Please assign a menu to the primary menu location under menu

Monday, September 9, 2024
CrimeTechnology

సాంకేతికతతో చోరీలకు చెక్‌

నేత్రన్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి): నగరంలో చోరీ కేసులు గణనీయంగా తగ్గు ముఖం పట్టాయి. దీనికి తోడు రికవరీ శాతం అమాంతం పెరిగి గత రెండేళ్లతో సరి పోల్చుకుంటే శభాష్‌ అనిపిస్తుంది. ఈ ఏడాది జనవరి 1నుంచి అక్టోబర్‌ 31వరకు కేసుల నమోదు, రికవరీ, డిటెక్షన్‌ వంటి కోణంలో చూస్తే మెరుగ్గానే ఉందని సంబంధిత విభాగ ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. ఈ తరహా విజయాలను సైతం కైవసం చేసుకోవడానికి నేర విభాగపు సిబ్బంది పనితీరుతో పాటుగా సాంకేతికత చక్కగా ఉపయోగించుకోవడమని పేర్కొంటున్నారు. గత రెండేళ్లలో చూస్తే.. 2019లో 850కేసులు, 2020లో 672కేసులు నమోదు అవ్వగా ఈ ఏడాది అక్టోబర్‌ 31వరకు కేవలం 667కేసులు మాత్రమే నమోదు అయ్యాయని వివరిస్తున్నారు. ఇందులో కూడా గత ఏడాది కరోనా లక్‌డౌన్‌ కారణంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అవ్వడంతో కాసంత తక్కువ కేసులు నమోదు అయినట్టు కనిపించాయని తెలిపారు. ఇక రికవరీ విషయానికొస్తే 2019లో 49శాతం, 2020లో 56శాతం నమోదవ్వగా ఈ ఏడాది అక్టోబర్‌ 31నాటికి 62శాతంగా ఉందన్నారు. ఈ పరిస్థితులు సాంకేతికతపై అధికంగా ఆధారపడం వలనే వచ్చాయన్నారు. సాంకేతికత ఉపయోగించుకొని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న నిందితులను సైతం అదే సాంకేతికత సరైన మార్గంలో ఉపయోగించి పట్టుకుంటున్నామన్నారు.

– లాభం కోసం హత్యలు కనుమరుగైపోయాయి..
మర్డర్‌ ఫర్‌ గైన్‌ (లాభం కోసం హత్య) వంటి కేసులు ఈ ఏడాది అక్టోబర్‌ 31వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గొప్ప విషయంగానే చెప్పాలి. 2019లో 2కేసులు, 2020లో 2కేసులు చొప్పున నమోదైన ఈ సంఖ్య ఈ ఏడాది పూర్తిగా శూన్యం కావడానికి అపార్ట్‌మెంట్‌లు, దుకాణాలు, గ్రూప్‌ హౌస్‌ల్లో సీసీ కెమెరాలు వంటివి అధిక సంఖ్యలో ఏర్పాటు చేయడం వలనే అని సంబంధిత ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. దీనికి తోడు గతంలో స్టాన్‌ పవర్‌ అనే సంస్థ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా 94కూడల్లో కెమెరాలను ఏర్పాటు చేయడం, ఆ తరువాత ఆ సంస్థ నిష్క్రమించిన తరువాత స్మార్ట్‌ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా జీవీఎంసీ సౌజన్యంతో మాట్ర్రిక్స్‌, ఎల్‌ అండ్‌ టీ వంటి సంస్థలు ఏర్పాటు చేసిన మరికొన్ని కెమెరాల ద్వారా నిత్యం నగరంలో డేగ కన్ను వేయడం వలన ఈ తరహా కేసులను కట్టుదిట్టం చేశామని వెల్లడిరచారు.

– గొలుసు, జేబు దొంగలు జోరు తగ్గింది..
గత ఏడాది కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడం వలన సాధారణంగా నమోదైన గొలుసు, జేబు దొంగతనాల కేసులు అంతకు ముందు ఏడాదితో పోల్చుకుంటే మెరుగైన ఫలితాలు ఇచ్చాయి. 2019లో గొలుసు దొంగతనాలు 54కేసులు నమోదు అవ్వగా ఈ ఏడాది అక్టోబర్‌ 31వరకు 38కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. 2020లో అయితే 34కేసులు నమోదైయ్యాయి. దీంతో పాటుగా జోబు దొంగతనాలు విషయానికొస్తే 2019లో 9కేసులు, 2020లో 10కేసులు నమోదు కాగా ఈ ఏడాది 9కేసులు నమోదై కాసంత పరవలేదనిపించాయి. ఈ తరహా కేసులు తగ్గు ముఖం పట్టడానికి ముఖ్య కారణం మార్కెట్‌లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లో నిఘా సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు ప్రజలను అవగాహన పరచడం వలన అదుపు చేశామని తెలిపారు.

