Please assign a menu to the primary menu location under menu

FashionTravel

పూర్ణామార్కెట్‌లో దొంగలు పడ్డారు..!

– ఇష్టానుసార వసూళ్లతో ప్రజలను బెంబేలెత్తిస్తున్న ఘరానా దొంగలు..
– ఆశీల గుత్తేదారులు చేస్తున్న చేష్టలకు చిర్రెత్తిపోతున్న వ్యాపారులు..
– జీవీఎంసీ నిబంధనలకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వైనం..
– రూ.2లకు బదులు రూ.10లు.. రూ.50లకు బదులు రూ.250లు..
– మూడు వాటాల కోసం కక్కుర్తి పడుతున్న మార్కెట్‌ గుత్తేదారులు..
– ఫిర్యాదు దారుల కోసం కొంగ జపం చేస్తున్న జీవీఎంసీ అధికారులు..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి): నగర నడిబొడ్డునున్న పూర్ణామార్కెట్‌లో దొంగలు పడ్డారు. మార్కెట్‌లో ఉండే వ్యాపారులతో పాటుగా సరుకులను ఎగుమతి, దిగుమతులు చేసే వాహన చోదకులను, అటుగా వచ్చే వినియోగదారులను సైతం బెంబేలెత్తిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ఈ తంతు జరుగుతున్న సంబంధిత ఉన్నతాధికారులు మాత్రం అప్‌ కమింగ్‌ లీడర్‌గా ప్రచారం చేసుకుంటున్న వ్యక్తి కనుసైగల్లో మెసులుతూ ఫిర్యాదుదారుల వస్తే చర్యలు తీసుకుంటామని కొంగ జపం చేస్తున్నారు. దీంతో పలువురు పీడిత బాధితులు ‘నేత్ర న్యూస్‌’ ప్రతినిధికి ఫిర్యాదు అందించడంతో నిఘా కట్టుదిట్టం చేసి పూర్తి అంశాలను తెలుసుకొని పలు ఆధారాలు సేకరించారు. అసలు విషయం ఏమిటంటే.. జీవీఎంసీకి సంబంధించిన ఆస్తులను ప్రతీ ఏడాది బహిరంగ వేలం పాట ద్వారా గుత్తేదారులకు అప్పగించి వాటిపై వచ్చే ఆదాయాన్ని నగరాభివృద్ధికి ఉపయోగించే క్రమంలో ఈ దొంగలు పుట్టుకొస్తున్నారు. విశాఖలో అధిక ఆదాయాన్ని సమకూర్చే ఆస్తుల్లో కీలకమైన ఆస్తి పూర్ణామార్కెట్‌ ఒకటి. ఈ క్రమంలో జోన్‌`4 కార్యాలయ పరిధిలో ఉండే ఈ పూర్ణామార్కెట్‌ను ప్రతీ ఏడాది ఇచ్చే విధంగానే గత దొంగలతో పొల్చుకుంటే ఈ ఏడాది ఘరానా దొంగలకు ఇవ్వడం వలన ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని గుత్తేదారులకు అప్పగించిన పలువురు అధికారులే గుసగుసలాడుకుంటున్నారు. జీవీఎంసీ ముందస్తుగా ఇచ్చిన గెజిట్‌ నిబంధనలు ప్రకారం స్కూటర్‌ పార్కింగ్‌కి రూ.2 వసూలు చేయాల్సిన గుత్తేదారులు రూ.10లు, కారుకి రూ.5లకు బదులు రూ.30లు వసూలు చేస్తున్నట్టు రశీదులు సైతం ఇస్తున్నారు. దీంతో పాటుగా అనధికారికంగా రహదారిపై జంగిడీలతో వ్యాపారాలు చేసే వ్యాపారుల నుంచి రూ.150నుంచి రూ.300వరకు వసూలు చేస్తున్నారు. ఇదే క్రమంలో సరుకులతో అటుగా వచ్చే భారీ, మధ్యతరహా వాహనాలు వస్తే చాలు గెజిట్‌లో ఎక్కడా కూడా లేని రూ.250 రశీదు ఇచ్చి దౌర్జన్యంగా దోచుకుంటున్నారు. భాషపై పట్టులేని ఇతర రాష్టాల నుంచి వచ్చే వాహన చోదకులు కనిపిస్తే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రూ.250ల రశీదులో నగదు విలువను చింపి సుమారు రూ.500వరకు వసూలు చేస్తున్నారని పలువురు వాహన చోదకులు బోరుమంటున్నారు. ఈ తరహా వ్యవహారాలను సంబంధిత జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఇప్పటి వరకు ఫిర్యాదులు తమకి రాలేదని, వస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పడం గమనర్హం.

