానీ.. స్టాంప్‌ వెండర్స్‌తో చేతులు కలిపి ప్రజలను ఇబ్బందులు పెట్టడం సభవు కాదని మండి పడుతున్నారు.

– స్టాంప్‌ పేపర్‌ల విక్రయాల్లో అక్రమ మార్గం..?
సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో స్టాంప్‌ పేపర్‌ల విక్రయాల్లో అక్రమాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అక్కడ విధులు నిర్వహించే వ్యక్తి పనిలో భాగంగా పక్క జిల్లాకు వెళ్తే ఆ ఉద్యోగి స్థానంలో వేరొక వ్యక్తిని నియమించాల్సిన అధికారులు చోద్యం చూడటంతో అక్రమార్కులకు అవకాశం దొరుకుతుంది. ముందుగానే లైసెన్స్‌ స్టాంప్‌ వెండర్స్‌తో పొత్తు పెట్టుకున్న రిజిస్ట్రార్‌ కార్యాలయ ఉద్యోగులు ఇక్కడ విక్రయాలు జరగలేని సమయంలో స్టాంప్‌ పేపర్‌ల విక్రయదారుల ఇంటి అడ్రస్‌ సైతం ఇచ్చి పంపిస్తున్నారంటే ఇరువురి మధ్య ఉన్న సక్రమ సంబంధం ఎన్ని అక్రమాలకు దారి తీస్తుందో ఇట్టే అర్థం అవుతుంది. ఆ స్థానంలో ఉద్యోగి లేకపోవడం అదునుగా చేసుకున్న ప్రైవేటు విక్రయదారులు తమ వద్దకు వచ్చే కొనుగోలుదారుల నుంచి అప్పనంగా అదనపు సొమ్మును కాజేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ అంశాల్లో బహిరంగ రహస్యం 0.3శాతం కమీషన్‌ మాదిరి స్టాంప్‌ పేపర్స్‌ విక్రయాల్లో కూడా లైసెన్స్‌ విక్రయదారులతో కమీషన్‌ వ్యాపారాన్ని కొనసాగించడంపై పలువురు కొనుగోలుదారులు మండి పడుతున్నారు. కార్యాలయంలో స్టాంప్‌ పేపర్‌ల విక్రయ సేవలు తాత్కలికంగా నిలిపివేయడంపై అక్కడ ఓ జవాబుదారి పద్ధతి కూడా లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