– పగటి, రాత్రి పూట ఇంటి దొంగతనాలు మాయం..
ఇళ్లల్లో పగటి, రాత్రి సమయాల్లో జరిగే భారీ దొంగతనాలను అరికట్టించడంలో సిబ్బంది అద్భుత ప్రదర్శన కనబరిచారనే చెప్పాలి. 2019లో పగటి పూట 64, రాత్రి పూట 138 నమోదవ్వగా 2020లో పగటి పూట 15, రాత్రి పూట163కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్‌ 31 వరకు మాత్రం పగటి పూట 20, రాత్రి పూట 117 కేసులు మాత్రమే నమోదు కావడం చోరీకి గురైన నగదు, ఆభరణాల శాతం చాలా తగ్గిందనే చెప్పాలి. దీనికి కూడా అపార్ట్‌మెంట్‌లు, ఇళ్లల్లో సీసీ కెమెరాలు అమర్చుకోవడం వలనే అదుపుచేశామని తెలిపారు. దీంతో పాటుగా పోయిన సొత్తును సైతం స్వాధీనం చేసుకోవడానికి, నిందితులను పట్టుకోవడానికి సీసీ కెమెరాలు చక్కగా ఉపయోగించుకున్నామన్నారు. ఇప్పటీకి కూడా ఇళ్లల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అవగాహన పరుస్తున్నామన్నారు.

– డకాయిటీ, రాబరీ, సాధారణ చోరీలు తగ్గాయి..
దోపిడీలు, సాధారణ దొంగతనాల విషయానికి కొస్తే గత రెండేళ్లలో నమోదు చేసుకున్న కేసుల కంటే కాసంత తక్కువగానే ఉన్నాయి. 2019లో డకాయిటీలు-1, రాబరీలు-15, సాధారణ దొంగతనాలు-288 నమోదు అవ్వగా 2020లో డకాయిటీలు-1, రాబరీలు-22, సాధారణ దొంగతనాలు-213గా నమోదైయ్యాయి. ఈ ఏడాది మాత్రం కొంచెం మెరుగు పడి డకాయిటీలు-3, రాబరీలు-12, సాధారణ దొంగతనాలు-200గా నమోదై ఓ వైపు పోలీసు సిబ్బందిని, మరోవైపు ప్రజలను ప్రశాంతంగా నిద్రపోయేలా చేశాయి. ఈమేరకు డీసీపీ డీఎస్‌ శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ తరహా నేరాలను అదపుచేయడానికి అధిక సంఖ్యలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బలమైన నిఘా కట్టుదిట్టం చేశామని పేర్కొన్నారు.

– ఈ ఏడాదిలో రికవరీ శాతం పరుగులు పెట్టింది..
నగరంలో జరుగుతున్న నేరాలకు అనుగుణంగా చోరీకి గురైన సొత్తును, నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తును నగదుతో సరిపోల్చి వెల్లడిరచే ఆఖరి ఘట్టం అద్భుతంగానే కనిపిస్తుంది. 2019లో సుమారు రూ.5.96కోట్లు సొత్తు చోరీకి గురవ్వగా రూ.2.90కోట్లు స్వాధీనం చేసుకొని 49శాతంగా ఉంది. 2020లో సుమారు రూ.4.58కోట్లు సొత్తు చోరీకి కాగా రూ.2.55కోట్లు స్వాధీనం చేసుకొని 56శాతంగా నమోదైయింది. ఈ ఏడాది అక్టోబర్‌ 31వరకు తీసుకున్న లెక్కల ప్రకారం సుమారు రూ.5.39కోట్లు సొత్తు చోరీకి అవ్వగా రూ.3.32కోట్లు స్వాధీనం చేసుకొని ఏకంగా 62శాతంగా నమోదై అద్భుతాన్ని సృష్టించింది. మరో రెండు నెలలో ఆ శాతం మరింత పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయంటున్నారు.

– నగర ప్రజలు అవగాహనతో మెలగాలి..
నగరంలో చోరీలు పూర్తి స్థాయిలో అరికట్టడానికి సిబ్బందికి అనేక అంశాల్లో సూచనలు ఇస్తూ పనిచేయిస్తున్నాం. దీనికి తోడు నగర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలను, కమిషనరేట్‌లో అందుబాటులో ఉన్న టెక్‌సెల్‌, క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌ వంటి అనేక సాంకేతిక అంశాలను ఉపయోగించి చోరీ కేసులను ఛేదిస్తున్నాం. సమస్యాత్మక ప్రాంతాలైన పోర్టు ఏరియా, హెచ్‌పీసీఎల్‌, స్టీల్‌ ప్లాంట్‌ వంటి ప్రాంతాల్లో జరుగుతున్న దొంగతనాలపై ప్రత్యేక దృష్టి కేంద్రికరించాం. శివారు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కొంచెం తక్కువగా ఉండటం వలన ఆ ప్రాంతాల్లో చోరులను అదుపులోకి తీసుకోవడానికి కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం. పండుగ సమయాల్లో నగర ప్రజలు అవగాహన భరితంగా ఉండి పోలీసులు ఏర్పాటు చేసిన ఎల్‌హెచ్‌ఎంఎస్‌ ఆప్‌ సేవను ఉపయోగించుకోవాలి.
– డీఎస్‌ శ్రావణ్‌ కుమార్‌ (సీసీఎస్‌ – ఏసీపీ, నగర ఇన్‌ఛార్జీ నేర విభాగపు డీసీపీ).

NETRA NEWS
the authorNETRA NEWS

Leave a Reply