– పేరుకి ఒక్కరు, మార్కెట్‌కి ముగ్గురు గుత్తేదారులు..
జీవీఎంసీ నుంచి గుత్తేదారుడిగా ఒకరు గుర్తింపు పొందిన పూర్ణామార్కెట్‌ ఆశీల వ్యవహారంలో మొత్తం ముగ్గురు గుత్తేదారులు వాటాలు పంచుకుంటున్నారని పలువురు వ్యాపారస్తులు వెల్లడిస్తున్నారు. 2022`2023కు గాను కాంట్రాక్టర్‌ జి.సత్యనారాయణ రెడ్డి పేరిట గెజిట్‌లో ఎక్కడా లేని విధంగా రూ.10, రూ.30, రూ.70, రూ.150, రూ.200, రూ.250ల రశీదులతో పాటుగా మరికొన్ని రశీదులు ముద్రించి వసూలు చేస్తున్న గుత్తేదారుడు, అనధికారికంగా రూ.500లకు పైగా వసూలకు పాల్పడుతున్నాడని పలువురు వాహన చోదకులు, వ్యాపారులు వివరిస్తున్నారు. వాస్తవానికి పూర్ణామార్కెట్‌ ఆశీల వ్యవహారంలో సంబంధిత వార్డుకి సంబంధించిన కీలక వ్యక్తి (అప్‌ కమింగ్‌ లీడర్‌)గా ప్రచారం చేసుకుంటున్న వ్యక్తి భాగస్వామ్యం ఉందని, ఆయనతో పాటుగా ప్రతీసారి ఆశీల పాటలో డీడీని చెల్లించి రింగ్‌ అవుతున్న మరో వ్యక్తి భాగస్వామ్యం కూడా ఉందని ఆశీలు వసూలు చేస్తున్న వ్యక్తులే వెల్లడిస్తున్నారు.

– రశీదులు ముద్రించి ఇష్టానుసారం వసూళ్లు..
మార్కెట్‌లో దుకాణాలు విక్రయాలు, రహదారిపై అనధికార జంగిడీ వ్యాపారాలు జీవీఎంసీ అధికారులు ఓ తప్పుగా గుర్తిస్తే.. రశీదులు సైతం ముద్రించి ప్రజల నుంచి అక్రమ వసూలకు పాల్పడుతున్న గుత్తేదారులు పలుకుబడితో చేస్తున్న దొంగతనంగానే గుర్తించాలి. సంబంధిత వార్డు కీలక వ్యక్తి సైతం ఆశీల వ్యవహారంలో భాగస్వామ్యం ఉండటం వలనే ఈ తరహా వ్యవహారం జోరుగా సాగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. అన్ని అంశాల్లో తనదైన ముద్ర వేసుకొని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు ఇచ్చే కీలక వ్యక్తి(భాగస్వామ్య గుత్తేదారుడు) తన ముందు రశీదులు ముద్రించి రోజువారీ చేస్తున్న ఈ దొంగతనం కోసం బహిరంగ ఫిర్యాదులు ఎందుకు చేయడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

– చర్యలతో పాటుగా త్వరలో కాంట్రాక్ట్‌ రద్దు చేస్తాం..
జీవీఎంసీ గెజిట్‌లో ఇచ్చిన ధరల కంటే అధికంగా వసూలు చేయడం చట్టరీత్యా నేరం. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే సంబంధిత గుత్తేదారులు రూ.87,20,000, +18.5% మొత్తం సొమ్మును చెల్లించాలి లేదా బ్యాంకు గ్యారెంటీ ఇవ్వల్సి ఉండగా ఎటువంటిది చేయకపోవడం వలన కాంట్రాక్టన్‌ రద్దు చేయడానికి కౌన్సిల్‌ ముంది పూర్తి అంశాలను పెట్టాం. అక్కడ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తాం. అధిక ధరలకు సంబంధించి రశీదులు మా దృష్టికి వచ్చాయి. అధిక ధరల నేపధ్యంలో ఫిర్యాదుదారులు వచ్చి ఫిర్యాదు అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.
-బీవీ రమణ (జోన్‌`4 జోనల్‌ కమిషనర్‌).

RAVI KUMAR
the authorRAVI KUMAR

1 Comment

  • I was reading some of your articles on this website and I
    believe this site is rattling instructive! Keep posting.

    My blog post Dane_Z

Leave a Reply