-స్టాంప్‌ పేపర్‌ల విక్రయాల్లో విక్రయదారులు ఇష్టారాజ్యం..!
రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరిగే వ్యవహారాలు నిత్యం రద్ధీని సంతరించుకోవడంతో ప్రజలకు త్వరితగతిన సేవలందించే ఉద్ధేశంతో ప్రభుత్వం పొరుగు సేవల పద్ధతిలో కమీషన్‌ ఇస్తూ లైసెన్స్‌ వెండర్స్‌ వ్యవస్థను ప్రవేశపెడితే ఆ వ్యవస్థ ప్రజలను పట్టి పీడిస్తుందనే చెప్పాలి. కార్యాలయ అధికారులు, సిబ్బంది వారితో కుమ్మకై కార్యాలయంలో విక్రయాలు చేసే వ్యక్తి సెలవు పెట్టే సమయాల్లో ప్రత్యామ్నాయం లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. ఉద్యోగి సెలవులు దినాల్లో కార్యాలయంలో విక్రయాలు లేకపోవడంతో సమీపంలో లైసెన్స్‌ ద్వారా విక్రయాలు చేస్తున్న వ్యక్తులు అదనపు సొమ్ము పేరిట పీడిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం నుంచి 5శాతం కమీషన్‌ పద్ధతిలో స్టాంప్‌ పేపర్స్‌ని తీసుకునే సౌలభ్యం కల్పించారు. వాటిని రికార్డులో నమోదు చేసి పేపర్‌పై ముద్రించిన ధరకే విక్రయించాలి. కానీ ఇక్కడ అదనపు సొమ్మును అర్జిస్తున్న వ్యక్తులు రెట్టింపు ధరల కంటే అధికంగా విక్రయించడం వలన తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పలువురు ప్రజలు వెల్లడిస్తున్నారు. ఈ పద్ధతి మంచి లాభాలను ఇవ్వడంతో ఎక్కడా లేని విధంగా సూపర్‌ బజార్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో సుమారు 40మంది వరకు లైసెన్స్‌ స్టాంప్‌ వెండర్స్‌ ఉన్నారంటే అతిశయోక్తి లేదు. విశాఖ జిల్లాల్లో గల ఏడు కార్యాలయాల్లో సుమారు 10మంది చొప్పున సుమారు 70మంది ఉంటే ఈ ఒక్క కార్యాలయంలో 40మందికి పైగా ఉన్నారంటే ఆశ్చర్యం పడాల్సిన విషయం. ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చి కార్యాలయంలో కనీసం స్టాక్‌ని ఉంచుకోలేని పరిస్థితి లేదని చెప్పడానికి చక్కటి ఉదాహరణ వింటే ఇట్టే అర్థం అయిపోతుంది. సూపర్‌ బజార్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గత నెల రోజులుగా రూ.10 విలువ కలిగిన స్టాంప్‌ పేపర్‌లు లేవని అక్కడి సిబ్బంది కొనుగోలుదారులను వెనక్కి పంపిస్తుంటే అక్కడకి ఆమడ దూరంలో ఉన్న లైసెన్స్‌ స్టాంప్‌ వెండర్‌ వద్ద 28వ తేది గురువారం కూడా రూ.10ల స్టాంప్‌ పేపర్‌ రూ.30లకు ‘నేత్ర న్యూస్‌’ ప్రతినిధి కొనుగోలు చేసి ఆధారాన్ని సేకరించారు. ఈ కార్యాలయంలో కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తి వద్ద ఉన్న రూ.10ల స్టాంప్‌ పేపర్‌ ఉండి, కార్యాలయంలో ఎందుకు లభించడం లేదని ఒక్కసారి ఆలోచిస్తే ఇట్టే అర్థం అయిపోతుంది.

-రూ. లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి..!
గతంలో పలుమార్లు అవినీతి నిరోధక శాఖ అకస్మిక తనిఖీలు నిర్వహించి సాక్షాత్తు రిజిస్ట్రార్‌ స్థాయి అధికారులతో పాటుగా ప్రైవేటు డాక్యుమెంట్‌ లేకరులను సైతం పట్టుకున్న ఇక్కడ పద్ధతి మారలేదు. దిగువస్థాయి నుంచి రిజిస్ట్రార్‌ వరకు 0.3శాతం కమీషన్‌ ఆనవాయితీగా వస్తుందని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమైయితే.. స్టాంప్‌ పేపర్‌ల విక్రయాల్లో జరిగే అదనపు శాతాలను ఏ విధంగా లెక్కపెట్టి ఇస్తారో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బందికి పక్కాగా తెలుస్తుంది. కార్యాలయంలో లభించని విలువ (డినామినేషన్‌) కలిగిన పేపర్‌లు, ఇదే కార్యాలయం నుంచి తీసుకెళ్లి విక్రయించే సమీప లైసెన్స్‌ స్టాంప్‌ వెండర్స్‌ వద్ద అదనపు ధరకు ఏ విధంగా లభిస్తున్నాయో అని సంబంధిత అధికారులు ఇప్పటి వరకు ఎందుకు గ్రహించలేదో అర్థం కావడం లేదు. ఏది ఏమైన రిజిస్ట్రార్‌ శాఖలో జరుగుతున్న అక్రమ విక్రయాల విషయమై జిల్లా రిజిస్ట్రార్‌తో పాటుగా ఇతర ప్రభుత్వ పెద్దలు సైతం స్పందించాలని పలువురు ప్రాధేయ పడుతున్నారు.

RAVI KUMAR
the authorRAVI KUMAR

Leave a Reply